తూర్పుగోదావరి

మహిళా సంఘాలకు గేలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 20: నల్లధనాన్ని మార్చుకునే ఎత్తుగడల్లో భాగంగా జిల్లాలోని మహిళా సంఘాలకు గేలం వేసే పనిలో కొందరు అధికారులు తలమునకలు కావడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. ముఖ్యంగా జిల్లాలోని మహిళా సంఘాల కార్యకలాపాలను పర్యవేక్షించే శాఖకు చెందిన కొందరు అధికారులు ఈ పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సదరు అధికారులు ఈ విషయంలో చక్రం తిప్పుతూ, నల్ల కుబేరులుగా మారిన పెద్ద అధికారులకు భరోసా ఇచ్చినట్టు సమాచారం! జిల్లాలో పొలిటీషియన్లు, బడా బాబులు, కాంట్రాక్టర్ల మాదిరిగా కొందరు అధికారులు సైతం బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకునేందుకు విశ్వప్రయత్నాలు సాగిస్తున్న వైనంపై ఆదివారం ఆంధ్రభూమిలో ప్రచురితమైన కథనంతో సంబంధిత వర్గాల్లో కలకలం మొదలయ్యింది. జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఇలా ముగిసిందో లేదో అలా నోట్ల మార్పిడిపై సదరు అధికారులు దృష్టి సారించారు. కోట్ల మొత్తంలో బ్లాక్‌మనీని కలిగివున్న అధికారులు వేర్వేరు మార్గాల్లో నోట్ల మార్పిడి పనిలో పడ్డారు. అయితే ధనిక అధికారులకు నమ్మకస్తులైన కొందరు అధికారులు శక్తివంచన లేకుండా నోట్ల మార్పిడికి రంగం సిద్ధం చేసినట్టు ఆ శాఖకు చెందిన ఉద్యోగులే బాహాటంగా చెప్పకుంటున్నారు. జిల్లాలో వేలాదిగా మహిళా గ్రూపులున్నాయి. మహిళల పేరిట లక్షల సంఖ్యలో బ్యాంకు ఖాతాలున్నాయి. కొత్తగా గ్రూపులో చేరిన సభ్యులకు జన్‌ధన్ పేరుతో ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఖాతాలను తెరిపించారు. ఈ నెట్‌వర్క్ ప్రస్తుతం తమకు అనుకూలిస్తుందని సదరు ధనిక అధికారులు ఆశతో ఉన్నారు. చాలా కాలంగా జిల్లాలో పాతుకుపోయి, ధనిక అధికారులకు నమ్మిన బంటుగా మారిన ఓ అధికారి సహా మరికొందరు ఈ బాధ్యతలను భుజానికెత్తుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. జన్‌ధన్ ఖాతాలతో పాటు మహిళల ఖాతాలను సేకరించి, ఆయా ఖాతాల్లో కనీసం రెండు లక్షలకు తగ్గకుండా జమ చేసేందుకు రంగం సిద్ధమైనట్టు భోగట్టా! ఈ విధంగా ధనికాధికారుల డబ్బును మహిళల ఖాతాలకు బదలాయించి, పరిస్థితులు సర్దుమణిగిన పిమ్మట సొమ్మును విత్‌డ్రా చేసుకునేలా తగిన హామీతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదంతా అధికారులు నేరుగా రంగంలోకి దిగకుండా, మధ్యవర్తుల ఆధ్వర్యంలోనే జరుగుతున్నట్టు సమాచారం! మరోవైపు కొందరు మహిళలు ఇందుకు సహకరించడం లేదని తెలిసింది. అర్ధంతరంగా తమ ఖాతాల్లో లక్షలు వచ్చి చేరితే తర్వాత ఐటి శాఖ నుండి ఇబ్బందులు ఎదురవుతాయన్న భయంతో కొందరు సున్నితంగా తిరస్కరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

గిట్టుబాటు ధర లేక బెండ తోట నేలమట్టం
సీతానగరం, నవంబర్ 20: ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేయడంతో ధనికుల పరిస్థితి ఎలా ఉన్నా మధ్యతరగతి వారు, పూట కష్టపడితే కానీ కడుపు నిండని కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటివరకు కూరగాయలు పండించిన రైతులకు గిట్టుబాటు ధర లభించేది. అయితే పెద్దనోట్ల రద్దుతో చిల్లర దొరకక, మార్కెట్‌లో రైతుకు గిట్టుబాటు లభించక దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాడు. ఆదివారం సీతానగరం వెలంపేటకు చెందిన కొండ్రపు ముత్యాలరావు తాను వేసిన బెండ తోటలో మొదటిసారి కోసిన పంటకు పది కిలోలు 30 రూపాయలు పలికింది. వచ్చిన డబ్బులు కూలీలకు కూడా సరిపోకపోవడంతో రెండోసారి కోత కోయకుండానే పంటను నేలమట్టం చేశాడు. ముత్యాలరావు ఎకరంన్నర భూమిని 75 వేల రూపాయలకు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు. అయితే పెద్దనోట్ల రద్దుతో మార్కెట్‌లో బెండ ధర పడిపోయింది. లక్ష రూపాయల మేర తనకు నష్టం వాటిల్లిందని వాపోతున్నాడు. తనలాంటి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాడు.

కవులకే వనె్న తెచ్చిన మహనీయుడు ఆవంత్స
డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్
పిఠాపురం, నవంబర్ 20: పీడిత వర్గాలకు ఆశాజ్యోతిగా, కవులకే వనె్న తెచ్చిన మహానీయుడు ఆవంత్స సోమసుందర్ అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ఆదివారం పిఠాపురం చెలికాని భావనరావు సభాసదన్‌లో సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ వెంట్రావు అధ్యక్షతన జరిగిన సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. యువ రచయితలను ప్రోత్సహించడం, తన ఆస్తులను సైతం అమ్ముకుని కవితాలోకానికి చేసిన సేవలు మహనీయుడు సోమసుందర్ అని ఆయన కొనియాడారు. ఆయన ఈ దశాబ్దపు కవితాలోకానికి దీపస్తంభం అని, ఆయన వెలుగులో ఎంతో కవులుగా పేరుగాంచారన్నారు. సోమసుందర్ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ఆయన పేరున కుటుంబ సభ్యులు చేస్తున్న కవితా పురస్కారాలు అభినందనీయమన్నారు. పిఠాపురం కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్పతనం సోమసుందర్‌కే దక్కుతుందని, విజయవాడ, పిఠాపురంలో సోమసుందర్ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన రాసిన పుస్తకాలను విశ్వవిద్యాలయాలలో అందుబాటులో ఉండేలా చేస్తామని చెప్పారు. సోమసుందర్ కవితా పురస్కారాలను ఎలనాగ, గంటేడ గౌరునాయుడు, హెచ్‌ఎస్‌వికె రంగారావు, ఎవిఎస్ జగన్నాథశర్మ, డాక్టర్ ఆలూరి విజయలక్ష్మిలకు అందజేశారు. కార్యక్రమంలో కవులు స్టాలిన్, గుజరావు సీతారామస్వామి, అనురాధ, కత్తెం సుబ్బారావు, యనమండ్ర సూర్యనారాయణ, కొండేపూడి శంకర్రావు, సోమసుందర్ కుమారులు శిశికాంత్ శాతకర్ణి, విజయశేషేంద్ర శాతకర్ణి తదితరులు పాల్గొన్నారు.
రూ.63.70 లక్షల గంజాయి స్వాధీనం
*గంజాయి స్మగ్లింగ్‌లో సిఐ, కానిస్టేబుల్ హస్తం*ఎవరినీ ఉపేక్షించం :ఒఎస్‌డి ఫకీరప్ప
చింతూరు, నవంబర్ 20: అక్రమాలకు, అవినీతికి పాల్పడినా, సహకరించినా వారిని ఉపేక్షించేదిలేదని చింతూరు ఒఎస్‌డి ఫకీరప్ప అన్నారు. శనివారం మండలంలోని రత్నాపురం జంక్షన్ వద్ద పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఒఎస్‌డి ఫకీరప్ప స్థానిక పోలీసుస్టేషన్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి వివరాలను వెల్లడించారు. ఈ వివరాలిలావున్నాయి. ఒడిస్సా రాష్ట్రం నుంచి తెలంగాణకు లారీలో భారీగా గంజాయి తరలిస్తున్నట్టు చింతూరు సిఐ దుర్గాప్రసాద్, ఎస్సై శ్రీనివాస్‌కుమార్‌లకు సమాచారం అందింది. దీనితో రత్నాపురం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీని పోలీసులు చేపట్టారు. ఓ లారీని తనిఖీ చేయగా, అందులో పశువుల దాణా మూటల కింద గంజాయి మూటలను పోలీసులు గుర్తించారు. మొత్తంగా 2 వేల 125 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయిని తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. పట్టుకున్న గంజాయి విలువ 63 లక్షల 70 వేల రూపాయలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అలాగే నిందితుల వద్ద 4,500 రూపాయల నగదు, తొమ్మిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఒఎస్‌డి ఫకీరప్ప తెలిపారు. పట్టుబడ్డవారిలో పిల్లి భద్రారావు, చల్లకొండల ప్రేమ్‌చంద్, బుక్య బన్సాలీ, షేక్ గౌస్‌మియా, గెద్దాడ గంగాజలం, శివలంక త్రిమూరస్తులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
గంజాయి స్మగ్లింగ్‌లో పోలీసుల హస్తం
ఈ గంజాయి స్మగ్లింగ్‌లో మారేడుమిల్లి సిఐ అంకబాబు, కానిస్టేబుల్ సత్యనారాయణ హస్తమున్నట్టు పట్టుబడ్డ గంజాయి స్మగ్లర్లు పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు. దీనితో సిఐ అంకబాబు, కానిస్టేబుల్ సత్యనారాయణపై కేసు నమోదుచేసినట్టు ఒఎస్‌డి ఫకీరప్ప పేర్కొన్నారు. సిఐ అంకబాబును విఆర్‌కు పంపినట్టు, కానిస్టేబుల్ సత్యనారాయణను సస్పెండ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఫకీరప్ప తెలిపారు.

