ఈ వారం స్పెషల్

మానవ సేవకు మహా సంకల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ వ్యక్తి చిన్న పని తలపెడితే అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. విద్యార్థులు చదువుకోవాలన్నా, గృహస్థుడు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా, కుటుంబ సభ్యులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా అనేక ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉంటారు. సామాన్యులకు ప్రతి చిన్నపనీ కష్టమైందిగానే కనిపిస్తుంది. కాని మహానుభావులకు ఎంతపెద్ద పనైనా చిన్నదిగానే కనిపిస్తుంది. లక్షలాది మందికి ఆచార్యులుగా ఉన్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి చేపట్టిన ప్రాజెక్టులు, పథకాలు, కార్యక్రమాలు వింటేనే ఆశ్చర్యం వేస్తుంది. వారు చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు చూస్తే ఆయన ఒక వ్యక్తి కాదు ప్రచండమైన అద్భుతమైన మహత్తర శక్తి అనిపిస్తోంది.
ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, వైద్య, ఆరోగ్య కార్యక్రమాలు.. ఇలా ఒకటి రెండూ కాదు.. పదుల సంఖ్యలో వివిధ కార్యక్రమాలు చేపట్టి సమాజ సేవలో నిమగ్నమయ్యారు.
1956 నవంబర్ 3న వెంకటాచార్యులు, అలవేలు మంగ తాయారు దంపతులకు రాజమండ్రి సమీపంలోని అర్తమూర్ గ్రామంలో జన్మించిన చినజీయర్ తన 23 ఏట సన్యాసాశ్రమం స్వీకరించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి పెద్ద శ్రీమన్నారాయణ రామానుజు జీయర్‌గారు చిన్న జీయర్ గురువులు. 1981లో గుంటూరు జిల్లా నడిగడ్డపాలెంలోని శ్రీమత్ ఉభయ వేదాంత ఆచార్య పీఠం అధిపతిగా చిన జీయర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం శ్రీరామనగరాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని పని చేస్తున్నానరు. ఆనాటి నుండి ఆయన చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తూ ఉన్నాయి. ఒక కార్యక్రమం పూర్తవగానే మరొక కార్యక్రమం చేపడుతున్నారు. సామూహిక విష్ణు సహస్రనామ పారాయణాలు, యజ్ఞాలు, గీతాసందేశ కార్యక్రమాలు నిర్వహించారు. ఏ స్థాయిలో కూడా అలసిపోయినట్టు ఆయన కనిపించడం లేదు. నిరంతరం సమాజ సేవ కొనసాగిస్తున్నారు. ‘స్వీయ ఆరాధన-సర్వ ఆదరణ’ అన్నది చిన జీయర్ స్వామి ప్రధానంగా పెట్టుకున్న నినాదం. ‘మానవ సేవ-సర్వప్రాణి సేవ’ అంటూ ముందుకు సాగుతున్నారు.
జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ (జెట్), జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ (జీవా), జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (సొసైటీ), వికాసతరంగిణి, అన్నదానం, శ్రీమదుభయ వేదాంతాచార్య పీఠం ప్రధానంగా ఏర్పాటు చేశారు.
జెట్
జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్) ద్వారా వేద, ఆగమ పాఠశాలలు, కళాశాల, జీయర్ పురస్కారాలు, వైదిక సదస్సులు, వైదిక గ్రంథాల ముద్రణ, భక్తినివేదన మాసపత్రిక ప్రచురణ, అంధులకు పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నారు. సీతానగరం (గుంటూరు), శ్రీరామనగరం, జీవా (హైదరాబాద్), వారిజ (విశాఖపట్నం), కరీంనగర్‌లలో వేద పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో పాంచరత్న, ఆగమ, ప్రబంధం, వేదాంతం, యజుర్వేదం, స్మార్థం, మైత్రాయిని వేదాలను బోధిస్తున్నారు. జీవాలో వేదవిద్యార్థులకు కంప్యూటర్ లాబోరేటరీ ఉంది. వేదవిద్యార్థులకు గార్డెనింగ్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, కళల్లో ప్రావీణ్యం, గోసేవ తదితర అంశాల్లో కూడా బోధన జరుగుతోంది. వేదవిద్యలో విశేష కృషి చేసిన పండితులకు తరచూ పురస్కారాలు (జీయర్ పురస్కారాలు) అందిస్తున్నారు. జెట్ పేరుతోనే వేద గ్రంథాలైన రుగ్వేద సంహిత, శుక్ల యజుర్వేదీయ కాణ్వ సంహిత, కృష్ణ యజుర్వేదీయ మైత్రాయణీ సంహిత, తైత్తరీయ సంహిత, అధర్వ వేద శౌనక సంహిత, బ్రాహ్మణం, అరణ్యకం, ఆగమ గ్రంథాలైన పాద్మ, శ్రీప్రశ్న, విష్ణుతిలక, పరమ పురుష, విష్వక్సేన, పురుషోత్తమ, నారదీయ తదితర పుస్తకాలు ప్రచురించారు. అలాగే పద్మపురాణం నాలుగు బాగాలు ముద్రించారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లలో జెట్ విభాగాలు ఏర్పాటయ్యాయి. చిన జీయర్ తరచూ ఆయా దేశాలకు వెళుతూ, భారతీయ సంప్రదాయాలు, ఆచారాలపై ప్రసంగాలు చేస్తూ, ఆధ్యాత్మిక అంశాల్లో చైతన్యం కలిగిస్తున్నారు.
