తూర్పుగోదావరి

కాపుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబరు 18: తమను బిసిలుగా గుర్తించాలన్న డిమాండ్‌తో కాపు సామాజికవర్గం జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపుమేరకు కాపు జెఎసి ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో ఖాళీ కంచాలపై గరిటెలతో దరువేసి తమ నిరసన చాటుకున్నారు. రాజమహేంద్రవరం, అమలాపురం వంటి ముఖ్య ప్రాంతాలు సహా డివిజన్, మండల కేంద్రాలు, పుర పాలక సంఘాల కూడళ్ళలో కాపులు ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని భానుగుడి జంక్షన్ వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనలో కాపులు నల్లని వస్త్రాలను ధరించి ఖాళీ కంచాలు, గరిటెలతో నిరసన తెలిపారు. కాపు జెఎసి కో-కన్వీనర్ వాసిరెడ్డి ఏసుదాసు కార్యక్రమంలో మాట్లాడుతూ తమ నేత ముద్రగడ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లా కేంద్రాలు, డివిజన్, మండల కేంద్రాలలో కాపులు నల్ల రిబ్బన్లు ధరించి కంచాలపై గరిటెలతో కొట్టి ఆకలి కేకలను వినిపించామన్నారు. అలాగే 30వ తేదీన ప్రజాప్రతినిధులకు ఆయా జిల్లాల కాపులు రిజర్వేషన్లు కోరుతూ వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు. జనవరి 9వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7 గంటల మధ్య ఆయా జిల్లాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. జనవరి 25వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుండి ముద్రగడ సత్యాగ్రహ పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలియజేశారు. అమలాపురం మీదుగా అంతర్వేది వరకు సాగే ఈ పాదయాత్రకు పెద్ద ఎత్తున కాపు సామాజికవర్గం హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాపులకు అనేక హామీలిచ్చి చివరకు వారి నాయకులను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. 2016 ఆగస్టు నెలాఖరుకే మంజునాథ కమీషన్ తుది నివేదికను భారత పార్లమెంట్‌కు పంపేందుకు కృషి చేస్తానని చంద్రబాబు హామీనిచ్చారని, ఇంతవరకు ఆ ప్రక్రియే పూర్తి కాలేదని ఏసుదాసు విమర్శించారు. కార్యక్రమంలో కాపు సామాజికవర్గ నేతలు ఫ్రూటీకుమార్, జానపాముల నాగబాబు, భూలోకరాయుడు తదితరులు పాల్గొన్నారు.
మురారిలో వైభవంగా కనకదుర్గమ్మ తీర్థం

గండేపల్లి, డిసెంబర్ 18: మెట్ట ప్రాంతంలో కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందిన మురారి కనకదుర్గమ్మ అమ్మవారి తీర్థం ఆదివారం వైభవంగా నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుండే కాకుండా పరిసర జిల్లాలు, ఒడిస్సా రాష్ట్రం నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జాతీయ రహదారికి సుమారు నాలుగు కిలోమీటరు దూరంలో జీడిమామిడి తోటలో వేంచేసియున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుండి వివిధ వాహనాలపై తరలివచ్చి మొక్కులు చెల్లించుకుని సహపంక్తి భోజనాలు చేశారు. జగ్గంపేట సిఐ కాశీ విశ్వనాధం ఆధ్వర్యంలో గండేపల్లి ఎస్సై ఎం రజనీకుమార్ మద్యం విక్రయాలు జరపకుండా చర్యలు తీసుకోవడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. అయితే మంచినీటికి భక్తులు ఇక్కట్లు పడ్డారు. సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోరు నుండి మంచినీరు తెచ్చుకున్నారు.
