ఈ వారం స్పెషల్

నవ్యతకు నాంది మకర సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచపాదం పితరం ద్వాదశాకృతిం
దివ ఆహుః పరే అర్థే పురీషిణం
అధేమే అన్యఉపరే విచక్షణం
సప్త చక్రౌషడర ఆహురర్పితమితి
-ఋగ్వేదం
*
సర్వ ప్రపంచమునకు పై భాగము నందుండి, తన కిరణముల పరిపాక విశేషము చేత, సంవత్సరము ఆయనము ఋతువు మాసము పక్షము దినము మొదలైన కాల భేదాన్ని ఏర్పరుస్తున్నది - సూర్య భగవానుడు. కాలాన్ని ఏర్పరచి భాగ విభాగాలుగా వున్న సంవత్సరంగా కొలత యిచ్చి, హేమంతము శిశిరమూ ఒక ఋతువుగా చెపితే, ఐదు ఋతువులుగా లేక ఆరు ఆకులు అనగా ఆరు ఋతువులతో ఏడు చక్రాల రథముతో ఏడు గుఱ్ఱాలుగా చెప్పబడే ఏడు రంగులతో లేక, వారములోని ఏడు దినములతో - పనె్నండు రూపాలుగా అనగా పనె్నండు నెలలుగా అన్నిటికీ నియామకుడిగా, తండ్రిగా వ్యవహరిస్తున్నాడు సూర్యుడని ఋగ్వేదం చెపుతోంది.
శక్తిరూపంలో అంతటా అంతర్లీనంగా ఉండి, తండ్రిగా వ్యవహరింపబడే సూర్యుడు - మేషాది మీన రాశులలో నెలకొక రాశిలో చేరతాడు. ఒక్కొక్క రాశిలో సంక్రమించే సమయాన్ని ‘సంక్రాంతి’ అని పిలుస్తారు. సంక్రాంతి అంటే ‘చేరుట’ అని అర్థం. కనుక ఈ విధంగా సంవత్సరానికి పనె్నండు సంక్రాంతులు వస్తాయి. అయితే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినపుడు వచ్చే ‘మకర సంక్రాంతి’ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది.
హేమంత ఋతువు - ధనుర్మాసం
చంద్రగమనాన్ని అనుసరించి, పౌర్ణమి తిథికి సంబంధిత నక్షత్రంలో వచ్చే మాసాలకు ఆ నక్షత్రం పేరుగా పిలుస్తారు. ఉదాహరణకు చైత్రమాసం ఎలా వచ్చిందంటే, చిత్తా నక్షత్రంతో పౌర్ణమి వస్తే, అది చైత్రమాసం అని పేరు వచ్చింది. విశాఖా నక్షత్రంలో పౌర్ణమి వస్తే అది, వైశాఖ మాసం. ఇలా మాస నామములు ఏర్పడినాయి. రవి, మిథునరాశి నుండి, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఆరు నెలలు చీకటి మార్గం, అదే దక్షిణాయనం సూర్యుడు ధనూరాశి నుండి మకర రాశిలో ప్రవేశించినప్పుడు ప్రకృతి నవనవోనే్మషణంగా నవ్యకాంతులీనుతూ చీకటి తొలగి, వెలుగు ద్యోతకమవుతుంది. ఇక్కడి నుంచి ఆరు నెలలు ఉత్తరాయణం - వెలుగు మార్గం.
ఉత్తరాయణం, హేమంత ఋతువులో, పుష్యమాసంలో వస్తుంది. సూర్యుడు, మకర రాశిలో ప్రవేశించిన సమయం నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. దీనినే మనం, మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటాం. ఇది పెద్ద పండుగ. మూడు రోజులు జరుపుకునే పండుగ.
