ఈ వారం స్పెషల్

ధన్యో గృహస్థాశ్రమః

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సానందం సదనం సుతాశ్చ సుధియః కాంతాప్రియాలాపినీ
సుధనం సన్మిత్రం స్వపోషితిరితిః స్వాజ్ఞాపరాః సేవకాః
ఆతిథ్యం శివపూజనం ప్రతిదినమిష్టాన్నపానం గృహే
సాధోః సంగముపాసతే చ సతతం ధన్యో గృహస్థాశ్రమః

అంటే.. ఇంట్లో అందరూ సుఖంగా ఉండి, పుత్రుడు బుద్ధిమంతుడై, భార్య మధుర భాషిణియై, మంచి మిత్రులు, స్వపత్నీ సంగమం, ఆజ్ఞానువర్తులైన సేవకులు, రోజూ అతిథి సత్కారం, శివారాధనం కలిగి ఉంటూ.. పవిత్రమూ రుచికరమూ అయిన అన్నపానాదులు, నిత్యసత్సాంగత్యము ఉన్న గృహస్థుని ఆశ్రమం ధన్యము- అని అర్థం. ఇది జరగాలంటే ముందుగా మనిషి కర్మలన్నింటినీ శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నెరవేర్చాలి.
మా గురువుగారు ఈ పద్యం గురించి చెప్పినప్పుడు పద్యం కంటే.. ఆ పద్యం గురించి చెప్పిన సందర్భం విని ఆకర్షితురాలినయ్యాను నేను.. ఎంత మంచి పద్యం, గృహస్థాశ్రమం గురించి ఎంత చక్కగా చెప్పారని అనుకుంటూ ఇంట్లో పెట్టుకున్నారట. ఒకానొక సందర్భంలో మా మధ్య ఈ పద్యం చర్చకు వచ్చింది. నాకు కూడా ఈ పద్యం చాలా నచ్చి.. అసలు సమాజంలో మనిషి ఎలా ఉండాలి? అతని ధర్మాలేమిటి? అనే విషయాలన్నీ అప్పట్లోనే వేదాల్లో వివరించారు కదా.. వాటిని మళ్లీ మళ్లీ చర్చకు తీసుకురావడం నేటి సమాజానికి ఆరోగ్యకరం, అవసరం.. అనిపించింది ఇద్దరికీ.. ఆ ప్రయత్నమే ఇది.. వివరాల్లోకి వెళితే..
భారతీయ సమాజం సమున్నత విలువలు, ఆదర్శాల సమ్మిళితం. ఒక వ్యక్తి సామాజిక జీవనం ఈ విలువలు, ఆదర్శాలతోనే ముడివడి ఉంటుంది. ఉన్నతంగా జీవించడానికి పాటించాల్సిన ధర్మాలు, ఆచరించాల్సిన సిద్ధాంతాలు, అవసరమైన గుణాలు.. వంటివన్నీ మన సమాజం
మూలాల్లో కనిపిస్తాయి. వీటన్నింటి గురించి మన పెద్దవారు, పూర్వీకులు ఎప్పుడో వేదాల్లో వివరించారు. మనిషి ఎలా మనుగడ సాగించాలి? ప్రకృతి పట్ల, తోటివారి పట్ల ఎలా మసలుకోవాలి? భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి? అనే అంశాలను కూలంకషంగా చర్చించారు. ప్రతి మనిషి వీటిని అధ్యయనం చేస్తే సమాజ నిర్మితిని అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైనా సమాజ నిర్మితిని అధ్యయనం చేయాలంటే ముందు ఆ సమాజం మూలాలను అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ సమాజంలోని సమస్యలు, విశిష్ట లక్షణాలపై అవగాహన ఏర్పడుతుంది. భారతీయ సమాజం ఆదర్శాలు, విలువలతో కూడుకున్నది. దీని గురించి తెలుసుకోవాలంటే ముందు హిందూ సమాజం పునాదుల గురించి అధ్యయనం మొదలుపెట్టాలి.
