తూర్పుగోదావరి

ఇక జలసౌర బావులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 24: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జలసిరి కింద ఏర్పాటుచేసిన బోరు బావులకు ఇకనుండి సోలార్ విద్యుత్‌ను మాత్రమే అందజేస్తారని జిల్లా కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ తెలియజేశారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాలులో సోమవారం ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం కింద బోరు బావుల తవ్వకాలకు 200 అడుగుల వరకు మాత్రమే అనుమతిస్తారన్నారు. సోలార్ విద్యుత్ వినియోగానికి 5 హెచ్‌పి మోటార్లను సబ్సిడీపై అందజేయనున్నట్టు చెప్పారు. ఈమేరకు లబ్ధిదారులు, డ్వామా, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి అమలుచేస్తున్న వివిధ పథకాల్లో భాగంగా ఈ నెల 28వ తేదీన రాజమహేంద్రవరంలో చంద్రన్న దళిత బాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీలకు వివిధ పథకాల ద్వారా రుణాల పంపిణీ, కేటాయించిన నిధులపై అవగాహన కలిగిస్తామన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రులు హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. చంద్రన్న దళిత బాట కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటుచేయనున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు రాజమహేంద్రవరంలో అనువైన ప్రాంతాన్ని గుర్తించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి లబ్ధిదారులు హాజరయ్యేలా చూడాలని సూచించారు. జిల్లాలో ఒక్కొక్కటి రూ.1.50 లక్షల వ్యయంతో 14 వేల గృహాలు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద మంజూరయ్యాయని, 12 వేల మంది లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే పూర్తయ్యిందని పేర్కొన్నారు. నవంబర్ 1 నుండి 15వ తేదీవరకు గృహ నిర్మాణ పక్షోత్సవాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. పక్షోత్సవాలను విజయవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పశు సంవర్ధక శాఖ చేపడుతున్న పనులను కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో 1.42 లక్షల పశువులకు ఏలికపాముల నిర్మూలనకు తొలి విడత వేక్సిన్లు వేశామని, రెండవ విడత ప్రక్రియను 2017లో చేపడతామని చెప్పారు. జిల్లాలో పశువులకు వైద్యం అందించేందుకు, గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పశువుల బోనులు ఏర్పాటుచేస్తారని, దీని ద్వారా పశువులకు వైద్యం అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. రిలయన్స్ సహకారంతో 5 వేల పశువుల దాణా, గ్రాసం కోసం అజోలా కిట్లను పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏజన్సీలో కూరగాయల సాగు ప్రోత్సాహానికి 10 వేల కూరగాయల విత్తనాల కిట్లను పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. సమీక్షా సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, సంయుక్త కలెక్టర్-2 జె రాధాకృష్ణమూర్తి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎఒబిలో ఎన్‌కౌంటర్‌తో అప్రమత్తం
-వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు
రాజవొమ్మంగి, అక్టోబర్ 24: ఎఒబిలో భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మన్యంలో పోలీసులు సోమవారం అప్రమత్తమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేతలు సహా 24 మంది మావోయిస్టులు మరణించారు. దీంతో రాజవొమ్మంగి, జడ్డంగిలో పోలీసులు పెద్ద ఎత్తున వాహనాల తనిఖీ చేశారు. విశాఖ జిల్లా నుండి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక ఎస్సై రవికుమార్, సిబ్బంది ప్రతి వాహనాన్ని నిశితంగా పరిశీలించారు. మావోయిస్టులు వాహనాల్లో దిగువ ప్రాంతాలకు తరలిపోయే అవకాశమున్నందున ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