జాతీయ స్థాయి పోరాటమే శరణ్యం
రాజమహేంద్రవరంలో రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం

రాజమహేంద్రవరం, డిసెంబర్ 18: పోలవరం నిర్వాసితులకు అండగా ప్రభుత్వాలను కదిలించే పోరాటాన్ని సాగించాలని, జాతీయస్థాయి పోరాటం సాగించి కేంద్రమే పునరావాసం కల్పించే విధంగా నిర్వాసితులతో అఖిలపక్షం నడుం బిగించాలని రాజమహేంద్రవరంలో ఆదివారం ఆర్ధిక, రాజకీయ విశే్లషకుడు పెంటపాటి పుల్లారావు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. పోలవరం నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం మాజీ ఎంపి మిడియం బాబూరావు, వివిధ పక్షాల నేతలు, వివిధ పార్టీల నాయకులు పలు తీర్మానాలు చేశారు. సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు స్వాగతం పలికారు. సమావేశంలో నిర్వాసితులు, న్యాయవాదులు ముప్పాళ్ళ సుబ్బారావు, సిపిఐ నాయకులు మీసాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పోలవరం నిర్వాసితులకు పునరావాసం పూర్తయ్యేంత వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకూడదని తీర్మానించారు. జాతీయ స్థాయి ఉద్యమాన్ని సాగించాలని, నిర్వాసితులకు అండగా అన్ని పార్టీలు పోరాటం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది.
నిర్వాసితులకు అండగా వుండి పోరాటాన్ని సాగించేందుకు రౌండ్ టేబుల్ తీర్మానం మేరకు కృషిచేయాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎన్నిసార్లు ముఖ్యమంత్రికి డిమాండ్ చేసినా చెవిటోడిముందు శంఖం ఊదినట్టేనని మాజీ ఎంపి జివి హర్షకుమార్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్వాసితుల ఉసురు తీసుకుంటుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను పాలించడం లేదని, వారితో వ్యాపారం చేస్తున్నాయని ఆరోపించారు. రైతు సంఘం జాతీయ కార్యదర్శి రావుల వెంకయ్య మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల ముంపు ప్రాంత ప్రజల పరిస్థితి రెంటికీ చెడిన రేవడిగా ఉందన్నారు. నిర్వాసితులకు అండగా, వారి సమస్యలకు సంఘీభావం వ్యక్తం చేస్తూ అన్ని పార్టీలు పోరాటంలో మమేకం కావాలన్నారు. త్యాగం చేసినవారికి అండగా పోరాటం సాగించాలన్నారు. చంద్రబాబునాయుడును గడ్డపారతో పొడిస్తేనే ఆయన చెవిన నిర్వాసితుల గోడు విన్పిస్తుందన్నారు. పోలవరం నిర్వాసితుల గోషను ఢిల్లీలోనే విన్పించాలని, కేంద్రంతోనే తాడోపేడో తేల్చుకునే విధంగా అఖిలపక్షమంతా ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడతామన్నారు.
బిజెపి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాల కొండయ్య మాట్లాడుతూ పోరాటం అవసరం లేకుండా కేంద్రం అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు. వనవాసి అనే స్వచ్చంధ సేవా సంస్థ నిర్వాసితుల సమస్యలపై పని చేస్తుందన్నారు. రూ.40 వేల కోట్లు కేంద్రం వద్ద పునరావాసం కోసం నిధులు వున్నాయన్నారు.
