ఈ వారం స్పెషల్

ప్రపంచానికి పెనుసవాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ నాగరికత వికసిస్తోంది.. సాంకేతికత విస్తరిస్తోంది.. ప్రపంచమే ‘పుడమి పల్లె’గా అవతరించింది.. ఆహారోత్పత్తుల్లో అద్భుతాలు.. వైద్య పరిశోధనల్లో నవీన ఆవిష్కరణలు.. కృత్రిమ మేధ కొత్తపుంతలు.. ఇవన్నీ విశ్వజనులందరినీ ‘ఆహా..!’ అనిపిస్తున్నా- నేటి ఆధునిక యుగంలో అనేకానేక సమస్యలు ‘్భగోళం’పై ముప్పేట దాడి చేస్తున్నాయి.. విశ్వమానవ కల్యాణానికి ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు అహరహం కృషి చేస్తున్నా- ప్రపంచ శాంతి, ఆకలి కేకలు, వ్యాధుల బాధలు, ఆర్థిక అసమానతలు, మహిళలపై వివక్ష, నిరుద్యోగం, నిరక్షరాస్యత, జీవవైవిధ్య విధ్వంసం, సామాజిక వైరుధ్యాలు, ఉగ్రవాదం, శరణార్థుల ఘోష, వాతావారణ కాలుష్యం, భూతాపం... ఇలా ఎనె్నన్నో సవాళ్లు నేడు ప్రపంచాన్ని భయోత్పాతానికి గురిచేస్తున్నాయి. మానవ హక్కుల పరిరక్షణకు, సామాజిక-ఆర్థిక పురోగతికి అమలు చేస్తున్న బృహత్తర ప్రణాళికలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదన్నది కాదనలేని కఠోర వాస్తవం. ఈ సమస్యలకు, సవాళ్లకు ఎలాంటి సరిహద్దులు లేవు. పేద, ధనిక దేశాలనే వ్యత్యాసం లేకుండా అన్ని చోట్లా ఈ సమస్యలు జనజీవనాన్ని సాఫీగా సాగనివ్వడం లేదు. మరికొద్ది రోజుల్లో 2019వ సంవత్సరం కాలగర్భంలో కలిసిపోతున్న నేపథ్యంలో- సమస్యలతో సతమతమవుతున్న ఈ విశ్వానికి రాబోయే రోజుల్లో కాస్తయిన సాంత్వన లభిస్తుందా? అంటే అది ప్రశ్నార్థకమే!
విభిన్న రంగాల్లో సాధించిన ప్రగతిని గణాంకాల కొలమానాలతో బేరీజు వేసుకొంటే.. ‘సంతృప్తి రవంత.. సమస్యలు కొండంత’ అని అంగీకరించక తప్పదు. ప్రపంచాన్ని చుట్టుముట్టిన సమస్యలు ఎన్నో ఉన్నా, వాటిలో కొన్ని ప్రధాన సమస్యల నుంచైనా బయటపడేందుకు వినూత్న కార్యాచరణ అవసరం. ఈ సవాళ్లను అధిగమించేందుకు ప్రపంచ దేశాలన్నీ సమష్టి కృషి చేయాల్సి ఉంది. యావత్ మానవాళిని అనేక సమస్యలు పీడిస్తున్నా ‘పద్దెనిమిది విశ్వవ్యాప్త సవాళ్ల’పై ఎదురొడ్డి పోరాడాల్సి ఉందని ఐక్యరాజ్య సమితి గతంలోనే పిలుపునిచ్చింది. నిర్దేశిత లక్ష్యాలను 2030 నాటికి సాధించేలా ప్రపంచ దేశాలన్నీ భాగస్వామ్యం వహించి ముందుకు సాగాలని ఐరాస సూచించింది. వ్యక్తులు, మానవ సమాజాలు, సామాజిక వర్గాలు, దేశాలు, అంతర్జాతీయ సంస్థలు.. ఇలా ఎవరికివారు ‘గమ్యాన్ని’ చేరుకొనేందుకు సమర్ధవంతమైన ప్రణాళికలను ఆచరణలో అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేస్తోంది. నేటి సాంకేతిక యుగంలో సమస్యలు తిష్టవేయడాన్ని ఒక సవాల్‌గా తీసుకోవాలని సూచించడమే గాక, లక్ష్యసాధనకు నిర్దిష్ట ప్రణాళికలను కూడా ఐరాస, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ వేదికలు సిద్ధం చేశాయి. ఆహార భద్రత, వ్యాధుల తీవ్రత, ప్రాథమిక విద్య, లింగ సమానత్వం, మహిళా సాధికారత, వాతావరణ కాలుష్యం, జీవ వైవిధ్య హననం, తాగునీటి సమస్య, మహిళలపై లైంగిక దాడులు వంటి ప్రధాన సమస్యలను అధిగమిస్తే తప్ప మానవాళికి సుఖమయ జీవనం అసాధ్యం అని చెప్పాలి.
