తూర్పుగోదావరి

రేసులో ఐదుగురు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 4: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష స్థానం రేసులో ఐదుగురు నేతలున్నారు. జిల్లా అధ్యక్ష పదవికి కార్యకర్తల నుండి అభిప్రాయ సేకరణ ప్రక్రియను సోమవారం జిల్లా కేంద్రం కాకినాడలోని డి కనె్వన్షన్ హాలులో నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా పరిశీలకుడు ధర్మాన ప్రసాదరావు, మరో రాష్టన్రేత ముదునూరి ప్రసాదరాజు తదితరులు హాజరయ్యారు. కార్యకర్తల అభిప్రాయ సేకరణ అనంతరం రాజమండ్రికి చెందిన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి ఎంపిక ఎంపిక దాదాపు ఖరారైనట్టు సమాచారం! జక్కంపూడి విజయలక్ష్మితో పాటు ఆమె కుమారుడు జక్కంపూడి రాజా పేరు కూడా పరిశీలనకు వచ్చింది. అలాగే కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణల పేర్లు కూడా అధ్యక్ష పదవికై చర్చకు వచ్చాయి. కార్యకర్తల నుండి సేకరించిన అభిప్రాయాలను అధినేత జగన్‌కు రాష్ట్ర నేతలు వివరించనున్నారు. జిల్లా వైకాపా అధ్యక్ష పదవికి కార్యకర్తల నుండి అభిప్రాయ సేకరణ ప్రక్రియ పూర్తయ్యిందని, ఈనెల 11న పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి దీనిపై పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అవుతారని వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెప్పారు. అదే రోజు జిల్లా అధ్యక్షుడిని జగన్ ప్రకటిస్తారని ఆయన స్పష్టం చేశారు. కాగా జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్న రాజమండ్రికి చెందిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు వ్యవహార శైలి పట్ల స్థానికంగా ప్రత్యేక చర్చ జరిగింది. అయితే తనను జిల్లా అధ్యక్ష స్థానానికి ఎంపిక చేయని పక్షంలో ఆయన తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం అందింది. అభిప్రాయ సేకరణలో మీ పేరును పరిశీలనలో ఉంచాలా? అని జిల్లాకు చెందిన కుడిపూడి చిట్టబ్బాయిని రాష్ట్ర నేతలు కోరగా తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, ఎవర్ని ఎంపిక చేసినా సహకరిస్తానని ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. సమావేశంలో మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, పెండెం దొరబాబు, అల్లూరి కృష్ణంరాజు, గిరజాల స్వామినాయుడు, కుడిపూడి చిట్టబ్బాయి, పార్టీ నాయకులు చలమలశెట్టి సునీల్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, యనమదల గీత, కొల్లి నిర్మలకుమారి, తోట సుబ్బారావు నాయుడు, అనంత ఉదయభాస్కర్, శెట్టిబత్తుల రాజబాబు, ఆర్‌విజెఆర్ కుమార్(ఫ్రూటీ కుమార్), ముత్తా శశిధర్ తదితరులు పాల్గొన్నారు. సభకు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధ్యక్షత వహించారు.

వృద్ధుల కోసమే ‘మీ ఇంటికే మీ రేషన్’
సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 4: వృద్ధాప్యం వల్ల కదల్లేని లబ్దిదారులకు ఇంటి వద్దే తెల్లరేషన్‌కార్డుపై ఇంటికే నిత్యావసరాలను అందజేస్తున్నట్లు సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్ వెల్లడించారు. రాజమహేంద్రవరం నగరంలోని జాంపేటలో సోమవారం మీ ఇంటికే మీ రేషన్ పథకం కింద ఆమె ఇంటి వద్ద నిత్యావసరాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కదల్లేని పరిస్థితుల్లో ఒంటరిగా ఉండే వారు, వృద్ధ దంపతులు, వికలాంగుల ఇళ్లకే నిత్యావసరాలను పంపిణీ చేస్తామన్నారు. రాజమహేంద్రవరం పరిధిలో సుమారు 200 మందిని గుర్తించినట్లు చెప్పారు. తొలుత విఆర్వోలు ధ్రువీకరించిన తరువాత వారికి ఇంటికి రేషన్ అందజేస్తారన్నారు. స్థానిక రేషన్‌డీలర్లు, విఆర్వోలు ఇందుకు సహకరిస్తారన్నారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ పివివి గోపాలకృష్ణ, ఎంఎస్‌ఓ జిడి కిషోర్‌బాబు, కార్పొరేటర్లు ద్వారా పార్వతిసుందరి, తలారి ఉమాదేవి, భగవాన్ దంపతులు పాల్గొన్నారు.