సిపిఎం మాజీ ఎంపి మిడియం బాబూరావు మాట్లాడుతూ నిర్వాసితుల పరిస్థితి అగమ్యగోచరంగా వుందని, ముంపు మండలాల ప్రజలను రాష్ట్రం పట్టించుకోలేదేన్నారు. వైసిపి నేత, మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీ దుర్గేష్ మాట్లాడుతూ నిర్వాసితులకు సంపూర్ణమైన న్యాయం జరిగేంత వరకు పోరాటం సాగిస్తామని, ఇప్పటికే తమ పార్టీ అధినేత జగన్ ముంపు మండలాల్లో విస్తృతంగా పర్యటించారన్నారు. నిర్వాసితులకు చట్ట ప్రకారం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాది పల్లా త్రినాధరావు మాట్లాడుతూ అదివాసీ అటవీ హక్కులను కాపాడాలని, ఆదివాసీల త్యాగాలపై పోలవరం నిర్మాణం జరుగుతోందన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమాలు నిష్పలం కాకూడదని, న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయాలన్నారు. సిపి ఎం అర్బన్ జిల్లా కార్యదర్శి టి. అరుణ్ మాట్లాడుతూ నిర్వాసితులకు పూర్తి పరిహారం అందించేంత వరకు పోలవరం నిర్మాణం ఆపాలని తీర్మానించారు. డ్యాం కట్టే ఏడు గ్రామాలను బలవంతంగా ఈడ్చేసి నిర్బంధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, 28న తలపెట్టిన రోడ్ల దిగ్బంధం కార్యక్రమాన్ని మద్దతు తెలియజేయాలన్నారు. నిర్వాసితులు చేగొండపల్లికి చెందిన ముచ్చిక రంజిత్‌కుమార్, అంగులూరుకు చెందిన వరలక్ష్మి, కట్టా కనకదుర్గ తదితరులు మాట్లాడుతూ అడవిని నమ్ముకుని జీవిస్తున్న తమను ఈడ్చేయడం వల్ల సర్వస్వం కోల్పోయామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇపుడు తమ పరిస్థితి ఒడ్డున పడిన చేపల మాదిరిగా వుందన్నారు. తమ గ్రామాలను ఖాళీ చేయించడం వల్ల చెట్ల కింద బతుకుతున్నామని, పునరావాస కాలనీలు కొన్ని చోట్ల కూలిపోయేలా ఉన్నాయని, తమకు భూమికి భూమి ఇవ్వలేదని వాపోయారు. వివిధ వర్గాలకు చెందిన కె తిలక్, దుర్గా ప్రసాద్, సిపి ఐ సత్యనారాయణ మూర్తి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఏలేరు పూర్తి ఆయకట్టుకు నీరు
డిప్యూటి సిఎం చినరాజప్ప
కాకినాడ, డిసెంబర్ 18: ఏలేరు రైతులకు పూర్తి స్ధాయి ఆయకట్టుకు నీరందిస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హామీ ఇచ్చారు. ఆదివారం రాజప్పను ఏలేరు ఆయకట్టు రైతులు ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాజప్పకు రైతులు తమ కష్టాలను వివరించారు. గత రెండేళ్ళ కాలం నుండి ఏలేరుకు పూర్తి స్ధాయిలో నీరు అందకపోవడంతో ఆశించిన స్ధాయిలో పంటలు దిగుబడి రాక అప్పులు పాలయ్యామని చెప్పారు. ఈ సారైనా పూర్తి స్ధాయి పంటలకు నీరందించాలని రైతులు రాజప్పకు వివరించారు. జనవరి 5వ తేదీన పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పధకం ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే అవకాశాలున్నాయని ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రైతుల కష్టాలు తనకు తెలుసునని ఈ విషయాలు ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకువస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎస్‌విఎస్‌ఎన్ వర్మ, వరుపుల సుబ్బారావు, జ్యోతు నెహ్రు తదితరులు పాల్గొన్నారు.