నేడు చిన్న చిన్న విషయాలకే కోపాలు.. తాపాలు.. హత్యల వరకూ వెళ్లిపోతున్నారు. కారణం.. ఈ భూమిపై పుట్టినందుకు కనీసం వారిని వారు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదని అర్థమవుతుంది. జరగాలనుకున్న పని జరగలేదంటే ఒత్తిడి.. అనవసరంగా పరుగులు పెడుతూ.. సామాజిక మాధ్యమాలపై ఎక్కువ సమయాన్ని గడుపుతూ, కాలాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేక మనసుపై ఒత్తిడిని పెంచుకుంటూ చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యల వరకూ వెళ్లిపోతూ.. మనిషి తనను తాను అంతం చేసుకుంటున్నాడు. వీటన్నింటినీ పూర్వీకులు ముందుగానే ఊహించి, అనేక సంవత్సరాలు అధ్యయనం చేసి ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంతవరకు.. అంటే ప్రతి ఒక్క విషయాన్ని అనేక రకాలుగా పరిశీలించి, తర్కించి, విశే్లషించి.. ఒక పిల్లాడు ఎలా చదువుకోవాలి? పెరిగి పెద్దయ్యాక ఎలా బతకాలి? ఎలాంటి అమ్మాయిని పెళ్లిచేసుకోవాలి? భార్యని ఎలా చూసుకోవాలి? పిల్లల్ని ఎలా పెంచాలి? తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి? సమాజంలో ఎలా మెలగాలి? మంచి సమాజాన్ని ఎలా నిర్మించాలి? వంటి వాటన్నింటినీ కూలంకషంగా రాశారు అప్పటి పూర్వీకులు. వీటన్నింటినీ ఆచరించినంతవరకు సమాజం బాగానే ఉంది. ఇవన్నీ ఎప్పుడైతే పనికిరానివని మనిషి అనుకుంటున్నాడో.. అప్పుడే సమాజ పతనం మొదలైంది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ కుటుంబం పట్ల, సమాజం పట్ల ఎలా ఉండాలో తెలుసుకుంటే.. వారి జీవితాలతో పాటు సమాజం కూడా హత్యలు, కుట్రలు, కుతంత్రాలు లేకుండా అందమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో అభివృద్ధిని సాధిస్తుంది. ఇలా జరగాలంటే ఆశ్రమ ధర్మాలు విధిగా పాటించాల్సిందే.. ఆశ్రమ ధర్మాలు సమాజంలో వ్యక్తి నడవడికను, ప్రవర్తనను క్రమబద్ధీకరిస్తాయి. ఇవి నాలుగు..
* బ్రహ్మచర్యాశ్రమం
* గృహస్థాశ్రమం
* వానప్రస్థాశ్రమం
* సన్యాసాశ్రమం
మనిషి జీవితాన్ని ఇలా వివిధ దశలుగా విభజించి.. ఆయా దశల్లో వారు నిర్వర్తించాల్సి విధులు, నడవడికలను తెలియజేశారు పూర్వీకులు. ఈ చర్యలు వ్యక్తి ప్రవర్తనను క్రమబద్ధీకరించి మోక్షం దిశగా నడిపిస్తాయి. వీటిలో ముఖ్యమైనది గృహస్థాశ్రమం. సాక్షాత్తూ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు.. వంటివారే గృహస్థాశ్రమాలను పాటించడానికి మానవ జన్మను ఎత్తారు. మానవుల్లా అన్ని ఆశ్రమ ధర్మాలను పాటిస్తూ.. ప్రతి మనిషి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఎలా నడచుకోవాలో తెలియజెప్పారు.

రుద్రో ముండధరో భుజంగసహితో గౌరీ తు సద్భూషణా
స్కందః శంభుసుతః షడాననయుతస్తుండీ చ లంబోదరః
సింభక్రేతిమమూషకం చ వృషభస్తేషాం నిజం వాహన
మిత్థం శంభుగృహే విభిన్నమతిషు చైక్యం సదా వర్తతే॥

అంటే.. శంకరుడు కపాల మాలను, సర్పాలను ధరిస్తాడు. పార్వతి సుందరాభరణములను వేసుకుంటుంది. శివుని కొడుకులైన కార్తికేయుడు, షణ్ముఖుడు, గణేశుడు.. పొడుగైన తొండము, లంబోదరముగలవాడు. వీరి వాహనాలైన వృషభం, సింహం, నెమలి, మూషికాలు కూడా పరస్పరం విరోధ స్వభావం కలవి. ఇలా ఉన్నప్పటికీ పరస్పర విరుద్ధ స్వభావాలున్న శివ పరివారంలో ఏకత్వం ఉంటుంది. ఇలా కుటుంబంలో కూడా వేర్వేరు స్వభావాలున్నవారు కలసి తమ అభిమానం, సుఖభోగాలను త్యాగం చేసి, ఇతరుల మంచి-చెడులను చూసుకుంటూ, వారిని ఎల్లవేలలా కాపాడుతూ పరస్పరం ప్రేమ పూర్వకంగా ఏకత్వాన్ని కలిగి ఉండాలి. ఇదే విషయాన్ని కుటుంబ వ్యవస్థ కూడా చెబుతుంది.
మానవ జీవనంలోని ప్రతి దశలోనూ దానికి తగిన ధర్మాలు వేదాల్లో సూచించబడ్డాయి. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం.. ఇలా ప్రతి దశలోనూ మనిషి పాటించాల్సిన ధర్మాలేంటో ఉపదేశించాయి వేదాలు. మానవ జీవన ప్రస్థానంలో నాలుగు రకాల దశలు దాటుకుంటూ వెళ్లాలి. వాటిలో మొదటిదైన బ్రహ్మచర్యం జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడటమే కాక ఆ తరువాతి దశ అయిన గృహస్థాశ్రమానికి చక్కటి మార్గాన్ని ఏర్పరుస్తుంది. బ్రహ్మచర్య ధర్మాలను సరిగ్గా పాటించిన వాళ్లే గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి అర్హులని చెప్పే వేదం గృహస్థాశ్రమానికి కూడా కొన్ని ధర్మాలు, నియమాలను సూచించింది. వాటిని పాటిస్తే జీవితంలోని కీలక దశలోని ధర్మాలను ఆచరించినట్లే..