ఆగని ఆకలి కేకలు..
వ్యవసాయ రంగంలో వినూత్న పరిశోధనల ఫలితంగా పంటల ఉత్పత్తి పెరుగుతున్నా నేడు చాలా దేశాల్లో ప్రజలు ఆకలి బాధతో అలమటిస్తున్న దీనదృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి తొమ్మిది మందిలో కనీసం ఒకరు తగిన ఆహారానికి నోచుకోవడం లేదని ఐక్యరాజ్య సమితి నివేదికలు నిగ్గుతేల్చాయి. తగిన పోషకాహారం అందక పేద దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల్లోనూ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పోషకాహార లోపం మహిళలు, పిల్లల పాలిట పెనుశాపంగా మారింది. నానాటికీ ప్రపంచ జనాభా పెరుగుతున్నందున ఆహార భద్రత అనేది అలవికాని సమస్యగా పరిణమించింది. మలేరియా, క్షయ, హెచ్‌ఐవీ వ్యాధుల కంటే పోషకాహార లోపంతో నీరసించి మృత్యువు పాలవుతున్న వారి సంఖ్య అధికంగా ఉండడం ఆందోళనకరం. ఆహార భద్రత అనేది 2019వ సంవత్సరానికే పరిమితం కాలేదు. ఈ సమస్య గతంలోనూ ఉంది, రాబోయే కాలంలోనూ మరింతగా వేధించే ప్రమాదం లేకపోలేదు. వ్యవసాయ రంగంలో అధిక దిగుబడులు సాధించడం సమస్య కానే కాదు. అయితే, పంట ఉత్పత్తులన్నీ ప్రజలందరికీ చేరడం లేదన్నది నిష్ఠుర సత్యం. పంటలకు సంబంధించి అధిక దిగుబడులు కన్పిస్తున్నా- దళార్ల దోపిడీ, మార్కెట్ మాయాజాలం ఫలితంగా సరైన ఆహారానికి ఎంతోమంది నోచుకోవడం లేదు. చాలా దేశాల్లో కొనుగోలు శక్తిలేని పేదవర్గాల వారు ఆహార ఉత్పత్తులను అందుకోలేక పోతున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల వల్లనే గత దశాబ్ద కాలంలో ఆకలి సమస్య తీవ్రరూపం దాల్చింది. ఆకలి సమస్య కారణంగా పేద దేశాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు పోతూ శరణార్థులుగా మారుతున్నారు. ఈ శరణార్థులు ఆహారానికే కాదు, కనీస మానవ హక్కులకు కూడా దూరమవుతున్నారు. వీరు ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. అధిక ధరలకు ఆహార పదార్థాలను కొనలేని దీనులు వ్యాధులకు లోనై అస్థిపంజరాలను తలపిస్తున్నారు. ప్రపంచ జనాభాలో 11 శాతం మంది పోషకాహార లోపంతో సతమతమవుతుండగా, మరోవైపు 40 శాతం మంది మధ్య వయస్కులను అధిక బరువు వేధిస్తుండడం విచిత్రమైన పరిణామం. పేద దేశాల్లో ఆకలి తాండవిస్తుండగా, కొన్ని దేశాల్లో పిల్లలు, పెద్దల్లో ఊబకాయం పెరగడం సమాంతర పరిణామం. ఓవైపు పోషకాహార లోపం, మరోవైపు సరైన ఆహారం తీసుకోకపోవడం రెండు పార్శ్వాలుగా కనిపిస్తున్నాయి. శరీరం శుష్కించి పోవడం, ఊబకాయం.. ఈ రెండూ ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ఊబకాయం సంపన్న వర్గాలకే పరిమితం అనుకుంటే పొరపాటే. విభిన్న ఆదాయ వర్గాల్లోనూ ఊబకాయం విస్తరించడం విషమ సమస్యగా మారింది.