పెద్దనోట్ల రద్దు అనాలోచిత చర్య
* నోట్లు మార్చేవారిని కాల్చివేయాలి* అధికారులకు లక్షల కోట్లు లంచాలు*వర్తక సదస్సులో వక్తలు
రాజమహేంద్రవరం, డిసెంబర్ 18: ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పెద్దనోట్లను రద్దు చేయడం అనాలోచిత చర్య అని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో వర్తకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు ఆదివారం రాజమహేంద్రవరం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఉభయ గోదావరి జిల్లాల వర్తక సదస్సు జరిగింది. ఈసదస్సులో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ నల్లధనాన్ని నిరోధించేందుకు పెద్దనోట్లను రద్దు చేసినట్లు ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకుంటున్నారని, అయితే అంబానీలు, అదానీలకు ఈవిధానాల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని, సామాన్యులు, చిన్న వర్తకులు మాత్రమే అనేక పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీకి చిత్తశుద్ధి ఉంటే తొలుత పెద్దల నుంచి ప్రక్షాళన ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాని మోడీకి మరోసారి ప్రధానిగా పోటీ చేసే అవకాశం ఉండదని జోస్యం చెప్పారు. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం పార్లమెంటులో ఈఅంశాన్ని చర్చించకపోవడం శోచనీయమని, ప్రజాసమస్యలను చర్చించకపోతే పార్లమెంటు ఉన్నది ఎందుకని ప్రశ్నించారు. పెద్దనోట్లను రద్దు చేసిన ప్రభుత్వం, నగదురహిత చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహిస్తోందని, అయితే హ్యాకర్ల బెడద వల్ల సామాన్యులు దోపిడీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ మాట్లాడుతూ పెద్దనోట్లను రద్దు చేసిన కేంద్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, రద్దు చేసిన స్థాయిలో కరెన్సీని పంపిణీ చేయకపోవడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వర్తకులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అయితే ఆర్థిక వ్యవస్థలో మార్పులు చేపట్టినపుడు అవస్థలు తప్పవని, రానున్న రోజుల్లో ఈవిధానాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. దివంగత ప్రధాని పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినపుడు కూడా ఇలాగే విమర్శలు చేశారని గుర్తుచేశారు. 130కోట్ల జనాభా కలిగిన దేశంలో 5కోట్ల మంది మాత్రమే ఆదాయపుపన్ను చెల్లిస్తున్నారని, వారిలో ఎక్కువశాతం ఉద్యోగులే ఉన్నారన్నారు. 1శాతం మంది వర్తకులు, పారిశ్రామికవేత్తలే 7లక్షల కోట్ల పన్నుల రూపేణా చెల్లిస్తున్నారన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల నిజంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైతే ఇప్పటికే విప్లవం వచ్చేదన్నారు. దేశంలో అధికారుల వల్లే అవినీతి పెచ్చుమీరుతోందని ఆరోపించారు. అధికారులు లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని అంబికా కృష్ణ పేర్కొన్నారు. అక్రమంగా నోట్ల మార్పిడి చేసుకునే వారిని కాల్చిపారేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. జనవరి 1వ తేదీ నుంచి నల్లధనికుల సొమ్ము కూడా ప్రభుత్వపరమవుతుందన్నారు. బ్యాంకు రుణాలపై వడ్డీలు 10శాతాని కన్నా దిగువకు చేరితే వర్తకులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. నల్లధనం నిర్మూలనతో ఇది సాధ్యమవుతుందన్నారు. ఎపి ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్(్ఫక్కీ) కన్వీనర్ అశోక్‌కుమార్‌జైన్ అంబికా కృష్ణ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ మాట్లాడటంపై ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలుకు ఖర్చుపెట్టిన సొమ్ము, రాజ్యసభ సభ్యత్వానికి టిజి వెంకటేష్ వెచ్చించిన