మనిషి జీవితంలోని నాలుగు ‘ఆశ్రమాలూ’ ఎంతో ప్రాధాన్యం కలిగినవి. బ్రహ్మచర్యాశ్రమం వ్యక్తిని గృహస్థునిగా తయారుచేయడానికి తగినటువంటిది. వేదం ప్రకారం ఎవరు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో వారే గృహస్థాశ్రమంలోకి వ్రేశించాలి. నలభై ఎనిమిది సంవత్సరాల దాకా బ్రహ్మచర్యం పాటించవచ్చునని వేదం ఆదేశిస్తుంది. కానీ ఇరవై ఐదు సంవత్సరాలు దాటితే మానవుడు గృహస్థుడు కావచ్చు. ఉత్తమ సంతానం కోసమే పెళ్లి చేసుకోమని వేదం చెబుతోంది. సంతానాన్ని సుశిక్షితులుగా పెంచాలని వేదం ప్రబోధిస్తుంది. అందుకే ఓ రచయిత ఇలా చెప్పాడు..
మంచి వివాహమే.. మంచి దాంపత్యం..
మంచి దాంపత్యమే.. మంచి సంతానం..
మంచి సంతానమే.. మంచి సమాజం..
మంచి సమాజమే.. మంచి ప్రపంచం..
వేదం ఏం చెప్పిందంటే..
* భార్యాభర్తల మధ్య వియోగం కలుగకుండా వారి మధ్య ప్రేమకు విఘాతం కలుగకుండా గృహజీవనం సజావుగా జరగాలని వేదం ఉపదేశిస్తుంది.
* అమ్మాయి గానీ, అబ్బాయి గానీ.. ఇరువురికీ పరస్పరం ప్రేమ ఉన్నప్పుడే వివాహానికి అంగీకరించాలని, కపటానికి, మోసానికి తావులేని విధంగా దాంపత్య జీవితం సాగాలని వేదం వివరిస్తుంది.
* భర్త ఏకపత్నీవ్రతుడై ఉండాలని, వివాహమాడిన స్ర్తిని కాదని, పరస్ర్తిలతో సంబంధం పెట్టుకోరాదని పురుషులను శాసించింది వేదం.
* స్ర్తిలకు కూడా ఇదే వర్తిస్తుందని ఆదేశించింది.
* ఇల్లు ఎప్పుడూ సూర్యలోకంలా ప్రకాశిస్తూనే ఉండాలని, ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఎప్పుడూ సుఖాన్ని, హాయినిచ్చేవిగా ఉండాలి. అలా ఉండాలంటే భార్యాభర్తలిద్దరూ కలసి గృహస్థ ధర్మాలను నిర్వహించాలి.
* భార్యాభర్తలిద్దరూ పరస్పరాంగీకారంతోనే ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలి. బంధుమిత్రాదులతో మంచి మాట, నడవడికతో ప్రసన్న చిత్తులుగా వ్యవహరించాలి.
* కుటుంబ ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఉత్తమ కార్యక్రమాలను నిర్వహించాలని, అందరికీ ఆదర్శంగా ఉండాలని వేదం ఉద్బోధిస్తుంది.
* భార్య ఏవిధంగానైతే భర్తను, పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. వేళకు అన్నపానాదులు సిద్ధం చేస్తూ వారిని ప్రేమిస్తుందో.. అదేవిధంగా భర్త కూడా భార్య పట్ల ప్రేమతో, మమకారంతో మెలగాలని వేదం చెబుతోంది.
* భార్యాభర్తలిద్దరూ కేవలం అందచందాలకే ప్రాధాన్యం ఇవ్వకుండా మానసిక సౌందర్యాలను ప్రేమించాలి. అంతఃసౌందర్య ప్రాముఖ్యతను తెలుసుకుని ఒకరితో ఒకరు ప్రేమగా మెలగాలి. స్వచ్ఛమైన నీరులా భార్యభర్తల హృదయాలు కలసిపోవాలి. తమ సంతానాన్ని ఏవిధంగా అయితే ప్రేమిస్తారో అలాగే దంపతులు కూడా పరస్పరం ప్రేమలో మునిగిపోవాలని వేదం ఉపదేశిస్తుంది.
* బలం కంటే ఆరోగ్యమే ఆనందానికి మార్గం. ముసలితనంలో కలిగే దుఃఖాలను పోగొట్టగలిగే సంతానాన్ని కనాలని, వారిని ఎంతో ప్రేమతో పెంచాలని వేదం ఉద్బోధిస్తుంది.
* మంచి సంతానాన్ని పొందడమే కాదు.. వారికి మంచి శిక్షణ ఇవ్వడం కూడా గృహస్థు కర్తవ్యమే అంటుంది వేదం.