ప్రకృతి రామణీయతకు ప్రతీకగా నిలుస్తుంది - మకర సంక్రాంతి. ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తరాభిముఖుడై, తన దివ్యకాంతులను ప్రజ్వరిల్ల చేస్తూ, ప్రకాశిస్తాడు. జీవన సరళిని నిర్దిష్టించి, ఆనంద మకరందాలను అందించి ఆనందమయ కోశానికి చేరుకునే ‘వెలుగు’ మార్గాన్ని చూపిస్తూ, జన జీవనానికి, నవజీవన వికాసాన్ని జాగృతం చేసి క్రాంతి నిచ్చేది - మకర సంక్రాంతి.
సమ్యక్ క్రాంతి.. మకర సంక్రాంతి
‘సమ్యక్’ అనగా పవిత్రమైన, ‘క్రాంతి’ అనగా ‘మార్పు’. సూర్యుడు ఉత్తరాభిముఖుడై పయనిస్తూ ప్రకృతిలో అందము ఆనందము చేకూరే మార్పును తీసికొని వస్తాడు. మన దృష్టిని అంతర్ముఖము గావించి, నిర్మల నిశ్చల మనస్సును, సద్బుద్ధిని ప్రసాదించి, వాటిని తనవైపు అనగా ప్రాపంచిక విషయాల నుండి పరమాత్మ వైపు మళ్లించి, మనలను ఉత్తరులుగా కటాక్షిస్తాడు.
విశ్వనాథ వారి హేమంతం
ఆరు ఋతువులలో హేమంత ఋతువు విశిష్టమై ప్రకృతికే రమణీయంగా నిలుస్తుంది. పచ్చని పంట పొలాలతో, ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణంతో శోభాయమానంగా ఉంటుంది. తట్టలో కూర్చోబెట్టిన వధువులా, గుమ్మడి పూవులో కులికే మంచు బిందువులతో రాబోయే శిశిర భయంతో ప్రకృతి కాంత జమిలి దుప్పటి కప్పుకొన్నదా అన్నట్లు తెలుగు నేల నాల్గుదెసల మంచు కురుస్తూ ఉండగా, హేమంత ఋతువు వచ్చిందంటారు విశ్వనాథ. వేకువ ఝామున మ్రుగ్గుపెట్టే కనె్న, మంచుకొండ ఆడపడుచులాగా, పంట కుప్పపై వేసే కప్పు మంచు కొండ కనక శిఖరములాగా, తడిపాటి మట్టి గోడను, చిఱుకొమ్మలతో గేరాడు గిత్త - నందీశ్వరుడు లాగా కనపడుట వలన, నిత్యము మంచు పడుతూ ఉండటం వలన హిమాచలము పరివార సమేతముగా ఉత్తరము నుండి దక్షిణాపథమునకు వచ్చినట్లుగా, హేమంత ఋతువు తెలుగునాట ప్రవేశించిందని హేమంత ఋతు శోభను, విశేషంగా విశిష్ఠంగా అందించాడు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ.
వాల్మీకి మహర్షి
అటువంటి హేమంత ఋతువులో వచ్చే మకర సంక్రాంతి సౌందర్య విలాసాన్ని, ప్రకృతి రమణీయ శోభను వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలో అరణ్యకాండలో హృద్యంగా వర్ణించాడు.
రవి సంక్రాంతి సౌభాగ్యః తుషారారుణ మండలః
విశ్వానంద ఇవాధర్మః చంద్ర ప్రకాశతే
జీవన స్రవంతిని నయనానందకరం చేసే సౌందర్య రస స్రవంతిగా సంక్రాంతిని వర్ణించిన మహనీయులెందరో వున్నారు.
మకర సంక్రాంతికి స్ఫూర్తి.. గజేంద్ర మోక్ష ఘట్టం
మకర సంక్రాంతిలోని ఆధ్యాత్మిక రస సౌందర్యాన్ని గురించి పరమ భాగవతోత్తముడైన పోతన భాగవతంలో మనకు అద్భుతంగా అందించారు - అష్టమాధ్యాయంలో, గజేంద్ర మోక్ష ఘట్టంలో. అంతేకాదు, యోగశాస్త్ర రహస్యాలను కూడా విశదపరచాడు.
