తూర్పుగోదావరి

‘కాపు’ సభ్యత్వాలకు రెడ్ కార్పెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 6: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దూకుడును దృష్టిలో ఉంచుకునే జిల్లాలో పెద్ద ఎత్తున సభ్యత్వాల సేకరణకు తెలుగుదేశం వ్యూహంతో సాగుతోంది. ముఖ్యంగా జిల్లాలో కాపు సామాజికవర్గం నుండి పెద్ద ఎత్తున సభ్యత్వాలను సేకరించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ముద్రగడ ఈ నెల 15 నుండి కోనసీమలో పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో, కాపు సామాజికవర్గానే్న లక్ష్యంగా చేసుకుని సభ్యత్వాలు సేకరించాల్సిందిగా సదరు నేతలకు ఆదేశాలు కూడా జారీ అయినట్టు సమాచారం! జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పను రాష్ట్ర సభ్యత్వ నమోదు కమిటీ కన్వీనర్‌గా నియమించడానికి వెనుక ప్రధాన కారణం కూడా ఇదేనని స్పష్టమవుతోంది. ముద్రగడ పేరు చెబితే ఆది నుండి అగ్గిమీద గుగ్గిలంగా మారే చినరాజప్పకు కన్వీనర్ పదవిని అప్పగించడం ద్వారా ఈ అంశంలోనూ కాపులకే పెద్దపీట వేశామన్న సంకేతాలను చంద్రబాబు ఇచ్చారు. కాపు సామాజికవర్గాన్ని ముద్రగడ వైపు వెళ్లకుండా కట్టడి చేసేందుకు ఉన్న ఉపాయాల్లో సభ్యత్వ నమోదు కూడా ఒకటని భావిస్తున్నారు. ముఖ్యంగా సభ్యత్వాలను సేకరించి, చేతులు దులుపుకోకుండా సభ్యులకు ఏదో ఒక మేలు చేశామన్న నమ్మకాన్ని కలిగించేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సభ్యత్వాలను సేకరిస్తున్నప్పటికీ, ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. కాపు సామాజికవర్గానికి కంచుకోటగా ఉన్న జిల్లాలో పెద్ద ఎత్తున సభ్యత్వాలను సేకరించడం ద్వారా తమ హవా చాటుకోవాలని అధినేత చంద్రబాబు యోచిస్తున్నారు. సభ్యత్వాలను సేకరిస్తూనే మరోవైపు జనచైతన్య యాత్రలను సమాంతరంగా నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. 100 రూపాయలను సభ్యత్వ రుసుంగా నిర్ణయించారు. సభ్యత్వం పొందిన వారికి బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, ప్రమాదవశాత్తూ మరణిస్తే 2 లక్షల ప్రమాద బీమా పరిహారం సభ్యుడి కుటుంబానికి లభిస్తుందంటూ ప్రచారం చేస్తున్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులందరినీ సభ్యత్వ నమోదులో భాగస్వాములు కావాలని అధినేత చంద్రబాబు ఆదేశించారు. ప్రతివొక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తమ తమ పరిధిలో తప్పనిసరిగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందేనని స్పష్టం చేసినట్టు తెలిసింది. కాపు సామాజికవర్గానికి టిడిపి ప్రభుత్వం ద్వారానే న్యాయం జరుగుతుందని, ముద్రగడ మోసపూరిత మాటలు నమ్మవద్దని కూడా కాపుల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు. కాపుల నుండి పెద్ద ఎత్తున సభ్యత్వాలను సేకరించడం ద్వారా కాపులందరూ పార్టీకి సానుకూలంగానే ఉన్నారన్న సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వాడుకోవాలని ఆశిస్తున్నారు.

ప్రశాంతంగా పోలీస్ కానిస్టేబుల్స్ పరీక్షలు
గండేపల్లి, నవంబర్ 6: మండలంలోని సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల్లో ఏర్పాటుచేసిన పది సెంటర్లలో ఆదివారం పోలీసు కానిస్టేబుల్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలకు జిల్లా నుండి మొత్తం 9 వేల మంది పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా, 8166 మంది హాజరైనట్టు విద్యా సంస్థల డైరెక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ కొనసాగాయి.