* గృహస్థాశ్రమ ధర్మం ఓ రథం లాంటిది. భార్య రథారోహణ చేయగా, భర్త సారథి వలె దాన్ని నడిపించాలి. ఆనందంతో పాటు ధనాన్ని కూడా సంపాదించాలని వేదం చెబుతోంది.
* తక్కిన మూడు ఆశ్రమాలు దేన్ని ఆశ్రయిస్తాయో అదే గృహస్థాశ్రమం. అందుకే గృహస్థాశ్రమం మనిషి జీవితంలో కీలకమైన కాలం. గృహస్థాశ్రమం ఇహపర సుఖాలకు కేంద్రమని వేదం ఘోషిస్తోంది.
* బ్రహ్మచర్యాశ్రమంలో కన్న కలల్ని సాకార రూపంగా ధరింపజేసేది గృహస్థాశ్రమమని, త్రికరణ శుద్ధికి ఆలుమగలు అంకితమై ఉండాలని వేదం బోధిస్తోంది.
* దంపతులు తమ ఇంట్లోని గాలిని, అగ్నిని, నీటిని, ధనాన్ని నియమిత రూపంలో వాడుకునే విధానాన్ని అలవాటు చేసుకోవాలని వేదం చెబుతోంది. * భార్య నిండు చూలాలిగా ఉన్న సమయంలో భర్త ఆమెకు సంపూర్ణ రక్షణను ఇవ్వాలని, కాని చోటికి వెళ్లడం గానీ, కాని వ్యక్తులతో కలవడం గానీ చేయకూడదని వేదంలో ఉంది.
* గృహస్థులు ఆరగించే పదార్థాల్లో బార్లీ, గోధుమ, శనగలు, వరిధాన్యం ఉండేలా చూసుకోవాలిని, సోమలతాదులను పరిశుద్ధ జలంతో స్వీకరించాలని వేదం సూచిస్తోంది.
* గృహస్థ జీవనంలో భార్యాభర్తలు ఒకరి పట్ల మరొకరు విశ్వాసపూర్ణులై అన్ని సౌకర్యాలను పొందుతూ.. గాలి, నీరు, వెలుతురు సమృద్ధిగా ఉండే ఇంటిని సంపాదించుకుని కాపురం చేయాలని, నిరాండబరమైన వేషధారణకు అవకాశమివ్వాలని వేదం చెబుతోంది.
* తమ సంతానానికి విద్యాబుద్ధులనందించి, వారి పురోభివృద్ధికి తోడ్పడాలని, వారిని ఉత్తమ సంతానంగా తీర్చిదిద్దాలని, ఎంతో ఓపికతో, సహనంతో వారికి కష్టం, త్యాగం విలువ తెలియజేస్తూ సమాజంలో ఉత్తమ పౌరులుగా మెలిగేలా తీర్చిదిద్దాలని వేదం చెబుతోంది. తద్వారా సమాజం కూడా ఆరోగ్యకరమైన అభివృద్ధి సాధిస్తుందని పూర్వీకుల నమ్మకం.
ఇలా మనిషి ఒంటరిగా నీటి బిందువులాంటి తళుక్కుమనే వ్యక్తిత్వంతో.. భార్యతో కలిసి జంటగా సముద్రమంత ఐకమత్యంతో కలసి మెలిసి.. సంతానాన్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది.. అడ్డంకులన్నింటినీ ప్రేమతో దాటడమే మనిషి లక్ష్యం. అటువంటి మనుషులున్న కుటుంబాలు.. అటువంటి కుటుంబాలున్న ఊళ్ళు.. అటువంటి ఊళ్ళు ఉన్న రాష్ట్రాలు.. అన్నీ ప్రేమమయమే కదా..! ఇదీ మన భారతదేశం.. ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన వసుధైక కుటుంబం. *
హిందూ సమాజ మూలాలను పరిశీలిస్తే..
* చతుర్విద పురుషార్థాలు
* ఆశ్రమ ధర్మాలు
* రుణాలు
* కర్మ సిద్ధాంతం
* త్రిగుణాలు
* శ్రుతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు
చతుర్విద పురుషార్థాలు
ధర్మం, అర్థం (సంపద), కామం (కోరిక), మోక్షం అనేవి చతుర్విధ పురుషార్థాలు. సమాజంలో నివసిస్తున్న వ్యక్తి అంతర్గత, బాహ్య ప్రవర్తనను నియంత్రించడానికి వీటిని నిర్దేశించారు. వీటి ప్రకారం వ్యక్తులు వివిధ దశల్లో క్రమశిక్షణతో, ధర్మబద్ధంగా జీవించాల్సి ఉంటుంది. తద్వారా సమాజం వ్యవస్థీకృతం అవుతుంది. అసంఘటిత పరిస్థితులకు దూరంగా ఉంటుంది.
ఆశ్రమ ధర్మాలు
వీటినే వర్ణాశ్రమ ధర్మాలు అని కూడా అంటారు. ఇవి నాలుగు..