ఇంటి నుండే ప్లానింగ్ అవకాశం
రామచంద్రపురం, అక్టోబర్ 24: భవన నిర్మాణదారులకు ఇంటి ప్లాన్ల అనుమతులు తమ ఇంటి వద్ద నుండే అప్‌లోడ్ చేసుకుని, మంజూరు ఉత్తర్వులు పొందే సులభతర విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మున్సిపల్ శాఖ రాజమండ్రి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పిఎన్‌ఎస్ సాయిబాబు తెలిపారు. రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో ఉన్న లైసెన్డ్స్ సర్వేయర్లతో మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌లో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో ఆర్‌డిడి సాయిబాబు కొద్దిసేపు భవన నిర్మాణ అనుమతుల అంశాలు వివరించారు. భవన నిర్మాణం చేసుకోదలచిన వారు తమ దరఖాస్తును, భవన అనుమతులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేసుకుంటే, ఫీజు వివరాలు తెలుపుతారని, వాటిని చెల్లించిన వెంటనే అనుమతులు మంజూరవుతాయని తెలిపారు. ఒకవేళ ఈ ప్రక్రియ ఇష్టం లేని వ్యక్తులు లైసెన్డ్స్ సర్వేయర్ ద్వారా భవన నిర్మాణ అనుమతులను అందుకోవచ్చునన్నారు. దరఖాస్తులో పేర్కొన్న రీతిలో నిర్మాణం కచ్చితంగా జరగాలన్నారు. దీనిపై శాఖాపరంగా పర్యవేక్షణ జరుగుతుందని, అనుమతులకు చేసిన దరఖాస్తు కాపీలను పురపాలక సంఘ కార్యాలయంలో అందించాలని, మాస్టర్‌ఫ్లాన్, రహదారి వెడల్పు తదితర అంశాలు పరిశీలనలో ఉంటాయని, భవనం నిర్మాణానికి సంబంధించి గిఫ్ట్ డీడ్ అందించాలని, రుసుములో 10 శాతం డిపాజిట్ చేయాలని ఆయన వివరించారు. ఒకవేళ అనుమతించిన ఫ్లాన్‌కు భిన్నంగా భవన నిర్మాణం జరిగితే.. 10 శాతం సొమ్ము మున్సిపల్ నిధులకు జమ కావడమే కాకుండా, అక్రమ నిర్మాణంపై జరిమానా విధించే అధికారం పురపాలక సంఘానికి ఉందన్నారు. ప్రత్యేకించి ఇటువంటి అనుమతులు జారీచేసిన గృహ యజమానులకు తప్పనిసరిగా బ్యాంకర్లు గృహ రుణ సౌకర్యాన్ని అందించాల్సి ఉంటుందన్నారు. రామచంద్రపురం పట్టణానికి సంబంధించి 24 ప్లానులు ఇప్పటి వరకు అందుకోగా, వాటిలో 12 దరఖాస్తులను అంగీకరించినట్లు సాయబాబా తెలిపారు. మిగిలిన 12 దరఖాస్తులలో జత పరచాల్సిన డాక్యుమెంట్లు సక్రమంగా పంపకపోవడంతో తిరస్కరించినట్లు తెలిపారు. బిపిఎస్‌కు 40 మంది దరఖాస్తు చేయగా, 36 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఒక భవనానికి సంబంధించి ఒక అంతస్తుకు అనుమతులు ఇచ్చిన సమయంలో రెండు మూడు అంతస్తులు నిర్మించడం పురపాలక చట్టం, భవన నిర్మాణ చట్టానికి వ్యతిరేకమని అంటూ.. సక్రమ రీతిలో భవన నిర్మాణదారుడు దరఖాస్తు చేసుకుంటే.. తాము అందుకు వెంటనే అనుమతులు మంజూరు చేయిస్తామని తెలిపారు. భవన నిర్మాణానికి ఆటోక్యాడ్‌లో గీసిన ఇంటి ఫ్లాన్, ఇంటి దస్తావేజు నకలు, లింక్ దస్తావేజు నకలు, ఇంటిపన్ను రశీదు నకలు లేదా ఖాళీస్థలం పన్ను రశీదు నకలు, స్థలం ఫొటో, ఫొటోలో నిర్మించే స్థలంలో ఎదురుగా ఉన్న రహదారి కనబడేలా ఏర్పాటు, ఏపి రిజిస్ట్రేషన్ శాఖ వారి నుండి ఎన్‌కంబ్రెన్స్‌మెంట్ సర్ట్ఫికెట్, అండర్ టేకింగ్ 100 రూపాయల నాన్ జ్యుడిషియల్ పేపర్లు, గృహ నిర్మాణదారు అడ్రస్, డిక్లరేషన్ ఫారమ్, 200 చదరపు మీటర్లు లేదా జి ఫ్లస్ 1 దాటిన భవనం రెండవ అంతస్తు ఉంటే.. 10 శాతం బిల్డప్ ఏరియా మార్టిగేషన్ రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలన్నారు. రహదారి వెడల్పు పోర్షన్ గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నారు. ఫ్లింత్ ఏరియా మేరకు అమలులో ఉన్న ఫీజులను డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలన్నారు. బిల్డింగ్ ప్లాన్ ఆమోదం అందుకున్న తరువాత మంజూరైన ప్లాన్ ప్రకారం భవన నిర్మాణం జరగాలని మున్సిపల్ కమిషనర్ చిలకమర్తి శ్రీరామశర్మ, ఆర్‌డిడి సాయిబాబా స్పష్టం చేసారు.
ఈ నెలలోనే పురుషోత్తమ పట్నం టెండర్లు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, అక్టోబర్ 24: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ఈ నెలాఖరుకల్లా టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు జల వనరుల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అఖండ గోదావరి నది ఎడమ గట్టుపై సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామం వద్ద తలపెట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులపై జల వనరుల శాఖ ఆగమేఘాలపై చర్యలు చేపట్టింది. పట్టిసీమ స్ఫూర్తితో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయాలని ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందుకోసం ఖర్చు చేయాల్సిన రూ.1630 కోట్ల నిధులను ఏ విధంగా సమకూర్చాలనేది ఇదమిద్ధంగా నిర్ణయానికి రాలేదు. ఈ నిధుల విషయం ఇంకా ఎటూ తేలలేదు. పోలవరం ఎడమ కాల్వకు ఈ ఎత్తిపోతల పథకానికి అనుసంధానం కాబట్టి పోలవరం ప్రాజెక్టు నుంచి నిధులను సమీకరించుకోవాలని ముందుగా తలపెట్టినట్టు తెలుస్తోంది. అయితే పట్టిసీమ ఖర్చు చేసిన నిధులను పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిధులను రాబట్టేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో పోలవరం అధారిటీ మొట్టికాయలు వేసింది. దీంతో పట్టిసీమ స్ఫూర్తి కేవలం పనులకు మాత్రమే పరిమితం గానీ నిధుల విషయంలో కాదని తేలిపోయింది. ఈ విషయం పక్కనబెడితే.. ఈలోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసుకుని నవంబర్ 15వ తేదీకల్లా పనులను శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ పథకం శంకుస్థాపన పనులకు సంబంధించి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం సమీపంలోనే హెలీప్యాడ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి హెలీప్యాడ్‌కు సంబంధించి ఇప్పటికే స్థల పరిశీలన కూడా అధికారులు పూర్తిచేశారు. ఇదే సందర్భంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్టు తెలిసింది. పురుషోత్తపట్నం పథకంలో సుమారు పది కిలోమీటర్ల వరకు ప్రెజర్‌మెయిన్ నిర్మించాల్సి వుంది. ఈ ప్రెజర్ మెయిన్ పనులను ఒక ప్యాకేజీ, హెడ్ వర్క్సు ఒక ప్యాకేజీ, మూడు వంతెన క్రాసింగ్ పనులను మరో ప్యాకేజీగా పనులను విభజించి టెండర్లు పిలవనున్నట్టు తెలిసింది. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ఎలైన్‌మెంట్‌లోని మూడుచోట్ల పదహారవ నెంబర్ జాతీయ రహదారి క్రాసింగ్‌కు సంబంధించి ఇప్పటికే నేషనల్ హైవే అధారిటీతో జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్, జల వనరుల శాఖ అధికారులు చర్చించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కూడా ఈ పనులపై ఆదేశించినట్టు తెలుస్తోంది. హెడ్ వర్క్సు పనులు నిర్దేశిత వ్యవధిలోగా పూర్తయినప్పటికీ, హైవే క్రాసింగ్ పనులే ఆలస్యమయ్యే పరిస్థితి వుందని తెలుస్తోంది. జాతీయ రహదారి క్రాసింగ్, పంపుహౌస్ నిర్మాణం, పంపుల ఏర్పాటు, ప్రెజర్‌మెయిన్ (పైపులైన్ నిర్మాణం) పనులు నిర్దేశిత వ్యవధిలో పూర్తయితే ఏడాది లోగా ఈ పథకం అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అయతే అంతకంటే ముందు నిధుల విషయం తేలాల్సి వుంది.

నేడు మున్సిపల్ భవనం మొదటి ఆంతస్తు ప్రారంభం
తొలిసారి రానున్న మంత్రి నారాయణ

సామర్లకోట, అక్టోబర్ 24: సామర్లకోట మున్సిపల్ కార్యాలయం భవనంపై రూ.48.6 లక్షల రూపాయిల వ్యయంతో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన మొదటి అంతస్తు భవనాన్ని మంగళవారం మున్సిపల్ శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించనున్నట్టు మున్సిపల్ చైర్‌పర్సన్ మన్యం పద్మావతిచంద్రరావు, కమిషనర్ కెటి సుధాకర్ చెప్పారు. సుమారు రెండేళ్ళుగా మున్సిపల్ భవనంపై అంతస్తు పనులను స్టేట్ ఫైనాన్స్ కమీషన్ గ్రాంటు, మున్సిపల్ జనరల్ నిధులనుండి వెచ్చించి పనులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షత వహిస్తారు. కింది భవనానికి కాంగ్రెస్ కౌన్సిల్ హాయంలో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భవనంగా నామకరణం చేశారు. అయితే ప్రస్తుత కౌన్సిల్ పై అంతస్తు భవనానికి దివంగత సిఎం, టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పేరు పెట్టారు. మొదటి అంతస్తులో అధునాతనంగా కౌన్సిల్ సమావేశాల నిర్వహణకు హాలు ఏర్పాటు చేశారు. అలాగే ఇంజనీరింగ్ విభాగానికి చెందిన మున్సిపల్ డిఇ, ఎఇ, సిబ్బంది నిర్వహణ విభాగాలతోపాటు చైర్‌పర్సన్ ఛాంబర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే కౌన్సిలర్లకు వెయిటింగ్ రూం సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. అలాగే రూ.50 లక్షల వ్యయంతో నీలమ్మ చెరువుగట్టు వద్ద నిర్మించిన సిసి రోడ్డును కూడ మంత్రులు ప్రారంభిస్తారన్నారు. మంత్రి నారాయణ మొదటిసారిగా వస్తుండడంతో మున్సిపల్ కార్యాలయాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దారు. కార్యక్రమాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ హెచ్ అరుణకుమార్ తదితరులు పాల్గొంటారని వారు చెప్పారు.

రాష్ట్ర వైద్య విధాన పరిషత్ బోర్డు డైరెక్టర్‌గా డాక్టర్ బిక్కిన
రాజోలు, అక్టోబర్ 24: రాష్ట్ర వైద్య విధాన పరిషత్ బోర్డు డైరెక్టర్‌గా తాటిపాకకు చెందిన డాక్టర్ బిక్కిన వీరాస్వామిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని బిక్కిన సోమవారం విలేకర్లకు తెలిపారు. తాటిపాకలో డాక్టర్ బిక్కిన గత నాలుగు దశాబ్థాలుగా పేదలకు మెరుగైన వైద్య సేవలను అతి స్వల్ప రుసుముతో అందిస్తుండడం విశేషం. అలాగే తాటిపాక సర్పంచ్‌గా, తాటిపాక పిహెచ్‌సి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌గా సేవలందజేశారు. ఈయన చేసిన సేవలకు గాను రాష్ట్ర వైద్య విధాన పరిషత్ బోర్డు డైరెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా డాక్టర్ బిక్కిన సిఎం చంద్రబాబుకు, ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బిక్కినను ఈ పదవిలో నియమించడం పట్ల రాష్ట్ర హార్టికల్చరల్ యూనివర్శిటీ బోర్డు డైరెక్టర్ బోనం నాగేశ్వరరావు, ఎఎంసి ఛైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణమూర్తి, టిడిపి మండల శాఖ అధ్యక్షుడు కోళ్ల వెంకన్న, సర్పంచ్ సరెళ్ల వరలక్ష్మీ శ్రీనివాస్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

జి కొత్తపల్లిలో భారీ గిరినాగు హతం
శంఖవరం, అక్టోబర్ 24: మండలంలోని జి కొత్తపల్లి గ్రామంలో సుమారు 15 అడుగుల పొడవు గల గిరినాగు సోమవారం హల్‌చల్ చేసింది. గ్రామ శివారున గల పొలాల్లో కూలీలు పని చేసుకుంటుండగా అలజడి అయింది. పరిశీలించి చూడగా గిరినాగు వారి కంట పడింది. అత్యంత ప్రమాదకరమైన 15 అడుగుల పొడవైన గిరినాగును చూసి వారు భయభ్రాంతులకు గురయ్యారు. కొంతమంది యువకులు ధైర్యంచేసి గిరినాగును హతమార్చారు. చనిపోయన పామును గ్రామస్థులు తిలకించేందుకు గ్రామంలోకి తీసుకువచ్చారు.

కాళ్లవాపు వ్యాధితో మరో గిరిజనుడి మృతి
విఆర్‌పురం, అక్టోబర్ 24: కాళ్లవాపు వ్యాధితో మరో గిరిజనుడు మృతిచెందిన సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. మృతుని బంధువుల కథనం ప్రకారం మండల పరిధి చినమట్టపల్లి గ్రామానికి చెందిన సోడె కిట్టయ్య (45) అనే గిరిజనుడు కాళ్లవాపు వ్యాధితో బాధపడుతూ శనివారం ఉపాధి పనులకు వెళ్లివచ్చిన తర్వాత కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే రేఖపల్లి పిహెసికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే భద్రాచలం తీసుకెళ్లాలని సూచించారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందినట్లు వారు తెలిపారు.

కనీస వేతనాల సంఘం సలహా బోర్డు డైరెక్టరుగా కుసుమ
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, అక్టోబర్ 24: రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతనాల సంఘం సలహా బోర్డు సభ్యులుగా టిడిపి సీనియర్ నేత కుసుమ సూర్యమోహనరావు నియమితులయ్యారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సోమవారం ఉత్తర్వులు అందాయి. చంద్రబాబు పాలనాదక్షతకు ఆకర్షితులైన సూర్యమోహనరావు సాధారణ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తనకు పదవి రావడానికి కృషిచేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె కళావెంకట్రావు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఎంపి పండుల రవీంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రేపు రైతుబజార్ ప్రారంభం
మండపేట, అక్టోబర్ 24: ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు నిరంతర కృషి ఫలితంగా మండపేట పుర ప్రజల చిరకాల వాంఛ అయన రైతు బజారు ఏర్పాటు బుధవారంతో తీరనుంది. స్థానిక గాంధీ నగర్‌లో రూ.43 లక్షల రూపాయల వ్యయంతో మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతు బజార్‌ను నిర్మించారు. ఈ నెల 26న ప్రారంభించేందుకు సన్నాహాలు ఇప్పటికే పూర్తిచేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు తదితర అంశాలపై సోమవారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు చేకూరి రమేష్ రాజుతో కలిసి పరిశీలించారు. రైతు బజార్‌లో 31 షాపులు ఏర్పాటు చేసినట్టు, అందులో 26 షాపులు కూరగాయలు పండించే రైతులకు, 4 షాపులు డ్వాక్రా సంఘాలకు, ఒక షాపును వికలాంగునికి కేటాయించినట్టు ఎమ్మెల్యే వేగుళ్ల తెలిపారు. కూరగాయల ధరలు ఇష్టం వచ్చిన రీతిలో అమ్ముతూ.. ప్రజలను కొందరు వ్యాపారులు దోచుకుంటున్న నేపథ్యంలో రైతు బజార్ ఏర్పాటుకు ప్రజలు డిమాండ్ చేసేవారు. గత 8 సంవత్సరాలుగా రైతు బజార్ ఏర్పాటుకు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కృషిచేస్తూ వచ్చారు. ఆ ప్రాంతంలోని ఖాళీ స్థలంలో గ్రావెల్ చదును చేసి, తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ వివి కన్యాకుమారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రైతుబజార్ ఇన్‌ఛార్జి ఇ భాస్కరరావు, టిడిపి నాయకులు జొన్నపల్లి సూర్యారావు, వై ప్రసాద్, ఉంగరాల రాంబాబు, కాసిన కాశి, పాలచర్ల శిరీష్, ఎం సూర్యప్రకాష్, గనిశెట్టి వీర్రాజు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. బందోబస్తు ఏర్పాట్లను మండపేట ఎస్సై నసీరుద్దీన్ తన సిబ్బందితో నిర్వహించారు.