తూర్పుగోదావరి

జనసేనానికి రెడ్ కార్పెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 7: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌తో జిల్లా కేంద్రం కాకినాడలో ఈనెల 9న సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో పాల్గొనేందుకు వస్తున్న జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు కొణిదల పవన్‌కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా జనసేన సత్తాను చాటేందుకు ఆ పార్టీ శ్రేణులతో పాటు పవన్ అభిమానులు సన్నద్ధమవుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాకినాడ నగరానికి వచ్చిన పవన్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అప్పట్లో ఆయన రాక కారణంగా టిడిపి అభ్యర్ధులు తిరుగులేని ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. ఆ సభ తరహాలో తాజాగా జరిగే సీమాంధ్రుల ఆత్మగౌరవ సభకు బ్రహ్మరథం పట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేనాని రాక నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యింది. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎం రవిప్రకాష్ పర్యవేక్షణలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకై ప్రత్యేక చర్యలు చేపట్టారు. సీమాంధ్రుల ఆత్మగౌరవ సభకు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి కూడా భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మరోవైపు అధికార తెలుగుదేశం సహా ఇతర రాజకీయ పార్టీలు ఈ సభపై ప్రత్యేక దృష్టి సారించాయి. పవన్‌కళ్యాణ్ అభిమానులైతే పార్టీలకతీతంగా ఈ సభకు వెళ్ళేందుకు అమితోత్సాహాన్ని చూపిస్తున్నారు. కాకినాడ జెఎన్‌టియు క్రీడామైదానంలో బహిరంగ సభ జరుగనున్న నేపథ్యంలో జాతీయ రహదారికి ఆనుకుని ఈ ప్రాంతం ఉండటంతో వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. సర్పవరం, భానుగుడి జంక్షన్‌ల మధ్య ఆరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు వాహనాల రాకపోకలను నిలిపివేసి, ప్రత్యామ్నాయ మార్గాలను కేటాయించారు. ప్రస్తుతం జెఎన్‌టియు స్టేడియంలో బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, బహిరంగ సభ నిర్వహణ, జనసమీకరణ, సభా స్థలి వద్ద ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు, బారికేడ్లు, ప్రథాన వేదిక తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. కులాలకు అతీతంగా పవన్ అభిమానులు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చేలా ఇప్పటికే నేతలు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు రాఘవయ్య చెప్పారు.
శరవేగంగా పుష్కర నగర వనం
95 హెక్టార్లలో పర్యాటక వనం : రాష్ట్రంలోనే అతి పెద్ద పార్కు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 7: రాజమహేంద్రవరం సమీపంలో 16వ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని అటవీ శాఖకు చెందిన 95 హెక్టార్ల సువిశాల విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్ద నగర వనం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ వనం అభివృద్ధికి దాదాపు రూ.కోటి మంజూరు కాగా ఇప్పటి వరకు విడుదలైన రూ.55 లక్షల నిధులతో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆధునిక జీవన గమనానికి తగిన విధంగా అత్యాధునిక సహజ సిద్ధ అందాల నడుమ ఈ నగర వనం సిద్ధమవుతోంది. గత పుష్కరాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వనాన్ని పుష్కర నగర వనంగా అంకితం చేశారు. ఈ నేపధ్యంలో ఒక భౌతిక పరిశోధనా కేంద్రంగా ఈ వనాన్ని జాతీయ స్థాయి పర్యాటక ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. ప్రకృతి సహజసిద్ధ వైవిధ్య జీవావరణాలను తెలియజేసే విధంగా ఈ వనానికి ఏర్పాటు చేసిన రెండు ఆర్చిలు విశేషత సంతరించుకున్నాయి. రెండు కిలో మీటర్ల వాకింగ్ ట్రాక్ నిర్మించారు. యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విశేషంగా నక్షత్ర వనాన్ని పెంచారు. డార్విన్ పరిణామక్రమాన్ని తెలియజేసే తైలవర్ణ చిత్రాల ప్రదర్శన ప్రహారీ చుట్టూ ఏర్పాటు చేయడం ప్రత్యేకత సంతరించుకుంది. వెదురు బొంగులు, దుబ్బుగడ్డి వంటి సహజసిద్ధ మెటీరియల్స్‌తో పగోడాలు నిర్మించారు. సందర్శకులు కూర్చునేందుకు తాటిబద్దెల ఫర్నీచర్‌తో సోఫాలు తయారు చేశారు. ఔషధ మొక్కలను పెంచారు. అటవీ శాఖ ఆధ్వర్యంలోని ఈ పార్కును రాష్ట్రంలోనే విశేషమైన రీతిలో పర్యాటకంగా తీర్చిదిద్దుతున్నారు. అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టులో ఇదొక పర్యాటక పార్కుగా అభివృద్ధి చేయడంతో రానున్న కాలంలో ఒక ల్యాండ్ మార్కు కానుంది. శరవేగంగా పనులు చేస్తున్నామని, దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయని అటవీ శాఖ డిఎఫ్‌ఒ ప్రభాకర్ చెప్పారు.