* బ్రహ్మచర్యాశ్రమం
ఈ ఆశ్రమంలో గురువు వద్దనే ఉండి వేదాధ్యయనం చేయాలి. గురువును ప్రసన్నం చేసుకుంటూ విద్యార్థులు వేదాధ్యయనం ప్రారంభిస్తారు. బ్రహ్మచారిగా ఇంద్రియ నిగ్రహాన్ని పాటించి జ్ఞానయజ్ఞనం చేస్తారు.
* గృహస్థాశ్రమం
ఒక వ్యక్తి వివాహం చేసుకోవడం ద్వారా బ్రహ్మచర్యాశ్రమం నుండి గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాడు. ధర్మాచరణ, సంతానోత్పత్తి ద్వారా సమాజం ముందుకు కొనసాగడానికి తోడ్పడతాడు. కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తాడు. గృహస్థాశ్రమంలో పంచ మహాయజ్ఞాలు చేయాలి. అవి..
* బ్రహ్మ యజ్ఞం.. అంటే.. వేదాధ్యయనం
* పితృ యజ్ఞం.. అంటే.. తర్పణం, శ్రాద్ధక్రియలు
* దైవ యజ్ఞం.. అంటే.. కర్మకాండలు, హోమాలు
* భూత యజ్ఞం.. అంటే.. బలి, అర్పణలు
* నృయజ్ఞం.. అంటే.. అతిథులకు, పేదవారికి సేవ చేయడం
* వానప్రస్థాశ్రమం
పిల్లలకు వివాహం జరిపించి, వారి సంతానంతో గడిపిన తర్వాత వ్యక్తి వానప్రస్థంలోకి ప్రవేశిస్తాడు. భార్యతో పాటు అడవులకు వెళ్లి నివాసం ఏర్పరచుకుంటాడు. భార్యతో ఉన్నప్పటికీ సంసార సంబంధాన్ని కొనసాగించకుండా.. ఆమెతో ఉంటూనే శారీరకంగా దూరంగా ఉంటూ వానప్రస్థ విధులను నిర్వర్తిస్తాడు. హోమాలు చేస్తూ దైవచింతనతో గడుపుతాడు. గృహస్థ, సన్యాసాశ్రమాలకు వారధిగా వానప్రస్థాశ్రమం ఉంటుంది.
* సన్యాసాశ్రమం
ఈ ఆశ్రమంలో పూర్వపు జీవితంతో పూర్తిగా బంధాన్ని తెంచుకుంటాడు. భార్యను కూడా విడిచి ఒంటరిగా సన్యాసాశ్రమంలోకి ప్రవేశిస్తాడు. కఠినమైన ఆహార నియమాలు ఉంటాయి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని సన్యాసిలా జీవించాలి. పూర్తి సమయాన్ని దైవచింతనతో గడపాలి. అడవుల్లో కాకుండా ఊరూరా తిరుగుతూ ఆదర్శ బోధనలు చేస్తూ దైవానికి దగ్గరవ్వాలి.
ఈ విధంగా మనిషి తన జీవితంలో ధర్మ, అర్థ, కామాలను సాధించి దైవచింతనతో శేషజీవితం గడుపుతూ మోక్షానికి దగ్గర అవుతాడు.
రుణాలు
పుట్టిన ప్రతి వ్యక్తి తీర్చుకోవాల్సిన రుణాలు కొన్ని ఉంటాయి. ఇవి ఒక వ్యక్తికి ఎదుటివారి పట్ల ఉన్న బాధ్యతలను తెలియజేస్తాయి. అవి
పితృ రుణం: తన జన్మకు కారణం అయిన తండ్రి రుణం తీర్చుకోవడాన్ని పితృ రుణంగా చెబుతారు.
గురు రుణం: గురు శుశ్రూష చేయడం, గురుదక్షిణ చెల్లించడం, గురువుకు మంచి కీర్తిని సంపాదించి పెట్టడం ద్వారా విద్యను ప్రసాదించిన గురువు రుణం తీర్చుకోవాలి.
దైవ రుణం: మానవజన్మను ప్రసాదించినందుకు నవ విధ భక్తిమార్గాలతో, యజ్ఞయాగాదుల నిర్వహణతో భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతూ దైవరుణం తీర్చుకోవడం.
కర్మ సిద్ధాంతం
భారతీయ హిందూ సమాజంలో కర్మభావన ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది కార్యకారణ సంబంధాలను వివరిస్తుంది. మంచి చెడుల ద్వారా ఎదురయ్యే ఫలితాలను తెలుపుతూ సమాజంలో వ్యక్తి ప్రవర్తనను నియంత్రిస్తుంది. సమాజంలో ఒక వ్యక్తి చేసే మంచి పనులకు మంచి ఫలితాలు, చెడు పనులకు చెడు ఫలితాలు ఎదురవుతాయని కర్మ సిద్ధాంతం చెబుతోంది. వ్యక్తి బాహ్య, అంతర్గత ప్రవర్తనలను నియంత్రించడం దీని ముఖ్యోద్దేశం. కర్మ ఆలోచనలు, సద్భావన కలిగిన మాట, మనం చేసే పనులు, మనం ఇతరులతో చేయించే పనుల ద్వారా వ్యక్తమవుతుంది.