మంచి పోషకాలున్న ఆహారాన్ని కొనుగోలు చేయడం సామాన్యులకు ‘ఖరీదైన’ వ్యవహారంగా మారుతోంది. అల్పాదాయ వర్గాల ప్రజలు నాణ్యత లేని, పోషక విలువలు లేని ఆహారాన్ని కొనకతప్పడం లేదు. సామాన్యులు తక్కువ ధరకు లభించే ఆహారంతోనే సంతృప్తి పడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలందరికీ ఆహార భద్రత అన్న నినాదం ఓ ప్రహసనంగా మారుతోంది. 2030 నాటికి క్షుద్బాధను నివారించలన్నది ఐక్యరాజ్య సమితి లక్ష్యం అయినప్పటికీ అది సాకారమయ్యే పరిస్థితి కానరావడం లేదు. చిన్న, పెద్ద అనే వ్యత్యాసం లేకుండా అన్ని దేశాల్లోనూ పోషకాహారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వారిలో కొనుగోలు శక్తి పెంచేలా ప్రభుత్వాలు సరైన ప్రణాళికలు రచించాలని ఐరాస విజ్ఞప్తి చేసింది. ఆహారోత్పత్తులను పెంచేలా, నిత్యావసర సరకులను సరసమైన ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. సామాజిక వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేస్తే ఆహార లేమి నుంచి కొంతవరకైనా ఉపశమనం లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు థాయిలాండ్, నేపాల్, మెక్సికో, కోస్టారికా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో సామాజిక వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
వ్యాధుల పంజా..
సరైన పోషకాహారం లభించక విశ్వవ్యాప్తంగా లక్షలు, కోట్లలో మరణాలు సంభవిస్తుండగా.. మరోవైపు అంటువ్యాధులు, జీవనశైలి వ్యాధులు, ఎబోలా వంటి వైరస్‌లు దాడి చేస్తున్నాయి. ఒకప్పుడు కలరా, మలేరియా, క్షయ, హెచ్‌ఐవీ వంటి అంటువ్యాధులపై ప్రపంచ దేశాలు ఆందోళన చెందగా ఇపుడు అపరిశుభ్రమైన తాగునీరు, వాతావరణ కాలుష్యం వంటి కారణాలతో వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరింది. వ్యాధి నివారణ చర్యలను తీసుకుంటున్నట్టు దేశవిదేశాల్లో పాలకవర్గాలు ఘనంగా ప్రకటిస్తున్నప్పటికీ పరిసరాల పరిశుభ్రత, నాణ్యమైన మంచినీటి సరఫరా అనేవి పూర్తి స్థాయిలో జరగడం లేదు. క్యాన్సర్, మధుమేహం, శ్వాసకోశ వ్యాధులపై దృష్టి సారించడంతో పాటు రోడ్డు ప్రమాదాలు, వాతావరణ కాలుష్యం వంటి సమస్యలపై ప్రభుత్వాలు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటువ్యాధుల ఫలితంగా సంభవిస్తున్న మరణాల్లో అల్పాదాయ వర్గాల వారు 71 శాతం మంది ఉండడం గమనార్హం. వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహార విలువలపై పేదదేశాల వారిని మరింత చైతన్యవంతం చేయాల్సి ఉంది. మరోవైపు మితిమీరిన మద్యపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగం, వంటలకు హానికరమైన ఇంధనాలను వాడడం కూడా అకాల మరణాలకు కారణాలుగా కన్పిస్తున్నాయి. ఆహార భద్రత లాగే రహదారి భద్రతపైనా దృష్టి సారించాల్సి ఉంది. వ్యాధులు, అకాల మరణాలకు కారణమవుతున్న పరిస్థితులపై సామాన్య ప్రజల్లో అవగాహన పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలి. ఆరోగ్య భద్రతకు సంబంధించి మహిళలు, విద్యార్థులు, వృద్ధుల్లో చైతన్యం తెచ్చేందుకు విస్తృతంగా శిక్షణ శిబిరాలను నిర్వహించాలని ఐరాస విజ్ఞప్తి చేసింది. ‘ఆరోగ్యానికి నీరు- పరిశుభ్రత’ అనే నినాదంతో ఇప్పటికే థాయిలాండ్, మెక్సికో, నేపాల్, భారత్ వంటి దేశాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. చేతుల పరిశుభ్రత, దంతాల పరిరక్షణ, మేలైన వంట పద్ధతులు, మంచి ఆహారపు అలవాట్లపై ప్రచారం చేపట్టాల్సి ఉంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు, వ్యాయామం, యోగ, మితాహారం వంటివి ఆచరించాల్సి ఉంది. ఈ అలవాట్లు విద్యార్థులకు చిన్నతనం నుంచే నేర్పించాలి.