మకర మొకటి రవిజొచ్చెను, మకరము మరియొకటి ధనువు మాటున దాగెన్, మకరాలయమున దిరిగెడు మకరంబులు కూర్మరాజు మయివున కరిగెన్’ ఉత్తరాషాఢ 2,3,4 పాదములు, శ్రవణా నక్షత్రం నాల్గు పాదములు, ధనిష్ఠ 1,2 పాదములు, వెరశి తొమ్మిది పాదములు మకర రాశిలో ఉంటాయి. ఉత్తరాషాఢ మొదటి పాదం ధనూరాశిలో ఉంటుంది. మూలా నక్షత్రం, పృథ్వీతత్త్వానికి సంకేతం, ధనూ రాశిలో ఉంటుంది. కూర్మరాజు, పృథ్వీతత్త్వానికి సంకేతం. అష్టదిక్పాలకులలో ఇంద్రుడు తూర్పు దిక్కుకు అధిపతి. ఐరావతం - గజేంద్రుడు - ఏనుగు - ఇంద్రుని వాహనం - మూలాధారంలో ఉంటుంది. ఇంద్రుడు సహస్రారంలో ఉంటాడు.
అలాగే, పడమర దిక్కుకు అధిపతి వరుణుడు. అతని వాహనం మకరం - మొసలి. మూలాధారంలో ఉండే గజరాజు, సహస్రారం చేరాలి. గజరాజు ఒక సాధకుడు - యోగిలాగా ఉన్నాడని వర్ణిస్తాడు పోతన. ఇది కుండలినీ యోగశాస్త్రం. మూలాధార తత్త్వాన్ని మననం చేసికొంటూ, స్వాధిష్ఠాన చక్రంలో ప్రవేశింపచేస్తాడు. స్వాధిష్ఠానం జలతత్వం. దీని అర్థం ఏమిటి? మూలాధార చక్రంలోని గజము, జల తత్వంలోకి ప్రవేశించగా శ్రీమన్నారాయణుడు - కాలచక్రమనే సుదర్శన చక్రాన్ని పంపి, మకరాన్ని ఖండిస్తాడు. అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానజ్యోతి వెలుగుతో ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుందన్న మకర సంక్రాంతి పర్వదిన విషయాన్ని పోతన శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలో, జ్యోతిష యోగశాస్త్ర అన్వయంతో వివరించాడు. గజేంద్ర మోక్ష ఘట్టం మకర సంక్రాంతికి పండుగకు పూర్తి స్ఫూర్తిని, దీప్తిని ఇస్తుంది.
మకర సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటాం. సంక్రాంతి పండుగకు వెనకటి రోజు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు. భోగి పండుగను గురించి తెలుసుకునే ముందు, ధనుర్మాసం గురించి ఆకళింపు చేసుకోవాలి.
ధనుర్మాసం - విశేషాలు
రవి సంచారమును గణనం చేసి, సూర్యమానం ప్రకారం మాసముల పేర్లు నిర్ణయింపబడ్డాయి. సూర్యుడు ఒక రాశిలో నుండి మరొక రాశిలోకి వెళ్లటానికి ఒక నెల పడుతుంది. సూర్యుడు మేష రాశిలో ప్రవేశించినప్పటి మాసాన్ని మేష మాసమని పిలుస్తారు. అలాగే, వృశ్చిక రాశి నుండి ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. దీనినిబట్టి మనకు ఏం తెలుస్తుందంటే, చాంద్రమానం ప్రకారం చైత్రం నుండి ఫాల్గుణ మాసం వరకు పనె్నండు నెలలు. అలాగే, సౌరమానం (సూర్యసంచారాన్ననుసరించి) మేష మాసం నుండి మీనమాసం వరకు పనె్నండు నెలలు. వీటిలో ధనుర్మాసం విశేషంగా పేర్కొంటారు. ధనుర్మాసం - మార్గశిర పుష్య మాసాల్ని కలుపుతూ వస్తుంది.