త్రిగుణాలు
వ్యక్తి ప్రవర్తనా రీతుల ఆధారంగా గుణాలను వివరించారు. ఇవి మూడు రకాలు కాబట్టి త్రిగుణాలు అన్నారు.
శ్రుతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, దర్శనాలు....
శ్రుతులు: శ్రుతి (వినికిడి) ద్వారా నేర్చుకునేవి. గురుముఖంగా ఆయన నోటి నుంచి వినడం, మననం చేసుకోవడం ద్వారా విషయాన్ని నేర్చుకోవడం. వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలను శ్రుతులు అంటారు.
స్మృతులు: స్మరణ చేసుకోవడం ద్వారా నేర్చుకునేవి. గ్రంథ రూపంలో అధ్యయనం చేసేవి. మనుస్మృతి, గృహ్య సూత్రాలు, ధర్మసూత్రాలు, సూత్ర గ్రంథాలను స్మృతులు అంటారు.
పురాణాలు: అష్టాదశ పురాణాలను వీటికి ఉదాహరణగా చెప్పొచ్చు. అలాగే భాగవతం కూడా.
ఇతిహాసాలు: చరిత్రకు కల్పనలను జోడించి కథల రూపంలో రాసేవే ఇతిహాసాలు. రామాయణం, మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. ఇవి మానవ జీవనాన్ని, జీవన విధానాన్ని నిర్దేశించి మార్గదర్శకం చేస్తాయి.
దర్శనాలు: వీటిని షడ్దర్శనాలు అంటారు. ఇవి- సాంఖ్య, న్యాయ, యోగ, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, వైశేషికాలు. దర్శనాలు అంటే రుషులు దర్శించి జ్ఞానబోధ చేసినవి అని అర్థం.
ఇలా అనేక అంశాలతో భారతీయ హిందూ సమాజంలో వ్యక్తుల జీవన విధానం, ప్రవర్తనా రీతులు ముడివడి ఉన్నాయి. వీటిని భారతీయ సమాజం మూలాలుగా చెబుతారు.
*
సత్కార్యాలకు అనుకూలం..

గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించేవారికి వివేకానందుడు ఏమని చెప్పాడంటే.. ‘మోహ మాత్సర్యాల కోరల్లో మనుషులు ఎలా చిక్కుకున్నారో చూడండి. గుండెల్ని ద్రవింపజేసే వారి దీనాలాపాలు వినండి. ముందుకు నడవండి.. మున్ముందుకే.. ఓ స్థైర్యవంతులారా! శృంఖలాలలో ఉన్నవారిని విడిపించడానికీ, నిరుపేదల దారిద్య్ర భారాన్ని తగ్గించడానికి, అజ్ఞానుల హృదయాంధకారంలో వెలుగులు ప్రసరింపజేయడానికి ముందుకు అడుగేయండి. ఇతరుల కోసం నిర్వర్తించిన ఏ చిన్న కార్యమైనా సరే.. అంతశ్శక్తిని మేల్కొలుపుతుంది. ఇతరుల క్షేమం గురించి కనీస యోచన హృదయంలో సింహశక్తిని నిక్షిప్తం చేస్తుంది. మీరంటే నాకు అపారమైన ప్రేమ. కానీ మీరందరూ ఇతరుల సేవలో ప్రాణార్పణ చేయాలని నేను కాంక్షిస్తున్నాను. మీరలా చేస్తూ ఉంటే చూడడం నాకు అమిత సంతోషం. ప్రేమ విజయాన్ని పొందుతుంది. మీరు మీ తోటివారిని ప్రేమిస్తున్నారా? భగవంతుడు ఎక్కడో లేడు. మీరు అనే్వషణకు ఎక్కడకు వెళతారు? కటిక దరిద్రులు, కష్టజీవులు, దీనులు, బలహీనులు.. వీరందరూ దైవాలే.. వీరిని ముందుగా ఎందుకు పూజించరు? మీరు పేదల్లో పరమాత్మను దర్శించగలగాలి. మనసులో ఏ తలంపూ లేకుండా ధనాపేక్ష, ప్రతిష్ఠ కాంక్ష, మరే ఫలాపేక్ష లేకుండా పనిచేసే వ్యక్తి అత్యుత్తమంగా పనిచేస్తాడు. ఎందుకంటే గృహస్థాశ్రమమే ఎలాంటి సత్కార్యాలు చేయడానికైనా అనుకూలమైన సమయం’ అంటారు వివేకానందుడు.

సమాజసేవకు మార్గం..