మావోయిస్టులకు సహకరించొద్దు
* ఎటపాక ఒఎస్‌డి ఫకీరప్ప
చింతూరు, ఏప్రిల్ 4: చత్తీస్‌గఢ్-ఆంధ్ర సరిహద్దున గల మల్లంపేట గ్రామస్థులకు ఎటపాక ఒఎస్‌డి ఫకీరప్ప సోమవారం దుప్పట్లు, బియ్యం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టులకు సహాయ సహకారాలు అందించి జీవితాలను జైలుపాలు చేసుకోవద్దని హితవు పలికారు. కష్టించి పనిచేసి జీవితాన్ని ఆనందంగా గడపాలని సూచించారు. దండకారణ్యం సరిహద్దు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ చేయూతనిస్తుందని హామీ ఇచ్చారు. మావోయిస్టుల మాయమాటలు నమ్మి హింసాత్మక, అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనవద్దని ఆయన గ్రామస్థులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో చింతూరు సిఐ దుర్గారావు, ఎస్సై గజేంద్రకుమార్, సిఆర్‌పిఎఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
హానికర రసాయనాల వినియోగంతో
అనారోగ్యం
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ
కాకినాడ, ఏప్రిల్ 4: హానికర రసాయనాలతో కృత్రిమంగా పరిపక్వత చెందిన మామిడి, అరటి, బొప్పాయి, సపోట వంటి పండ్ల వినియోగం వలన ప్రజలలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావడానికి కారణమవుతాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ అన్నారు. సోమవారం జెసి తన ఛాంబర్‌లో ఆహార భద్రతా, ప్రమాణాల విభాగంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాల్షియం కార్బైడ్‌లోని ఎసిటిలీన్, ఆర్సెన్‌నిక్ తదితర హానికర రసాయనాలు మానవుల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటివల్ల కడుపులో అల్సర్లు, నాడీ సంబంధిత, కాలేయ సంబంధ, చర్మ వ్యాధులు, చూపు మందిగించడం, క్యాన్సర్ తదితర రోగాలు ఈ పండ్ల తినడం వలన వస్తాయన్నారు. పండ్లను తినుట ద్వారా శ్వాసకోస వ్యాధులు వస్తాయని, గర్భిణీ స్ర్తిలకు గర్భాశయ వ్యాధులు, పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన వ్యాధులు రావడం, పిల్లలకు మెదడుపై, ఫిట్స్, జ్ఞాపకశక్తి తగ్గుట వంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుందని జెసి చెప్పారు. మామిడి పండ్లు వినియోగించే వారు వాటిని శుభ్రంగా కడిగి తినాలని, ఆపిల్ పండ్లు మైనపోత కలిగినట్టుగా అనుమానం వస్తే వాటిని కొంత సేవు వెనిగర్ సోల్యూషన్‌లో ఉంచి నీటితో శుభ్రంగా కడిగి తినాలని అదే విధంగా ద్రాక్ష, బొప్పాయి పండ్లను నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి అందులో వాటిని కడిగి తినాలని జాయింట్ కలెక్టర్ చెప్పారు. ఈ పండ్ల వ్యాపారులు కాల్షియం కార్బైడ్ ఉపయోగించి పరిపక్వతకు పాల్పడే వారికి ఆహార భద్రత, ప్రమాణాలు అమలు చట్టం-2006 ప్రకారం ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష, 3లక్షల వరకు జరిమానా విధించబడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ పండ్ల వ్యాపారులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంటు పుడ్ కంట్రోల్ అధికారి ఆర్ నాగేశ్వరరావు గెజిటెడ్ డిఓ బివిఎన్‌ఆర్‌కె ప్రసాద్, ఎఫ్‌ఎస్‌ఓలు కె వెంకటరత్నం, ఎస్ కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు సౌకర్యాలు కల్పించాలి