సొమ్ము, పట్టిసీమ పేరిట ప్రభుత్వం ఖర్చుపెడుతున్న సొమ్ము ఎక్కడిదని నిలదీశారు. రాజకీయాలకు అతీతంగా చాంబర్ ఆఫ్ కామర్స్ చిన్న వర్తకుల పక్షాన నిలవాల్సి ఉందన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మోడీ ప్రభుత్వం 86శాతం నోట్లను రద్దు చేసిందని, దీంతో సామాన్య ప్రజలతో పాటు, వర్తకులు కూడా నానా పాట్లు పడుతున్నారన్నారు. నోట్లు రద్దు చేసి ప్రజల అభిమానాన్ని కూడా తాకట్టుపెట్టిందన్నారు. మోడీ ప్రభుత్వం అదానీలు, అంబానీల వంటి వారికి లక్షల కోట్ల రాయితీలు ప్రకటించిందన్నారు. మరోవైపు నగదురహిత లావాదేవీలపై అధికారుల వేధింపులు, ఒత్తిళ్లు అధికమయ్యాయన్నారు. లంచగొండి అధికారులకు ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. కమర్షియల్ టాక్స్ శాఖ కరెప్షన్ శాఖగా తయారైందని ధ్వజమెత్తారు. ఫిక్కీ అధ్యక్షుడు బి భాస్కరరావు మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు అమలులో విఫలమైందన్నారు. వర్తకులంతా నిర్భంధంగా నగదురహిత లావాదేవీలు చేయాలన్న అధికారుల ఒత్తిళ్లను నివారించాలని, లేనిపక్షంలో ఉద్యమిస్తామన్నారు. రాష్ట్రంలోని అధికారులే అవినీతిని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈసందర్భంగా పెద్దనోట్ల రద్దు తరువాత నగదు కోసం ఎటిఎంల వద్ద పడిగాపులు కాసి ఆశువులు బాసిన 140 మందికి సదస్సు సంతాపం ప్రకటించింది. నగదురహిత చెల్లింపులపై అధికారుల వేధింపులను నివారించాలని, ఒకవేళ స్వైపింగ్ వంటి నగదురహిత చెల్లింపుల సందర్భంగా హ్యాకర్ల వల్ల జరిగే నష్టానికి బాధ్యులను నిర్ధారించాలని, ఎస్‌ఎంఎస్ ద్వారా వే బిల్లుల జారీ విధానాన్ని అమలు చేయాలని, నగదురహిత చెల్లింపులపై సిటిఓ స్థాయిలో ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయాలని సదస్సు తీర్మానించింది. ఈసదస్సులో చాంబర్ అధ్యక్షుడు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, ఫిక్కీ జిల్లా చైర్మన్ నందెపు శ్రీనివాస్, చాంబర్ మాజీ అధ్యక్షులు బొమ్మన రాజ్‌కుమార్, కొల్లేపల్లి శేషయ్య, పొలసానపల్లి హనుమంతరావు, విజయవాడ చాంబర్ డైరెక్టర్ కోటేశ్వరరావు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వర్తక సంఘాల నాయకులు సలాది నాగేశ్వరరావు, పప్పు సత్యనారాయణ, ఈరంకి చక్రపాణి, జెవి రామారావు, పి సురేష్, కర్రి సుబ్బారెడ్డి, గ్రంధి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

రిజర్వేషన్లు సాధించేవరకూ విశ్రమించం:కాపు జెఎసి

అమలాపురం, డిసెంబర్ 18 : కాపు రిజర్వేషన్ సాధనలో భాగంగా రాష్ట్ర కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు కోనసీమ జెఎసి ఆధ్వర్యంలో ఆదివారం అమలాపురంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నల్లా విష్ణుమూర్తి, కోనసీమ టిబికె జెఎసి నాయకులు కల్వకొలను తాతాజీల ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్‌లో ఖాళీ కంచాలపై గరిటెలతో శబ్ధాలు చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గడియారపుస్తంభం సెంటరులో భారీ మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నల్లా విష్ణుమూర్తి మాట్లాడుతూ కాపు రిజర్వేషన్లు సాధించేంత వరకూ ఉద్యమాన్ని కొనసాగింస్తామని, ఇదే ఆఖరి పోరాటమన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను 2017 డిసెంబర్ నాటికల్లా అమలు చేయకపోతే కాపుల సత్తా ఏమిటో చూపుతామని హెచ్చరించారు. తరతరాలుగా అన్ని రాజీకీయ పార్టీలు కాపుల ఓటు బ్యాంకుతో అధికారాన్ని చేపట్టి అనంతరం కాపులను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. కాపులను అణచివేతకు గురిచేస్తే త్వరలోనే తగిన మ్యూలం చెల్లించుకోవాల్సి ఉంటుందని నల్లా హెచ్చరించారు. ఈ దశలవారీ ఉద్యమంలో కాపులంతా పాల్గొని తమ ఐక్యతను ప్రభుత్వానికి