గృహస్థ ధర్మానికి ఆశ్రమ గౌరవాన్ని కల్పించి గృహస్థాశ్రమాన్ని నిర్వచించారు మన మహర్షులు. అంతటి గృహస్థాశ్రమాన్ని ఆధారంగా చేసుకుని దయ, దానగుణాలతో శోభిల్లి వారు అత్యున్నత మోక్ష లక్ష్యానికి చేరుకున్నారు. అదే కోవకు చెందిన కర్దమ మహాముని సంసార సాగరంలో అడుగిడే ముందు సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకోసం తపస్సు చేశాడు. ఆ తప్ఫఃలంగా అపురూపమైన అర్ధాంగిని పొందడమే కాదు.. స్వయంగా శ్రీమన్నారాయణుడే తన కుమారుడిగా జన్మించే వరాన్ని ప్రాప్తించుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
గృహస్థ ధర్మాన్ని నిర్వహించడం కూడా యజ్ఞంగా నిర్వచిస్తూ కర్దమ మహాముని లోకానికి మార్గదర్శకత్వం వహించాడు. ఆ ప్రజాపతిని మాధ్యమంగా చేసుకుని గరుడ వాహనుడైన ఆ గదాధరుడు యజ్ఞ నిర్వహణలో గృహస్థుల బాధ్యతలను, తనలోనే లోకాలన్నీ కొలువై ఉన్నాయని, తాను మనలోనే ఉన్నాడని గుర్తుచేశాడు. సాధారణంగా లోకంలో ప్రవృత్తి మార్గాన్ని వీడి.. నివృత్తి పథంలో పయనించే ఆధ్యాత్మిక సంపన్నులను మినహాయిస్తే.. ఇతరులందరూ గృహస్థ ధర్మాన్ని అనువర్తించవలసినవారే.. సమాజంలో బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకు ఆధారమైన గృహస్థాశ్రమం ఎంతో విశేషమైనది.
యథామాతర మాశ్రీత్యసర్వే జీవన్తి జన్తవః
తథాగృహస్థ మాశ్రీత్యసర్వే జీవన్తి మానవాః
అంటే.. ‘కుటుంబంలో తల్లిని ఆశ్రయించి పిల్లలు జీవిస్తున్నట్లే సమాజంలోని అన్ని వర్గాలవారు, గృహస్థులను ఆశ్రయించి బతుకుతున్నారు’- అంటోంది మన సనాతన ధర్మం. అంటే గృహస్థాశ్రమం ఈ సమాజానికి తల్లివంటిదన్నమాట. అలాంటి ఆశ్రమంలో ఎంత ధార్మికంగా అడుగిడాలో, ఎంత అప్రమత్తంగా మసలుకోవాలో కర్దమ ప్రజాపతి పరోక్షంగా మనకు చెప్పాడు. ఆ ఆశ్రమాన్ని కూడా భగవంతునితో అనుసంధానం చేస్తూ సుసంపన్నం చేసుకునేందుకు ప్రయత్నించాలని తన ప్రవర్తనతో చూపించాడు. అందుకే మహావిష్ణువు కోసం తపస్సు చేసి మరీ తన అర్ధాంగి కోసం అభ్యర్థించాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. కర్దమ మునీశ్వరుడు అంజలి ఘటించి వినమ్రంగా.. తాను గృహస్థ్ధర్మంలోకి ప్రవేశింపదలిచానని చెప్పాడు. అది కూడా సృష్టి కోసమని స్పష్టం చేశాడు. ‘కాలాత్మకుండవైన నీకు నీ అభిమతంబగునట్టుగా కర్మమయంబైన భవదాజ్ఞా చక్రంబు ననుసరించుటకు గాని మదీయ కామంబు కొరకు కాదు’ అంటే- నీకిష్టమైన దివ్య కార్యమైన సృష్టిని వృద్ధి చేయడానికి మాత్రమే కానీ, నా కామం కోసం కాదు అంటాడు. అప్పుడు ప్రసన్నుడైన ఆ శేషతల్పశాయి.. ‘నీవు ఏమి కావాలని కోరి, నన్ను భక్తి శ్రద్ధలతో ఆరాధించావో ఆ కోరిక నెరవేరుతుంది. బ్రహ్మదేవుడి కుమారుడైన స్వయంభువ మనువు, అతని భార్య అయిన శతరూప తన కుమార్తె దేవహూతితో కలిసి నీ వద్దకు వస్తారు. ఆ సుగుణాలరాశిని నీవు వివాహం చేసుకో.. నీ కోరిక నెరవేరుతుంది’ అని వర ప్రదానం చేశాడు. దాంతో ‘శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు నేనీ కన్యను పెళ్లి చేసుకుంటాను. ఉత్తమ గుణ సంపన్నురాలైన ఈమెకు సంతానం కలిగేవరకూ నేను గృహస్థు ధర్మాన్ని నిర్వర్తిస్తాను. ఆ తరువాత జితేంద్రియుడనై యోగ మార్గం అవలంబించి ఆధ్మాత్మిక పథాన పయనిస్తాను’ అని ప్రతిజ్ఞ చేశాడు కర్దమ ముని. ఇక్కడ కర్దమ ముని గృహస్థుల విధిని చాలా విపులంగా చెప్పాడు. కాలమంతా కామోపభోగాలతో గడపకుండా ప్రవృత్తి మార్గాన్ని విడిచి నివృత్తి మార్గంలో నడవాలని సూచించాడు. భార్యాభర్తలు సంతానం కలిగిన అనంతరం పారమార్థికం, ఆత్మ నిగ్రహం అయిన పరిశుద్ధ జీవనం గడపడానికి కావలసిన బలం ఇవ్వమని భగవంతున్ని ప్రార్థించాలి. అప్పుడు గృహస్థాశ్రమ ధర్మాన్ని సమాజసేవ అనే సత్కర్మలకు ఉపయోగించే అవకాశం లభిస్తుంది. ఇదీ గృహస్థాశ్రమం గురించి కర్దమ మహాముని చేసిన దిశానిర్దేశం.

