తూర్పుగోదావరి

శిరోముండనం కేసులో పిపి రద్దును నిరసిస్తూ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 3: రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామ దళితుల శిరోముండనం కేసులో ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌ను (పిపి) రద్దుచేస్తూ ఇచ్చిన జిఓను ఉపసంహరించుకోవాలని కోరుతూ వామపక్ష పార్టీలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా ఉద్రిక్తమయింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా జిల్లా నలుమూలల నుండి వాహనాలపై సిపిఐ, సిపిఎం, న్యూడెమోక్రసీ, లిబరేషన్, జనశక్తి, న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) దళిత, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు భారీగా చేరుకున్నారు. ఎమ్మెల్యే తోటకు శిక్ష పడాలని, దళితులకు రక్షణ కల్పించాలని, పిపిని తొలగించవద్దంటూ నినాదాలు చేశారు. ఈ కేసులో ప్రథమ ముద్దాయి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును రక్షించే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు నినదించారు. కొద్దిసేపటికి ఆందోళనకారులు కలెక్టరేట్ గేటు వైపునకు దూసుకెళ్ళగా అప్పటికే భారీగా చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వివాదం, తోపులాట జరిగింది. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని బలవంతంగా ఈడ్చుకుంటూ వాహనాల ద్వారా నగరంలోని పలు పోలీసుస్టేషన్లకు తరలించారు. ఈ తోపులాటలో లిబరేషన్ జిల్లా కార్యదర్శి కె గణేశ్వరరావుకు తీవ్ర గాయమైంది. పోలీసుల తీరును నిరసిస్తూ పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అడ్డుకుని అక్రమ అరెస్ట్‌లు చేయడాన్ని వామపక్ష, దళిత సంఘాల నాయకులు తప్పుపట్టారు. ఎమ్మెల్యే తోటను రక్షించేందుకే తమను అరెస్ట్ చేసినట్లు వారు చెప్పారు. త్వరలో జిల్లావ్యాప్త ఉద్యమం నిర్వహించి తీవ్రతరం చేస్తామన్నారు. ఈ ధర్నాలో వామపక్ష నేతలు టి మధు, డి శేషుబాబ్జీ, ఎం దుర్గాప్రసాద్, జి బేబిరాణి, రమేష్, జె వెంకటేశ్వర్లు, బి సూర్యారావు, నాగయ్య, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు స్థానిక బాలాజీ చెరువు సెంటర్ నుండి ర్యాలీగా కలెక్టరేట్‌కు వచ్చారు.

ప్రతిపక్షాల గొంతు నొక్కడమే

*చంద్రబాబు ప్రకటన పై వైసిపి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు ఆగ్రహం

రాయవరం, అక్టోబర్ 3: ప్రజా సమస్యలపై పోరాడేవారిపై పిడి యాక్ట్ పెట్టాలంటూ సిఎం చంద్రబాబు చేసిన ప్రకటన ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని వైసిపి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని పసలపూడి గ్రామం వచ్చిన సందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రతిపక్ష నేతగా జిల్లాలో సెస్ భూములు, తమ్మవరంలో ప్రజా సమస్యలపై పోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు వైసిపి ఉద్యమిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఎన్ని పిడి యాక్ట్‌లు పెట్టినా ప్రజలపై పోరాటం ఆగదన్నారు. జిల్లాను రోగాలు చుట్టుముడుతున్నాయని, ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలో రోగులతో నిండిపోతున్నాయని, ఏజన్సీలో కాళ్ల వాపు వ్యాధితో గిరిజనులు మృత్యువాత పడుతున్నారని..వీటినేమీ సిఎం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాను హెల్త్ ఎమర్జన్సీగా ప్రకటించాలని కురసాల డిమాండు చేశారు. సిఎం చంద్రబాబు దోమలపై దండయాత్ర చేసి తనకు తనను కమెండోగా ప్రకటించుకున్నారన్నారు. ప్రతిపక్ష నేత జగన్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ నిజమైన కమెండోగా ప్రజల గుండెల్లో నిలుస్తారన్నారు. జిల్లాలో తమ పార్టీ కార్యకర్తలపై పోలీసు వేధింపులు ఎక్కువయ్యాయని కురసాల ఆరోపించారు. అనంతరం గ్రామంలో మండపేట నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ వేగుళ్ల పట్ట్భారామయ్యచౌదరితో కలిసి గడప గపడకూ వైసిపి కార్యక్రమాన్ని కురసాల నిర్వహించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర నాయకులు రెడ్డి రాధాకృష్ణ, ఆర్ వెంకటేశ్వరరావు, సత్తి వెంకటరెడ్డి, పెంకే వెంకట్రావు, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ సిరిపురపు శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షుడు నల్లమిల్లి వెంకట్రెడ్డి, కొవ్వూరి త్రినాధరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పుట్టిన రోజు వేడుకకు వెళ్లి శవమయ్యాడు

చింతూరు, అక్టోబర్ 3: స్నేహితుని పుట్టిన రోజు వేడుకకు వెళ్లి ఓ వ్యక్తి విగతజీవి అయిన ఘటన మండలంలో సోమవారం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. లక్కవరం గ్రామానికి చెందిన నవీన్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం తన స్నేహితులైన సతీష్, కార్తీక్, రమేష్, రవిలతో తులసిపాక గ్రామంలోని సోకులేరు వాగు వద్ద పిక్నిక్ ప్రదేశానికి వెళ్లారు. స్నేహితులంతా పుట్టిన రోజు వేడుకను ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. అక్కడ ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో గానీ సతీష్ (28) వాగులో మృతిచెందాడు. స్నేహితులు నవీన్, కార్తీక్, రమేష్‌లు మోతుగూడెం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎస్సై కిశోర్‌కు సతీష్ మృతిచెందిన విషయాన్ని తెలిపారు. కాగా మరో స్నేహితుడు రవి మాత్రం పరారయ్యాడు. ఎస్సై కిశోర్ సంఘటనా స్థలానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మృతుడు సతీష్ కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు. ఆదివారం సాయంత్రం వాగులో ఉన్న సతీష్ మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిశోర్ తెలిపారు. అలాగే పరారీలో ఉన్న రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా..మృతుని భార్య వెంకటలక్ష్మి, కుటుంబ సభ్యులు సతీష్‌ను స్నేహితులే హతమార్చారని ఆరోపిస్తున్నారు. పోలీసులు సతీష్ స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
పోస్టుమార్టం ఆలస్యంపై ఆందోళన
సతీష్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సోమవారం ఉదయం పోస్టుమార్టం నిమిత్తం చింతూరుకు తీసుకువచ్చారు. సాయంత్రం వరకూ పోస్టుమార్టం నిర్వహించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చింతూరు ప్రధాన సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యాధికారులను సస్పెండ్ చేయాలని నినదించారు. మృతుని భార్యకు క్షమార్పణ చెప్పాలని డిమాండు చేశారు. రాస్తారోకో కారణంగా రాకపోకలు స్తంభించాయి. సిఐ దుర్గాప్రసాద్ రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారుల వద్దకు వచ్చి ఆలస్యం కావడానికి గల కారణాలను వివరించారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.