తెలియజేయాలని, పాలకపార్టీలో ఉన్న కాపు నాయకులు ఇప్పటికైనా కుల సమస్యపై ప్రభుత్వంతో చర్చించాలని నల్లా డిమాండ్ చేసారు. కోనసీమ టిబికె జెఎసి అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ మాట్లాడుతూ రిజర్వేషన్ సాధనకోసం ముద్రగడ చేపట్టిన దశలవారీ ఉద్యమానికి కాపులంతా పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాలనీ కోరారు. కాపుల సమస్యలను విస్మరించి పదవుల కోసం ఆరాటపడే కాపు ప్రజాప్రతినిధులకు త్వరలోనే తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఒంటెద్దు బాబి, కురసా ఆంజనేయులు, అరిగెల నాని, రంకిరెడ్డి శ్రీను, సాధనాల సుబ్రహ్మణ్యం, అడపా మాచరయ్య, వాకపల్లి శ్రీను, తిక్కా ప్రసాద్, పోలిశెట్టి కిట్టయ్య, సలాది నాగేశ్వరావు, అడపా దత్తుడు, అరిగెల నటరాజ్, సుంకర సుధ, తోట నాగేశ్వరరావు, కోలా శ్రీను, కడియం సందీప్, చిట్టినీటి శ్రీను, డేగల రమణ, టి వీరబాబు, రాయపురెడ్డి ప్రసాద్, ఆకుల సూర్యనారాయణమూర్తి, కంకిపాటి వీరబాబు, కల్వకొలను బాబి, అడపా సూరిబాబు, దున్నాల వేణు, కల్వకొలను ఉమా, సాధరనాల మురళీ, కందుల శివ, సలాది చక్రి, నల్లా శ్రీను, వర్రే శేషు, నిమ్మకాయల సురేష్, బోడపాటి గోపాలకృష్ణమూర్తి, చిక్కాల రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్తిపాడు: కాపు ఉధ్యమనేత ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు కిర్లంపూడి, ప్రత్తిపాడు మండలాల పరిధిలోని గ్రామాల్లో కంచాల మీద గరిటలతో ధ్వని చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్ ఇస్తానని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలంటూ వారు నిరసన తెలియజేశారు. పలు గ్రామాల్లోని బీసీలు, ఎస్సీలు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ నిరసన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. కిర్లంపూడి మండల కేంద్రంలోని ఏనుగు వీధి జంక్షన్‌లో బిసి మహిళలు సుమారు 3 గంటల పాటు కంచాలపై ధ్వని చేస్తూ నిరసన తెలిపారు. కిర్లంపూడి మండలంలోని వేలంక, సింహాద్రిపురం, రామకృష్ణాపురం, చిల్లంగి, జగపతినగరం, గెద్దానాపల్లి, రాజుపాలెం గ్రామాల నుండి భారీ సంఖ్యలో కాపులు, బిసిలు, దళితులు కిర్లంపూడికి చేరుకుని తమ నిరసనను తెలియజేశారు. ఈ సంధర్భంగా కిర్లంపూడిలో జరిగిన సభలో కిర్లంపూడి మాజీ సర్పంచ్ మద్దాల నాగమణి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో కాపులను బిసిల్లో చేర్చి ఆదుకుంటానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని ఇందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తే మండలంలో ఉన్న మహిళలంతా తమ వ్యతిరేకతను ఎన్నికల్లో ఓటు ద్వారా తెలియజేసి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని నాగమణి హెచ్చరించారు. కాగా ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం, ఒమ్మంగి, ఉత్తరకంచి, ఏలూరు, లంపకలోవ గ్రామాలకు చెందిన కాపులు భారీ సంఖ్యలో ప్రత్తిపాడు మండల కేంద్రంలోని అల్లూరి సీతారామరాజు జంక్షన్‌లో మానవహారంగా ఏర్పడి కాపు యువత, కాపు నాయకులు కంచాలపై ధ్వని చేస్తూ తమ ఆకలిని ప్రభుత్వానికి తెలియజేశారు. అనంతరం వారు ప్రత్తిపాడులోని అన్ని వీధులు కంచాల ధ్వని చేసుకుంటూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బలిజ నాయకుడు ఏడిద రెడ్డినాయుడు, కాపు నాయకులు చేరు కృష్ణ, ధర్మవరం సొసైటి అధ్యక్షుడు జువ్వల చినబాబు, కాపు జెఏసి నాయకుడు చెక్కపల్లి సత్తిబాబు, ప్రత్తిపాడు మండల మాజీ అధ్యక్షుడు సత్యంశెట్టి సీతారామం, పంది దొరబాబు, ప్రత్తిపాడు లేఖర్ల సంఘం అధ్యక్షుడు కూనిశెట్టి సూరిబాబు, దళిత నాయకుడు గూడాల వెంకటరత్నంల సారధ్యంలో ప్రత్తిపాడులో ముద్రగడకు మద్దతుగా ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు.
విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల అవగాహన అవసరం
* ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
కొత్తపేట, డిసెంబర్ 18: విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిలు పేర్కొన్నారు. స్థానిక కాంతి భారతి ఇంగ్లీషు మీడియం కానె్వంట్‌లో జిల్లాస్థాయి చెకుముకి సైన్సు సంబరాలను ఆదివారం నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 55 మండలాలకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కెఎంఎంఆర్ ప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సైన్స్ ఎగ్జిబిట్స్ చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జడ్పీటీసీ ధరణాల రామకృష్ణ, జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షుడు సిహెచ్ స్టాలిన్, సిహెచ్ రవికుమార్, ఎంఇఒ వై సత్తిరాజు, ఇఆర్ సుబ్రహ్మణ్యం, కెవివి సత్యనారాయణ, మిద్దే ఆదినారాయణ, జిఎస్‌హెచ్ ప్రసాద్‌వర్మ, పి నరసింహారావు, కరస్పాండెంట్ తోట సత్యవాణి, కె కృష్ణసాయి, ఎండి ఖాజామొహిద్దీన్, తోట వెంకటేశ్వరరావు, జెవివి మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు బండారు శేషగిరిరావు, ఆదివారపుపేట వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మగువుల మనసును దోచుకుంటున్న చేనేత వస్త్రాలు
*మిస్ కాకినాడ పూజాజైన్
కాకినాడ సిటీ, డిసెంబర్ 18: చేనేత వస్త్రాలు మగువుల మనసును దోచుకుంటాయని మిస్ కాకినాడ పూజాజైన్ అన్నారు. ఆధునిక పద్దతుల్లో చేనేత కార్మికులు ప్రత్యేక ఇకట్ ఆర్ట్ విధానంలో రూపొందించిన హ్యేండ్‌లూమ్ ఉత్పత్తుల ప్రదర్శను స్థానిక దేవాలయం వీధిలోని పైడా చలమయ్య శ్రీనివాస కళ్యాణ మండపంలో ఆదివారం మిస్ కాకినాడ పూజాజైన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పోచంపల్లి ఇకట్ ఆర్ట్‌మేళా పేరిట నిర్వహిస్తున్న ఈప్రదర్శనలో చేనేత కార్మికులు ఆధునిక పద్దతుల్లో రూపొందించిన వస్త్రాలను విద్యార్ధినులు, యువతుల మనసులను ఎంతగానో ఆకట్టు కుంటాయని పూజాజైన్ కొనియాడారు. చేనేత కార్మికులు రూపొందించిన వస్తువులను ప్రజలు ఆదరించాలని పిలుపునిచ్చారు. హ్యేండ్‌టూమ్ ఆర్ట్ డైరెక్టర్ లవకుమార్ మాట్లాడుతూ ఈనెల 24వ తేదీ వరకు ఈప్రదర్శన ఉంటుందన్నారు. చేనేత కార్మికులు అందరకి అవసరమైన వస్తువులు, వస్త్రాలను రూపొందించారని తెలిపారు. ఈప్రదర్శనలో పలువురు చేనేత కార్మికులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం,
ఎమ్మెల్యే పులపర్తి
రావులపాలెం, డిసెంబర్ 18: రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారధ్యంలో ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అన్నారు. రావులపాలెం వ్యవసాయ అరటి మార్కెట్‌యార్డులో రూ. 