ఎందుకింత ప్రాముఖ్యత?
అహోరాత్రముల సంధికాలమునకు సంధ్య అని పేరు. ప్రాతః సంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్యలు. అలాగే పక్షద్వయ సంధికాలములు, పూర్ణిమ అమావాస్యలు మాసద్వయ సంధి కాలములు, ఋతువులు, ఉత్తర దక్షిణాయన సంధికాలములు, మకర కర్కాటక సంక్రమణములు - సంధ్యలే. నూతన సంవత్సరాది కూడా సంధ్యయే. ఇవన్నీ పుణ్యప్రదమైనవి, విశేషమైనవి. ధనుర్మాసము కూడా సంధి కాలమే.
అమరకోశంలో పేర్కొన్న ప్రకా రం, మానవుల మాసకాలము పితరులకొక రోజు. మన సంవత్సర కాలము దేవతలకు ఒక రోజు. మానవులకు రాత్రింబవళ్లు ఉన్నట్లుగా, దేవతలకు ఉన్నాయి. మన ఉత్తరాయణం - ఆరు నెలలు, దేవతలకు పగలు. మన దక్షిణాయణం ఆరు నెలలు, దేవతలకు రాత్రి. మన రాత్రింబవళ్ల సంధికాలం సంధ్య అయినట్లు, దేవతలకు కూడా వారి రాత్రింబవళ్లు సంధికాలము సంధ్యే.
దక్షిణాయనము ఆరు నెలలు పూర్తికాగా అనగా సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనూరాశిలో ప్రవేశించు సమయము, దేవతల రాత్రి యొక్క అవసాన సమయము. సూర్యుడు ధనూ రాశి నుండి మకర రాశిలో ప్రవేశించు సమయము దేవతలకు ప్రాతః కాలము.
మనకు సూర్యోదయానికి పూర్వం ఐదు గడియలు అనగా రెండు గంటలు ఉషః కాలము. దీనే్న బ్రాహ్మీ కాలమని, బ్రాహ్మీ ముహూర్తమని చెప్తారు. ఇది అత్యంత పవిత్రమైన కాలము. యజ్ఞయాగాదులలో దేవతలకు హవిస్సులిచ్చే కాలము. ధనుర్మాసం, దేవతలకు ఉషః కాలము. కనుకనే ధనుర్మాసం నెల రోజులు తెల్లవారుఝాముననే లేచి, నోములు వ్రతాలు పూజలు లాంటి భగవైత్కంకర్యాదులు నిర్వర్తించటం యుగయుగాలుగా వస్తోంది.
భోగి పండుగ
ఈ పండుగను, మకర సంక్రాంతి పండుగకు, వెనక రోజున జరుపుకుంటారు. అంటే, ధనుర్మాసం చివరి రోజున జరుపుకునే పండుగ - భోగి పండుగ. ‘ధనుర్థరో ధనుర్వేదో దండోదమయితా దమః’ అన్నది విష్ణు సహస్ర నామములు. ధనుస్సే వేదము, ధనుస్సనే వేదము. ఇవన్నీ శ్రీ మహావిష్ణువు దివ్య నామములు. సీతా కల్యాణం - ధనుర్భంగము జరిగితేగాని జరుగదు. కనుక ధనుర్మాస భంగము జరిగితే, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రాప్తిస్తుంది. ‘కోటి నదులు ధనుష్కోటిలో నుండగా ఏటికి తిరిగేవే మనసా’ అన్న తోడిరాగ కీర్తనలో అద్భుతంగా, ధనురాకారముగానున్న కనుబొమల మధ్య స్థానమునే ధనుష్కోటియని, నదుల వలె ప్రవహించు నాడీ ద్వారములు కది కేంద్రమని ధ్యానయోగ లక్ష్యమని, వర్ణించాడు నాదయోగి సద్గురు త్యాగరాజస్వామి.
