పశ్చిమగోదావరి

నగదు కోసం ప్రజల పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 22 : పండగలు సమీపిస్తున్న తరుణంలో నగదు కోసం ప్రజలు పాట్లు అన్నీ, ఇన్నీ కావనే చెప్పాలి. ఎక్కడ చూసినా చేతిలో నగదు కోసం సామాన్య మధ్య తరగతి ప్రజలు బ్యాంకులు, ఎటి ఎంలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే వున్నారు. అయినప్పటికీ ఎక్కడా క్యూల మోతాదు తగ్గుతున్న దాఖలాలు గానీ, చేతికి నగదు అందుతున్న పరిస్థితి గానీ లేకపోవడంతో జనంలో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. క్రిస్మస్ పర్వదినం సమీపించడంతో నగదు కోసం మరింత మంది బ్యాంకుల చుట్టూ తిరుగుతుండటంతో రద్దీ గణనీయంగా పెరిగింది. దీనితోపాటే ఇబ్బందులు కూడా భారీగా పెరిగిపోయాయి. మరోవైపు అధిక శాతం ఎటి ఎంలు పనిచేయకపోవడంతో జనం పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఒక రకంగా ఎటి ఎం ట్రావెల్స్ మాదిరిగా జనం ఎక్కడెకక్కడ ఎటి ఎంలు వున్నాయి అని చూసుకుంటూ ఎక్కడ నగదు వుంది అన్న సమాచారాన్ని తెలుసుకుని అక్కడకు వెళ్లి క్యూలో నిలబడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఏ నలుగురు కలిసినా పలానా ఎటి ఎంలో ఇందాక నగదు వుందన్న సమాచారానే్న అందిపుచ్చుకుంటూ కనిపిస్తున్నారు. ఒకరి వద్ద సమాచారాన్ని పుచ్చుకుని మరింత మంది అదే ఎటి ఎంకు పరుగులు తీస్తున్నారు. మొత్తంగా చూస్తే నగదు చెస్ట్ నిర్వహిస్తున్న బ్యాంకు పరిధిలోని కొన్ని ఎటి ఎంలలో మాత్రమే నగదు లభ్యత కనిపిస్తుండగా మిగిలిన బ్యాంకులు దాదాపుగా చేతులు ఎత్తేస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఇక నోట్ల కష్టాలకు ప్రత్యామ్నాయంగా విరుగుడుగా చెబుతున్న నగదు రహిత లావాదేవీల విషయంలోనూ మరిన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. సాంకేతికంగా అన్ని స్థాయిల్లోనూ సామర్ధ్యం ప్రదర్శించే పరిస్థితి లేకపోవడంతో వినియోగదారులు గందరగోళంలో చిక్కుకుంటున్నారు. కొన్ని చోట్ల స్వైపింగ్ మిషన్ల సాంకేతికత అటు దుకాణదారులకు, ఇటు వినియోగదారులకు కూడా పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకటి, రెండు చోట్ల స్వైపింగ్ మిషన్లు దర్శనమిస్తున్నా అక్కడ కార్డులను స్వైప్ చేస్తే కొన్ని సార్లు మెస్సేజ్‌లు రాకపోవడంతో మరోసారి స్వైప్ చేసి నగదును నమోదు చేస్తున్నారు. అయితే ఆ విధంగా చేసిన తరువాత మొత్తం రెండు మెస్సేజులు ఒకేసారి రావడం, ఆ రకంగా చూస్తే వంద రూపాయలు చెల్లించాల్సిన చోట వినియోగదారుడు 200 రూపాయలు చెల్లిస్తుండటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొంతవరకు నగర, పట్టణ ప్రాంతాల పరిధిలోని వినియోగదారులు ఇబ్బందులున్నా ఇలాంటి వాటికి కొంత ధైర్యం చేస్తున్నప్పటికీ సింహభాగం వున్న గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇలాంటి పరిస్థితులు దాదాపుగా కనిపించడం లేదనే చెప్పుకోవాలి. అంతకుమించి గ్రామీణ ప్రాంతాల పరిస్థితులు మరింత దుర్భరంగా మారుతున్నాయి. పట్టణ, నగర ప్రాంతాల్లోని బ్యాంకులు, ఎటి ఎంలలో కొంత శాతం నగదు లభ్యత వుంటున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా విస్మరించారన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. అధిక శాతం గ్రామాల్లో నగదు అందుబాటు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకటి, రెండు చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎటి ఎంలు వున్నప్పటికీ అవి పనిచేయడం మానేసి 40 రోజులు దాటిపోయిందంటే అతిశయోక్తి కూడా కాదు. ఈ విధంగా బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా విస్మరించాయన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే గత నెలలో ప్రారంభమైన ఈ నోట్ల కష్టాలు ఇంకెంతకాలం భరించాలో తెలియక జనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రక్క జనం నోట్ల కష్టాలతో ఇబ్బందులు పడుతుంటే మరో వైపు వామపక్షాల అనుబంధ సంఘాలు బ్యాంకుల వద్ద ధర్నాలు, నిరసన ప్రదర్శనలతో ముందుకు వెళుతున్నారు. అయితే జనం మాత్రం పండుగ ముందుగానే ఎలాగోలా నగదు దక్కించుకోవాలన్న ఆతృతలో