2.11 కోట్లతో చేపట్టిన వివిధ భవన నిర్మాణాలను ఆదివారం వారు ప్రారంభించారు. రైతు విశ్రాంతి భవనం, అతిథిగృహం, క్యాంటీను భవనంతో పాటు సహజసిద్ధంగా అరటికాయలను మాగించేందుకు నిర్మించిన రైఫనింగ్ చాంబర్, అరటి ధరలను తెలిపేందుకు ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తపేట ఎఎంసి చైర్మన్ బండారు వెంకట సత్తిబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎందరో రైతులు, కూలీలకు ఈ అరటిమార్కెట్ యార్డు ఉపాధి కల్పిస్తుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కోట్లాది రూపాయలు వెచ్చించి అదనపు సౌకర్యాలు కల్పించామన్నారు. రావులపాలెం అరటిమార్కెట్ యార్డు సౌకర్యాల పరంగా మిగిలిన ఎఎంసిలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఎమ్మెల్యే పులపర్తి మాట్లాడుతూ కోనసీమలో ఉన్న ఎఎంసిలలో రావులపాలెం మార్కెట్ యార్డు ముందంజలో ఉందన్నారు. ఇక్కడ కూలీలు, రైతులు ప్రభుత్వం అమలు చేస్తున్న చంద్రన్న బీమా పథకంలో చేరాలని సూచించారు. అలాగే ఎఎంసి నిధులతో ఎఎంసి పరిధిలోని అన్ని మండలాల్లో లింకు రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో ఎఎంసి వైస్ చైర్మన్ గుత్తుల ఏడుకొండలు, డిసిసిబి డైరెక్టర్ చిలువూరి రామకృష్ణంరాజు, ఎఎంసి డైరెక్టర్లు వెలిగట్ల త్రిమూర్తులు, వై వెర్రియ్య, సర్పంచులు నెక్కంటి వెంకన్న, కుడుపూడి వెంకటేశ్వర్లు, కడలి లచ్చన్న, ఎంపిటిసిలు మట్టా సత్యదేవి, కుడుపూడి శ్రీనివాస్, మండల టిడిపి అధ్యక్షుడు గుత్తుల పట్ట్భారామారావు, మహిళా అధ్యక్షురాలు దోనేపూడి దుర్గలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సభ్యత్వ నమోదు లక్ష్య సాధనకు ప్రణాళికతో ముందుకుసాగాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి
అనపర్తి, డిసెంబర్ 18: తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి చివరి రోజైన సోమవారం సాయంత్రానికి లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు సమన్వయ కమిటీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షుడు ప్రణాళికతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. స్థానికంగా ఉన్న ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో 28,718మందిని పార్టీ సభ్యులుగా చేర్చాలనేది లక్ష్యం కాగా, ఆదివారం నాటికి 25,899మందిని సభ్యులుగా చేర్పించామన్నారు. ఇప్పటి వరకూ 61 శాతం మంది (13,953 మందిని) తిరిగి పార్టీ సభ్యులుగా చేర్పించామని, దీని ద్వారా జిల్లాలో అనపర్తి నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందన్నారు. పార్టీ నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తిచేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్న ఆయన మిగిలిన 2,819మందిని సభ్యులుగా చేర్పించడంలో ప్రతి మండలం నుండి కొత్తవారినైనా తిరిగి 700మందిని సభ్యులుగా చేర్పించి లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. జనవరి 2నుండి ప్రారంభం కానున్న జన్మభూమి, మా ఊరు కార్యక్రమాలు, అదే విధంగా మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమం విజయవంతం కావడానికి ఏ విధంగా ముందుకు సాగాలనే విషయంపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశంలో జడ్పీ వైస్ ఛైర్మన్ పెండ్యాల నళినీకాంత్, ఎఎంసి ఛైర్మన్ సిరసపల్లి నాగేశ్వరరావు, జడ్పీటీసీ కర్రి ధర్మారెడ్డి, అనపర్తి మండల పార్టీ అధ్యక్షుడు కర్రి వెంకటరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.