తూర్పుగోదావరి

మేయర్ సీటు కోసం కుమ్ములాటలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 23: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో అధికార తెలుగుదేశం పార్టీ నేతల్లో మేయర్ సీటు కోసం పోటీ పతాక స్థాయికి చేరింది. టిక్కెట్ విషయంలో పార్టీ నిర్ణయమే శిరోధార్యమంటూ ఇటీవల జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన సూచనలను ఖాతరు చేసే స్థితిలో నగర నేతలున్నట్టు కనిపించడం లేదు. మేయర్ టిక్కెట్ కోసం ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తూ, తమకున్న ఛానెల్స్‌లో విశ్వప్రయత్నాలు ‘కొన’సాగిస్తున్నారు. ఎవరికి టిక్కెట్ ఇచ్చినా సదరు అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ ఇన్‌ఛార్జి మంత్రి సూచనలను ఇక్కడి గ్రూపులు పెడ చెవిన పెట్టక తప్పదని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
కాకినాడ మేయర్ స్థానం జనరల్ (మహిళ)కు దాదాపు ఖరారైనట్టే! దీంతో తమకు లైన్ క్లియర్ అయ్యిందని కాపు సామాజికవర్గ నేతలు ధీమాతో ఉన్నారు. జనరల్ మహిళ అంటే ఇతర కులాలకు చెందిన మహిళా నేతలూ పోటీచేసే అవకాశాలున్నప్పటికీ ప్రస్తుత సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న అధికార పార్టీ కాపు సామాజికవర్గానికే మేయర్ టిక్కెట్ ఇచ్చేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. పైగా కాకినాడ నగర పాలక సంస్థలో సామాజికపరంగానూ కాపులకు పట్టు ఉండటంతో ఆ వర్గం అభ్యర్థికే టిక్కెట్ కేటాయించడం సముచితమని జిల్లాకు చెందిన మంత్రుల నుండి కూడా అధినేత చంద్రబాబుకు వినతులు వెళ్ళాయి. అయితే స్థానికంగా మాత్రం కాపులతో పాటు వైశ్య సామాజికవర్గం మేయర్ టిక్కెట్‌ను ఆశిస్తోంది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు సన్నిహితుడైన కాకినాడ సిటీ టిడిపి అధ్యక్షుడు నున్న దొరబాబు తన భార్యకు మేయర్ టిక్కెట్ ఆశిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుండి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడిన కాపు సామాజికవర్గానికి చెందిన మాకినీడి శేషుకుమారి మేయర్ సీటు కోసం విశ్వప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే సామాజికవర్గానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నేత సుంకర తిరుమలకుమార్ తన భార్య అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం తప్పక పరిశీలిస్తుందని ధీమాతో ఉన్నారు. వీరే కాకుండా మరో ఇరువురు మహిళా నేతలు మేయర్ టిక్కెట్ కోసం జిల్లా ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వీరిలా ఉంటే వైశ్య సామాజికవర్గానికి చెందిన పార్టీ నేత గ్రంధి బాబ్జీ తన కుటుంబ సభ్యురాలికే మేయర్ టిక్కెట్ సాధించి తీరుతానన్న ధీమాతో ఉన్నారు. ఇలా వీరంతా ఎవరి ప్రయత్నాల్లో వారుండగా దిమ్మతిరిగే రీతిలో ఓ మహిళా నేత చివరి నిమిషంలో తెరపైకి వచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కాపు సామాజికవర్గానికి చెందిన సదరు మహిళా నేతను పోటీలోకి దించడం ద్వారా కొత్త మొహాన్ని తెర పైకి తెచ్చి, ఆమె గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలంటూ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం! ఇప్పటికే మేయర్ పదవిని ఆశిస్తున్న వారిలో ఏ ఒక్కరికి టిక్కెట్ ఇచ్చినా, మిగిలిన వారు చీలిక తెచ్చే అవకాశాలున్నాయని, అదే అన్ని విధాలుగా సమర్ధురాలైన కొత్త మొహాన్ని బరిలోకి దింపితే గెలుపు నల్లేరుపై నడకవుతుందని టిడిపి చెందిన ఓ సీనియర్ నేత ఆంధ్రభూమి ప్రతినిధి వద్ద వ్యాఖ్యానించారు.