చింతలూరు నూకాంబికా అమ్మవారి ఉత్సవాలపై అధికారులకు సబ్ కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం

ఆలమూరు, ఏప్రిల్ 4:ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉత్సవాల్లో చింతలూరు శ్రీ నూకాంబికా అమ్మవారి జాతర ఉత్సావాలు ఒకటని,ఈ జాతరకు వచ్చే భక్తులకు అమ్మవారి సౌకర్యవంతమైన దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు శక్తివంశన లేకుండా పనిచేయాలని రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయకృష్ణన్, రామచంద్రపురం డిఎస్పీ మురళీకృష్ణ అన్నారు. అమ్మవారి జాతర మహోత్సవాలపై సోమవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం స్థానిక తహసీల్దార్ టిఆర్ రాజేశ్వరావు అద్యక్షతన నిర్వహించారు. ముఖ్యంగా ఈ సమావేశంలో మంచినీటి సౌకర్యం,పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఇఓపిఆర్డీ బొజ్జిరాజుకు తెలిపారు. ప్రజారవాణాపై తీసుకున్న చర్యలపై రావులపాలెం డిపో మేనేజర్ షేక్‌షబ్నం నుండి అడిగి తెలుచుకున్నారు. ఎంతటివారైనా ట్రాఫిక్ నిబంధనలు పాటించి తీరాలని అందుకు చింతలూరు గ్రామ ప్రజలతోపాటు ఉభయగోదారి జిల్లా ప్రజలు సహకరించాలని డిఎస్పీ కోరారు. 24 గంటలు విద్యుత్ ఉండేడట్లు చర్యలు తీసుకోవాలని ఎఇ ఆచారికి ఆదేశాలిచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు ఉత్సవాలు అన్ని రోజులు అందుబాటులో ఉండాలన్నారు. ఉత్సవాల్లో మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధించామని ఎక్సైజ్ ఎస్సై తెలిపారు. అలాగే జొన్నాడ-కాకినాడ ఆర్‌అండ్‌బి రోడ్డుపై భారీ వాహనాలతోపాటు ఇసుక ట్రాక్టర్లను పూర్తిగా నిషేధించామని మండపేట ఇన్‌ఛార్జి ఎంవిఐ ఆర్ అప్పారావు తెలిపారు.ఈ ఉత్సవాలపై మంగళవారం మరోసారి సమీక్ష జరుగుతుందని అన్ని శాఖల అధికారులు హాజరవ్వాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ నాతి బుజ్జి, రాజమహేంద్రవరం డిఎల్‌పిఓ ఎం వరప్రసాద్, ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి ఎ రామలింగం, మండపేట సిఐ పుల్లారావు,ఎస్సై శేఖర్‌బాబు, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ శేషుబాబు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
మండు వేసవిలో మంచుతెరలు
రావులపాలెం, ఏప్రిల్ 4: చల్లని శీతాకాలంలో మాత్రమే కన్పించే పొగమంచు మండు వేసవిలోను మాయ చేస్తోంది. ప్రచండభానుని ప్రతాపానికి ఉష్ణోగ్రతలు తీవ్రమై సామాన్యులు అల్లాడుతున్న వేళ ఆ ప్రతాపాన్ని తగ్గించేందుకా అన్నట్టు ఉదయం పొగమంచు భానుడి రాకను ఆలస్యం చేస్తోంది. అయితే ఉదయించే సూర్యుడిని ఆపడం ఎవరి తరం అన్నట్టుగా కొద్ది నిముషాల్లోనే ఆ మంచు కరిగి మాయమవుతోంది. దట్టంగా అలుముకున్న పొగమంచు, కొద్ది నిముషాల్లోనే అది మాయమై ఉదయభానుడు ఆవిష్కృతమవుతున్న దృశ్యాలు సోమవారం రావులపాలెం పోతంశెట్టి రామిరెడ్డి పార్కు చెరువు వద్ద ఆవిష్కృతమయ్యాయి. ఈ దృశ్యాలు స్థానికులను అలరించాయి.
--ద్రాక్షారామ భీమేశ్వర ఆలయ ఇఒకు--
కందులపాలెం వెంకన్న ఆలయ బాధ్యతలు

దేవాదాయ శాఖ డిసి ఆదేశాలు
రామచంద్రపురం, మార్చి 4: మండలంలోని కందులపాలెం శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్వహణ బాధ్యతలను ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరస్వామి వారి ఆలయ కార్యనిర్వహణాధికారి పెండ్యాల వెంకట చలపతిరావుకు అప్పగిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ చందు హనుమంతరావు ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు ఈ అలయానికి సింగిల్ ట్రస్టీగా బొప్పన వీర్రాజు వ్యవహరిస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన పలువురు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారంతో వీర్రాజుపై పలు ఆరోపణలతో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉన్నతాధికార్లకు ఫిర్యాదుచేశారు. ఈ అంశంపై దేవాదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమవారం విచారణ నిర్వహించారు. ఆలయానికి సంబంధించిన భూమికి కౌలుగా ఒక ఎకరానికి 45 బస్తాలు ధాన్యం రైతు ఇస్తుండగా, రికార్డుల్లో 25 బస్తాలుగా చూపిస్తున్నారనేది ఒక ఆరోపణ. అదేవిధంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న కొబ్బరి చెట్ల ఫలసాయం సుమారు రూ.10 వేలు ట్రస్టీకి జమ అవుతున్నప్పటికీ ఆలయ ఆదాయ వ్యయ పట్టికల్లో నమోదు కావడంలేదు. పూజల నిమిత్తం, ధూప దీప నైవేధ్యం నిమిత్తం నెలకు రూ.500 ఖర్చు చేస్తున్నట్లు రికార్డుల్లో చూపినట్టు ఆరోపణలొచ్చాయి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాల సందర్భంగా సుమారు 150 మంది భక్తులు రూ.500 చొప్పున చెల్లించి, కల్యాణోత్సవంలో పాల్గొంటున్నారు. అయితే ఆ మొత్తం ఆలయ జమా ఖర్చుల్లో చేర్చకపోవడాన్ని ఫిర్యాదుదారులు తమ ఆరోపణ పత్రంలో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై డిప్యూటీ కమిషనర్ సోమవారం నిర్వహించిన విచారణలో వాస్తవమేనని తేలాయి. దీనితోట్రస్టీ నుండి వీర్రాజు నుండి ఆలయ బాధ్యతలు తీసుకోవాలని ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరస్వామి వారి ఆలయ కార్యనిర్వహణాధికారి పెండ్యాల వెంకట చలపతిరావును ఆదేశించారు. ఈ విచారణలో సింగిల్ ట్రస్టీ బొప్పన వీర్రాజు, ఫిర్యాదిదారుడు పలివెల శ్రీనివాస్ పాల్గొన్నారు.

వేసవిలో ఆరోగ్య సమస్యలు రాకుండా అప్రమత్తంగా ఉండాలి
*కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ, ఏప్రిల్ 4: వేసవిలో ఎడల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని, ఆరోగ్య సమస్యలు రాకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదురుగా రెవెన్యూ భవనంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఏప్రిల్, మే నెలల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు రైస్ మిల్లర్లు, ఫెర్టిలైజర్లు, నగరపాలక సంస్ధల ద్వారా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు జాగ్రత్తలు వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యోగ జెఎసి అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పితాని త్రినాధరావు, కలెక్టరేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి: జెసి సత్యనారాయణ
కాకినాడ, ఏప్రిల్ 4: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులన్నీ సకాలంలో పరిష్కరించాలని జెసి ఎస్ సత్యనారాయణ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని డ్వామా హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని జెసితో పాటు డిఆర్వో బి యాదగిరిలు నిర్వహించారు. ఆర్జీదారుల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వాటిని సంబంధిత అధికారులు సకాలంలో స్పందించి పరిష్కరించాలని తగు ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు నిర్వహించిన జెసి కలెక్టరేట్ నుండి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించగా సుమారు 20 మంది వారి సమస్యలను విన్నవించారు. ఈ కార్యక్రమాల్లో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఎంపిడిఒకు గాయాలు
ఉప్పలగుప్తం, ఏప్రిల్ 4: కాకినాడ నుండి ఉప్పలగుప్తం వస్తున్న ఎంపిడిఒ వెంకట్రావు శ్రీనివాస్‌కు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. సోమవారం ఉదయం కాకినాడ నుండి మోటారు సైకిలుపై ఉప్పలగుప్తం ఎంపిడిఒ కార్యాలయానికి వస్తుండగా ముమ్మిడివరం సమీపంలో విద్యార్థులు అడ్డురావడంతో వారిని తప్పించబోయి వెంకట్రావు ప్రమాదానికి గురయ్యారు. స్థానికులు ఆయనను అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించి వెద్యసేవలు అందించారు. విషయం తెలుసుకున్న పలువురు అధికారులు అమలాపురంలో కిమ్స్ ఆసుపత్రికి చేరుకుని ఆయనను పరామర్శించారు.
మెరుగైన వైద్య సేవలందించాలి: ఎంపి పండుల
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, ఏప్రిల్ 4: అమలాపురం పట్టణ పరిధిలోగల గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వెద్య సేవలు పేదప్రజలకు అందించే నిమిత్తం ఎస్‌బిఐ శాఖ అధికారులతో అమలాపురం ఎంపి పండుల రవీంద్రబాబు సంప్రదించి అమలాపురం ఏరియా ఆసుపత్రిని దత్తత తీసుకుని వైద్య సేవలకు అవసరమైన నిధులను సమకూర్చాలని ఎస్‌బిఐ వెంటనే స్పందించి నిధులు సమకూర్చుటకు వారి యొక్క సుముఖత తెలియజేసి, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిపాదనల మేరకు తగు చర్యలు తీసుకోవాలని ఎంపి పండుల తెలియజేశారు.

ఐటిడిఎ కార్యాలయం వద్ద పోలవరం నిర్వాసితుల ఆందోళన
రంపచోడవరం, ఏప్రిల్ 4: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురవుతున్న గ్రామాల్లోని నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎఐకెఎంఎస్ ఏజన్సీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వాసితులు సోమవారం ఐటిడిఎ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పిల్లా రామిరెడ్డి మాట్లాడుతూ పునరావాస చట్టంలో పేర్కొన్న విధంగా భూములకు పరిహారం అందించడం లేదన్నారు. నిర్వాసితులకు ప్యాకేజీలు చెల్లించడంలో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిర్వాసితుల సమస్యలను తక్షణం పరిష్కరించి గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండు చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్నవారి వద్దకు రంపచోడవరం సబ్ కలెక్టర్ పి రవి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులకు ఎటువంటి అన్యాయం జరగదని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతుకూలీ సంఘం నాయకులు జాన్సీరాణి, బి వర్మ, ఎన్‌ఎస్ రాజు, గిరిజన సంఘం నాయకుడు కుంజం రామారావు తదితరులు పాల్గొన్నారు.
పిఠాపురాన్ని సుందరీకరిస్తా
ఎమ్మెల్యే వర్మ:సుమారు రూ.కోటి పనులకు శంకుస్థాపన
పిఠాపురం, ఏప్రిల్ 4: పిఠాపురం పట్టణాన్ని అన్ని హంగులతో సుందరీకరిస్తానని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్ వర్మ అన్నారు. 97.66 లక్షల రూపాయలతో కూడిన సిమెంట్ డ్రైన్‌లు, రోడ్లు నిర్మాణాల కోసం సోమవారం ఆయన వివిధ వార్డులలో శంకుస్థాపన చేశారు. 3, 4,12,13,14,16,24,28,29 వార్డుల్లో ఆయన అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అటు పట్టణాలను ఇటు గ్రామాలను అభివృద్ధి పరిచేందుకు ఎన్నో కోట్ల రూపాయలను వెచ్చిస్తోందన్నారు. పట్టణాన్ని సుందరీకరించడంలో తనవంతు పాత్ర పోషిస్తానని దానికోసమే సుమారు కోటిరూపాయలు వెచ్చించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ కరణం చిన్నారావు, వైస్ ఛైర్మన్ పిల్లి చిన్నా, కౌన్సిలర్ రెడ్డెం భాస్కరరావు, పి శ్రీను, వేనుం సురేష్, కమీషనర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
శ్యామలాంబ అమ్మవారి జాతర ప్రారంభం
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 4: రాజమహేంద్రవరం నగర వరప్రదాయిని శ్యామలాంబ(సోమాలమ్మ) అమ్మవారి జాతర సోమవారం ప్రారంభమైంది. జాతర మహోత్సవాలను మేయర్ పంతం రజనీశేషసాయి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో డిప్యుటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, టిడిపి నాయకులు గన్ని కృష్ణ, యర్రా వేణుగోపాలరాయుడు, ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు రెడ్డి రాజు, గొర్రెల రమణ, రెడ్డి మణి, కేతా నాగేశ్వరరావు, బెజవాడ రాజ్‌కుమార్, మజ్జి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 4: రాజమహేంద్రవరం శివారు పిడింగొయ్యి పంచాయితీ పరిధిలోని బుచ్చయ్యనగర్-కవలగొయ్యి రోడ్డులో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. అనుమానాస్పద పరిస్థితుల్లో ఆమె మరణించింది. సుమారు 40-45ఏళ్ల వయస్సు కలిగిన ఆమెను గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లు భావిస్తున్నారు. అయితే ఆమె శరీరంపై నుంచి కారు పలుసార్లు దూసుకుపోయినట్లు గుర్తులు ఉండటంతో మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనా స్థలానికి పోలీసు జాగిలాన్ని రప్పించి పరిశీలించగా, కొద్దిదూరంలోని తోటల్లోకి వెళ్లి ఆగిపోయింది. అక్కడ పలు బీరుసీసాలు ఉండటం గమనార్హం. ఆమెను ఎవరైనా అక్కడికి తీసుకుని వచ్చి అఘాయిత్యం చేసి హత్య చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఆమె సమీపంలోని కల్లుపాక వద్ద కనిపించి తనది అమలాపురం అని చెప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని తూర్పుమండలం డిఎస్పీ రమేష్‌బాబు, బొమ్మూరు సిఐ కనకారావు సందర్శించి, దర్యాప్తు చేపట్టారు. బొమ్మూరు పోలీసులు కేసునమోదు చేశారు.