శ్రీరాముడు శివధనుర్భంగము చేశాడంటే, ఓంకార రూపమైన ధనుస్సును, రాముడు భగ్నం చేయగా, ఓం= అ+ఉ+మ్ అని మూడు వేదములుగా లోకంలో ప్రసారమయి, ప్రసిద్ధి చెందినాయి. భంగమంటే - తరంగమని మరొక అర్థం ఉన్నది. వేదములు శబ్ద తరంగములుగా ప్రసారమయినవని అర్థము. ఇదే సీతాకల్యాణము లోక కళ్యాణమునకు దోహదపడింది.
ఇదే విధముగా, ధనుర్మాసములోని, ధనుర్భంగము వలన శీతము భగ్నమై ఉష్ణము ప్రసరిస్తుంది. మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. ధనుర్మాసమంటే వేద మాసము.
మా, ఆశ = మాస’ అనగా, లక్ష్మి నిండియున్న మాసమని అర్థము. వేదలక్ష్మి వేదమాత యొక్క శోభతో నిండియున్న మాసమని అర్థము.
భోగిపండుగ నాడు, భోగిమంటలు వేస్తారు. ‘అగ్ని’ సూర్యునికి ప్రతీక. ఋగ్వేదంలో అగ్ని ఆరాధన విశేషంగా చెప్పబడింది. భోగిమంటల్లో సంకటాలు దగ్ధమవుతాయి. ఆ మంటలు మానవాళి కల్మషాల్ని పటాపంచలు చేస్తాయి. మనలోని పాత దుష్ట్భావాన్ని, దుర్గుణాలను జ్ఞానమనే మంటలో వేసి దహించాలి. భోగి రోజున ఉదయానే్న అభ్యంగన స్నానం చేస్తారు. చిన్నపిల్లల్ని చక్కగా ముస్తాబు చేసి, భోగి రోజు సాయంత్రం వరుసగా కూర్చోబెట్టి వారి శిరస్సుపై రేగిపండ్లు బంతిపూల రెక్కలు దిష్టితీసి పోస్తారు. పెద్దలు పిల్లల్ని ఆశీర్వదిస్తారు. రేగి పండ్లలో, సౌరశక్తి ఉంటుంది. శిరస్సు మీద పడితే, ఆ శక్తి తేజస్సు పిల్లలకి వస్తుందని, రావాలని ఆకాంక్షిస్తూ, భోగిపళ్లు పిల్లలకు శిరస్సుపై పోసే అద్భుత ఆచారం అనాదిగా వస్తోంది.
గోదాదేవి, శ్రీరంగనాథుల కల్యాణం
ధనుర్మాస చివరి రోజు జరుపుకునే భోగిపండుగ అనగానే జ్ఞప్తికి వచ్చేది గోదాదేవి శ్రీరంగనాథుల కల్యాణం. దక్షిణాపథంలో శ్రీవిల్లిపుత్తూరులో స్వయంభువుగా వెలసిన స్వామి - వటపత్రశాయి. ఆ స్వామిని, అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించిన భక్తుడు భట్టనాథుడు. ఆయన చిత్తం ఎప్పుడూ, విష్ణుమూర్తిపైనే లగ్నం కాబడి ఉండటం చేత అతనికి ‘విష్ణుచిత్తుడ’ని పేరొచ్చింది. ఆయనే ‘పెరియాళ్వారు’. ఆయన రోజూ పూలమాలలు, తులసీ దళమాలలు కట్టి, స్వామికి సమర్పించేవాడు. భగవత్ సేవలో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్న విష్ణుచిత్తునికి, ఒకనాడు తులసి చెట్లకు కుదురులు చేస్తుంటే, ఒక అయోనిజ శిశుప్రాయంలో భగవదత్తంగా లభించింది. బిడ్డలు లేని తనకు ఆ వటపత్రశాయి ఆ లోటును తీర్చాడని సంతోషించి పెంచుకున్నాడు. ఆమెకు ‘కోదై’ అనగా పూలమాల అని పేరు పెట్టుకున్నాడు. ‘గో’ అంటే వేదవాక్కులు, భూదేవి అనే అర్థాలున్నాయి. భూదేవి ఆ శిశువును తనకు ప్రసాదించిందని ‘గోదా’ అని నామకరణం చేశాడు. పూలమాలలను తను మొదటగా ధరించి, తరువాత స్వామి అలంకారానికి పంపించేది, కనుక గోదాదేవికి ‘ఆముక్తమాల్యద’ అని పేరు వచ్చింది. అందరినీ రక్షించే తల్లిగా ‘ఆండాళ్’ అని పిలిచేవారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలను సహజసిద్ధంగా పొందిన గోదాదేవి శ్రీరంగనాథుని పతిగా తలచి, సంపూర్ణ శరణాగతితో భక్తితో ఆరాధించి, స్వామి అనుగ్రహమును పొంది, మకర సంక్రమణం వెనుక రోజు, ధనుర్మాసం చివరి రోజైన భోగి పండుగ రోజున శ్రీరంగనాథుని వివాహమాడుతుంది. ముప్పది రోజులు అనగా ధనుర్మాసమంతా మార్గళీవ్రతాన్ని ఆచరించి, 30 రోజులు ముప్పది పాశురములు (కీర్తనలు) రచించి స్వరార్చనలో అర్చించింది గోదాదేవి. అవే ‘తిరుప్పావై’ దివ్య ప్రబంధం. తిరు అంటే శుభప్రదమైన శ్రీప్రదమైన ‘పావై’ అంటే వ్రతం లేక నోము - మలి నోము.
భోగి పండుగ - బలి చక్రవర్తి
బలి చక్రవర్తిని శ్రీమహావిష్ణువు వామన రూపంలో, పాతాళానికి పంపిన పర్వదినమే - భోగి పండుగ అని కూడా చెప్తారు. మూడడుగుల స్థలం ఇవ్వమని కోరాడు వామనుడు, బలి చక్రవర్తిని. మూడడుగుల స్థలం ఇచ్చి తనలోని స్థూల సూక్ష్మ కారణ శరీరాలను, జాగ్రత్ స్వప్న, సుషుప్త్యావస్థలను, సత్వ రజ తమో గుణములను, దారేషణ పుత్రౌషణ ధనేషణలను హరింప చేసుకున్నాడు - బలి చక్రవర్తి.
సూర్య సంచారం
సూర్యగమనాన్ని ‘భోగ’మంటారు. ధనూరాశి నుండి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినపుడు ప్రకృతిలో మార్పు స్పష్టంగా కనపడుతుంది. చండ మార్తాండ మండలములో ప్రచండ తేజ స్వరూపుడైన సూర్యుడు నవ్యకాంతిని ప్రజ్వలింపచేస్తూ ప్రకాశిస్తాడు. రాత్రి సమయం తక్కువయి క్రమేపీ పగటి కాలం ఎక్కువవుతుంది. నవ్యతేజస్సు, ఉత్సాహాన్ని ఇస్తుంది - మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం. నవ్యతకు నాంది పలికేది మకర సంక్రాంతి.
సంక్రాంతి పండుగ
వ్యవసాయ ప్రధానమైన తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి శోభ ప్రస్ఫుటంగా కనపడుతుంది. సంక్రాంతి నాటికి ధాన్యం ఇంటికి చేరుకుంటుంది. ఇళ్లూ వాకిళ్లూ కళకళలాడుతూ ఉంటాయి. పండుగకు ముందు నుండీ, పండుగ పనులు ప్రారంభమవుతాయి. కొత్త బియ్యం, నువ్వులు బెల్లంతో పిండివంటలు తయారుచేస్తారు. సంప్రదాయాలు సంబరాలు వేడుకలతో సంక్రాంతిని పిల్లలు, కొత్త అల్లుళ్లతో ఉత్సాహంగా జరుపుకొంటారు. ‘రాశి చక్రమ్ము దీరించి రంగవల్లి నిన్ను బూజింప, భక్తియై నిలిచినారు, ఉత్తరాయణ పుణ్యకాలోదయమున, రా రమ్ము మకర సంక్రాంతి లక్ష్మి’ అని వర్ణించిన కవి సమ్రాట్ పైడిపాటి సుబ్బరామశాస్ర్తీ గీతం, మకర సంక్రాంతి పండుగకు దీప్తినిస్తుంది.
ముగ్గులు - గొబ్బిళ్లు
ధనుర్మాసం నెల పొడుగునా చిత్రవిచిత్రమైన ముగ్గులను వాకిళ్లలో తీర్చిదిద్దుతారు. ప్రాచీన కాలం నుంచీ హైందవ సంప్రదాయంలో రంగవల్లులు పేర్కొనబడ్డాయి. స్కాంద పురాణం, రామాయణం, మహాభారతంలో ముగ్గుల ప్రస్తావన ఉన్నది. తెలుగు సంస్కృతికి అద్దం పడుతూ నెల రోజులూ వాకిల్లలో కళాపిజల్లి, ముగ్గులు పెట్టి, గోమయంతో చేసిన గొబ్బిళ్లు పెడతారు. ముగ్గులలోని బియ్యపు పిండిని క్రిమికీటకాదులు భుజిస్తాయి. ఇది ఒక విధమైన భూత యజ్ఞం.
గోమయంతో చేసిన ముద్దలను గొబ్బిళ్లు అంటారు. ప్రధానంగా మూడు ముద్దలు పెడతారు. విశ్వమోహన మురళీగానంతో ఆనందపరిచే శ్రీకృష్ణునికి చిహ్నంగా ఒకటి, గోపాలుని అనంత శక్తితో ఎత్తబడిన గోవర్ధన గిరికి గుర్తుగా మరొకటి, నిత్య జీవితంలో పాడి పంటలకు ఆధారమైన గోమాతకు ప్రతీకగా మూడవ గొబ్బెమ్మను పెడతారు.
పితృ తర్పణాలు
ఉత్తరాయణ పుణ్యకాలం, మకర సంక్రాంతినాడు, పితృ దేవతలకు తర్పణములు అర్పిస్తే, వారు సంతసించి, వంశవృద్ధిని అందిస్తారు. శుభాల్ని కూర్చిపెట్టి గృహంలో శుభకార్యములు నిర్విఘ్నంగా జరిగేటట్లు ఆశీర్వదిస్తారు. పితృదేవతలకు ఉత్తమ గతి లభిస్తుంది.
బొమ్మల కొలువు
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు స్ఫూర్తినిస్తూ, బొమ్మల కొలువులు పెడతారు. పురాణేతిహాసములు, చరిత్ర, సాంఘిక జీవన స్థితిగతులను ప్రతిబింబించేటట్లుగా, అత్యంత విజ్ఞాన దాయకంగా ఉంటాయి, బొమ్మల కొలువులు.
కనుమ పండుగ
కృషితో నాస్తి దుర్భిక్షమ్ - అని, ఏరువాక పౌర్ణమితో సేద్య యజ్ఞానికి నాంది పలికి, శ్రమకోర్చి, విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించి, దైవానుగ్రహంతో పంటను ఇంటికి తీసుకువస్తారు, కృషీవలులు. మకర సంక్రాంతిని వైభవోపేతంగా జరుపుకుంటారు. వ్యవసాయ వృత్తికి చేదోడువాదోడుగా నిలిచే గోజాతికి కృతజ్ఞత చూపుతూ కనుము పండుగ నాడు పశువుల్ని గోజాతిని పూజిస్తారు. ‘కృషియున్న నెపుడు దుర్భిక్షమే యుండదు, గోజాతి కృషికిని కుదురు కాన కనుము పండుగ నాడు కర్షక జనులెల్ల గోవుల పసువులన్ కుంకుమలను పూజించి వానికి పుష్కలమ్ముగ పుష్టి కలుగు నాహారము లొలయజేసి..’ ‘మకర సంక్రాంతి’లో మనోహరంగా వర్ణించిన విషయం, కనుము పండుగకు స్ఫూర్తిని దీప్తిని ఇస్తుంది.
గాలిపటాలు..
సంక్రాంతి సంబరాలలో పశువుల పరుగు పందాలు, గాలి పటాలు ఎగరవేసే పందాలు ముఖ్య భూమిక వహిస్తాయి. ప్రపంచమంతటా గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం నెలకొంది. గాలి పటాలను ఎగుర వేయటంలోనూ, గాలిపటాల పందాలలో గెలిచి అవార్డులు, ప్రశంసలు అందుకొన్న వారిలో జయపూర్‌లోని బాబూ భాయ్‌ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే, ఇటీవల గాలి పటాలను ఎగురవేయటానికి చైనా దేశం నుండి దిగుమతి అవుతున్న ‘మాంజా’ పక్షులకు ప్రాణ హాని కలిగిస్తోంది, కొందరి చిన్నపిల్లల, యువకులకు కూడా హాని కలిగిస్తోంది. వాటికి దూరంగా ఉండి, హానికరము గాని దారములు వాడితే, సంక్రాంతి సంబరాన్నిస్తుంది.
అయ్యప్ప స్వామి: మకరజ్యోతి దర్శనం
హరిహరాంశగా అవతరించి, ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ శరణు ఘోషతో శబరిమలకు వచ్చే భక్తులను కటాక్షించే స్వామి - అయ్యప్ప స్వామి. పందల రాజుకిచ్చిన వాగ్దానం మేరకు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి స్వామిని జ్యోతి స్వరూపంగా దర్శించుకొని, జ్ఞానోదయాన్ని పొందుతారు. ఇది మకర సంక్రాంతికి ఒక విశేషం.
అర్ధ కుంభమేళా
రవి మకర రాశిలో ఉండి, గురుడు వృశ్చిక రాశిలో ఉండగా ప్రయాగ త్రివేణీ సంగమంలో అర్ధ కుంభమేళా ఉత్సవం, చాలా వైభవంగా, సంపూర్ణ భక్తి ప్రపత్తులతో జరుగుతుంది. ఒక నెలంతా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం 15.1.2019 నుండి 4.3.2019 వరకూ ప్రయాగలో గొప్పగా జరుగుతుంది - కుంభమేళా ఉత్సవం. ఇది మరల 12 సంవత్సరాలకి గాని రాదు.
సంక్రాంతి సందేశం
వ్యష్టి నిష్టం కాని సృష్టిలో పరస్పరాన్యోన్యమైన సమాజంలో ఉత్తేజ ఉత్సాహస్ఫూర్తులతో, ముందు వచ్చే మార్పునకు స్వాగతం పలుకుతూ, సమన్వయ సమరస భావంతో జీవన యాత్ర సల్పుతూ, సర్వ మానవ సౌభ్రాత్రతతో విశ్వమానవ కల్యాణాన్ని కాంక్షించే నవ్య తేజస్సును పొందాలని చెప్తోంది - నవ్యతకు నాంది పలికే మకర సంక్రాంతి.

-పసుమర్తి కామేశ్వర శర్మ 94407 37464