మాతాశిశు మరణాలను నివారించేందుకు ప్రభుత్వంతో పాటు పౌర సమాజం కూడా తోడ్పాటును అందించాలి. పోషకాహార లోపం, రక్తహీనత వల్ల భారత్ సహా అనేక దేశాల్లో మాతాశిశు మరణాలు అధిక సంఖ్యలో సంభవిస్తున్నట్టు అధికారిక నివేదికలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా అయిదేళ్లలోపు చిన్నారుల మరణాలు అనేక దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పేద, అల్పాదాయ వర్గాల గర్భిణులు, బాలింతలకు రక్తహీనత పెనుశాపమైంది. పోషకాహారం అందక శిశువులు, బాలింతలు మరణాలకు చేరువవుతున్నారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణ విషయంలోనే కాదు, వారి పెంపకంలోనూ అనేక లోటుపాట్లు ఎదురవుతున్నాయి. ఎలాంటి వివక్ష లేకుండా ఆడపిల్లలకు కూడా విద్యాహక్కును అందించాలి. అవిద్య కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా మహిళలు సాధికారతను సాధించలేక పోతున్నారు. లింగ వివక్షను నిర్మూలించినపుడే ఏ దేశమైనా అభివృద్ధి పథాన దూసుకుపోతుందని, నేటి ఆధునిక యుగంలోనూ అసమానతలు కొనసాగడం అర్థరహితమని ఐరాస పేర్కొంది. పిల్లలకు నాణ్యమైన విద్య అందించినపుడే అసమానతలు అంతం అవుతాయంటూ నేపాల్, దక్షిణాఫ్రికా, ఫిజీ, కోస్టారికా,్థయిలాండ్, మెక్సికో వంటి దేశాల్లో నిర్దిష్ట బోధనా పద్ధతులను అమలు చేసేలా ఐక్యరాజ్య సమితి కొన్ని చర్యలు చేపట్టింది.
లింగ సమానత్వం..
ప్రపంచ జనాభాలో సగానికి మించి మహిళలున్నప్పటికీ తరాల తరబడి వారిపై సాంఘిక, ఆర్థిక వివక్షలు కొనసాగుతున్నాయి. సామాజిక కట్టుబాట్లు వారికి ప్రతిబంధకాలుగా మారాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, సాధికారత వంటివి మహిళలందరికీ అందడం లేదు. ప్రపంచం పురోగమిస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నప్పటికీ, చాలా దేశాల్లో మహిళలకు మానవ హక్కులు అందని దుర్భర పరిస్థితులు కొనసాగుతున్నాయి. విద్య, ఆర్థిక స్వేచ్ఛ లేనందున వారు సాధికారతకు నోచుకోవడం లేదు. మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబమే కాదు, సమాజం కూడా ముందంజలో ఉంటుందన్న మాటలు నినాదాలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటికీ చాలా దేశాల్లో అత్యధిక సంఖ్యలో మహిళలు ఇంటి బాధ్యతలు, పిల్లల పెంపకానికే పరిమతం అవుతున్నారు. ఉపాధి, ఉద్యోగాల్లో వారికి పురుషులతో సమానత్వం ప్రశ్నార్థకమవుతోంది. సమాన పనికి సమాన వేతనం ఆచరణలో అమలు కావడం లేదు. విద్యావంతులైన మహిళలు సైతం ఇంటి బాధ్యతలకే పరిమితం కావడం వల్ల- వారికి సాధికారత, ఆర్థిక స్వేచ్ఛకు లభించడం లేదు. విద్యకు నోచుకోని పేదవర్గాల మహిళలు సరైన పోషకాహారం లభించక వ్యాధుల బారిన పడుతున్నారు. అవిద్య వల్ల హెచ్‌ఐవి, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులకు లోనై మరణిస్తున్న మహిళల సంఖ్య అధికంగానే ఉంటోంది. అత్యాచారాల వల్ల లైంగిక సంబంధ వ్యాధులకు గురై ప్రాణాలు కోల్పోతున్న అతివల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మహిళలకు మానవ హక్కులు, లింగ సమానత్వం, సాధికారత వంటి అంశాలపై సమాజంలో అవగాహన పెంచాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వాలు తగినన్ని నిధులను కేటాయించి సరైన ప్రణాళికలను ఆచరణలో అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి కోరుతోంది. మహిళలు సాధికారత సాధిస్తేనే వారు పురుషులతో సమానంగా జీవించగలుగుతారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు, హస్తకళలను ప్రోత్సహిస్తే మహిళా సాధికారత కొంతవరకైనా సాకారమవుతుంది. మహిళా సాధికారత నిజమైనపుడు వారు అవిద్య, అసమానత్వం వంటి సమస్యలను అధిగమించే అవకాశం ఉంది.
జీవ వైవిధ్యానికి చేటు..
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం పదమూడు మిలియన్ల విస్తీర్ణం మేరకు అటవీ హననం జరుగుతున్నందున స్వచ్ఛమైన గాలి లభించడం లేదని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. జీవ వైవిధ్యం తగ్గుతున్నందున ప్రపంచ వ్యాప్తంగా పలురకాల జీవులు అంతరించి పోతున్నాయి. వాతావరణ కాలుష్యం, అడవుల నరికివేత, సముద్రాలు చెత్తకుండీలా మారడం వంటి పరిస్థితులతో పలురకాల బాక్టీరియాలు, వన్యమృగాలు, జలచరాలు మనుగడ కోల్పోతున్నాయి. వానపాములు, కప్పలు, కొన్ని రకాల సూక్ష్మజీవులు క్రమేపీ అదృశ్యం అవుతున్నందున భూసారం తగ్గుతోంది. సేంద్రియ పద్ధతులకు బదులు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులను మితిమీరి వాడుతున్నందున పంటలు విషతుల్యం అవుతున్నాయి. భూతాపం పెరగడంతో మంచుశిఖరాలు కరిగిపోయి సముద్రాలు జనావాసాల వద్దకు వస్తున్నాయి. అటవీ విస్తీర్ణం తగ్గడంతో అనావృష్టి వల్ల భూగర్భ జలాలు నానాటికీ అడుగంటి పోతున్నాయి. వాతావరణ సమతుల్యత ఘోరంగా దెబ్బతినడంతో పర్యావరణం కలుషితమైపోతోంది. వన్యప్రాణులను పరిరక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు. ప్రకృతి సంపద, అడవి జంతువులు అంతరించిపోతున్నందున ‘వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల’ను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది.
సముద్రాలు కాలుష్యమయం
భూగోళంలో ఎక్కువ విస్తీర్ణంలో జలవనరులు ఉన్నప్పటికీ, రక్షిత మంచినీరు అందని విషమ పరిస్థితి తప్పడం లేదు. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వాలు ఎనె్నన్నో ప్రణాళికలను చేపడుతున్నా ఆశించిన ఫలితాలు అందడం లేదు. నదులు, సముద్రాలు కాలుష్యమయమవుతున్నాయి. నీటి కోసం వానలపైనే ఆధారపడక తప్పడం లేదు. సముద్రాలు కార్బన్ డయాక్సైడ్‌ను స్వీకరించి, ప్రకృతిలో 30 శాతం మేరకు ఆక్సిజన్‌ను మనకు అందిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణానికి హాని జరుగుతున్నందున సముద్రాల్లో జలచరాలు మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రాల్లో టన్నుల కొద్దీ పారవేయడం వల్ల జలచరాలు మృత్యువు పాలవుతున్నాయి. కాలుష్యం పెరగడంతో సముద్రాల్లో మత్స్యసంపద నానాటికీ తగ్గుతోంది. ఫలితంగా చేపల వేటను వృత్తిగా చేసుకున్న వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొనక తప్పడం లేదు. ఇంధన వ్యర్థాలు, ప్లాస్టిక్, చెత్తాచెదారాల వల్ల సముద్రాలు ‘మృత్యు కేంద్రాలు’గా మారుతున్నాయని పర్యావరణ శాస్తవ్రేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహ్లాదం కలిగించే సముద్ర తీరాలు ‘డంపింగ్ యార్డుల’ను తలపిస్తున్నందున పర్యాటక రంగం సవాళ్లను ఎదుర్కొంటోంది.
అందరికీ అందని తాగునీరు..
ఆహారం కొరత మాదిరి పరిశుభ్రమైన తాగునీరు ‘గగన కుసుమం’ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మంచినీరు అందరికీ అందుబాటులో లేకుండా పోయింది. నదులు, వాగులు, వంకలు, జలాశయాలు ఎన్నో ఉన్నా పరిశుభ్రమైన తాగునీటికి ప్రజలు నోచుకోవడం లేదు. విశ్వవ్యాప్తంగా రెండు బిలియన్ల మంది ప్రజలు కలుషిత నీటినే గతిలేక తాగుతున్నారు. పేద దేశాల్లో ఇప్పటికీ బహిరంగ మల విసర్జన కొనసాగుతున్నందున నీటి వనరులు కలుషితమవుతున్నాయి. పరిశుభ్రత లేని ఇలాంటి నీటినే ప్రజలు గృహావసరాలకు వినియోగించక తప్పని పరిస్థితులు పల్లెసీమల్లో సర్వసాధారణం. రక్షిత మంచినీటి సరఫరాకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఎందుకూ కొరగావడం లేదు. వాననీటిని పరిరక్షించుకుంటూ మంచినీటి సమస్యను నివారించేందుకు తగిన ప్రణాళికలను అమలు చేసేందుకు ప్రభుత్వాలు ఆసక్తి చూపించినట్టయితే పరిస్థితి కొంతవరకైనా తగ్గుతుంది. ‘పరిశుద్ధ జలాలు- పారిశుధ్యం’ నినాదం ఆచరణలో నిజమైతే మంచినీటి సమస్య నుంచి ప్రజలకు కాస్తయినా ఉపశమనం లభిస్తుంది.
కార్యాచరణే శరణ్యం
ఆధునిక సాంకేతిక యుగంలోనూ వేధిస్తున్న వౌలిక సమస్యల నుంచి గట్టెక్కాలంటే పాలకవర్గాలు క్షేత్రస్థాయి నుంచి సరైన ప్రణాళికలను చిత్తశుద్ధితో అమలు చేయాల్సి ఉంది. తగిన విధాన నిర్ణయాలను తీసుకోవడమే కాదు, వాటి అమలుకు నిధుల కేటాయింపులు అవసరం. మానవ హక్కులు, శిశువుల సంరక్షణ, మహిళా సాధికారత, లింగ సమానత్వం వంటి సమస్యలపై నిరంతర జాగరూకతే శరణ్యం. అధిక జనాభాను నియంత్రించేందుకు, వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు నిర్దిష్ట ప్రణాళికలు నిరంతరం అమలు చేయాలి. ఈ విషయాలపై ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు చేసిన తీర్మానాలను అన్ని దేశాలూ అమలు చేస్తే తప్ప ప్రస్తుత పరిస్థితిలో మార్పును ఆశించలేం. ఇలాంటి అంశాలపై వివిధ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఆచరణ రూపం దాల్చాల్సి ఉంది. ‘నినాదాలు కాదు.. విధానాలు ముఖ్యం’ అని ప్రభుత్వాలు గుర్తెరిగినపుడే ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్యల నుంచి కొంతవరకైనా బయటపడే అవకాశాలున్నాయి. *

-పి.ఎస్.ఆర్.