జెట్ (సొసైటీ)
జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ (సొసైటీ) పేరుతో గిరిజన పాఠశాలలు, మత్స్యకారుల పాఠశాల, వృత్తివిద్యాపాఠశాల నడిపిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా (పాతజిల్లా) కడెం మండలంలోని అల్లంపల్లి, ఇదే జిల్లాలోని ఉట్నూరు మండలంలోని బీర్సాయిపేటలలో గిరిజనులకోసం జీయర్ గురుకులాలు నడుస్తున్నాయి. ప్రకాశం జిల్లా కఠారివారిపాలెంలో మత్స్యకారుల పిల్లలకోసం జీయర్ గురుకులం నడుస్తోంది. ప్రకాశం జిల్లా మార్టూర్‌లో జీవన వికాస్ పేరుతో ప్రతిభ కలిగిన విద్యార్థులకు హాస్టల్ నిర్వహిస్తున్నారు. జెట్ నేతృత్వంలోనే ‘్భక్తినివేదన’ పేరుతో ఆధ్యాత్మిక మాసపత్రిక ప్రచురిస్తున్నారు. భీష్మ ఏకాదశి సందర్భంగా
వివిధ ప్రాంతాల్లో సామూహిక విష్ణుసహస్ర నామ పారాయణం 1994 నుండి నిర్వహిస్తున్నారు. గ్రామీణాభివృద్ధికి ‘కృష్ణం వందే జగద్గురుమ్’ పేరుతో సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
జీవా
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ గ్రామ పరిధిలో శ్రీరామనగరంలో ‘జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ’ (జీవా) ఏర్పాటు చేశారు. జీవాలో వేదవిద్యాలయం, అంధులకు పాఠశాల, కళాశాల నడిపిస్తున్నారు. హోమియో మెడికల్ కాలేజీ, ఆసుపత్రి ఏర్పాటు చేశారు. హోమియో మెడికల్ కాలేజీలో బీహెచ్‌ఎంఎస్ కోర్సు నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘నీట్’ పరీక్ష ద్వారా ప్రవేశాలు కొనసాగుతున్నాయి. అంధుల కోసం విద్యాసంస్థలు నడిపిస్తున్నారు. విశాఖపట్నంలోని వారిజలో ఒకటి నుండి పదోతరగతి వరకు పాఠశాల నడుస్తోంది. అలాగే జీవాలో జూనియర్ కాలేజీ (హెచ్‌ఈసీ, సీఈసీ విభాగాలు), డిగ్రీ కాలేజీ (బీఏ, బీకాం) నడుస్తోంది. ప్రపంచంలో మొట్టమొదటి సారి ఇతరుల సాయం లేకుండా 2007 సంవత్సరంలోనే లాప్‌ట్యాప్‌లపై పరీక్షలు రాసిన ఘనత జీవా విద్యాసంస్థల అంధులకే దక్కింది.
