తూర్పుగోదావరి

బాణీ మార్చిన బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 19: తెలుగు తమ్ముళ్ల హడావిడి మధ్య రాజమహేంద్రవరంలో శనివారం సిఎం చంద్రబాబునాయుడు పర్యటన కోలాహలంగా సాగింది. నాలుగు బహిరంగ సభలు, ఆరు కార్యక్రమాలతో ఉదయం నుంచి రాత్రి వరకు పర్యటన బిజీ బిజీగా సాగింది. నిర్దేశిత సమయానికి అటూ ఇటూగా ఉదయం 9.40 గంటలకు రాజమహేంద్రవరం చేరుకున్న చంద్రబాబునాయుడు రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు గడిపారు. చంద్రబాబునాయుడు హాజరైన బహిరంగ సభలు, పర్యటన ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. ఈసారి చంద్రబాబునాయుడు తన బాణీ మార్చినట్టుగా కన్పించింది. పార్టీ కేడర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధమైనట్టుగా సమాయత్తం చేయడం కన్పించింది. కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కష్టపడితేనే గుర్తింపు వుంటుందని, మీరు మునిగిపోతే నేనూ మునిగిపోతానని అంటూ వేదికపై వున్న నాయకులకు చురకలు అంటించారు. వెయ్యి రూపాయల నోటు రద్దయిన తర్వాత చాలా ఉత్సాహం కన్పించినట్టుగా వైఖరి కన్పించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో దిశానిర్దేశం చేసిందని అన్నారు. ఎన్నికల్లో వెయ్యి నోట్ల పంపిణీకి అవకాశం లేకుండా పోయిన వైనం పట్ల ఆనందం కన్పించింది. నగర పరిధిలో స్టేడియం గ్రౌండ్స్‌లో జరిగిన డ్వాక్రా బహిరంగ సభకు స్వాగతం పలికేందుకు గోరంట్ల బుచ్చియ్య చౌదరి మైకులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా మహిళా నాయకులు మాట్లాడాలని సూచించారు. వాస్తవానికి ఈ సభకు ప్రోటోకాల్ మేరకు స్థానిక ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అధ్యక్షత వహించాల్సి వుంది. అయితే ఈ సభకు డిఆర్‌డిఎ అధికారులు స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం అందించలేదని తెలిసింది. అందుకే స్థానిక ఎమ్మెల్యే సభకు హాజరు కాలేదని తెలిసింది. జనచైతన్య యాత్ర బహిరంగ సభ నుంచి మొదలై కార్యకర్తల సభ, డ్వాక్రా మహిళల బహిరంగ సభ, దళిత, గిరిజన గర్జన మహాసభలోనూ ముఖ్యమంత్రి ప్రసంగించారు. రొటీన్‌కు భిన్నంగా నిదానంగా ప్రసంగించారు. ఎక్కువ సమయం వెచ్చించారు. సుమారు రెండు గంటల ఆలస్యంగా కార్యక్రమం జరిగింది. మొత్తం మీద జిల్లాకు ఎటువంటి వరాలు లేకుండా చంద్రబాబునాయుడు పర్యటన ముగించారు. శాటిలైట్ సిటీని మాత్రం రాష్ట్రంలోనే ఆదర్శ టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దుతానని రూరల్ ప్రాంతానికి వరాల జల్లు కురిపించారు.
ఆర్థిక అసమానతలు తొలగిస్తాం
కడియం, నవంబర్ 19: ఆర్థిక అసమానతలు తొలగినప్పుడే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి వీలుగా వారిలో నైపుణ్యాభివృద్ధికి అనేక ప్రణాళికలు తయారుచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 9 లక్షల మహిళా సమాఖ్యలు 90 లక్షల మంది సభ్యులతో అత్యంత శక్తిమంతంగా పనిచేస్తున్నాయన్నారు. ప్రతి మహిళా సగటున నెలకు రూ.10 వేలు సంపాదించేలా ఉపాధి కల్పనా కార్యక్రమం చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధంచేస్తున్నామన్నారు. అందుకు మహిళా సంఘాలు చొరవతో ముందుకు రావాలన్నారు. రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన డ్వాక్రా మహిళల సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు. డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు వెలుగు సిబ్బంది పాత్ర కీలకమన్నారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి వెలుగు సిబ్బంది కృషిచేస్తే, వారి కుటుంబాలకు అండగా తానుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. ఇప్పటికే వెలుగు సిబ్బంది జీతాలు 30 శాతం పెంచామన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు విస్తృత పరచడానికి డ్వాక్రా మహిళలే ఒక పెద్ద నెట్‌వర్క్‌గా పనిచేస్తారన్నారు. ఇప్పటికే మహిళా సంఘాలకు అనేక వ్యాపారాలు అప్పగించినట్టు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కంపోస్టు ఎరువుల తయారీ, మధ్యాహ్న భోజన పథకాలు, మరుగుదొడ్ల మెయిన్‌టినెన్స్, డిజిటల్ లిటరసీ వంటి కీలక పనులు అప్పగించగా, సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. రంపచోడవరానికి చెందిన కె వీరలక్ష్మి అనే మహిళ ఎల్‌ఇడి బల్బుల యూనిట్‌ను పెట్టి ఎంతో లాభాన్ని అర్జించించిందని ఆమెను ప్రశంసించారు. ఈ సందర్భంగా వీరలక్ష్మి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తన పనిలో సాధనబాధకాలను వివరించింది. తాను ఇంజనీరింగ్ చదువుకున్నానని, తన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలనే తలంపుతో 50 మంది సభ్యులతో ఎల్‌ఇడి బల్బుల యూనిట్ నెలకొల్పానని, అది విజయవంతమైందని, ఇప్పుడు తన వద్ద రూ.8 కోట్ల విలువైన ఆర్డర్లున్నాయని, అయితే అందుకు తగిన ఆర్థిక సదుపాయం అందుబాటులో లేక, బ్యాంకుల సహకారం సరిపోక వ్యాపారంలో వెనుకడుగు వేయాల్సి వస్తోందని ముఖ్యమంత్రికి వివరించింది. తాను కూలిపని కూడా చేసేదాన్నని, ఇప్పుడు ఈ వ్యాపారంలో ప్రభుత్వ యంత్రాంగం సహకారంతోనే ఎల్‌ఇడి బల్బుల యూనిట్‌ను నెలకొల్పగలిగానని భావోద్వేగంతో ముఖ్యమంత్రికి తెలిపింది. దీనిపై స్పందించిన సిఎం చంద్రబాబు తక్షణం ఆ గ్రూపునకు ఆర్థిక సహకారం అందించాలని, అందుకు అవసరమైన ష్యూరిటీని ప్రభుత్వం తరఫున ఇవ్వాలని సభా వేదికపై ఉన్న జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, మృణాళిని, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపి మురళీమోహన్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పిల్లి అనంతలక్ష్మి, గొల్లపల్లి సూర్యారావు, పెందుర్తి వెంకటేష్, బుచ్చి మహేశ్వరరావు, తోట త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

నవ్వుతూ... నవ్విస్తూ!

-సరదా సరదాగా సాగిన సిఎం పర్యటన
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, నవంబర్ 19: సిఎం చంద్రబాబునాయుడు రాజమహేంద్రవరం పర్యటనలో ఆద్యంతం చాలా ఉత్సాహంగా కనిపించారు.. అక్కడక్కడ సెటైర్లు వేశారు.. గతం కంటే భిన్నంగా నవ్వుతూ, నవ్విస్తూ కన్పించారు. శాటిలైట్‌లో జనచైతన్య యాత్ర బహిరంగ సభలో ప్రసంగాన్ని ముగిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకే మీ ఓట్లు అంటూ నినాదాలు చేశారు.. ఎన్నికలు జ్ఞాపకం వస్తున్నాయా.. అని నవ్వుతూ వెయ్యి నోటు కన్పిస్తుందా.. దాని జోలికి మాత్రం వెళ్ళకండి అంటూ వ్యాఖ్యానించారు. అంతకు ముందు కూడా మీ సెల్ ఫోన్‌లో టార్చిలైట్ ఆన్ చేయండి అంటూ అందరి చేత సెల్ ఫోన్‌లో టార్చిలైట్ వేయించారు.. మీ సెల్ ఫోన్‌లో టార్చిలైట్ కోసం బటన్ నొక్కినంత సులువుగా సెల్ నుంచే నగదు తీసుకునే విధంగా మీ అందరికీ ఆన్‌లైన్ అకౌంటెన్సీ నేర్పిస్తానన్నారు. చెరుకూరి కల్యాణ మండపంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కూడా చంద్రబాబునాయుడు చాలా సరదాగా మాట్లాడారు. కార్యకర్తలపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. మాటల సందర్భంలో ఇంటికొక సెల్ ఫోన్, వేరే వాళ్ళ కోసం మరో ఫోన్ వాడుతున్నారా అంటూ చమత్కరించడంతో సభలో పెద్ద పెట్టున నవ్వులు చిందాయి. మొత్తం మీద చంద్రబాబునాయుడు ఎన్నికల మూడ్‌లోకి వచ్చినట్టుగా కన్పించింది. కార్యకర్తల ఉత్సాహం మధ్య చంద్రబాబునాయుడు గతం కంటే అధికంగా నవ్వుతూ ఉత్సాహంగా గడిపారు. సుమారు రెండు గంటల ఆలస్యంగా కార్యక్రమం జరిగింది. సిఎం చంద్రబాబునాయుడు పాల్గొన్న బహిరంగ సభా ప్రాంగణాల వద్ద వివిధ వినతి పత్రాలు ఇచ్చేందుకు, వచ్చినవారి వినతి పత్రాలు స్వీకరించేందుకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీల్లో ముందుగానే వచ్చిన అర్జీదారులందరికీ కూర్చోబెట్టి వినతి పత్రాలు స్వీకరించేలా చర్యలు తీసుకున్నారు. ఈ గ్యాలరీకి ఒక ఆర్డీవో కేడర్ అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. చంద్రబాబు వెంట జిల్లాలోని అందరూ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఏడు ఆలయాల అభివృద్ధికి ప్రణాళిక:మంత్రి పైడికొండల
కడియం, నవంబర్ 19: రాష్ట్రంలో ఏడు ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. దివాన్‌చెరువులో నగర వనం కార్యక్రమం ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి స్థానిక విలేఖరులతో మాట్లాడారు. సింహాచలం, అన్నవరం, ద్రాక్షారామ, విజయవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు మాస్టర్‌ప్లాన్ తయారు చేశామని మంత్రి పైడికొండల పేర్కొన్నారు. ఆయా ఆలయాల్లో మరిన్ని మెరుగైన వౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధంచేశామన్నారు. దేవాలయాలకు సంబంధించి అన్ని వివరాలను వెబ్‌సైట్లలో పొందుపరిచినట్టు చెప్పారు. దేవాలయ సిబ్బందికి హెల్త్‌కార్డులు అందిస్తామని తెలిపారు. సిబ్బంది జీతాలను ఒకేచోట తీసుకునేలా కసరత్తు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఉన్నారు.
నల్ల కుబేరుల్లో అధికారులు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, నవంబర్ 18: పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడు చిల్లర సమస్యతో బాధపడుతుంటే, మరోవైపు నల్లకుబేరులు మాత్రం తమ వద్ద మూలుగుతున్న బ్లాక్ మనీని మార్చుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. విశేషమేమిటంటే నల్లకుబేరుల జాబితాలో జిల్లాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఉండటం! జిల్లాలో టాప్ టెన్ అధికారుల్లో నలుగురు ఉన్నతాధికారులు కోట్ల మొత్తంలో బ్లాక్‌మనీ కలిగివున్నారని, సామాన్య ప్రజల మాట దేవుడెరుగు ఇపుడు మా పరిస్థితి ఎవరితో చెప్పుకోవాలి? అని సదరు అధికారులు దిగాలు పడినట్టు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లాకు చెందిన రెవెన్యూ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతోంది. ఈ నెల 8వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసింది. దురదృష్టవశాత్తు అంతకు రెండు రోజులు ముందు జిల్లాకు చెందిన ఇరువురు ఉన్నతాధికారులకు ఓ కార్పొరేట్ సంస్థ చెరొక మూడుకోట్ల రూపాయలను నజరానాగా సమర్పించిందని, తెల్లవారే సరికి తేరుకోలేని రీతిలో పెద్దనోట్లను ప్రభుత్వం రద్దుచేసిందని, ఈ పరిణామం సదరు అధికారులకు దిమ్మ తిరిగేలా చేసిందని సాక్షాత్తూ ఓ అధికారి ఆంధ్రభూమి ప్రతినిధి వద్ద వ్యాఖ్యానించారు!
అలాగే జిల్లా కేంద్రం కాకినాడలోనే ఓ ప్రభుత్వ శాఖను దీర్ఘకాలంగా అంటి పెట్టుకుని ఉన్న జిల్లాస్థాయి అధికారి కూడా బ్లాక్‌మనీని ఇటు ఇంట్లో ఉంచుకోలేక, అటు మార్చుకోలేక ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం! ఇతడు కాకుండా మరో రెండు ముఖ్య శాఖల అధికారులు ఇటీవలి కాలంలో భారీగా సంపాదించిన కరెన్సీని ఏ విధంగా వైట్ చేసుకోవాలో తెలియక గందరగోళంలో పడినట్టు తెలిసింది. సరిగ్గా ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వస్తుండటం సదరు అధికారులకు గోరు చుట్టుపై రోకలి పోటు చందాన పరిణమించింది. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తున్నారంటే కనీసం నాలుగైదు రోజుల ముందుగా పర్యటన విజయవంతానికి సంబంధించిన పనుల్లో ప్రభుత్వ శాఖల అధికారులు తలమునకలవుతారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కరెన్సీని మార్చుకునే తీరిక, అవకాశం లేక సదరు అధికారులు తీవ్రంగా మధనపడుతున్నట్టు తెలిసింది. అలాగే జిల్లాలోని వివిధ శాఖల్లో దీర్ఘకాలంగా ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు అర్ధంతరంగా పెద్ద నోట్లు రద్దుకావడంతో డీలా పడ్డారు. అయితే చాలామంది తెలివైన అధికారులు తాము సంపాదించిన నగదుతో ఎప్పటికపుడు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యతనిచ్చారు. ఇలా బంగారం, నగలను కొనుగోలు చేసిన అధికారులు మాత్రం ప్రశాంతంగానే నిద్రపోతున్నారు. ముఖ్యంగా కొందరు ముఖ్య అధికారులు ఇటీవలి కాలంలో జిల్లా కేంద్రం కాకినాడ, ఎడిబి రోడ్డు తదితర ప్రాంతాల్లో కోట్ల రూపాయలు వెచ్చించి పొలాలు, స్థలాలను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. సదరు అధికారులు కూడా బినామీ పేర్లపై ఈ ఆస్తులను కొనుగోలు చేశారు. బినామీల చట్టాన్ని త్వరలో కేంద్ర ప్రభుత్వం ఝుళిపించనున్న నేపథ్యంలో ఇక్కడ కూడా చిక్కులు తప్పవన్న భయం సదరు అధికారులను వెంటాడుతోంది.
మధురపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘనస్వాగతం
కోరుకొండ, నవంబర్ 19: జిల్లా పర్యటన సందర్భంగా మధురపూడి విమానాశ్రయానికి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి ఘనస్వాగతం లభించింది. విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మధురపూడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాహేశ్వరరావు, రాజమండ్రి ఎంపి మాగంటి మురళీమోహన్, కాకినాడ ఎంపి తోట నరసింహం, జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, జెసి సత్యనారాయణ, రాజమండ్రి సబ్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్, ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేష్, ఆకుల సత్యనారాయణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వర్మ, గోర్లంట బుచ్చియ్య చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్ పంతం రజనీశేషసాయి, మాజీ ఎమ్మెల్యే సత్యానందరావు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.