సంక్రాంతికి ఖైదీ నెంబర్ 150 విడుదల
దర్శకుడు వివి వినాయక్
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 7: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 సంక్రాంతి నాటికి విడుదల చేసేందుకు కృషిచేస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ వెల్లడించారు. రాజమహేంద్రి గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పుష్కరాలరేవులో ప్రతిష్టించిన విద్యాగణపతిని బుధవారం మధ్యాహ్నం వినాయక్ దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ఈచిత్రం 60శాతం చిత్రీకరణ పూర్తయ్యిందన్నారు. 8ఏళ్ల విరామం తరువాత కూడా చిరంజీవిలో చరిష్మా, గ్లామర్ తగ్గలేదని కితాబునిచ్చారు. ఎంతో ఉత్సాహంగా ఆయన షూటింగ్‌లో పాల్గొంటున్నారన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
వైద్యులకు డిఎం అండ్ హెచ్‌ఒ చంద్రయ్య హెచ్చరిక
శంఖవరం, సెప్టెంబర్ 7: విధి నిర్వహణలో అలసత్వం వహించినా, రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా వైద్యలపై చర్యలు తప్పవని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ కె చంద్రయ్య హెచ్చరించారు. మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలోని ప్రాధమికోన్నత వైద్యశాలను ఆయన బుధవారం అకస్మిక తనిఖీ చేశారు. తొలుతగా హాజరుపట్టీని పరిశీలించగా, అందులో సంతకాలు లేకుండా ఖాళీలు ఉండడాన్ని గమనించి వైధ్యాధికారిణి రాజకుమారిని ఇదేమిటని ప్రశ్నించారు. సిబ్బంది వివరాలు అడుగగా పొంతనలేని సమాధానాలు రావడంతో సిబ్బంది ఎంతమంది డ్యూటీలో ఉన్నారో ఉన్నతాధికారులకు తెలియడంలేదు కాబట్టి వస్తున్నారు, పోతున్నారు అంతేకాని బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో తిరిగి వైద్య సేవలందించాల్సిన సిబ్బంది ఆసుపత్రిలో ఎందుకు ఉంటున్నారంటూ మండిపడ్డారు. సీనియర్ వైధ్యురాలు రాజకుమారి విధుల్లోకి చేరి చాలా రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు డిడిఒ బాధ్యతలు స్వీకరించలేదని ప్రశ్నించగా, ఆమె చెప్పిన సమాధానానికి అసంతృప్తి వ్యక్తం చేశారు. గర్భిణులను డెలివరీ అయిన గంట వ్యవధిలోనే ఇళ్లకు పంపించడాన్ని తప్పుబట్టారు. అనంతరం స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో సుమారు 100 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, డెంగ్యూ అనేది కేవలం అపరిశుభ్రత వల్లే పుట్టే దోమల వల్లే వస్తుందన్నారు. ప్రతీ చోట పరిశుభ్రతపై ప్రజలు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. తాగునీటి ట్యాంకులను ప్రతీ పది రోజులకొకసారి క్లోరినేషన్ చేసి, ట్యాంకుపై ఆ తేదీని ప్రదర్శనగా ఉంచాలన్నారు. అనంతరం ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించి, రోగులను వారికి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. కత్తిపూడిలోని జంగాల కాలనీలో వైరల్ జ్వరాలు అదుపులోకి వచ్చాయని, అయితే గత మూడు రోజులుగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. కాలనీలోని గృహాలను పరిశీలించగా నీటి తొట్టెల్లో ఇంకనూ లార్వాలు ఉన్నట్లు గుర్తించామని, దీనికి బాధ్యులైన హెల్త్ అసిస్టెంట్, ఎఎన్‌ఎమ్‌ల మెమో జారీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా మలేరియా అధికారి పిఎస్‌ఎస్ ప్రసాద్, విబిడి కన్సల్టెంట్ సిహెచ్ శ్రీనివాసు, ఎస్‌యుఓ ఎమ్ పద్మేశ్‌బాబు తదితరులు పాల్గోన్నారు.
గిరిజనుల భాగస్వామ్యంతో
వాటర్‌షెడ్ పథకం పూర్తిచేయాలి
అడ్డతీగల, సెప్టెంబర్ 7:ప్రకృతి వనరుల సంరక్షణలో ప్రత్యేకించి గ్రామీణప్రాంతాల్లో భూమి, నీరు సంరక్షణ ద్వారా గ్రామీణ ప్రజల సామాజిక ఆర్థిక సాధికారతతో భాగస్వామ్య వాటర్‌షెడ్ పథకం కీలకమైనదని జిల్లా కలెక్టరు హెచ్ అరుణ్‌కుమార్ అన్నారు. బుధవారం మండలంలో డి.్భమవరం, దొరమామిడి గ్రామాల్లో వాటర్‌షెడ్ పథకాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాటర్‌షెడ్ పథకంలో భాగంగా నేల, నీరు వృక్షసంపద, మానవవనరుల సంరక్షణ, ఉమ్మడి వనరుల అభివృద్ధి అంశాలపై గిరిజనులకు పూర్తి అవగాహన కల్పించి తదుపరి పనులను వారి భాగస్వామ్యంతోనే ప్రారంభించి పూర్తిచేయాలని వాటర్‌షెడ్ సిబ్బందిని ఆదేశించారు. ఏజెన్సీ పరిధిలో 14 మెగా వాటర్‌షెడ్ పథకాలు రూ. 83.29 కోట్లతో ప్రారంభించారని ఆయన తెలిపారు. నిరుపేదలకు సుస్థిర జీవనోపాధి కల్పించడం ద్వారా పర్యావరణ సమతుల్యత, గిరిజనుల ఆర్థిక సామాజిక స్థితిగతులను పెంపొందించు లక్ష్యంతో ఈ సమగ్ర వాటర్‌షెడ్ యాజమాన్య కార్యక్రమం రూపొందించామన్నారు. వాటర్ యూజర్ కమిటీ ఛైర్మన్‌గా సర్పంచ్ వ్యవహరిస్తారన్నారు. ముందుగా దొరమామిడిలో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను, రాతి రివిట్‌మెంట్‌ను ఆయన పరిశీలించారు. పనులు స్థానికంగా ఉన్న గిరిజనులకే అప్పగించాలని కమిటీలకు సూచించారు. గ్రామాల్లో విటిడిఎలు ప్రజల భాగస్వామ్యంతో నిర్మాణపు పనులు చేపట్టాలన్నారు. పనిక్షేత్రాల్లో పనుల వివరాలను తెలుపుతూ ప్రదర్శనా బోర్డులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి నిత్యావసరాల నాణ్యతను పరిశీలించారు. వీటిలో కందిపప్పు నాణ్యత లోపించడంపై ఆయన సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనసమానగరువులోరూ.3.80 లక్షలతో నిర్మించిన మరో చెక్‌డ్యామ్‌ను ఆయన పరిశీలించి ప్రాజెక్టు వల్ల ఏ మేరకు ఆయకట్టు స్థిరీకరించబడింది రైతులను అడిగి తెలుసుకున్నారు. కులధ్రువీకరణ పత్రాల మంజూరులో రెవిన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారని గ్రామస్థుల పిర్యాదు చేయగా గ్రామసభలు నిర్వహించి, తీర్మానాలకు అనుగుణంగా నిబంధనలకు లోబడి ధ్రువపత్రాలు మంజూరు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలో సమగ్రనీటి యాజమాన్య కార్యక్రమంలో భాగంగా ప్రవేశిక కార్యక్రమంలో పాల్గొని ఈ పథకంలో సోలార్‌లైట్లు, టెంట్‌హౌస్‌లు, తాగునీటి అవసరాలు తీర్చుకోవడంలో సహజవనరుల నిర్వహణ కోసం ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగ పర్చుకోవాలని, నూటికి నూరు శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, నిరుపయోగంగా వున్న బోరుబావిని మరమ్మతులు చేయిస్తామని, వాచ్ అండ్ వార్డు పేమెంట్ల సమస్యను 15 రోజులలో పరిష్కరిస్తామని, మధ్యాహ్న భోజన పథకంలో సమస్యలను పరిష్కరిస్తామని, మల్లవరంమామిళ్ళు, డి.్భమవరం గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. డి.్భమవరం గ్రామంలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి పిల్లలతో ముచ్చటించారు. వాట్‌ర్‌షెడ్ పథకం ద్వారా మంజూరుచేసిన టెంట్‌హౌస్‌లను లబ్ధిదారులకు పంపిణీచేసారు. అనంతరం సేద్యపు నీటికుంటలో ఆత్మ సౌజన్యంతో సరఫరా చేసిన చేపపిల్లలను కలెక్టర్, పిఓ చేతుల మీదుగా వదిలారు. ఐటిడిఏ పిఒ కెవిఎన్ చక్రధరబాబు మాట్లాడుతూ, డిఎస్సీ అభ్యర్థులకు ఈనెల 16, 17 తేదీల్లో రాత పరీక్ష చింతూరు, రంపచోడవరంలలో నిర్వహిస్తారని తెలిపారు. గతంలో జారీచేసిన హాల్‌టికెట్లే ఈ పరీక్షల నిర్వహణకు పరిగణనలోనికి తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అటవీహక్కుల గుర్తింపు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న వారికి నిబంధనలకు అనుగుణంగా త్వరలో పట్టాలు జారీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ వాటర్‌షెడ్ సంయుక్త కమీషనర్ యం.శివప్రసాద్, మానిటరింగ్ అధికారిణి జె.్భరతి, ఎపిడి వై. శంకర్‌నాయక్, పిహెచ్‌ఓ సిహెచ్. శ్రీనివాసులు, తహశీల్ధార్ పి.శ్రీపల్లవి, ఎంపిపి అన్నం సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

మాయమాటలతో నిండా ముంచారు
*పునరావాసం కల్పించాకే పోలవరం నిర్మాణం చేపట్టాలి*సిపిఎం ఆధ్వర్యంలో ఐటిడిఎ దిగ్బంధం*రోడ్డుపైనే వంటా వార్పు
చింతూరు, సెప్టెంబర్ 7: పోలవరం నిర్వాసితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాయమాటలతో నిండా ముంచాయని, టిడిపి పచ్చి మోసపూరిత ప్రభుత్వమని సిపిఎం పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. సిపిఎం ఆధ్వర్యంలో విలీన మండలాల ప్రజలు బుధవారం చింతూరు ఐటిడిఎను దిగ్బంధించి, నిర్వాసితులను అన్నివిధాలా ఆదుకోవాలంటూ నినదించింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి అరుణ్, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ ఎంపి మిడియం బాబూరావు మాట్లాడుతూ నిర్వాసితులకు ముందుగా పునరావాసం కల్పించి, వారికి పరిహారం చెల్లించిన తరువాతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. 2018 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న టిడిపి ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం, పరిహారం విషయాలలో ఎందుకు జాప్యం చేస్తోందని మండిపడ్డారు. నిర్వాసితులకు మాయమాటలు చెప్పి, వారి పొట్టను కొట్టేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, మోసం చేయడంలో బాబు సిద్ధహస్తుడని వ్యాఖ్యానించారు. త్వరలోనే ప్రజల చేతిలో టిడిపి ప్రభుత్వానికి బుద్ధి తప్పదని హెచ్చరించారు. పోలవరం వలన 400 గ్రామాల ప్రజలు నిర్వాసితులవుతారని, నేటి వరకు వీరికి ప్రభుత్వం ఎటువంటి భరోసా కల్పించలేదని ఎద్దేవా చేశారు. గ్రీవెన్స్ డేకు ఐటిడిఎ పిఒ హాజరు కాకపోవడం పట్ల మండిపడ్డారు. పిఒ వచ్చి సమస్యలు వినేంత వరకు ఐటిడిఎ దిగ్బంధం కొనసాగుతుందని ఎపిఒ వెంకటేశ్వరరావుకు సిపిఎం నాయకులు తెలిపారు. ఎంతకీ పిఒ రాకపోవడంతో విసుగెత్తిన సిపిఎం నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి, వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. రహదారిపైనే భోజనాలు చేశారు. ఎపిఒ వెంకటేశ్వరరావు ఈ విషయాన్ని పిఒ దృష్టికి తీసుకెళ్లగా 15, 16 తేదీలలో సమావేశమై చర్చిస్తామని, ఈ విషయాన్ని సిపిఎం నాయకులకు తెలియజేయాలన్నారు. ఎపిఒ వెంకటేశ్వరరావు ఆమేరకు విషయాన్ని సిపిఎం నాయకులకు తెలిపారు. దీంతో శాంతించిన నాయకులు, కార్యకర్తలు తమ సమస్యలపై వినతిపత్రాన్ని వెంకటేశ్వరరావుకు సమర్పించి, రాస్తారోకో విరమించారు.
చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ
చింతూరు ఎస్‌ఐ గజేంద్రకుమార్ సిపిఎం పార్టీ చేపట్టిన ఐటిడిఎ దిగ్బంధం, రాస్తారోకో ఆందోళన కార్యక్రమాలతో ఎటువంటి ఇబ్బందికర ఘటనలు చోటుచేసుకోకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఐటిడిఎ దిగ్బంధం సమయంలో సిపిఎం నాయకులు ఐటిడిఎ గేట్లు తోసివేసి, లోపల బైఠాయించారు. అనంతరం రోడ్డుపై వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో ఎస్‌ఐ గజేంద్రకుమార్ అధికారులు, సిపిఎం నాయకులతో చర్చించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా పరిస్థితిని చక్కదిద్దారు.

గ్రామాల వౌలిక వసతుల కల్పనకు పన్నులు పెంచక తప్పదు
*రాజమహేంద్రవరం డిఎల్‌పిఒ వరప్రసాద్
ఆలమూరు, సెప్టెంబర్ 7:గ్రామాల్లో వౌలిక వసతులు మెరుగు పరచడానికి పన్నులు పెంచక తప్పదని రాజమహేంద్రవరం డిఎల్‌పిఓ బి వరప్రసాద్ తెలిపారు. బుధవారం ఆలమూరు మండలంలో చెముడులంక రక్షిత మంచినీటి నిర్వహణ, మడికిలో పారిశుద్ధ్య నిర్వహణ, చొప్పెల్ల, జొన్నాడ, ఆలమూరు గ్రామాల్లో పన్నులు వసూళ్లు, పారిశుద్ధ్యంపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2002 సంవత్సరం నుండి ఇప్పటి వరకూ గ్రామాల్లో ఎటువంటి పన్నులు పెంచలేదని, అలాగే ఆయా గ్రామాల్లో భూమి విలువలు పది రెట్లు పెరిగాయని, ప్రజల ఆదాయం కూడా పెరిగిందన్నారు. ఇప్పుడు ఉన్న పన్నుల విధానం సిబ్బంది జీతాలకే సరిపోవడంలేదని తెలిపారు. ఇప్పడి నుండి ప్రజలపై ఒకేసారి పన్నులు భారం పెంచకుండా స్వల్పంగా పెంచనున్నట్లు తెలిపారు. 2016-17 సంవత్సరానికి ఏడు కోట్లు పన్నులు వసూళ్ల లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే డివిజన్‌లో లే అవుట్లలో స్థలాలు ఎన్ని విక్రయించారు, మిగిలిన స్థలాలు ఎన్ని, అక్రమ లేఅవుట్లు ఎన్ని ఉన్నాయి తదితర విషయాలపై సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రామాల్లో అంటు రోగాలు రాకుండా ఎప్పటి కప్పుడు బ్లీచింగ్, ఫినాయిల్ వంటివి డ్రెయిన్లలో చల్లించాలని, నీటి నిల్వలు ఎక్కడా లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు. అలాగే మడికి వైన్ సెంటర్ వద్ద తాగిన గ్లాసులు ఆరు బయటే పడేయడంపై ఆయన షాపు యజమాన్యాన్ని హెచ్చరించారు. ఈయన వెంట ఇఒపిఆర్డీ బి బొజ్జిరాజు, పంచాయతీ సెక్రటరీలు బి వెంకటరావు, రావిపాటి సత్యనారాయణ, పి శివకుమార్, యు రేణుక, సర్పంచ్‌లు జి సీతామహలక్ష్మి, బి వెంకటరావు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
గోదారి తీరంలో కుసుమ ధర్మన్న సాహితీ సోయగం
*18న సాహితీ సమాలోచన, రచనలు ఆవిష్కరణ*కవులు, కళాకారులు, రచయితలు హాజరు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 7: గోదావరి తీరంలో కుసుమ ధర్మన్న సాహితీ సోయగం వీయనుంది..సాహిత్య సామాజిక స్ఫూర్తి కుసుమ ధర్మన్న సాహితీ సమాలోచనకు సంఘ సంస్కరణల పురిటిగడ్డ, చారిత్రక రాజమహేంద్రవరం వేదికైంది. గోదావరి తీరం నుంచి వెల్లి విరిసిన ఎంతో మంది సాహితీ సౌరభాలకు నిలయమైన ఈ నేల కుసుమ ధర్మన్న స్మృతులతో కుసుమాంజలి ఘటించనుంది. భారీస్థాయిలో ఈ నెల 18వ తేదీన జరగనున్న కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఎంతోమంది కళాకారులు, సాహిత్యవేత్తలు, రచయతలు, రచయిత్రులు, కవులు, మేధావులకు రాజమహేంద్రవరం స్వాగతం పలకనుంది. 18వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే వివిధ కార్యక్రమాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రచయితలతో గోదావరి తీరం సందడిగా మారనుంది. తెలుగునాట తొలి దళిత వైతాళికుడైన కుసుమ ధర్మన్న అక్షర యోధుడే కాదు పోరాట ధీరుడు కూడా. ఆయన పోరాట పటిమ, ఆయన రచనలు ఈనాటికీ స్ఫూర్తిదాయకం. అందుకే కుసుమ ధర్మన్న జీవితం, ఆయన రచనలు ఈనాటి తరానికి అందించాలనే సంకల్పంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కుసుమ ధర్మన్న సాహితీ సమాలోచన జరగనుంది. రాజమహేంద్రవరంలోని గోదావరి గట్టున బొమ్మన రామచంద్రరావు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్టు హాలులో 18న కుసుమ ధర్మన్న రచనలను ఆవిష్కరించనున్నారు. సమాలోచన సదస్సులు రెండు విభాగాలుగా జరగనున్నాయి. అనంతరం సందేశాత్మక సాంస్కృతిక కార్యక్రమాలను విశేష రీతిలో ఏర్పాటు చేశారు. ప్రజాశక్తి బుక్‌హౌస్ ప్రచురిత మాకొద్దీ నల్లదొరతనం, హరిజన శతకం, సామ్యవాదాన్ని సహించని హిందూయిజం, మద్యపాన నిషేధం, తొలి దళిత స్ఫూర్తి కుసుమ ధర్మన్న (వ్యాస సంకలనం), డాక్టర్ మద్దుకూరి సత్యనారాయణ రాసిన కుసుమ ధర్మన్న రచనలు-దళిత దృక్పథం, డాక్టర్ పుట్ల హేమలత రాసిన కుసుమ ధర్మన్న జీవిత ప్రస్థానం కావ్యాలను ఆవిష్కరించనున్నారు.కుసుమ ధర్మన్న సామాజిక సాహిత్య నేపథ్యం అనే అంశంపై జరిగే మొదటి సదస్సు తెలకపల్లి రవి అధ్యక్షతన నిర్వహించనున్నారు. వక్తలుగా ఎండ్లూరి సుధాకర్, జి. కళ్యాణరావు, మల్లేపల్లి లక్ష్మయ్య, శిఖామణి, వి.బాలసుబ్రహ్మణ్యం, కుసుమ రాజకుమారి హాజరవుతారు. దళితులు-వర్తమానం-కుసుమ ధర్మన్న అనే అంశంపై జరిగే రెండో సదస్సు జి.సుబ్బారావు అధ్యక్షతన నిర్వహిస్తారు. వక్తలుగా రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, మేడిపల్లి రవి కుమార్, కోయి కోటేశ్వరరావు, వి.శ్రీనివాసరావు హాజరుకానున్నారు. కుసుమ ధర్మన్న జీవితం, సాహిత్యంపై నృత్య రూపకాలు, గేయాలాపన తదితర సాంస్కృతిక కార్యక్రమాలు వైవిధ్యభరితంగా నిర్వహించనున్నారు.
బస్టాండులో మెరుగైన వసతులు కల్పించండి
ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప
పెద్దాపురం, సెప్టెంబర్ 7: స్థానిక మున్సిపల్ సెంటర్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఆర్టీసీ బస్టాండులో మెరుగైన వసతులు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మాణంలో ఉన్న బస్టాండును ఆయన పరిశీలించి పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నూతన బస్టాండు సేవలు ఉండాలన్నారు. బస్టాండు లోపలి భాగం అంతా పూర్తిస్థాయిలో సీలింగ్ ఫ్యాన్లు, హై టెక్ ఫర్నీచర్,ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రయాణీకులకు అనువుగా లగేజీ లోడింగ్, అన్‌లోడింగ్‌లకు అవకాశం కల్పించాలని సూచించారు. బస్టాండును ఆనుకుని ఎటువంటి ఆక్రమణలు, షాపుల ఏర్పాటు లేకుండా మున్సిపల్ అధికారులు ముందస్తుచర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ముందుగా రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో కోటి రూపాయలతోతో నిర్మిస్తున్న అతిథి గృహాన్ని పరిశీలించారు. పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. బస్టాండు పనులు మూడు నెలలో పూర్తిచేసి , ప్రజలకు అందుబాటులోనికి తీసుకు వస్తానని జూన్‌లో చేప్పానని, ఆదే విధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసామన్నారు. త్వరలోనే బస్టాండు, అతిథి గృహాలను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబు రాజు, సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ రవి చంద్ర, ఎఎంసి ఛైర్మన్, వైస్ చైర్మన్లు కుమార్ స్వామి, చిట్టిబాబు, మంత్రి తనయుడు నిమ్మకాయల రంగనాథ్, జల్లూరి శ్రీను, గుమ్మళ్ల రామకృష్ణ పాల్గొన్నారు.
దంగేరులో కపిల గిత్త జననం
రామచంద్రపురం, సెప్టెంబర్ 7: కె గంగవరం మండలం దంగేరు గ్రామానికి చెందిన ఒబిలినేని శంబయ్య చౌదరి (దొరబాబు)కు చెందిన చూడి ఆవుకు కపిల గిత్త దూడ జననం జరిగింది. కె గంగవరం మండల పరిధిలోని పశు వైద్యాధికారి డాక్టర్ కృష్ణార్జున ఈ ఆవుకు చూడి ఇంజక్షన్‌ను గుంటూరు నుండి రప్పించి, చేసారు. కాగా వేల రూపాయల ధరలు పలికే కపిల దూడ ఆరోగ్యంగా జన్మించడం పట్ల రైతు శంబయ్య చౌదరి ఆనందం వ్యక్తం చేసారు. అధికసంఖ్యలో ప్రజలు దొరబాబు పశువుల శాలలో ఉన్న కపిల గిత్త దూడను చూసేందుకు తరలివచ్చారు.