వికాస తరంగిణి
వికాస తరంగిణి పేరుతో సామాజిక సేవలు, ఆరోగ్య పరిరక్షణ, ప్రకృతివైపరీత్యాల సందర్భంగా సేవలు అందించడం, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొదించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సమావేశాలు, భజనలు నిర్వహిస్తున్నారు. ప్రకృతివైపరీత్యాల సమయంలో అనేక సందర్భాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కోనసీమ తుపాన్, తమిళనాడులో వివిధ సందర్భాలలో వచ్చిన తుపాను సందర్భంగా సేవలు అందించారు. తాజాగా కేరళ రాష్ట్రంలో వచ్చిన వరదబీభత్సం సందర్భంగా సేవలు అందించారు. గుజరాత్, నేపాల్‌లలో వచ్చిన భూకంపాల సమయంలో కూడా సేవలు అందించారు. బాధితులకు ఇళ్లను నిర్మించి ఇచ్చారు. ఉగ్రవాద నిర్మూలన కోసం పాదయాత్ర కూడా నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల శాంతిని కాంక్షిస్తూ మంగళతరంగిణి నిర్వహించారు. అమరవీరుల కుటుంబాకు ఆర్థిక సాయం చేశారు. తరచూ వైద్య ఆరోగ్య శిబిరాలు, పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. వేర్వేరుగ్రామాల్లో మంచినీటి సరఫరా పథకాలను కూడా ఏర్పాటు చేశారు. అమెరికాలో వీటి సేవ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆలయాలు
శ్రీరామనగరంలో దివ్యసాకేతం పేరుతో మూడంతస్తులలో ఆలయాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, మొదటి అంతస్తులో శ్రీరంగనాథస్వామి ఆలయం, రెండో అంతస్తులో శ్రీపరమపదనాథ ఆలయం (వైకుంఠం) ఉన్నా యి. ఈ తరహా ఆలయం తమిళనాడులో ఒకచోట మినహా దేశంలో ఎక్కడా లేదు. అలాగే గుంటూరు జిల్లా నడిగడ్డపాలెంలో లక్ష్మీనారాయణ ఆలయం, శ్రీకాకుళం జిల్లా మందసలో వాసుదేవ పెరుమాళ్, హృషీకేష్‌లో వైకుంఠ రామచంద్ర స్వామి ఆలయం, రంగధామంలో భూనీలా సమేత శ్రీరంగనాథస్వామి ఆలయం, విజయకీలాద్రి, సీతానగరం (విజయవాడ సమీపం) లో కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయాల్లో నిత్యపూజలు పెద్ద ఎత్తున నిర్వహించడమే కాకుండా, ప్రసాదాల పంపిణీ జరుగుతున్నాయి.
ఆశ్రమాలు
వివిధ ప్రాంతాల్లో ఆశ్రమాలను నిర్మించారు. శ్రీరామనగరం (హైదరాబాద్), భద్రాచలం, నడిగడ్డపాలెం (గుంటూరు), హుషీకేశ్, కరీంనగర్, మెల్కోటే (కర్నాటక), సీతానగరం (విజయవాడ సమీపం), శ్రీపెరంబుదూర్ (తమిళనాడు), శ్రీరంగం (తమిళనాడు), తిరుమల, వరిజ (విశాఖపట్నం) అమెరికాలోని హాస్టన్, న్యూజెర్సీలలో ఆశ్రమాలను ఏర్పాటు చేశారు. ఆయా క్షేత్రాలకు వచ్చే భక్తులు నివాసం ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ ఆశ్రమాల్లో నిత్యం తదియారాధన (అన్నదానం) జరుగుతోంది. నడిగడ్డపాలెంలో వృద్ధాశ్రమం నడిపిస్తున్నారు. పేదలైన వృద్ధులు నివాసం ఉండటంతో పాటు వారికి ఉచితంగా భోజనం సమకూరుస్తున్నారు.
‘ప్రజ్ఞ’ పేరుతో వేదసంస్కృతి, హిందూ సంప్రదాయాలను వ్యాప్తి చేస్తున్నారు. విద్యార్థులకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కళలు తదితర పోటీలు నిర్వహిస్తున్నారు. భారతీయ సాంప్రదాయ విధానాలను ప్రచారం చేస్తున్నారు. యోగా, మెడిటేషన్ శిబిరాలను రెగ్యులర్‌గా నిర్వహిస్తున్నారు.
ప్రధాన కేంద్రం
హైదరాబాద్ సమీపంలో ఉన్న శ్రీరామనగరం చిన్న జీయర్ స్వామికి ప్రధాన కేందంగా మారింది. స్వామి ఎక్కువ సమయం ఇక్కడే ఉంటున్నారు. గతంలో విజయవాడ సమీపంలోని సీతానగరంలో ఉండేవారు. దాదాపు వంద ఎకరాలపైగా విస్తీర్ణంలో ఏర్పాటైన శ్రీరామనగరం అద్భుతమైన సామాజిక, సంక్షేమ ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఈ ప్రాంగణంలోనే భగవత్ రామానుజుల భారీ విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ), దివ్యసాకేతం, హోమియో కాలేజీ, పెద్ద ఆడిటోరియం, అంధుల విద్యాసంస్థ, వేదపాఠశాల, పుస్తక విక్రయ కేంద్రం ఉన్నాయి. భక్తులకు రోజు తదియారాదన (్భజనం) ఏర్పాట్లు ఉన్నాయి. అనేక కార్యక్రమాలను కొనసాగిస్తున్న చిన జీయర్ స్వామికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది. పూర్తి వివరాలు కావలసిన వారు 95535 49971/72 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఈ-మెయిల్‌లో కూడా సంప్రదించవచ్చు.
