తూర్పుగోదావరి

మన్యంలో ఆగని శిశుమరణాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, అక్టోబర్ 4: ఏజెన్సీలో శిశుమరణాల పరంపర కొనసాగుతూనే ఉంది. మాతా, శిశుమరణాలు అరికట్టడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మారుమూల గ్రామాల్లో వైద్య సదుపాయం కల్పిస్తున్నామని నేతలు చేస్తున్న ప్రచారం వాస్తవ దూరంగా ఉంది. ఒకే పంచాయతీలో మూడు రోజుల వ్యవధిలో సరైన వైద్య సహాయం అందక ఇరువురు నెలల వయస్సు బిడ్డలు మరణించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. మండలంలో మారుమూలన ఉన్న లోదొడ్డి పంచాయతీ పూదేడు గ్రామానికి చెందిన వంతల పార్వతి, రాంబాబు దంపతుల 45 రోజుల వయస్సు గల మగబిడ్డ మంగళవారం ఉదయం కడుపునొప్పి, జ్వరంతో మరణించాడు. అనారోగ్యంతో విలవిల లాడుతున్న పసిబిడ్డను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కనీసం 108 కూడా ఆ గ్రామానికి వెళ్లలేని దుస్థితిలో రహదారి ఉండడంతో వాహనం రాక 30 కి.మీ దూరాన ఉన్న జడ్డంగి ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోడంతో బిడ్డ ప్రాణాలు విడిచింది. ఇదే పంచాయతీలో పాకవెల్తి గ్రామానికి చెందిన భీమిరెడ్డి లక్ష్మి, వెంకటరావుల 3 నెలల ఆడబిడ్డ ఈ నెల 1వ తేదీన ఇంటి వద్దే ప్రాణాలు విడిచింది. ఈ బిడ్డ కూడా తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ సకాలంలో వైద్యసహాయం అందక మరణించింది. రెండు నెలల క్రితం అమీనాబాద్, చికిలింత గ్రామాల్లో ఇరువురు బిడ్డలు మరణించారు. శిశుమరణాలు రోజు రోజుకీ మన్యంలో పెరిగిపోతున్నా పట్టించుకొనే నాధుడే కరువయ్యాడు. మారుమూలన ఉన్న లోదొడ్డి గ్రామానికి రహదారి నిర్మించాలని రెండు దశాబ్దాలుగా గిరిజనులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, మరిన్ని మరణాలు సంభవించేదాకా అధికారులు నిద్రనుండి లేవరా.. అని ఆగ్రామ సర్పంచ్ లోతా రామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మన్యంలో పెరుగుతున్న మరణాలతో గిరిజనులు బెంబేలెత్తుతున్నారు.