తూర్పుగోదావరి

ప్రత్యేక హోదా రాదని వెంకయ్య ఏనాడో చెప్పారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏడాది క్రిందటే చెప్పారని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. హోదా ఇవ్వరని చంద్రబాబుకు ఏడాది క్రితమే తెలిసినా కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు కలసి ఆడుతున్న నాటకాల కారణంగా రాష్ట్రం పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, ప్రజలను మభ్యపెట్టే పనిలో వారు పడ్డారని దుయ్యబట్టారు. కాకినాడలో సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితుల సమస్యలపై నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి ఉండవల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పట్లో అధికార, విపక్షాలు కలిసే రాష్ట్రాన్ని విభజించాయన్నారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో ఏమాత్రం స్పష్టత లేదని, ఈ విషయంలో వేటికి ఏ విధంగా నిధులు కేటాయిస్తారన్న విషయమై వివరణ ఇవ్వలేకపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కంటితుడుపు కోసమే ప్యాకేజీ ప్రకటన చేసినట్టు స్పష్టమవుతోందన్నారు. పోలవరం కుడికాలువ నిర్వాసితులకు ఎకరానికి రూ.30 లక్షల పరిహారం ఇచ్చిన ప్రభుత్వం, ముంపు బాధితులకు మాత్రం కేవలం రూ.3 లక్షలు మాత్రమే చెల్లించిందన్నారు. తమకు కనీసం రూ.15 లక్షలైనా ఇవ్వాల్సిందిగా ముంపు బాధితులు కోరుతున్నారన్నారు. తాజాగా పోలవరం కాంట్రాక్టర్‌కు 48 గంటల్లో రూ.55 కోట్లు అదనంగా ఇచ్చారని, అయితే జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చి, తమ జీవితాలను త్యాగంచేసిన గిరిజనులకు పరిహారం ఇవ్వడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని ఆయన ప్రశ్నించారు. 2018 నాటికి పోలవరం నిర్మాణాన్ని పూర్తిచేస్తామని చెబుతున్న ప్రభుత్వం, గిరిజన సమస్యలను ఎప్పటిలోగా పరిష్కరిస్తుందో స్పష్టంచేయాలని ఆయన డిమాండ్‌చేశారు. పట్టిసీమ తరహాలోనే పోలవరం నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చి, గిరిజన చట్టాలను సక్రమంగా అమలుచేయాలని సూచించారు. గిరిజనులు, గిరిజనేతరులకు కూడా ఒకే విధమైన ప్యాకేజీని అమలుచేయాలని కోరారు. పట్టిసీమ ప్రాజెక్టును మూడు సార్లు ప్రారంభించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేయకుండానే జాతికి అంకితం చేసిన ఘనుడు చంద్రబాబని విమర్శించారు. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు స్టే ఇచ్చి, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా తీర్పునివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం జరుగుతున్న భూసేకరణ ప్రక్రియను తాము తొలి నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా పేర్కొంటున్నామని, సింగపూర్, చైనా, మలేషియా కంపెనీలు మాస్టర్‌ప్లాన్‌లు ఇచ్చాయంటూ ముఖ్యమంత్రి ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. ఇకనుండి చంద్రబాబుకు వ్యతిరేకంగా అనేక కోర్టు తీర్పులు రానున్నాయని జోస్యం చెప్పారు. ఈ నెల 18న ‘నా డైరీ’ పేరుతో తాను రాసిన పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించనున్నట్టు చెప్పారు. ఈ పుస్తకంలో రాష్ట్ర విభజన సమయంలో భారత పార్లమెంట్‌లో చోటుచేసున్న అంశాలను పొందుపరచినట్టు తెలిపారు. సిపిఎం నేత, మాజీ ఎంపి డాక్టర్ మిడియం బాబూరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఎన్ని గ్రామాలు ముంపునకు గురి కానున్నాయో రీసర్వే చేసి, బాధితులకు మెరుగైన ప్యాకేజీ, పునరావాసం కల్పించాలని డిమాండ్‌చేశారు.