*
సమ సమాజమే లక్ష్యం
-చిన జీయర్ స్వామి

సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపేందుకు, వివిధ కులాల మధ్య హెచ్చు తగ్గులు లేకుండా చూసేందుకు, మానవ సేవయే మాధవసేవగా పరిగణిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను, సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. భగవత్ రామానుజాచార్యులు చిన జీయర్‌కు ఆదర్శమూర్తి. శ్రీశ్రీశ్రీ త్రిదండి పెద్ద శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ వీరికి గురువులు, ఆచార్యులు. భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న చిన జీయర్ ఆంధ్రభూమి ప్రతినిధికి వివిధ అంశాలపై ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు సమగ్రంగా ఇక్కడ అందిస్తున్నాం.

ప్రశ్న: రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న తలంపు ఎందుకు వచ్చింది?
జవాబు: సమాజంలో అసమానతలు నెలకొని ఉన్నాయి. గతంలో ఉన్న నాలుగు కులాలు, ఇప్పుడు 600 కులాలుగా విడిపోయాయి. చాలా మంది డబ్బుకోసం అక్రమమార్గాలను అనుసరిస్తున్నారు. ప్రతి విషయంలో వ్యాపారధోరణి కనిపిస్తోంది. ఒకే మతం వారి మధ్య యుద్ధాలు కొనసాగుతున్నాయి. వేయిసంవత్సరాల క్రితమే రామానుజులు సమాజంలో సమానత్వం కోసం పాటుపడ్డారు. నేటికీ ఆదర్శమూర్తిగా నిలిచారు. అలాంటి మహానుభావుడి గురించి లోకానికి తెలియచేయాలని, భవిష్యత్తు తరాలకు కూడా ఉత్తేజం కలిగించాలని రామానుజుల సహస్రాబ్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
ప్ర: రామానుజుల విగ్రహంతో పాటు దివ్యదేశాల మాడళ్లను ఎందుకు నిర్మిస్తున్నారు
జ: దేవాలయాలు ప్రజలను కలిపే కేంద్రాలు. ఇవి సమానత్వానికి చిహ్నాలు. దివ్యదేశాలన్నీ భూలోక వైకుంఠాలుగా భావిస్తున్నాం. ఈ పవిత్ర క్షేత్రాల్లో ఆళ్వారులు దివ్యప్రబంధాలను చదివారు. రామానుజులు ఈ క్షేత్రాలన్నింటినీ పర్యటించారు. అన్ని దివ్యదేశాలను అందరూ తమ జీవితంలో చూడలేకపోవచ్చు. అందుకే దివ్యదేశాల మాడళ్లతో ఆలయాలను నిర్మిస్తున్నాం.
ప్రశ్న: సనాతన ధర్మం అంటే ఏమిటి?
జవాబు: ధర్మం అంటే ఆచరణ విధానం. ఇది రెండు రకాలు..తాత్కాలిక లాభం కోసం చేసేది ఒకటైతే, దీర్ఘకాలిక లాభం కోసం చేసేది రెండోది. ఈ జీవితంలో లాభం కలిగించేది తాత్కాలికమైంది. జీవితం తర్వాత మళ్లీ వచ్చే జీవితం కోసం చేసేది దీర్ఘకాలికమైందని వేదాలు చెబుతున్నాయి. ఒక మంచి పనిచేయడానే్న ధర్మం అంటారు. జీవితంలో ప్రతి పని ధర్మంగా చేయాలి. సనాతనలో ‘తన’ అనేది ఉంది. సనాతన ధర్మం అంటే పురాతన కాలానికి సంబంధించిన ధర్మమని చాలా మంది భావిస్తారు. ధర్మం అనేది ఎప్పటికైనా ఏ కాలంలోనైనా ఒకే రకంగా ఉంటుంది. స్నానం చేయడం ఒక ధర్మం. నదినీటిలో స్నానం చేయాలి..అది ఉత్తమ ధర్మం. నదిలేకుంటే పుష్కరిణి (ట్యాంక్) నీటిలో చేయాలి. లేదా నూతి నీటితో చేయాలి. పట్టణాల్లో కుళాయి నీటితో చేస్తున్నాం. నీరు లభించకపోతే ‘పుండరీకాక్ష, పుండరీకాక్ష’ అంటూ మూడు సార్లు నీటిని తలపై, శరీరంపై చల్లుకోవాలి. ఇదీ ధర్మం. ధర్మానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు.
ప్ర: ‘దైవీ గుణాలు’ అంటే ఏమిటి? ఎవరికి అవసరం?
జ: భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా చెప్పారు..
‘అభయం సత్త్వసంశుద్ధిర్ జ్ఞాన యోగవ్యవ స్థితిః
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తవ ఆర్జవమ్‌॥
అహింసా సత్యమక్రోధస్త్వాగః శాన్తిరపైశునమ్‌
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్‌॥
తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా
భవన్తి సమ్పదం దైవీమభిజాతస్య భారత॥
అంటే భయరాహిత్యము, స్వీయస్థితి, పవిత్రీకరణం, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనం. దానగుణం, ఆత్మనిగ్రహం, యజ్ఞాచరణం, వేదాధ్యయనం, తపస్సు, సరళత్వము, అహింస, సత్యసందత, క్రోదరాహిత్యం, త్యాగం, శాంతి, ఇతరుల దోషాలను ఎన్నకుండుట, జీవులందరియెడ దయ, లోభరాహిత్యం, మృదుత్వం, సిగ్గు, దృఢనిశ్చయం, తేజము, క్షమ, ధైర్యం, శుచిత్వం, అసూయారాహిత్యం, గౌరవవాంఛ లేకుండుట అనేవి దివ్యగుణాలు...ఇవి దైవీ స్వభావం కలిగిన మనుషుల్లో ఉంటాయి. దైవీగుణాల వల్ల సత్ప్రవర్తన చేకూరుతుంది. ప్రతి ఒక్కరూ దైవీ గుణాలు కలిగి ఉండాలి. దైవీ గుణాలకు విరుద్దమైనవి అసుర (రాక్షస) గుణాలు. ప్రతి ఒక్కరూ దైవీగుణాలను అలవరచుకుంటే ఈ లోకం ఆనంద నిలయంగా మారుతుందనడంలో సందేహం లేదు.
ప్ర: చాలా మంది అశాంతితో జీవిస్తున్నారు..కారణాలు ఏమిటి? పరిష్కార మార్గాలు ఏమిటి?
జ: మనిషి అవసరాల కన్నా విలాసాలు ఎక్కువయ్యాయి. సాంకేతిక విజ్ఞానం పెరిగింది. ఈ విలాసాలకు హద్దు ఉండటం లేదు. ఉన్నదాంతో చాలామంది సంతృప్తి చెందడం లేదు. టీచర్లు, డాక్టర్లు, లాయర్లు, ఉద్యోగులు, కార్మికులు..ఇలా వివిధ వర్గాలకు చెందినవారిలో చాలా మంది తాము చేస్తున్న పని కష్టమని భావిస్తున్నారు. ఇష్టం లేకుండా చేసే ప్రతి పని కష్టంగానే ఉంటుంది. ప్రతిఒక్కరూ శీలాన్ని, వ్యక్తిత్వాన్ని, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. యోగా, ధ్యానం వల్ల ఏకాగ్రత సాధించవచ్చు. ఏకాగ్రత, శ్రద్దతో చేసే ప్రతి పని సంతృప్తిని కలగిస్తుంది. తద్వారా శాంతి చేకూరుతుంది.

ప్ర: నీతి, న్యాయం, సత్యం, హక్కుల గురించి అంతా చెబుతుంటారు..ఆచరణకు వచ్చే వరకు ఇవి లోపిస్తున్నాయా?
జ: ప్రతి వ్యక్తి తనను తాను సంస్కరించుకోవాలి. నీతిగా ఉండాలి. న్యాయంగా జీవించాలి. సత్యసంధతను అలవర్చుకోవాలి. సామాజిక కట్టుబాట్లకు అనుకూలంగా జీవించాలి. ప్రభుత్వం రూపొందించే నియమ, నిబంధనలు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడే ప్రవర్తించాలి. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. నేరం చేయడం తప్పు. ప్రభుత్వం రూపొందించిన చట్టాలను, నియమ, నిబంధనలు పాటించని వారిపట్ల శిక్ష ఉండాలి.
ప్ర: చాలా మంది వత్తిడితో జీవిస్తుంటారు. దీనికి పరిష్కారం ఏమిటి?
జ: మనం చేసే ప్రతి పని మనమే చేస్తున్నామన్న భావన తొలగించుకుని, భగవంతుడిపై భారం వేయాలి. భగవంతుడే చేస్తున్నాడన్న నమ్మకం ఉంటే వత్తిడి ఉండదు. చేసే పని శ్రద్దతో, ఓపికతో, కష్టం అని భావించకుండా ఇష్టంతో చేయాలి. ఇష్టంతో చేస్తే వత్తిడిని దూరం చేసుకోవచ్చు.
ప్ర: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచాయి. సమాజంలో అవసరమైన అభివృద్ధి కనిపిస్తోందా?
జ: అవును..సమాజంలో మార్పు కనిపిస్తోంది. నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశానికి ప్రపంచంలో మంచి గుర్తింపు వచ్చింది. అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోంది. సమాజంలో చెడుని తొలిగించి మంచికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభమైంది. దేశంలో ప్రతిపౌరుడు తమ బాధ్యతలను తు.చ తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. మన దేశాన్ని ఇప్పుడు ప్రపంచదేశాలు పొగుడుతున్నాయి.
