తూర్పుగోదావరి

కోనసీమలో ముద్రగడ పాదయాత్ర ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, నవంబర్ 4: కాపులను బిసిల్లో చేర్చాలంటూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 16 నుండి చేపట్టనున్న కాపు సత్యాగ్రహ పాదయాత్ర ఉద్యమాల పురిటిగడ్డ కోనసీమలో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే గ్రామగ్రామాన రాత్రుళ్లు కాపునేతలు రచ్చబండ సమావేశాలు నిర్వహించి ఉద్యమానికి ఊపిరులూదుతున్నారు. యువ నాయకులు తమశక్తియుక్తుల్ని ధారబోసేందుకు ఎవరి స్థాయిలో వారు ముమ్మర సన్నాహాలు చేస్తూ ముద్రగడ అడుగులో అడుగేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కోనసీమ వాసి కావడం, ముద్రగడ కోనసీమ నుండే పాదయాత్ర ప్రారంభించనుండటంతోప్రాధాన్యత సంతరించుకుంది. కాపురిజర్వేషన్ల ఉద్యమం నేపథ్యంలో గడిచిన కాలంలో చినరాజప్ప, ముద్రగడల మధ్య మాటల యుద్ధం నడిచింది.
రాష్ట్ర ప్రభుత్వంలో చినరాజప్ప కీలకపాత్ర పోషిస్తుండటం, ముద్రగడ కాపు రిజరేషన్ల విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతుండటంతో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి మధ్యా మాటల యుద్ధం సాగుతోంది. ఈనేపథ్యంలో 16 నుండి సాగే కాపుసత్యాగ్రహ పాదయాత్ర చర్చనీయాంశమైంది.
ఇదిలావుండగా ముద్రగడ పాదయాత్ర మాత్రం రెట్టించిన ఉత్సాహంతో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పాదయాత్ర జరిగే వివిధ గ్రామాల్లో కాపుమహిళలు సైతం తమ గ్రామపరిధి వరకూ ఆయనతో కలసి అడుగేసేందుకు కొంగు బిగించనున్నారు. తమ అధినాయకుడు తమ గ్రామానికి వస్తుంటే ఆయనకు విజయ హారతులు ఇస్తూనే ఆయన వెంట నడిచి తమ వంతు బాధ్యత నెరవేర్చడానికి మహిళలు సైతం ముందుకు వస్తుండటంతో ముద్రగడ పద్మనాభం పాదయాత్ర ఏ స్థాయిలో జరగనుందో అవగతమవుతోంది. ఉద్యమవేడి రోజురోజుకీ జోరందుకుంటున్న తరుణంలో కాపుఉద్యమానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ పాదయాత్ర నిర్వహించే ప్రాంతాలు, మధ్యాహ్నం భోజన విరామ స్థలాలు, రాత్రి బస చేసే ప్రదేశాలను కాపుఉద్యమ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, వాసిరెడ్డి ఏసుదాసు తదితరులు ఇప్పటికే నిర్ణయించి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ పాదయాత్ర జరిగే రోజుల్లో ప్రతీ ఇంటి నుండి కాపులు పిల్లాపాపలతో తరలివచ్చి ఆయనకు బాసటగా నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమం నేపధ్యంలో ఇంటిలిజెన్స్ వర్గాలు ఆయన రచించే ఉద్యమ వ్యూహాన్ని పసిగట్టేందుకు ఇప్పటి నుండి డేగకన్నువేసి ఆరాతీస్తున్నాయి. కాపుల రిజర్వేషన్ హక్కుల సాధన తప్ప తనకంటూ ఎలాంటి ఆలోచన లేవని తెగేసి చెబుతున్న ముద్రగడ అనుసరించే వ్యూహాన్ని అంచనా వేయటం ఎవరికీ సాధ్యం కాదన్నది గత సంఘటనలే రుజువుచేస్తున్నాయి. ఈనేపథ్యంలో కాపులను బిసిల్లో చేర్చాలని, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16 నుండి ముద్రగడ చేపట్టనున్న సత్యాగ్రహ పాదయాత్ర ఇప్పటి నుండే పెను సంచలనాలు సృష్టిస్తోంది. ఈ పాదయాత్రకు కాపులు ఉప్పెనలా తరలివచ్చి తమ సత్తాచాటనున్నారని, శాంతియుతంగా నిర్వహించే తమ పాదయాత్రపై ప్రభుత్వం కుయుక్తులు పన్నినా, భగ్నం చేయాలని చూసినా కాపుల ఆగ్రహాన్ని ఎదుర్కోక తప్పదని కాపుఉద్యమ యువ నేతలు నల్లా పవన్, త్సవటపల్లి నాగభూషణం హెచ్చరించారు. కాపులను బిసిల్లో చేర్చే వరకూ తమ ఉద్యమం ఆగదని వారన్నారు. పాదయాత్ర సమయంలో కాపుయువత అంతా ముద్రగడకు రక్షణ కవచంలా నిలిచి ఆయన్ని రక్షించుకుంటామని వారు స్పష్టంచేశారు. కాపుల ఐక్యత, ముద్రగడ మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఎవరు వ్యవహరించినా క్షమించేది లేదన్నారు. కాపుల మద్దతు అంతా ముద్రగడకేనని వారు పేర్కొన్నారు.