ఒకరికి ఒకరు తోడుగా...
భర్త- తన భార్య గురించి ‘‘ఈమె తన తల్లిదండ్రులు, సోదరులు మొదలైన వారినందర్నీ విడిచి నా దగ్గరకు వచ్చిందంటే ఎంత గొప్ప త్యాగం చేసింది? కనుక ఈమెకు ఏ విధమైన కష్టము కలుగనీయరాదు. జీవనం నిమిత్తం తిండి, బట్ట, ఇల్లు మొదలైన వాటికి లోటుండకూడదు. నాకంటే ఈమెకెక్కువ సుఖం లభించాలి’’అని భావిస్తూ ఆమె పాతివ్రత్య ధర్మ విషయం కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
పత్నికెటువంటి భావం ఉండాలంటే- ‘‘నేను నా గోత్రము, కుటుంబము మొదలైనవి త్యజించి వీరి ఇంటికి వచ్చానంటే సముద్రం దాటి ఇప్పుడు ఒడ్డుకి చేరుకొని మునిగిపోకూడదు. నావల్ల వీరికి దుఃఖం కలగకూడదు. వీరికి అవమానము గాని, నింద గాని, తిరస్కారం గాని జరుగకూడదు. నావల్ల వీరికి నింద మొదలైనవి జరిగితే అది చాలా అనుచితమైన విషయం అవుతుంది. నేనెంత కష్టమైనా అనుభవింతునుగాక. కాని వీరికి మాత్రం కించిత్తయినా కష్టం కలుగరాదు’’అంటూ ఆమె తన సుఖ సంతోషాలు త్యాగం చేసి పతి యొక్క సుఖ సంతోషాలు దృష్టిలో ఉంచుకొని ఆయన ఇహపర శ్రేయస్సు కోరుకోవాలి.

భర్త పాత్ర ఏ విధంగా ఉండాలి?
భార్య తన తల్లిదండ్రులను, తన వాళ్ళను, తన ఇంటి పేరును, గోత్రాన్ని వదులుకుని భర్తనే తన సర్వస్వమని భావిస్తుంది అట్టి భార్య ‘‘హృదయంతే దదామి’’అంటుంది. అనగా నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నానని అర్థం. భర్త ‘తవ చిత్త మనుచిత్తం భవతు’’ అంటాడు. నీ హృదయం నన్ను అనుసరించుగాక అని అర్థం.
భౌతికమైన ఆకర్షణలకే పరిమితం కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇచ్చిపుచ్చుకునే గుణాన్ని అలవరచుకోవాలి. ఇబ్బందులు ఎదురైతే సర్దుకుపోయే స్వభావాన్ని కలిగియుండాలి. భార్యను అర్థాంగిగా గుర్తించి అహంకారాలకు, అనుమానాలకు తావివ్వక అభిమానాన్ని, ఆనందాన్ని పంచుతూ భర్త తన పాత్రను గుర్తెరిగి గృహానికి యజమానిగా తనవంతు బాధ్యతను సదవగాహనతో పోషించాలి.

భార్య పాత్ర ఏవిధంగా ఉండాలి?
భర్త మనోభావాలకు, అభిరుచులకనుగుణంగా వ్యవహరించడం, పెద్దలను ఆదరాభిమానములతో సేవించడం వంటి ఉన్నత విలువలుగల భార్య కుటుంబంలో శాంతి, సామరస్యాలను నెలకొల్పుతుంది. అందుకే ‘్భర్యామూలమీదం గృహం’ అన్నారు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నంతసేపూ బాగుండడం, ఏదైనా తేడావస్తే వారిమీద కోపగించడం, ద్వేషించడం వంటి చర్యలు పనికిరావు. పరిస్థితులు బాగాలేనప్పుడు కూడా వాటిని అవగాహనతో పరిష్కరించుకోగలిగే సామర్థ్యాలను పెంపొందించుకుంటూ అన్యోన్యతతో, సదవగాహనతో వ్యవహరించాలి.
గృహస్థుల పాత్ర కేవలం దాంపత్యమునకే పరిమితం చెందక సంతానం పట్ల సరైన అవగాహనతో తల్లి, తండ్రి అనే అత్యంత కీలకమైన పాత్రలతో సమర్థవంతంగా వ్యవహరించాలి. *

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి