తూర్పుగోదావరి

కూపీ లాగుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 6: జన్‌ధన్ ఖాతాల పూర్వాపరాల కూపీలాగే పనిలో ఆదాయ పన్ను (ఐటి) శాఖ అధికారులున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం బ్యాంకర్లవద్ద గల జన్‌ధన్ ఖాతాదారుల డేటాను సేకరించే పనిలో వారున్నట్టు తెలిసింది. దీంతో బినామీల్లో సునామీ సుడులు తిరుగుతోంది. గత నాలుగు వారాలుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జన్‌ధన్ ఖాతాల్లోకి బడా బాబుల సొమ్మొచ్చి పడినట్టు రూఢీ అయ్యింది. అందుకే ప్రధాని నరేంద్రమోదీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జన్‌ధన్ ఖాతాల్లో బడాబాబులు వేసిన సొమ్మంతా మీకే చెందుతుంది2 అంటూ మోదీ పేదలనుద్దేశించి అన్న మాటలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ఐటి శాఖ జిల్లాలోని జన్‌ధన్ ఖాతాలపై దృష్టిసారించింది. ఈతరహా ఖాతాలు తెరిచి నెలలు గడుస్తున్నా నిధులు లేకపోగా, పెద్ద నోట్ల రద్దు అనంతరం అమాంతం లక్షలు వచ్చిపడటంతో ఆ ఖాతాల పూర్వాపరాలను వెలికితీసే పనిలో సంబంధిత శాఖల అధికారులు తలమునకలయ్యారు. ఒక ఖాతాలో రెండున్నర లక్షల వరకు ఉండవచ్చనే నిబంధన ఉండటంతో బినామీలు ఆయా ఖాతాలకు రెండున్నర లక్షల వరకు ఆదరా బాదరాగా జమచేశారు. ఇక్కడే అసలు కిటుకు దాగివున్నట్టు స్పష్టమవుతోంది. ఒక పేద కుటుంబంలో ముగ్గురు లేక నలుగురికి బ్యాంకు ఖాతాలుంటే ఆ నలుగురి పేరున ఒక్కొక్కరికి రెండున్నర లక్షల వంతున ఉన్న పక్షంలో కుటుంబం మొత్తంమీద ఉన్న ఆర్ధిక లావాదేవీల ఆధారంగా చర్యలుంటాయని తెలుస్తోంది. ఒక వ్యక్తికి రెండు లేక మూడు బ్యాంకుల్లో అకౌంట్లున్న పక్షంలో అన్ని అకౌంట్లలో ఉన్న మొత్తాన్ని కూడా లెక్కవేస్తే వచ్చే మొత్తం నిర్దేశించిన మొత్తానికి మించివున్నా ఐటి అధికారులు నోటీసులు జారీచేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అలాగే అర్ధంతరంగా జన్‌ధన్ ఖాతాల్లో వచ్చిపడ్డ నగదు ఏ విధంగా సమకూరిందో తగిన ఆధారాలు చూపాల్సిందిగా నోటీసులు పంపేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పేరున ఒకే సమయంలో లక్షలు వచ్చిపడినట్టు ఐటి శాఖ గమనించింది. జిల్లాకు చెందిన కొందరు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగుల పేరున రెండు లక్షల వంతున ఇటీవల డిపాజిట్లు చేసిన వైనంపై కూడా ఐటి అధికారులు దృష్టిసారించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ కార్పొరేట్ సంస్థ యజమాని, మాజీ ప్రజాప్రతినిధి తమ సంస్థకు చెందిన వందలాది మంది ఉద్యోగుల ఖాతాల్లోకి రెండు లక్షల వంతున నల్లధనాన్ని డిపాజిట్ చేసినట్టు కూడా సంబంధిత అధికారులు గమనించారు.
ఇదిలావుండగా గడువు తేదీ డిసెంబరు 31వ తేదీలోగా నల్లధనాన్ని మార్చుకునేందుకు జిల్లాకు చెందిన బడాబాబులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వడ్డీ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు నల్లధనాన్ని పెద్ద ఎత్తున ఇతర జిల్లాలకు తరలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ధార్మిక ఆందోళనలో ఉద్రిక్తత

రాజమహేంద్రవరం, డిసెంబర్ 6: రాజమహేంద్రవరంలోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆర్జేసీ కార్యాలయం ఎదుట మంగళవారం ధార్మికవాదుల ఆందోళన ఘర్షణకు దారితీసింది. ఒక కానిస్టేబుల్‌కు గాయం కాగా, చంద్రవౌళి అనే ఆందోళనకారుడు స్పృహకోల్పోయాడు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎసి రమేష్, ఇఒ, ఇనస్పెక్టర్, మరో ఉద్యోగి తీవ్ర స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారని, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ రక్షా సమితి, సాధు సంఘాలు, ధార్మిక సమితుల ప్రతినిధులు ఆర్జేసీ కార్యాలయం ఎదుట మంగళవారం పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. చాలాసేపు కార్యాలయం ముందు బైఠాయించిన ఆందోళనకారులు ఒక్కసారిగా తలుపులు తోసుకుని లోనికి వెళ్లడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వారిని నిలువరించడానికి పోలీసులు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. ఆందోళనకారుల్లో ఒకరు ఎస్‌ఐపై దురుసుగా ప్రవర్తించడంతో అడ్డువచ్చిన కానిస్టేబుల్ వెంకటేశ్వరరావుకు తీవ్రగాయమై చెవి నుంచి రక్తస్రావం అయింది. ఆసమయంలో అక్కడకు చేరుకున్న డిఎస్పీ కులశేఖర్ ఆందోళనకారులతో చర్చలు జరపడానికి ఉన్నతాధికారులతో సంప్రదించేందుకు ప్రయత్నించారు. ఆక్రమంలో ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి, ఆందోళనకారులను గేటు బయటవరకు చెదరగొట్టారు. ఈక్రమంలో దెందులూరుకు చెందిన చంద్రవౌళి అనే ధార్మికవాది స్పృహతప్పి పడిపోవడంతో అతడిని, గాయపడిన కానిస్టేబుల్‌ను హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డిఎస్పీ కులశేఖర్ హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర అధ్యక్షుడు చేదులూరి గవరయ్య, ఆర్జేసీ ఆజాద్‌తో ఫోన్‌లో చర్చలు జరిపి, సమస్య పరిష్కారానికి శుక్రవారం సమావేశమయ్యేలా హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరుని రథోత్సవం
బిక్కవోలు, డిసెంబర్ 6: బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి వేడుకలలో భాగంగా మంగళవారం స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కోలాట భజనలు, బ్యాండు మేళాలు, మంగళవాయిద్యాలు నడుమ స్వామివారి రథోత్సవం సాగింది. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి మంగళహారతులు పట్టారు. రాత్రి తొమ్మిది గంటలకు డ్యాన్స్ షో జరిగింది. కాగా సోమవారం రాత్రి స్వామివారి గ్రామోత్సవం బ్యాండ్ మేళాలు, కోయ డ్యాన్సులు, గరగ నృత్యాలతో కోలాహలంగా సాగింది. అఘోరాల నృత్యం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అనంతరం రాత్రి 11గంటలకు ప్రారంభమైన బాణాసంచా పోటీలను తిలకించడానికి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది జనం చేరుకోవడంతో హైస్కూల్ గ్రౌండ్ జనసంద్రంగా మారింది.
త్వరలో ఆరువేల కానిస్టేబుళ్ల భర్తీ

ఆత్రేయపురం, డిసెంబర్ 6: రాష్ట్రంలో ఆరువేల పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకానికి చర్యలు చేపడుతున్నట్లు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే పోలీసు సిబ్బంది నియామకాలకు చర్యలు తీసుకుంటోందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో వైద్యానికి పెద్ద పీట వేస్తున్నారని, ఆరోగ్యశ్రీ కన్నా మెరుగైన వైద్యాన్ని పేదలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్ వైద్య సేవలను విస్తృతం చేసామన్నారు. అలాగే సిఎం రిలీఫ్ పంఢ్ నుండి నిరుపేదల వైద్యానికి సాయం అందిస్తున్నామన్నారు. ఇసుక మాఫియా, భూకబ్జా దారులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు రాష్ట్రంలో మూడు లక్షల వరకూ పూర్తి చేసామని, గతంలో 47 లక్షలు ఉండేదన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎఎంసి చైర్మన్ బండారు సత్తిబాబు, సర్పంచ్ చిలువూరి ధనలక్ష్మి , డిసిసిబి డైరెక్టర్ చిలువూరి రామకృష్ణంరాజు, మండల పార్టీ అధ్యక్షుడు ఎం భాస్కరరావు, నీటి సంఘం అధ్యక్షుడు కుదప కృష్ణమూర్తి, సయ్యపరాజు రామకృష్ణరాజు, గాదిరాజు ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.

తుని రూరల్ సిఐపై ప్రైవేటు కేసు
తుని, డిసెంబర్ 6: దివీస్ బాధితులకు అండగా నిలిచి పోరాటం చేస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పట్ల రూరల్ సిఐ చెన్నకేశవరావు ప్రవర్తించిన తీరుపై స్థానిక న్యాయస్థానంలో ప్రైవేటు కేసు నమోదుచేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె వేణుగోపాల్ విలేకర్లతో మాట్లాడుతూ గత నెల 3న తొండంగి మండలంలో దివీసు బాధితులకు మద్దతుగా వచ్చిన మధు, కొంతమంది నాయకులను, బాధిత మహిళలను దుర్భాషలాడడమే కాకుండా బూటు కాలితో తన్నారని ఆరోపించారు. అంతేకాకుండా మరల ఇదే ప్రాంతానికి వస్తే ఎన్‌కౌంటర్ చేస్తానని హెచ్చరించడంపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
హోంగార్డుల సేవలు ఎనలేనివి
కాకినాడ సిటీ, డిసెంబర్ 6: హోంగార్డ్సు అందిస్తున్న సేవలు ఎనలేనివని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ కొనియాడారు. 54వ హోమ్‌గార్డ్సు రైజింగ్‌డే సందర్భంగా మంగళవారం జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో హోమ్‌గార్డ్సు పెరేడ్‌ను నిర్వహించారు. ఈ పెరేడ్‌కు ఎస్పీ రవిప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై హోమ్‌గార్డ్సు గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. హోమ్‌గార్డ్సు వ్యవస్థను 1962వ సంవత్సరంలో చైనాతో జరిగిన యుద్దం సమయంలో ఏర్పాటుచేశారని చెప్పారు. అప్పటి నుండి హోమ్‌గార్డ్సు సేవలను పోలీస్‌శాఖ వినియోగించుకుంటోందని, ఇటీవల కాలంలో వీరి ప్రాధాన్యత ఎక్కువగా పెరిగిందన్నారు. పోలీస్ సిబ్బందితో సమానంగా అన్ని రకాల విధులను నిర్వర్తించడమే కాకుండా, ఎస్కార్టు విధులు, నైటుబీటు, ట్రాఫిక్ రెగ్యులేషన్, కంప్యూటర్ ఆపరేటింగ్, డ్రైవర్స్‌గా వివిధ రకాల సేవలను పోలీస్ శాఖకు అందజేస్తున్నారని ఆయన చెప్పారు. అర్హులైన హోమ్‌గార్డ్సుకు ఎస్సై, కానిస్టేబుల్ రిక్రూట్‌మెంటులో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. హోమ్‌గార్డ్సు పిల్లలకు ఉపకారవేతనాలు, ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం వీరికి రోజువారి వేతనంగా నాలుగు వందల రూపాయలను చెల్లిస్తున్నామని ఎస్పీ రవిప్రకాష్ చెప్పారు. ఈ సందర్భంగా హోమ్‌గార్డ్సుకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ ఎఆర్ దామోదర్, ఒఎస్‌డి రవిశంకర్‌రెడ్డి, ఎస్‌బి డిఎస్పీ ఆర్ విజయభాస్కర్‌రెడ్డి, ఎస్ అప్పలనాయుడు, సిఐ వి శ్రీనివాస్, డిఎస్పీ ఎఆర్ వాసన్ తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరంలో...
రాజమహేంద్రవరం: హోంగార్డులు పోలీసులకు ధీటుగా సేవలు అందిస్తున్నారని అర్బన్ ఎస్పీ బి రాజకుమారి కితాబునిచ్చారు. హోంగార్డ్సు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎఆర్ మైదానంలో హోంగార్డులు పేరేడ్ నిర్వహించి, ఎస్పీకి గౌరవవందనం చేశారు. ఈసందర్భంగా జరిగిన సభలో ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ హోంగార్డుల సేవలు ప్రత్యేకమని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డులు పోలీసులతో సమానంగా సేవలందిస్తున్నారన్నారు. మరింత సేవలతో హోంగార్డుల ప్రతిష్టను ఇనుమడింపజేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ ఆర్ గంగాధర్, హోంగార్డ్స్ డిఎస్పీ సాయి శ్రీనివాస్, పలువురు డిఎస్పీలు, సిఐలు పాల్గొన్నారు.
ఎస్‌జివి మార్కెట్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

రాజమహేంద్రవరం, డిసెంబర్ 6: ఉభయ గోదావరి జిల్లాలకు కేంద్రంగా అతి పెద్ద హోల్‌సేల్ కిరాణా వర్తక కేంద్రం రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర జనరల్ మార్కెట్ (ఎస్‌విజి)ను కలెక్టర్ అరుణ్‌కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిరణా హోల్‌సేల్ వర్తకులతో చర్చలు జరిపి నగదు రహిత లావాదేవీలను వేగవంతం చేయాలని ఆదేశించారు. స్వైపింగ్ మిషన్లను పరిశీలించారు. వర్తకులంతా నగదు రహిత లావాదేవీలను నిర్వహించడంలో పూర్తి అవగాహన కలిగి వుండాలన్నారు. బ్యాంకుల ద్వారా స్వైపింగ్ మిషన్లు తీసుకోవడంలో ఆలస్యమవుతోందని వర్తకులు కలెక్టర్‌కు చెప్పారు. తమ సాధక బాధకాలు వివరించారు. చిల్లర వర్తకులు హోల్ సేల్ నుంచి కొనుగోలు చేయడంలో కూడా నగదు రహిత సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ వారికి సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో నగదు రహిత లావాదేవీలను విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. పింఛను నగదును బ్యాంకుల్లో జమ చేశామని, ఏజెన్సీలోని 11 మండలాల్లో ఎటిఎంలు లేకపోవడంతో నగదును చెల్లిస్తున్నామని, అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఎటిఎంల ఉపయోగించడాన్ని పెంచుతున్నామన్నారు. పింఛనుదారులకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు నగదు రహితంగా ఏర్పాట్లు చేశారు. రూపే కార్డుల ద్వారా నిత్యావసర సరుకులు తీసుకునే విధంగా పిఒఎస్ మిషన్లను వినియోగించే సేవలను అందుబాటులోకి తెచ్చామని, ఈ నెలాఖరు వరకు ఎటువంటి టాక్సు లేకుండా లావాదేవీలు చేసుకోవచ్చన్నారు. రైతులకు ధాన్యం కొనుగోలు సమయం కాబట్టి మద్దతు ధరకు తక్కువకు ఇవ్వకుండా పూర్తిగా చెల్లించే విధంగా నగదు రహిత లావాదేవీలకు చర్యలు చేపట్టామని కలెక్టర్ చెప్పారు. ఎమర్జెన్సీ ఆస్పత్రుల్లో కూడా నగదు రహిత సేవలు వినియోగించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇందుకు భిన్నంగా ఉన్న కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులకు నోటీసులు కూడా జారీచేశామన్నారు. పిఒఎస్ మిషన్ల వినియోగానికి పూర్తి స్థాయిలో కమర్షియల్ టాక్సు శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు కోటి రూపాయల వరకు చిన్న నోట్లు వచ్చే విధంగా ఆర్‌బిఐ ద్వారా చర్యలు తీసుకున్నామన్నారు. రానున్న రెండు మూడు వారాల్లో చిల్లర సమస్యలు అధిగమించగలమని భావిస్తున్నామన్నారు. పెద్ద నోట్ల రద్దు అమలులో కొత్త నోట్ల వినియోగంలో బ్యాంకర్లలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఆర్‌బిఐ పర్యవేక్షించాల్సి వుందన్నారు. కలెక్టర్ వెంట రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయకృష్ణన్ ఉన్నారు.

నేడు, రేపు జగన్ పర్యటన
రంపచోడవరం, డిసెంబర్ 6: రంపచోడవరం నియోజకవర్గంలో ఈ నెల 7,8 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పర్యటించనున్నారని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్ మంగళవారం తెలిపారు. ఏజెన్సీవాసుల కష్టాలు తెలుసుకుని గిరిజనులకు భరోసా ఇచ్చేందుకే ఈ పర్యటన అని అన్నారు. జగన్ ఈ నెల 7వ తేదీన మధురపూడి విమానాశ్రయం నుండి రోడ్డు మార్గం ద్వారా రంపచోడవరం మండలంలోని గోపవరం గ్రామానికి చేరుకుంటారన్నారు. అక్కడి నుండి ఆయన సీతపల్లి బాపనమ్మను దర్శించుకుని రంపచోడవరం చేరుకుంటారని తెలిపారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత రైతులతో మాట్లాడతారన్నారు. అలాగే రాజవొమ్మంగి మండలానికి చెందిన శిశు మరణాల బాధిత కుటుంబాలతో మాట్లాడతారని చెప్పారు. అనంతరం రోడ్డు షోలో దేవీ గుడి సెంటరు మీదుగా మారేడుమిల్లి మండలానికి చేరుకుని అక్కడే రాత్రికి బస చేస్తారన్నారు. 8వ తేదీ ఉదయం జగన్ విలీన మండలాల్లో పర్యటిస్తారని చెప్పారు. విఆర్ పురం మండలం రేఖపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారని తెలిపారు. అక్కడే కాళ్లవాపు బాధిత కుటుంబాలను పరామర్శించడంతోబాటు పోలవరం ప్రాజెక్టు ముంపు రైతులతో మాట్లాడతారని తెలిపారు. అనంతరం భద్రాచలం మీదుగా హైదరాబాద్ చేరుకుంటారన్నారు. స్థానిక డివిజన్ కేంద్రంలో అంబేద్కర్ 60వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ రత్నాబాయి, ఐటిడిఎ పిఒ దినేష్‌కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని విషయాలను భారతీయులంతా తెలుసుకుని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు నడవాలన్నారు. ఐటిడిఎ పిఒ దినేష్‌కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ప్రతిభను గురించి అందరూ తెలుసుకున్నారు. పిహెచ్‌సి డాక్టర్ రాములు, గెడ్డం శ్రీరాములు, ఎంపిటిసి పూజ, ఎంఇఒ దిలీప్‌కుమార్, సర్పంచ్ నిరంజనీదేవి, బోండ్ల వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
సమసమాజ స్థాపనకు కృషిచేయాలి

కాకినాడ, డిసెంబర్ 6: భారతరత్న బిఆర్ అంబేద్కర్ కలలుగన్న సమ సమాజ స్థాపనకు ప్రతిఒక్కరు కంకణ బద్ధులు కావాలని కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ 60 వర్ధంతిని పురస్కరించుకుని ఇంద్రపాలెం లాకుల కూడలిలో మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్, జడ్పీ చైర్మన్ నామన రాంబాబు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 60 ఏళ్ళు గడచినా అంబేద్కర్ ఆశయాలు, విలువలు ఎక్కడా చెక్కు చెదరలేదన్నారు. ముంబైలోని ఆయన సమాధిని సందర్శిస్తున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోందని చెప్పారు. అంబేద్కర్ ఆశయ సాధనకు నేటి యువత శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. విద్యను అన్ని వర్గాల వారికీ ఉచితంగా అందుబాటులోకి తెచ్చి, అవిద్యను పారదోలడమే లక్ష్యంగా అంబేద్కర్ చేసిన కృషిని ఈ జాతి మరువజాలదన్నారు. జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ విలువలకు పట్టం గట్టిన అంబేద్కర్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారన్నారు. కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ వంటి మహనీయుల అడుగుజాడల్లో నడవడం ద్వారా దేశానికి దిశాదశ నిర్దేశం చేసేందుకు వీలవుతుందని, ఆ దిశగా యువత పయనించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, సంయుక్త కలెక్టర్-2 జె రాధాకృష్ణమూర్తి, కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ అలీంబాషా, సాంఘిక సంక్షేమ శాఖ డిడి శోభారాణి, డ్వామా పిడి నాగేశ్వరరావు, మాల మహానాడు నాయకుడు ధనరాశి శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ స్థానాల పెంపునకు సహకరించాలి
కాకినాడ సిటీ, డిసెంబర్ 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపునకు సహకరించాలని కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ను కోరినట్లు కాకినాడ ఎంపి తోట నరసింహం చెప్పారు. మంగళవారం ఆయనతో ఢిల్లీలో సమావేశమై రాష్ట్ర విభజన సమయంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎపిలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలను పెంచడానికి చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ స్థానాల పెంపునకు రాజ్యాంగ సవరణ తప్పనిసరని ఇటీవల అటార్నీ జనరల్ చెప్పినందున కేంద్రం ఆదిశగా ప్రయత్నాలు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ విషయమై కేంద్రమంత్రి రాజ్‌నాధ్ సింగ్ సానుకూలంగా స్పందించారని ఎంపి నరసింహం తెలిపారు.
జయలలిత మృతి దేశానికి తీరనిలోటు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అకాల మరణం దేశానికి తీరనిలోటని కాకినాడ పార్లమెంటు సభ్యుడు తోట నరసింహం అన్నారు. పార్లమెంటు ఆవరణలో మంగళవారం జరిగిన సంతాప సభలో జయలలిత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, పేదలు కోసం అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి తమిళ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని ఆయన కొనియాడారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన పురుచ్చితలైవి జయలలిత మరణం తమిళ ప్రజలకే కాకుండా యావత్తు దేశానికే తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఎంపి నరసింహం సంతాపం వ్యక్తం చేశారు.

శాటిలైట్ సిటీకి సిఎం హామీలకు అనుమతులు:గోరంట్ల

రాజమహేంద్రవరం, డిసెంబర్ 6: ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాటిలైట్ సిటీ పర్యటన నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నింటికీ అనుమతులు మంజూరుచేశారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి తెలియజేశారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజమహేంద్రవరంలో స్టేడియం నిర్మాణానికి 30 ఎకరాల జైళ్ళ శాఖ భూమిని కేటాయిస్తూ సిఎం చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించి కలెక్టర్‌కు ఉత్తర్వులు అందాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి రాజమహేంద్రవరం హామీలన్నీ పూర్తిచేయాలని ఆదేశించారన్నారు. రాజమహేంద్రవరంలో ఎసిబి కోర్టు, మహిళా ఫ్యామిటీ కోర్టు మంజూరయ్యాయన్నారు. శాటిలైట్ సిటీలో జూనియర్ కాలేజి, ఆస్పత్రిని మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇదిలావుండగా ధవళేశ్వరంలోని అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టుకు సంబంధించి పిచ్చుకలంక వద్ద డ్రెడ్జింగ్ పనులను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రానున్నారు. ఇదే సందర్భంలో స్టేడియం నిర్మాణానికి, ధవళేశ్వరంలో ఫ్లోరీ కల్చర్ ల్యాబరేటరీని, కడియపులంకలో సోలార్ పవర్ యూనిట్లను ఒకే రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయించేందుకు భారీ ఎత్తున కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.