ప్ర: పంచభూతాలు కలుషితం అవుతున్నాయా? పృథ్వీమాతను రక్షించుకోవడం ఎలా?
జ: పృథ్వీమాతను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. పంచభూతాలైన గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం కలుషితం కాకుండా చూడాలి. పంచభూతాలు కలుషితం అయితే ప్రకృతివైపరీత్యాలు వచ్చే అవకాశం ఉంది. మనం ఇప్పుడు తరచూ ప్రకృతివైపరీత్యాలను అనుభవిస్తున్నాం. అనేక విధాల నష్టపోతున్నాం. పంచభూతాలు/ప్రకృతి కలుషితం చేయకుండా నడవడం మన ధర్మం. ప్రకృతే భగవంతుడిగా భావించడం భారతీయ సంప్రదాయం. ప్రకృతిని ఆరాధించడం నేర్చుకుంటే పంచభూతాలు కలుషితం కాకుండా ఉంటాయి.
ప్ర: సమాజం ఎలా ఉండాలని మహానుభావులు భావిస్తుంటారు?
జ: ఒక తండ్రి తన పిల్లలు బాగుండాలని, నీతిగా, న్యాయంగా జీవించాలని కోరతాడు. సమాజంలోని అందరినీ తమ పిల్లలుగానే మహానుభావులు భావిస్తారు. ప్రతి ఒక్కరు నీతిగా, న్యాయంగా, ధర్మంగా జీవించాలని, తోటివారికి చేయూత ఇస్తుండాలని కోరతారు. మహానుభావులు సామాన్యుల నుండి ఆశించేది ఇదే!
ప్ర: ఈ జన్మలో చేసే మంచి, చెడులకు వచ్చే జన్మలో ఫలితాలు ఉండటం అనేది న్యాయమేనా?
జ: చిన్నచిన్న తప్పులకు ఈ జన్మలోనే ఫలితం ఉంటుంది. మంచికి కూడా ఇదే జన్మలో ఫలితం ఉంటుంది. పెద్దతప్పులకు మాత్రం మరుజన్మలో ఫలితాలు ఉంటాయి.
ప్ర: ప్రజలకు వౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందా? సమాజం బాధ్యత ఏమిటి?
జ: ప్రతి ఒక్క పనీ ప్రభుత్వమే చేయాలన్న ఆలోచనల నుండి ప్రజలంతా బయటపడాలి. విద్య, వైద్యం, ఆహారం, వౌలిక వసతుల కల్పన కేవలం ప్రభుత్వ బాధ్యతనే కాదు. సామాజిక బాధ్యతగా భావించాలి.
ప్ర: హిందూ ధర్మానికి ఇతర వర్గాల నుండి హానికలుగుతోందా?
జ: హిందువులకే తమ ధర్మం గురించి పూర్తిగా అవగాహన ఉండటంలేదు. క్రిస్టియన్లు బైబిల్‌ను, ముస్లింలు ఖురాన్‌ను గౌరవిస్తారు. ఏ క్రిస్టియన్, ఏ ముస్లిం తమ మతాలను విమర్శించడంలేదు. హిందూమతం గురించి హిందువులే తెలుసుకోవడం లేదు. ఒక రామాయణం, ఒక భారతం, భగవద్గీత, వేదాలు, పౌరాణిక పుస్తకాలను ఎంతమంది చదువుతున్నారు..? కొంత మంది అజ్ఞానంతో సొంత మతానే్న విమర్శిస్తున్నారు. మతం, మతగ్రంథాలను అధ్యయనం చేయడం నేర్చుకోవాలి. పాజిటివ్‌గా ఆలోచించాలి.
ప్ర: దేవాలయాల పరిపాలనలో ప్రభుత్వ జోక్యం ఎంతవరకు ఉండాలి?
జ: ప్రభుత్వ జోక్యం లేకపోతేనే మంచిది. అనేక గ్రామాలు, పట్టణాల్లోని కాలనీల్లో ప్రభుత్వ (దేవాదాయ శాఖ) జోక్యంలేని ఆలయాలు చాలా చక్కగా నడుస్తున్నాయి. స్థానికులే పవిత్రంగా నడిపిస్తున్నారు.
ప్ర: ప్రతితప్పునకు ‘కలి’ ప్రభావం అంటూంటారు..నిజమేనా?
జ: మనం తప్పు చేసి, ‘కలి’ని నిందించడం ఎందుకు? ప్రతి పౌరుడు రాజ్యాంగానికి అనుగుణంగా, చట్టాలకు లోబడి జీవించాలి. ఎవరైనా చట్టాన్ని, రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే కఠిన దండన ఉండాలి. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పువల్ల వచ్చే ఫలితం ఒకే రకంగా ఉంటుంది. అందుకే తప్పు చేయకుండా మనం జాగ్రత్తపడాలి.
ప్ర: నైతిక విలువలు పెంపొందడం ఎలా?
జ: పిల్లలకు చిన్నతనం నుండే మంచి గురించి తెలియచేయాలి. ‘నైతిక విలువల’ గురించి సిలబస్‌లో ఒక పాఠ్యాంశంగా ఉండాలి. దానివల్ల సత్ఫలితాలు వస్తాయని ఆశించవచ్చు.
ప్ర: యువత చెడు మార్గంలో వెళుతున్నారన్న భావన ఉంది.
జ: అలాంటి భావన తప్పు. చాలా మంది మంచిమార్గంలోనే నడుస్తున్నారు. గుణం ప్రధానం.. కాని వయస్సు కాదు.
ప్ర: అమావాస్య రోజు శుభకార్యాలు చేయకూడదంటారు..నిజమేనా?
జ: తెలుగువారమైన మనం చంద్రమానం విధానాన్ని అనుసరిస్తున్నాం. తమిళులు సౌరమానం విధానాన్ని పాటిస్తారు. చంద్రమానంలో అమావాస్య మంచి కాదని భావించడం వల్ల శుభకార్యాలకు ఉపయోగపడదు. *
స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ
సమాజాన్ని సక్రమమార్గంలో నడపాలంటే ఎవరో మహానుభావులు జన్మించాల్సిందే. సమాజంలో సమానత్వం సాధించేందుకు, అంటరానితనాన్ని రూపుమాపేందుకు, దేవాలయాల్లో అందరికీ ప్రవేశం కల్పించేందుకు వేయి సంవత్సరాల క్రితమే ‘విప్లవం’ సృష్టించిన మహానుభావుడు భగవత్ రామానుజాచార్యులు. అట్టడుగు వర్గాలు ఆలయాల్లోకి వచ్చేందుకు వీలులేని వాతావరణం కొనసాగుతున్న సమయంలో, అంటరానితనం అడుగడుగునా కనిపిస్తున్న సమయంలో రామానుజులు జన్మించారు. సమాజంలో అంతా సమానమేనని, భగవంతుడి ముందు కులాల ప్రసక్తిలేదని ఎలుగెత్తి చాటినవారాయన. ఇప్పటికి సరిగ్గా వెయ్యి సంవత్సరాల క్రితం అంటే 1017 లో జన్మించిన రామానుజులు 120 సంవత్సరాల పాటు జీవించి, తన జీవితాన్ని యావత్తూ సమసమాజ స్థాపనకే ఉపయోగించారు. రామానుజుల మించిన మానవతామూర్తి లేరని బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అభిప్రాయపడ్డారంటే రామానుజుల వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థమవుతుంది. వేయి సంవత్సరాల తర్వాత రామానుజుల వారిని తలచుకోవడం, స్మరించుకోవడం మన ధర్మం.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ఒక అడుగు ముందుకు వేసి భగవత్ రామానుజుల గురించి భావి తరాల వారికి తెలియచేసేందుకు, ప్రపంచంలో గుర్తింపు తీసుకువచ్చేందుకు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆయన సంకల్ప ఫలితంగా రామానుజుల వారి భారీ విగ్రహం రూపొందింది. ఈ విగ్రహాన్ని హైదరాబాద్ సమీపంలోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేశారు. రామానుజుల విగ్రహంతో పాటు ఈ విగ్రహం చుట్టూ 108 దివ్య దేశాలకు చెందిన ఆలయాల నమూనాలతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణాలు పూర్తయ్యేందుకు మరో ఏడెనిమిది నెలల సమయం అవసరం అవుతుందని భావిస్తున్నారు. సమాజంలో సమానత్వం సాధించేందుకు రామానుజులు పాటుపడినందువల్ల ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ ఇక్వాలిటీ’ అని చిన జీయర్ పేరు పెట్టారు. 216 అడుగుల ఎత్తుతో దీన్ని ఏర్పాటు చేశారు. కూర్చుని ఉన్న భంగిమలో ఏర్పాటు చేసిన ఎతె్తైన విగ్రహాల్లో ఈ విగ్రహం ప్రపంచంలో రెండో అతి పెద్దదిగా పేరు తెచ్చుకోబోతోంది. విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటికీ, చుట్టూ కట్టడాల నిర్మాణం పూర్తి కాలేదు. లాంఛనంగా ప్రారంభించలేదు. 40 ఎకరాల స్థలంలో ఏర్పాటవుతున్న స్టాచ్యూ ఆఫ్ ఇక్వాలిటీ ప్రాజెక్టులో మొదటి దశ నిర్మాణాన్ని 2019 ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. నిర్ణీత సమయానికి అనుకున్నట్టుగానే పూర్తయితే దీన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేత ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజు జీయర్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి ప్రధానికి ఆహ్వాన లేఖ అందించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పరిధిలోకి వచ్చే ముచ్చింతల్ గ్రామ సమీపంలోని శ్రీరామనగరంలో రామానుజుల విగ్రహం ఏర్పాటు పూర్తయితే ఇది దేశానికే మణికిరీటంగా మెరవనుంది. భారత దేశంలో ఇంత ఎతె్తైన విగ్రహం కూర్చుని ఉన్న భంగిమలో ఇప్పటి వరకు లేకపోవడం గమనార్హం. గుజరాత్‌లో సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ విగ్రహాన్ని ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో 597 అడుగుల ఎత్తులో నిలుచుని ఉన్న భంగిమలో ఏర్పాటు చేస్తున్నారు. కూర్చుని ఉన్న భంగిమలో ఏర్పాటవుతున్న భగవత్ రామానుజుల పంచలోహ విగ్రహం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక రికార్డు నెలకొల్పబోతోంది. థాయిలాండ్‌లో ఏర్పాటు చేసిన గౌతమబుద్ధ కూర్చుని ఉన్న విగ్రహం 302 అడుగుల ఎత్తుతో అతి పెద్ద విగ్రహంగా పేరుతెచ్చుకుంది. వాస్తవంగా శ్రీరామనగరంలో భగవత్ రామానుజాచార్యు ల విగ్రహాన్ని 302 అడుగుల కంటే మరింత ఎత్తుగా ఏర్పాటు చేయాలని త్రిదండి చినజీయర్ భావించారు. అయితే ఈ విగ్రహం ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలానికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉండటంతో, 300 పైగా అడుగుల ఎతె్తైన రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతించలేదు. దాంతో విగ్రహం ఎత్తు 216 అడుగులకే పరిమితం చేయాల్సి వచ్చింది.
చైనాలోని ఏరోసన్ కార్పొరేషన్ ఈ విగ్రహాన్ని వేర్వేరు భాగాలుగా తయారు చేసి, ఇక్కడకు తీసుకువచ్చి అమర్చారు. కమలం పువ్వు ఆకృతి రూపొందించి, ఈ పువ్వు మధ్యభాగంలో విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం అడుగుభాగంలో మూడంతస్తుల భవనం నిర్మాణమయింది. దీనికి ‘్భద్రవేది’ అని పేరుపెట్టారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో రామానుజాచార్యుల వారి జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటోలు తదితరాలు ఉంటాయి. మొదటి అంతస్తులో 120 కిలోల బంగారంతో తయారు చేస్తున్న రామానుజుల మరో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రామానుజులు 120 సంవత్సరాలపాటు జీవించి ఉండటం వల్ల 120 కిలోల బంగారాన్ని ఉపయోగించి విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. రామానుజుల బంగారు విగ్రహానికి నిత్య పూజలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండో అంతస్తులో వేదిక్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటవుతోంది. రామనుజుల విగ్రహం చుట్టూ 108 దివ్యదేశాల మాడల్ ఆలయాలు నిర్మాణం అవుతున్నాయి. విగ్రహం ముందుభాగంలో 108 మెట్లు నిర్మించారు
స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనావేశారు. ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 500 కోట్ల రూపాయల వరకు ఖర్చయింది. దీని నిర్మాణంలో అందరినీ భాగస్వాములను చేసేందుకు చిన జీయర్ ప్రయత్నిస్తున్నారు. శ్రీరామ నగరానికే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే వనె్న తెచ్చే ప్రాజెక్టుగా ఇది రూపొందుతోంది. దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే కేంద్రంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.
రామానుజుల గురించి..
సమాజంలో అట్టడుగు వర్గాల వారికి అందరితో పాటు సమానహోదా కల్పించేందుకు పాటుపడ్డ రామానుజులు 1017 సంవత్సరంలో జన్మించారు. 120 సంవత్సరాలు జీవించారు. మొట్టమొదటి ఆచార్యులుగా పేరుతెచ్చుకున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కూడా రామానుజల వారిని ఆచార్యులుగా ఆమోదించి, రామానుజుల నుండి శంఖుచక్రాలను స్వీకరించారు. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులను అందరికీ అర్థమయ్యే విధంగా కామెంటరీలు రాశారు. గత వెయ్యి సంవత్సరాల కాలంలో వచ్చిన భక్తిప్రచారాలకు రామానుజులు ఆదర్శంగా నిలిచారు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన మహానుభావులు. అలాంటి రామానుజాచార్యుల వారికి సముచిత గౌరవం ఇచ్చేందుకు చిన్న జీయర్ ‘రామానుజ సహస్రాబ్ది’ పేరుతో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. శ్రీరామనగరంలో ఇటీవలే అంతర్జాతీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేశారు.

పి.వి. రమణారావు 98499 98093