క్యూలోనే కొనసాగిపోతున్నారు. మరికొందరు పగటిపూట నగదు తీసుకోవడం భారంగా మారడం, ఒక వేళ అవకాశం వచ్చినా ఆ సమయానికి నగదు లేదన్న సమాధానం రావడంతో విసుగెత్తిపోయి కొంతమంది కొంత వెరైటీగా ప్రయత్నిద్దామన్న ఉద్దేశ్యంతో అర్ధరాత్రి సమయంలోనూ, తెల్లవారుఝాము సమయంలోనూ ఎటి ఎంలకు వెళ్లి నగదు విత్‌డ్రా చేసుకుంటున్నారు. మరికొంతమంది ఇంకొంత తెలివిగా ఆలోచించి రాత్రి 11.30 గంటలు దాటిన తరువాత ఎటి ఎంలకు చేరుకుని ఒక రోజు కోటా 2000, కొద్దిసేపు వేచి వుండి 12 గంటలు దాటిన తరువాత ఆ తరువాత రోజు కోటా రెండు వేల రూపాయలు విత్‌డ్రా చేసుకుని ఇంటిదారి పడుతున్నారు. అయితే ఈ కష్టాలు మధ్య ఒళ్లు కుదిపేస్తున్న చలిని కూడా మరచిపోయి నగదు కోసం జనం పడే పాట్లు ఈ విధంగా వున్నాయి.
11.50 లక్షల చంద్రన్న కానుకలు సిద్ధం
జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి శివశంకర్‌రెడ్డి
జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 22: జిల్లాలో క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా పేదలకు పంపిణీ చేసేందుకు 11.50 లక్షల చంద్రన్న కానుకలు సిద్ధం చేసినట్టు జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి డి.శివశంకర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత శుక్రవారం పర్యటన సందర్భంగా ఏర్పాట్లను గురువారం ఆయన, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఎం.గణపతిరావు, ఆర్డీఒ ఎస్.లవన్న, తహసీల్దార్ జివివి సత్యనారాయణ పరిశీలించారు. సభాప్రాంగణం అయిన ఆలపాటి గంగాభవానీ కల్యాణ మండపాన్ని పరిశీలించారు. అనంతరం మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ జివివి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండలంలోని చౌక డిపో డీలర్లతో సమావేశమయ్యారు. మంత్రులు 23న లబ్ధిదారులకు చంద్రన్న కానుకలు, దీపం గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేస్తారని, లబ్ధిదారులను సభావేదిక వద్దకు తీసుకురావాలని డీలర్లను ఆదేశించారు. అనంతరం శివశంకర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా చంద్రన్న కానుకలు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. క్రిస్మస్‌కు తీసుకున్న వారికి సంక్రాంతికి కానుకలు ఉండవని చెప్పారు. జిల్లాను పొగ రహిత జిల్లాగా మార్చడానికి దీపం పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 103 శాతం వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. కుటుంబాలకు మించి జిల్లాలో 10.60 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్టు చెప్పారు. విద్యార్థులు, ఒంటరిగా ఉన్నవాళ్లు, వ్యక్తిగతంగా వాడుకునే వారు 18 వేల మందిని గుర్తించామని, వీరికి కూడా దీపం పథకంలో వంట గ్యాస్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు. ఆధార్‌కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం ఉంటే స్పాట్‌లో వంట గ్యాస్ కనెక్షన్ ఇస్తామని, కనెక్షన్‌కు 1100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, గ్యాస్ పొయ్యిలు ఎవరి ఇష్టమైనవి వారు కొనుగోలు చేసుకోచ్చని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 55,947 మంది రైతుల వద్ద 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు చెప్పారు. ధాన్యం అమ్మిన రైతులకు 794 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 709 కోట్ల రూపాయలు చెల్లించినట్టు తెలిపారు. ఈ మొత్తాలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్టు చెప్పారు. రబీ సీజన్ మొదలైనందున పెట్టుబడుల కోసం బ్యాంక్‌ల నుండి నగదు విత్‌డ్రాయల్ చేసుకునే వీలు కూడా కలెక్టర్ కల్పిస్తున్నారని చెప్పారు. త్వరలో విత్‌డ్రాయల్ సమస్య కూడా పరిష్కారం కానుందన్నారు. జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం 50 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 46 వేల దరఖాస్తులు అర్హమైనవని గుర్తించామని చెప్పారు. రానున్న జన్మభూమిలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పారు.
శ్రీవారి ఆలయంలో ఇకపై పెద్దనోట్లు చెల్లవు
ద్వారకాతిరుమల, డిసెంబర్ 22: ప్రభుత్వం రద్దుచేసిన పెద్దనోట్లు ఇకపై శ్రీవారి ఆలయంలో చెల్లవు. ఈ రద్దయిన నోట్లతో ఇప్పటి వరకూ పలువురు యాత్రికులు, భక్తులు అనేక సేవలు పొందారు. ఇకపై అటువంటి వారు జాగ్రత్తపడాల్సిందే. పెద్ద నోట్లు రద్దయిన నాటి నుండి చిన వెంకన్న క్షేత్రంలో భక్తులకు నోట్ల కష్టాలు పెద్దగా కనబడలేదు. దీనికి కారణంగా సుదూర ప్రాంతాల నుండి ఆలయానికి వచ్చే వేలాది మంది యాత్రీకుల్లో కొందరు పెద్ద నోట్ల ద్వారా టిక్కెట్లు, ప్రసాదాలు కొనుగోలు చేశారు. అయితే ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం రద్దయిన నోట్లు బ్యాంకుల్లో మాత్రమే చెల్లుబాటు అవుతాయని, మరెక్కడా చెల్లవని స్పష్టం చేయడంతో ఆలయ అధికారులు తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
పట్టిసం అభివృద్ధికి సిఎం ఆదేశం
దేవాదాయ శాఖ డిప్యూటి కమిషనర్ రమేష్‌బాబు
పోలవరం, డిసెంబర్ 22: పట్టిసం వీరేశ్వరస్వామి ఆలయ పరిసర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయమని ముఖ్యమంత్రి ఆదేశించారని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్‌వి రమేష్‌బాబు తెలిపారు. గురువారం వీరేశ్వర స్వామి ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు, పట్టిసం ఎత్తిపోతల వంటి పెద్ద ప్రాజెక్టులు ఉన్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని, ఈ నేపథ్యంలోనే పట్టిసం ఆలయ పరిసరాలను కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి అయ్యేటందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సిఎం సూచించినట్టు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఆలయాన్ని ఆనుకుని ఉన్న 22 ఎకరాలలో రిసార్ట్స్, అతిథి గృహం, భక్తుల విశ్రాంతి భవనం నిర్మించేందుకు అనువుగా ఉన్నాయని తెలిపారు. అలాగే నది దాటేందుకు వంతెన నిర్మాణానికి నివేదిక తయారుచేసి సిఎంకు సమర్పించనున్నట్టు చెప్పారు. ఆలయ ఆవరణలో అనిస్ర్తి, పుణ్యస్ర్తి విగ్రహాలు ఉన్నందున మహిళా భక్తులు రాత్రి సమయాల్లో ఆలయంలోనే ఉంటారు కానుక ఆలయం పక్కన పెద్ద హాలు నిర్మించాల్సి ఉందన్నారు. తొలుత ఆలయానికి వచ్చిన ఎండోమెంట్స్ డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈయన వెంట ఆలయ ఇవో పి విశ్వనాధరాజు తదితరులు ఉన్నారు.
215 మంది పేదలకు ఆర్ధిక సహాయం
ఎమ్మెల్యే బడేటి బుజ్జి
ఏలూరు, డిసెంబర్ 22 : ఆపదలో ఉన్న ప్రతీ పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి జాతీయ కుటుంబ సహాయ పధకం కింద 215 మంది పేదలకు ఆర్ధిక సహాయం అందజేస్తున్నామని ఎమ్మెల్యే బడేటి బుజ్జి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం భర్తను కోల్పోయిన 215 మంది మహిళలకు 20 వేలు రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయాన్ని ఆయన అందజేశారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి దురదృష్ట వశాత్తూ మరణిస్తే ఆ కుటుంబంలోని సభ్యులను ఆదుకోవడానికి ఈ పధకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తొలుత ఒక్కొక్క కుటుంబానికి అయిదు వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించాలని భావించగా ముఖ్యమంత్రి 20 వేల రూపాయలకు పెంచారని ఆయన చెప్పారు. చంద్రన్న బీమా పధకం పేదల జీవితాలకు ఒక ధీమాగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున బీమా పధకాన్ని ప్రోత్సహిస్తున్నామని కేవలం పనిచేసే కార్మికులు ఏడాదికి 15 రూపాయలు చంద్రన్న బీమాకు చెల్లిస్తే 134 రూపాయలు ప్రభుత్వ పరంగా బీమా కంపెనీకి వెచ్చిస్తామని దీని వలన ప్రమాద వశాత్తూ ఆ వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి అయిదు లక్షల రూపాయలు పరిహారం అందిస్తామని ఆయన చెప్పారు. సహజ మరణం సంభవించినా 30 వేల రూపాయలు ఆ కుటుంబానికి అందిస్తామని మరణించిన తర్వాత కూడా మరొకరికి భారం కాకూడదనే ఉద్దేశ్యంతో చంద్రబాబు ఈ పధకాన్ని ప్రవేశపెట్టారని ఏ ఒక్కరూ కూడా జాలిగా బాధపడుతూ మరణించిన వ్యక్తి దహన సంస్కారాలు చేయాల్సిన పనిలేదని తక్షణమే బీమా కంపెనీ అయిదు వేల రూపాయలు దహన ఖర్చులకు చెల్లిస్తుందని తర్వాత కుటుంబ సభ్యులకు 25 వేల రూపాయలు ఇస్తుందని అందుకే ప్రతీ ఒక్కరూ చంద్రన్న బీమా పధకంలో చేరాలని ఆయన కోరారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కొత్తగా 2700 మంది పేదలకు పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసామని జనవరి 2 నుంచి 12వ తేదీ వరకూ జరగనున్న జన్మభూమి సభల్లో ఈ పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి జన్మభూమి సభలో పెన్షన్లు రాకపోతే ప్రభుత్వ తప్పిందిగా భావించి వితంతువులకు బడేటి చారిటబుల్ ట్రస్టు నుంచి స్వంత సొమ్ము పెన్షన్ రూపంగా స్వయంగా అందజేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఎక్కడైనా సాంకేతికలోపం వలన వితంతువులకు పెన్షన్ మంజూరు కాకపోతే బాధపడవద్దని వారందరికీ ప్రతీ నెలా తాను స్వంతంగా పెన్షన్ ఇచ్చి ఆదుకుంటానని ఆయన చెప్పారు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పాలి ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో పేదలను అన్ని విధాల ఆదుకోవడానికే స్వర్గీయ ఎన్‌టి ఆర్ తెలుగుదేశం పార్టీని స్తాపించి పేదరికం లేని సమాజంకోసం పాటుపడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీ పేద కుటుంబాన్ని ధనవంతులతో సమానంగా అభివృద్ధి చేయడానికి నిరంతరం కష్టపడుతున్నారని చెప్పారు. సమావేశంలో కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు, డిప్యూటీ మేయర్ కిషోర్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఉప్పాల జగదీష్‌బాబు, ఎంపిపి రెడ్డి అనురాధ, తహశీల్దారు చంద్రశేఖర్, కార్పొరేటర్లు నాయుడు పోతురాజు, రాధాబాబు, వీరంకి త్రినాధ్, కప్పా ఉమామహేశ్వరరావు, భీమవరపు హేమసుందరి, జిజ్జువరపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నవీన ఆవిష్కరణలు చేసేది యువ ఇంజనీర్లే

భీమవరం, డిసెంబర్ 22: యువ ఇంజనీర్లు నూతన ఆవిష్కరణలతో చక్కని వ్యాపారాలు ప్రారంభించి మరికొందరికి ఉపాధి కల్పించాలని ప్రముఖ విద్యావేత్త, జిఆర్‌ఐఇడి డైరెక్టర్ ప్రొఫెసర్ పిఎస్ రాజు అన్నారు. భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కళాళాల సిఎస్‌ఇ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో స్ఫూర్తి-16 జాతీయస్థాయి విద్యార్థి సింపోజియమ్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిఎస్‌ఇ హెడ్ డాక్టర్ జివి పద్మరాజు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ పిఎస్ రాజు మాట్లాడుతూ ఎస్‌ఆర్‌కెఆర్ పూర్వ విద్యార్థులు స్థాపించిన పరిశ్రమలు ఎంతోమందికి ఉపాది కల్పించి దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు. మరో ముఖ్య అతిధి ఎస్‌ఆర్‌కెఆర్ పూర్వ విద్యార్థి పిసి వర్మ మాట్లాడుతూ యువత సాఫ్ట్‌స్కిల్స్‌లో చక్కని ప్రతిభ కనబర్చాలన్నారు. ఎస్‌ఆర్‌కెఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పార్థసారధివర్మ మాట్లాడుతూ ఎస్‌ఆర్‌కెఆర్‌లో అన్ని విభాగాల్లో పరిశోధన కేంద్రాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కెవిఎస్‌ఎన్ రాజు, కన్వీనర్ వి.చంద్రశేఖర్, సిఎస్‌ఇ హెడ్ జివి పద్మరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని చర్యలను నిరసిస్తూ సిపిఐ కార్యకర్తల సత్యాగ్రహం
ఏలూరు, డిసెంబర్ 22: : పెద్ద నోట్ల రద్దుతో వందలాది మంది సామాన్యులు ప్రాణాలు వదులుతుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రధాని కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారని సిపి ఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ విమర్శించారు. ప్రధాని చర్యలను నిరసిస్తూ సిపి ఐ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ ఆర్ పేటలోని జిల్లా లీడ్ బ్యాంకు వద్ద సిపి ఐ కార్యకర్తలు గురువారం సత్యాగ్రహం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ఎర్రరిబ్బన్ వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ పెద్ద నోట్లు రద్దు చేసి 44 రోజులు గడచిపోయాయని, ఇప్పటికీ సొమ్ము కోసం బ్యాంకులు, ఎటి ఎంల వద్ద క్యూలైన్లలో జనం నిలబడాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ విధంగా క్యూలైన్లలో వుండి 115 మంది మృతిచెందారని వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణం ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా 2.20 లక్షల ఎటి ఎంలు వుంటే వాటిలో 30 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని, లక్షల మంది క్యూలైన్లలోనే కొనసాగుతున్నారని చెప్పారు. ఈ పరిణామాల వల్ల చేతివృత్తులన్నీ దెబ్బతిన్నాయని, చిరువ్యాపారులు తీవ్ర నష్టాల బారిన పడ్డారని పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడే పరిస్థితికి వచ్చాయన్నారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పదేపదే చెబుతున్నారని, కానీ నిరక్షరాస్యత ఎక్కువగా వున్న దేశంలో నగదు రహిత లావాదేవీలు కష్టసాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రెడ్డి శ్రీనివాసడాంగే, పుప్పాల కన్నబాబు, కడుపు కన్నయ్య, పాల రామకృష్ణ, బేత శంకర్, వి ప్రసాద్, గాళ్ల శారద, కుప్పన పార్వతి పాల్గొన్నారు.
ఆరోగ్య సిబ్బంది ధర్నా
ఏలూరు, డిసెంబర్ 22 : పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వమే నిర్ణయించాలని, కేంద్రాల నిర్వహణను అపోలుకు అప్పచెప్పేందుకు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక 29వ డివిజన్ టైటస్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద జరిగిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. గత 16 సంవత్సరాలుగా పట్టణ మురికివాడల ప్రజానీకానికి వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందిని తొలగించి వైద్య సేవలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలంతా వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేంద్రాలను ప్రభుత్వ నిర్వహణలో వున్నప్పుడు ఒక్కో కేంద్రానికి లక్ష రూపాయలు కేటాయించి ప్రైవేటు వ్యక్తులకు మాత్రం నెలకు 5 లక్షలు కేటాయించడం వెనుక కోట్లాది రూపాయల కుంభకోణం దాగి వుందన్నారు. ప్రభుత్వమే నిర్వహిస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. దీనిపై తాము హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని, విషయం కోర్టులో పెండింగ్‌లో వుందని, కానీ దానికి భిన్నంగా అధికారులు అపోలుకు అనుకూలంగా వ్యవహరిస్తారని విమర్శించారు. ధర్నాలో కార్పొరేటర్ వి లక్ష్మి, వివిధ సంఘాల నాయకులు సిహెచ్ పోశారత్నం, దుర్గాంజలి, వి అరుణ, పద్మజ రాణి, విక్టోరియా, సక్కుబాయి, జనని, గ్రేస్ కమల, విజయకుమారి, ఝాన్సీ, వెంకటలక్ష్మి, మహాలక్ష్మి, భవానీ తదితరులు పాల్గొన్నారు.
నేడు మంత్రులు సునీత, సుజాత పర్యటన
జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 22: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, రాష్ట్ర మహిళా సాధికారిత, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత శుక్రవారం ఉదయం 9 గంటలకు జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేస్తున్నారని పట్టణ టిడిపి అధ్యక్షుడు షేక్ ముస్త్ఫా తెలిపారు. పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం మంత్రులు ఆలపాటి గంగాభవానీ కల్యాణ మండపంలో లబ్ధిదారులకు చంద్రన్న క్రిస్మస్ కానుకలు, దీపం గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయనున్నారని తెలిపారు. తొలుత శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రులు పూజలు చేస్తారని తెలిపారు. మంత్రి పరిటాల సునీత తొలిసారిగా పట్టణానికి వస్తున్నందున ఘనస్వాగతం పలకాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
వెయిట్ లిఫ్టింగ్ డైరెక్టర్‌గా బడేటి
ఏలూరు, డిసెంబర్ 22 : తమిళనాడులోని నాగర్ కోయిల్‌లో ఈ నెల 26 నుంచి 30 వరకు జరగనున్న వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు కాంపిటేషన్ డైరెక్టర్‌గా రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు బడేటి వెంకట్రామయ్య ఎంపికయ్యారు. ఈ మేరకు భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య ఎంపిక చేసింది. అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ కేటగిరి-1 రిఫరీ అయిన బడేటి గతంలో అనేక జాతీయ, అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు న్యాయ నిర్ణీతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా బడేటిని వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ వెయిట్ లిఫ్టర్లు, జిల్లా ఒలింపిక్స్ సంఘం సభ్యులు ఆయన్ను అభినందించారు.
కనీస వేతనాల కోసం డిమాండ్
ఏలూరు, డిసెంబర్ 22 : గ్యాస్ డెలవరీ కార్మికులకు ప్రభుత్వ చట్ట ప్రకారం కనీస వేతనాలు, పెన్షన్ సౌకర్యాలను కల్పించాలని సి ఐటియు రాష్ట్ర నాయకులు చింతకాయల బాబూరావు డిమాండ్ చేశారు. జిల్లా గ్యాస్ డెలివరీ బాయ్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సి ఐటియు నాయకులు ఎవి నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డి ఎన్‌విడి ప్రసాద్, వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి కృషి
ఎమ్మెల్యే ముప్పిడి
గోపాలపురం, డిసెంబర్ 22: ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు పథకాలు రూపకల్పన చేస్తున్నారని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం అందిస్తోన్న క్రిస్మస్ కానుకలను ఎమ్మెల్యే గురువారం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ముప్పిడి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ప్రభుత్వం క్రైస్తవులకు కానుకలు అందజేస్తోందని చెప్పారు. అభివృద్ధిలో రాష్ట్రంలోనే గోపాలపురం ప్రథమ స్థానంలో నిలవడం ఆనందదాయకమని ఎమ్మెల్యే ముప్పిడి పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా పనిచేస్తూ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపిపి రత్నాజీ చౌదరి, జడ్పీటీసీ ఈలి మోహినీ పద్మజారాణి, తహసీల్దారు నరసింహమూర్తి, ఎంపిడిఒ కృష్యప్రసాద్, మండల పరిషత్ ప్రతిపక్ష నేత వెలగా శ్రీరామ్మూర్తి, పలు గ్రామాల టిడిపి నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్దిదారులు పాల్గొన్నారు.