చిన్న ఆసుపత్రుల నిర్వహణకు సహకరించాలి
జిఒ నెం. 11 అమలుకు చర్యలు తీసుకోవాలి:ఐఎంఎ నూతన అధ్యక్షుడు డాక్టర్ గంగాధరరావు

అమలాపురం, నవంబర్ 20: రాష్ట్రంలోని చిన్న ఆసుపత్రుల నిర్వహణకు ప్రభుత్వం సహకరిస్తే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని ఐఎంఎ నూతన అధ్యక్షుడు పి గంగాధరరావు స్పష్టం చేశారు. అమలాపురం కిమ్స్ అసుపత్రిలో గత రెండు రోజులుగా జరిగిన ఐఎంఎ ఎపికాన్ 2016 రాష్టస్థ్రాయి సదస్సులో చర్చించిన విషయాలను ఆదివారం స్థానిక విలేఖరులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 80 శాతం చిన్న ఆసుపత్రుల ద్వారానే వైద్యసేవలు అందిస్తున్నామని, అయితే ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నిబంధనల కారణంగా వాటి మనుగడ ప్రశ్నార్థకం కానుందని, దీనిపై పునరాలోచన చేయాలని కోరారు. గత 30, 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఆసుపత్రులకు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని ఉత్తర్వులు జారీ చేయడం సమంజసం కాదన్నారు. అటువంటి ఆసుపత్రుల చుట్టూ ఫైర్ వాహనం తిరిగే విధంగా రహదారులు ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించి వెసులుబాటు కల్పించాలని కోరారు. పోలీసు అధికారులు వైద్య చట్టాలపై అవగాహన పెంచుకొని వైద్యుల పట్ల మంచి భావనతో వ్యవహరించాలని కోరారు. వైద్యులపై దాడుల నివారణకు గత ప్రభుత్వం 2008లో జివో నెం. 11ను జారీ చేసిందని, ఆ జీవో ప్రకారం వైద్యులపై దాడులకు పాల్పడితే నాన్ బెయిల్‌బుల్ కేసులుగా గుర్తిస్తారని, ఈ అంశాన్ని ప్రతీ ఆసుపత్రి వద్ద ప్రజలకు తెలిసేలా బోర్డులు ఏర్పాటుచేయాలని నిర్ణయించామన్నారు. సమాజం వైద్యుల బాగుకోసం కోరితే, వైద్యులు సామాజిక సేవకు నిరంతరం సిద్ధంగా ఉంటారన్నారు. అయితే ఇటీవల కాలంలో ప్రతి చిన్న విషయానికి రోగుల బంధువులు వైద్యులపై దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురిచేయడం పట్ల గంగాధరరావు ఆవేధన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లా ఎస్పీలకు వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ఐఎంఎ ద్వారా వివరించేందుకు సదస్సులో నిర్ణయించామన్నారు. ప్రధాన మంత్రి మోదీ పేద ప్రజల వైద్యంకోసం ప్రవేశపెట్టిన స్వస్థయోజన పథకాన్ని సదుపాయాలున్న చిన్న ఆసుపత్రులకు కూడా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. గత రెండు రోజులుగా కిమ్స్ కళాశాల యాజమాన్యం ఇచ్చిన ఆతిధ్యం పట్ల ఐఎమ్‌ఎ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. కోనసీమలో హెపటైటిస్-సి వ్యాధి తీవ్రత అధికంగా ఉందని, దీనిపై శ్రద్ధ వహించకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని గంగాధరరావు ఆందోళన వ్యక్తం చేశారు. అంతకు ముందు ఐఎమ్‌ఎ నూతన కార్యవర్గాన్ని ఎనుకున్నారు. ఐఎమ్‌ఎ రాష్ట్ర అధ్యక్షుడుగా పి గంగాధరరావు (గుడివాడ), కార్యదర్శిగా విశాఖపట్నానికి చెందిన కరుణామూర్తి, ఉపాధ్యక్షులుగా ఎంవి విజయశేఖర్, వెంకటేశ్వర్లు, నందకిషోర్, సంయుక్త కార్యదర్శులుగా సురేష్‌బాబు, మద్దేశ్వరరావు, రవికృష్ణ ఎన్నికయ్యారు. అలాగే వివిధ అనుబంధ కమిటీలను కూడా ఈ సదస్సులో ఎంపిక చేసినట్టు గంగాధరరావు తెలిపారు.
ఎట్టకేలకు మూతబడిన బ్యాంకులు
కాకినాడ సిటీ, నవంబర్ 20: ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రకటించిన అనంతరం బ్యాంకులు నిరంతరాయంగా పనిచేశాయి. గత రెండవ శనివారం, ఆదివారం ఇతర సెలవురోజుల్లో సైతం బ్యాంకు సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తూ ప్రజల నగదు మార్పిడి, డిపాజిట్ల స్వీకరణలో కీలకపాత్రను పోషించారు. దీంతో బ్యాంకులు నిరంతరాయంగా పనిచేయగా ఎట్టకేలకు ఈ ఆదివారం బ్యాంకులు మూతపడ్డాయి. గత మూడు రోజుల నుండి అన్ని బ్యాంకులు తమ వద్ద నగదు లేదంటూ బోర్డులు పెట్టడం, ఆదివారం బ్యాంకులు మూత పడడంతో ప్రజలు ఈ ఆదివారం తమ వద్ద ఉన్న పాత పెద్ద నోట్లను మార్చుకునే అవకాశం లేక ఇబ్బందులు పడ్డారు. నగదు సరఫరా జరిగితేనే పాత నోట్లను మార్పిడి చేయగలమని బ్యాంకులు ఇప్పటికే ప్రకటించడంతో సోమవారం అయినా తమకు నగదు దొరుకుతుందా లేదా అనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు. కాకినాడలో ఉన్న వివిధ బ్యాంకుల ఎటిఎంలు చాలావరకు నో మనీ బోర్డులు పెట్టి మూతపడి దర్శనమిచ్చాయి. కొన్ని ఎటిఎంలు మాత్రమే పనిచేయడంతో అక్కడ ప్రజలు డబ్బుకోసం గంటల తరబడి క్యూలో నిల్చుని నగదు కోసం వేచి ఉండాల్సి వచ్చింది. ఈ నగదు కష్టాలు ఇంకెంత కాలం ఉంటాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.
పెద్ద నోట్ల రద్దుతో అరటి ధరలు పతనం
రావులపాలెం, నవంబర్ 20: కార్తీక మాసంలో జోరుమీద ఉండాల్సిన అరటి ధరలు ఎగుమతులు పెద్ద నోట్ల రద్దుతో కుదేలయ్యాయి. ఇప్పటికే వరి కోతలతోపాటు దిగుబడి తగ్గి మార్కెట్టులో ఎగుమతులు తగ్గుముఖం పట్టగా తాజాగా నోట్ల రద్దు ప్రభావం అరటి వ్యాపారంపై పడింది. రావులపాలెం అరటి మార్కెట్టు యార్డులో సీజన్లో సుమారు 25 లారీల అరటి గెలలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. తద్వారా యార్డులో సుమారు రూ.25 లక్షల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అలాగే వందలాది మంది కూలీలు ఉపాధి పొందుతుంటారు. అలాగే కోనసీమతోపాటు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎంతోమంది రైతులు అరటి గెలల అమ్మకాల నిమిత్తం ఈ యార్డుకు వస్తుంటారు. కార్తీక మాసంలో ధరలు ఊపందుకుని లాభాలు చవి చూడవచ్చునని రైతులు ఎంతగానో ఆశించారు. కార్తీక మాసం ముందు దానికి తగినట్టుగానే ధరలు ఊపందుకున్నాయి. అయితే ప్రధాని మోదీ చేసిన పెద్ద నోట్ల రద్దు ప్రకటన వీరి ఆశలపై నీళ్లు చల్లింది. లక్షలాది రూపాయల వ్యాపారం కావడంతో పెద్ద నోట్ల ద్వారానే లావాదేవీలు జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం గత పది రోజులుగా రూ.500, వెయ్యి నోట్ల రద్దుతో వ్యాపారులు, రైతులు అయోమయానికి లోనయ్యారు. అయితే వ్యాపారులు, రైతుల మధ్య ఉన్న సంబంధాలు, సహకారం నేపథ్యంలో ప్రస్తుతానికి పాత నోట్ల ద్వారానే లావాదేవీలు సాగిస్తున్నారు. గెలలు అమ్మగా వచ్చిన నోట్లను రైతులు అష్టకష్టాలు పడి బ్యాంకుల్లో మార్చుకుంటున్నారు. ఈ ఇబ్బందులు పడలేని రైతులు తాత్కాలికంగా అరటి గెలల కోతలు నిలిపివేస్తున్నారు. దీంతో సుమారు 30శాతం గెలల విక్రయాలు తగ్గాయి. ప్రస్తుతం ఇక్కడ నుండి సుమారు 15 లారీల సరుకు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. దీంతో వ్యాపారం నిత్యం రూ.15లక్షలకు తగ్గుముఖం పట్టినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఎగుమతి, ప్యాకింగ్ కూలీలకు సైకిళ్లు, మోటార్ సైకిళ్లపై అరటి గెలలు తరలించే కూలీలకు కూలీగా రూ.500ల నోట్లే ఇస్తుండడంతో వారూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల వద్ద వాటిని మార్చుకునేందుకు గంటల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోంది. వ్యాపార సంస్థల వద్ద వాటిని తిరస్కరిస్తున్నారు. కొందరైతే రూ.50లు కమీషన్‌గా తీసుకుని సరుకులు ఇస్తున్నారని కూలీలు వాపోతున్నారు. కొద్ది రోజుల్లో పరిస్థితి చక్కబడి మార్కెట్లో ధరలు ఊపందుకుంటాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ద్రాక్షారామ ఆలయాన్ని సందర్శించిన ప్రముఖులు
రామచంద్రపురం, నవంబర్ 20: ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం పలువురు ప్రముఖులు దంపతయుక్తంగా దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పెండ్యాల వెంకట చలపతిరావు నేతృత్వంలో అర్చకులు సందర్శనకు వచ్చిన ప్రముఖులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహింపచేశారు. ఆలయ ప్రసాదాన్ని, జ్ఞాపికలను వారికి అందించారు. బేడామండపంలో వేద పండితులు, స్వస్తివాచకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ దర్శనం చేసుకున్న ప్రముఖుల్లో సిబిసిఐడి న్యాయమూర్తి శివశంకర్, రాష్ట్ర ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ టి శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. ఇంకా పలువురు ప్రముఖులు, అధికారులు ఆదివారం ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇదే విధంగా పంచారామ క్షేత్ర దర్శిని పేరిట రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి స్వామివార్లను, అమ్మవార్లను సేవించుకున్నారు.
దత్త అవధూత ఇకలేరు
గోపాల్‌బాబా హఠాన్మరణం
పిఠాపురం, నవంబర్ 20: దత్త అవధూత, శ్రీక్షేత్ర ఆశ్రమ పీఠాధిపతి భగవాన్ శ్రీ గోపాల్‌బాబా ఆదివారం హఠాన్మరణం పొందారు. పుట్టు పూర్వోత్తరాలు తెలియని గోపాల్‌బాబా సుమారు పదేళ్లపాటు భక్తులకు బాబాగా దర్శనమిచ్చారు. శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థలం కావడంతో గోపాల్ బాబా ఆధ్యాత్మిక కేంద్రాన్ని పిఠాపురంలో ఏర్పాటు చేసుకుని తన ఆశ్రమం ద్వారా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆశ్రమంలో ఉచిత విద్యాలయం, గోసంరక్షణ, విశేష దినాల్లో భారీ అన్నదానాలు నిర్వహించారు. గోపాల్ బాబా 2006 సంవత్సరం నవంబర్ 14న పిఠాపురంలో శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకుని భక్తులకు అవధూతగా దర్శనమిస్తూ వస్తున్నారు. ఆయన పరమపదించిన విషయం తెలిసి చాలామంది భక్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఆశ్రమానికి తరచూ మహారాష్ట్ర భక్తులు తాకిడి ఎక్కువగా ఉండేది. బాడ్మింటన్ పోటీల్లో పతకం సాధించి దేశానికి వనె్న తెచ్చిన పివి సింధు తన కోచ్ పుల్లెల గోపీచంద్‌తో గోపాల్ బాబా ఆశ్రమానికి వచ్చి ఆశీస్సులు పొంది విజయం సాధించటం అందరికీ విదితమే. సింధు చాలాసార్లు గోపాల్‌బాబా దర్శనానికి వచ్చినట్టు ఆశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు.