తూర్పుగోదావరి

ముగిసిన సాగర హేల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 15: కాకినాడ బీచ్ ఫెస్టివల్-2017 వాకలపూడి ఎన్టీఆర్ తీరంలో ఆదివారం రాత్రి ముగిసింది. కాకినాడ-ఉప్పాడ తీర మార్గం వెంబడి, హరిత రిసార్ట్స్, వాకలపూడి రోడ్డు తదితర ప్రాంతాల్లో పొద్దుపోయినా పర్యాటకుల హడావుడి కనిపించింది. సాగర తీరంలో సాంస్కృతిక సంబరాన్ని ప్రజలు తిలకించి ఆనందించారు. ఈనెల 12 నుండి ఆదివారం రాత్రి వరకు ఎన్టీఆర్ సాగర తీరంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. బీచ్ ఫెస్టివల్ ఆరంభం నుండి అనేక సమస్యలు ఎదురయ్యాయి. సంబరాల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగానికి ముందుచూపు లోపించింది. దీంతో ఆయా వర్గాలకు శిరోభారం తప్పలేదు! అర్ధం లేని రీతిలో అనువు గాని చోట (్భగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో) ఫెస్టివల్ నిర్వహించి, ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహాన్ని చవి చూశారు. ఫలితంగా ఉద్యోగులు బీచ్ ఫెస్టివల్ విధులను బహిష్కరించారు. కోడి పందాల నేపథ్యంలో పోలీసులు బరుల వద్దకు వెళ్ళకుండా సాగర సంబరాలకు పరిమితమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఓ విధంగా కోడి పందాలకు పోలీసులను వెళ్ళకుండా చేసేందుకు ఇదొక వ్యూహంగా పలువురు పేర్కొన్నారు. ఇక పార్కింగ్ ఏర్పాట్లు అధ్వాన్నంగా కనిపించాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు! గత అనుభవాలను చూసైనా సంబంధిత అధికారులకు ఈ విషయంలో కనువిప్పు కలుగలేదు! కేవలం వారం రోజుల వ్యవధిలో ఆయా సాంస్కృతిక కార్యక్రమాలను ఖరారు చేయడం, ప్రజల్లో తగిన ప్రచారం చేయకపోవడం, ఏ కార్యక్రమాన్ని ఎపుడు నిర్వహిస్తున్నారో ఎవరికీ తెలియకపోవడం ఈ ఏడాది మరో ప్రథాన వైఫల్యం! ఇక చివరిరోజైన ఆదివారం ముగింపు ఉత్సవాలకు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మినహా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులెవరూ రాకపోవడం విమర్శలకు తావిచ్చింది. అలాగే సంక్రాంతి రోజైన శనివారం జరిగిన నేను లోకల్ సినిమా ఆడియో ఫంక్షన్‌లో స్థానిక ఎమ్మెల్యేలకు కనీసం కుర్చీ వేయకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అధికారులు ప్రొటోకాల్ పాటించలేదంటూ అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడం గమనార్హం! ఉత్సవాల ప్రారంభం రోజు, ముగింపు రోజు హాజరైన చినరాజప్ప పర్యాటకులనుద్దేశించి ప్రసంగించారు. కాకినాడ ఎన్టీఆర్ సాగర తీరాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నాలుగు రోజుల పాటు నిర్వహించిన సాగర సంబరాలకు పెద్ద ఎత్తున పర్యాటకులు హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. బీచ్ ఫెస్టివల్ స్ఫూర్తితో కోనసీమ, గిరిజన ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. కోరంగి అభయారణ్యం, హోప్ ఐలాండ్, గోదావరి తీర ప్రాంతాలను వచ్చే ఏడాదిలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని తెలిపారు. గోదావరి తీర ప్రాంతాన్ని, పాపి కొండలు, దిండి, కడియం ప్రాంతాలను కలిపి టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని ఆయన వివరించారు. కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, అడిషనల్ ఎస్పీ ఎఆర్ దామోదర్, వివిధ శాఖల అధికారులు తదితరులు వేదికను అలంకరించారు.
వైభవంగా ప్రభల తీర్థం

మామిడికుదురు, జనవరి 15: ప్రతి ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ప్రభల తీర్థమహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మామిడికుదురు శివారు కొర్లకుంట వద్ద ప్రభలను ఉంచి తీర్థమహోత్సవం నిర్వహించారు. పలు గ్రామాల నుండి విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. మండలంలోని పెద పట్నం, మామిడికుదురు, ఈదరాడ, నగరం, పాశర్లపూడి గ్రామాల నుండి ప్రభలను ఊరేగింపుగా తీర్థమహోత్సవ క్షేత్రానికి తీసుకువచ్చారు. ఆయా గ్రామాల వీధుల్లో ఊరేగించి తీర్థమహోత్సవానికి తీసుకువచ్చారు. భక్తులు ప్రభలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. పెద పట్నం నుండి తీసుకువచ్చిన ప్రభలను కొర్లకుంట వద్ద పంట కాలువ నుండి దాటించారు. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా బారులుతీరారు.

అటకెక్కిన 144 సెక్షన్
కొనసాగిన జూదాలు
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, జనవరి 15: సంక్రాంతి సాంప్రదాయల పేరుతో నిర్వహించి అసాంఘిక, అశ్లీల, చట్ట వ్యతిరేక కార్యక్రమాలను నియంత్రించడంలో పోలీసులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పండక్కి ముందు ఆరునూరైనా ఈసారి కోడి పందాలు, గుండాట, అశ్లీల, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఊరూరా అవగాహనా సదుస్సులు, ప్లెక్సీలు, మైక్‌ల ద్వారా ప్రచారాలు నిర్వహించిన పోలీసులు చివరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల అధికార దర్పం ముందు మోకారిల్లక తప్పలేదు. అంతేకాకుండా జన్మభూమి మావూరు గ్రామ సభల్లో అధికార పార్టీ నాయకులే కోడి పందాలు నిర్వహణ చట్ట వ్యతిరేకమని ప్రకటించడం, వారే స్వయంగా ముహూర్తాలు చూసి పందాలను ప్రారంభించడం చూస్తుంటే మన రాజకీయ నాయకులు మాటలకు అర్ధాలే వేరని స్పష్టం చేస్తున్నాయి. సంక్రాంతిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా అమలు చేసిన 144 సెక్షన్ జాడ లేకుండా పోయింది. దీంతో పందాలరాయుళ్లు రెచ్చిపోయారు. ఐ పోలవరం మండలం మురమళ్ళలో ఏర్పాటు చేసిన భారీ కోడి పందాల బరి ఫ్యాక్షన్ సామ్రాజ్యం సంస్కృతి ఈ ప్రాంతానికి వచ్చేసిందా అన్న అనుమానాన్ని కలుగుజేసింది. ఇక్కడ కోడి పందాలు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన బరి చుట్టూ నిర్మించిన ఇనుపకంచే, బారికేడ్లు, ఇనుప గేట్లు, గేట్ల వద్ద తనిఖీలు వంటివి నిర్వాహకుల అధికార అహకారాన్ని స్పష్టం చేసాయి. ఇక్కడ ఏర్పాట్ల చూసిన వారికి ప్రభుత్వమే అధికారికంగా కోడి పందాలు నిర్వహిస్తుందన్న అనుమానం కలగక మానదు. ఇక్కడ ఏవిధమైన అల్లర్లు జరగకుండా, కోడిపందాలను ఫొటోలు తీయకుండా నియమించుకున్న సొంత సైన్యం ఆగడాలు వర్ణించ తరము కాదంటే అతిశయోక్తికాదు. సరదాగా ఫొటోలు తీసుకున్న సందర్శకుల విలువైన సెల్‌ఫోన్లను ఇక్కడ విధులు నిర్వహించిన బౌన్సర్లు ధ్వంసం చేసారంటే పోటీలను ఏస్థాయిలో నిర్వహించారో అర్ధం చేసుకోవచ్చు. మురమళ్ళ బరిలో పండగ మూడు రోజులు కోట్లలోనే చేతులు మారాయి. అలాగే పండుగ పేరుతో ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి, మలికిపురం మండలం శంకరగుప్తం, రాజోలు, కాట్రేనికోన, అల్లవరం, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం తదితర ప్రాంతాల్లో కోడిపందాలు, అశ్లీల నృత్యాలు అడ్డూఅదుపూ లేకుండా నిర్వహించారు. దీనిపై అమలాపురం డివిజన్‌లోని ఒక పోలీసు అధికారిని కదిలిస్తే ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులను కాదని ఏ అధికారి ఏమీ చేయలేరని నిట్టూర్చడం విశేషం. అలాగే పందాలు నిర్వహించే ప్రాంతల్లో మద్యం ఏరులై పారింది.
రసవత్తరంగా రాష్టస్థ్రాయి కబడ్డీ పోటీలు

రావులపాలెం, జనవరి 15: సంక్రాంతి సందర్భంగా రావులపాలెం ప్రభుత్వ ఉభయ కళాశాలల మైదానంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్టస్థ్రాయి పురుషుల, మహిళల ఆహ్వాన కబడ్డీ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. ఆదివారం రాత్రి వరకూ జరిగిన ఆఖరి రోజు పోటీల్లో పురుషుల విభాగంలో ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లా జట్లు ఫైనల్స్‌కు చేరుకోగా, మహిళల విభాగంలో విశాఖ, విజయనగరం జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఆఖరి రోజు పోటీలను ఎంపిపి కోట చెల్లయ్య, కాంగ్రెసు నాయకులు ఆకుల రామకృష్ణ, సిఆర్సీ రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఫైనల్స్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ పోటీలను తిలకించేందుకు రావులపాలెం పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున క్రీడాభిమానులు తరలివచ్చారు. పోటీల ఏర్పాట్లను సిఆర్సీ అధ్యక్ష, కార్యదర్శులు మల్లిడి కనికిరెడ్డి, కర్రి అశోక్‌రెడ్డి, కోచ్ డైరెక్టర్ నల్లమిల్లి వీరాఘవరెడ్డి పర్యవేక్షించారు.

శరణుఘోషతో పులకించిన ఆంధ్రా శబరిమలై
శంఖవరం, జనవరి 15: మండలంలోని సబ్‌ప్లాన్ ఏజన్సీ సిద్ధివారిపాలెంలోని సిద్ధి పుణ్యక్షేత్రం ఆంధ్రా శబరిమలైలో శనివారం మకరజ్యోతిని దర్శిస్తూ అయ్యప్ప మాలాధారులైన స్వాములు, భక్తులు చేసిన శరణుఘోషతో ఆంధ్రా శబరిమలై పులకించింది. మకర సంక్రాంతిని పురస్కరించుకొని అయ్యప్పస్వామి వారిని తెల్లవారుజామున అలంకరించి, స్వామివారికి ప్రీతికరమైన పుష్పాలు, ముత్యాలు, పంచామృతాభిషేకాలను ఆలయ ఛైర్మన్ భూపతి కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామి దంపతులు నిర్వహించారు. ఆలయానికి ఎదురుగా ఉన్న ఉషాద్రి పర్వతంపై సాయంత్రం 6.18 గంటలకు భక్తులకు స్వామి వారి మకరజ్యోతి దర్శన భాగ్యం కలిగింది. తొలుతగా మణికంఠుని ఆభరణాలను ఆంధ్రా శబరిమలైలో పంబగా పిలువబడుచున్న అంకంపాలెంలోని పందళరాజ భవంతిలో భక్తుల దర్శనార్థం ఉంచి, మధ్యాహ్నం ఆంధ్రా శబరిమలైలో స్వామి సన్నిధిలో మేళతాళాలు, బాణాసంచాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం అయ్యప్ప ఆలయంలోని పడినెట్టాంబడిపై 18 కళశాలను ప్రతిష్టించి, 36 జ్యోతులను ప్రజ్వలింపజేసి, ప్రత్యేక పుష్పాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉషాద్రి పర్వతాలపై మకరజ్యోతి దర్శనం దర్శనమివ్వడంతో భక్తులు చేసిన అయ్యప్ప శరణుఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. సంక్రాంతి సంధర్బంగా ఆంధ్రా శబరిమలైలో 18 భోగి మంటలు వేసి, ఆలయాన్ని విధ్యుద్ధీపాలంకరణతో సుంధరంగా తీర్చిదిద్దారు. జ్యోతి దర్శన సమయంలో భారీ భాణా సంచా కాల్చారు. భక్తులకు ఆలయ కమిటీ ప్రత్యేక సౌకర్యాలు కల్పించి స్వామివారి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కుసుమంచి రాజ్‌కుమార్, కుసుమంచి సీతారాం, కీర్తి కృష్ణ, పసగడుగుల నాగేశ్వరరావు, కృష్ణారావు, సిద్ధా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రభల తీర్థంలో వివాదం
ముమ్మిడివరం, జనవరి 15: అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని ఉల్లంఘించారని ముమ్మిడివరం మండలం పల్లిపాలెంలో జరిగిన ప్రభల తీర్థం వివాదాస్పదంగా ముగిసింది. సమస్యను పరిష్కరించేందుకు ఉత్సవ కమిటీ, పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పల్లిపాలెంలో వంద ఏళ్ళ పూర్వం నుండే కనుమ రోజున ప్రభల తీర్థం జరుగుతుంది. అలాగే ఆదివారం తీర్థం నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసారు. మండలంలోని కొత్తలంక, కొమానపల్లి, ఠాణేలంక, ముమ్మిడివరం, చింతలమెరక, అగ్రహారం, 10వ మైలు ప్రభలతో పాటు వివిధ గ్రామాల నుండి ప్రభలను తీసుకువస్తారు. సాంప్రదాయం ప్రకారం తీర్థం జరిగే ప్రాంతానికి మొదటిగా ఠాణేలంకకు చెందిన ప్రభ వచ్చిన తరువాత మిగిలిన ప్రభలు చేరుకుంటాయి. ఒక వేళ ఏ ప్రభైనా ముందుగా వచ్చినా తీర్థం జరిగే ప్రదేశానికి కొంత దూరంలో ఆగి ఠాణేలంక ప్రభ వచ్చిన తరువాత రావడం గత కొనే్నళ్ళుగా వస్తున్న సాంప్రదాయం. అయితే ఈసారి కొమానపల్లికి చెందిన తల్లి ప్రభ ముందుగా తీర్థం జరిగే ప్రాంతానికి రావడంతో ఠాణేలంక ఉత్సవ కమిటీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. ఈ సందర్భంగా రోడ్డుపైనే ప్రభను పెట్టి ధర్నా నిర్వహించారు. వివాదాన్ని పరిష్కరించడానికి ఉత్సవ కమిటీ సభ్యులు పెనె్మత్స జగ్గప్పరాజు, పెనె్మత్స చిట్టిరాజు, ఎస్‌ఐ ఎం అప్పలనాయుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగా చింతలమెరక, అగ్రహారం ప్రభల కమిటీ సభ్యులు ఠాణేలంక ప్రభ కమిటీకి మద్దతు తెలపడమే కాకుండా అక్కడే మరో ప్రాంతంలో తీర్థం నిర్వహించారు. దీంతో ఇక్కడ కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి సాయంత్రం అయిదు గంటల సమయంలో ప్రధాన ప్రభైన కొత్తలంక ప్రభ వచ్చిన వెంటనే మిగిలిన ప్రభలన్నీ వెనుదిరిగి వెళ్ళిపోయాయి.
రాష్టస్థ్రాయి బాస్కెట్‌బాల్ పోటీలు ప్రారంభం
రామచంద్రపురం, జనవరి 15: స్థానిక శ్రీకృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం 11వ రాష్టస్థ్రాయి బాస్కెట్‌బాల్ పోటీలను ఎమ్మెల్సీ, టిడిపి విధాన నిర్ణయ కమిటీ ఛైర్మన్ వట్టికూటి వీరవెంకన్న చౌదరి (కూర్మాపురం అబ్బు) ప్రారంభించారు. రామచంద్రపురం బాస్కెట్‌బాల్ అసోసియేషన్ నిర్వహణలో ఈ పోటీలు నాలుగు రోజులపాటు శ్రీకృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో జరగనున్నాయి. రాష్ట్రం, రాష్ట్రేతర ప్రాంతాల నుండి పురుషుల విభాగంలో 32 జట్లు, మహిళల విభాగంలో 10 జట్లు క్రీడా పోటీలలో పాల్గొంటున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి తెలిపారు. కాగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి, ఎమ్మెల్సీ వట్టికూటి వీరవెంకన్న చౌదరి మాట్లాడుతూ రామచంద్రపురం పట్టణంలో బాస్కెట్‌బాల్ అసోసియేషన్ చేపట్టే కార్యక్రమాలు ప్రజాహితంతో కూడినవని అన్నారు. క్రీడలకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అత్యున్నత రీతిలో ప్రాధాన్యమిస్తోందని అన్నారు. క్రీడల ద్వారా శారీరక ధారుడ్యమే కాకుండా, మానసిక వికాసం, ఇరుగు పొరుగు వారితో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటంతోపాటు పోటీతత్వం అలవడుతుందన్నారు. బాస్కెట్‌బాల్ రింగ్‌లోకి వేసి, పోటీలను ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ మేడిశెట్టి సూర్యనారాయణ, ప్రముఖ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు, ఎపిఎస్‌పి 3వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ముద్రగడ నాగేంద్ర, స్థానిక డిఎస్పీ ఎన్‌బిఎం మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ చిలకమర్తి శ్రీరామశర్మ, డిసిసిబి డైరెక్టర్ చిలుకూరి విశే్వశ్వరరావు, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
గన్నమనికి ఘన సత్కారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన గన్నమని చక్రవర్తిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్సీ కూర్మాపురం అబ్బు నేతృత్వంలో నిర్వహించిన ఈ సత్కార కార్యక్రమంలో గౌరవ అతిథులుగా హాజరైన వారంతా పాల్గొన్నారు. ముందుగా శ్రీకృత్తివెంటి పేర్రాజు పంతులు చిత్రపటానికి కూర్మాపురం అబ్బు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.
మార్చిలో సుకుమార్ చిత్రం విడుదల: దర్శకుడు వివి వినాయక్
మలికిపురం, జనవరి 15: బిపిఆర్ క్రియేషన్ పతాకంపై సుకుమార్ సోదరుడు విజయకుమార్ నిర్మాతగా, మరొక సొదరుని కుమారుడు బండ్రెడ్డి అశోక్‌ను హీరోగా పరిచయం చేస్తూ చిత్రీకరించిన దర్శకుడు అనే చిత్రం మార్చి నెలాఖరునాటికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ప్రముఖ సినీ దర్శకుడు బి సుకుమార్ తెలిపారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడానికై స్వగ్రామమైన మట్టపర్రు వచ్చిన ఆయన మలికిపురం విలేఖరులతో మాట్లాడుతూ తన తండ్రి పేరుమీదుగా ఈ సంస్థను స్థాపించామని, తన వద్ద పనిచేసిన హరిప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు వహించగా సాయికార్తీక్ సంగీతం సమకూర్చుతున్నారన్నారు. ఇషా ఈ సినిమాలో హిరోయిన్‌గా నటిస్తోందని సుకుమార్ తెలిపారు. సినీ రంగంలో దర్శకుడుగా పనిచేసే వ్యక్తి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే అంశంపై ఈకథ ఉంటుందని ఆయన తెలిపారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన మూడు సినిమాలు విజయవంతం కావడం పట్ల సినీరంగం అంతా సంతోషం వ్యక్తం చేస్తోందన్నారు. ర్చి నెలాఖరులోగాని, ఏప్రిల్ మొదటివారంలో గాని ఈసినిమాను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని, మరో అయిదు రోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుందన్నారు.
కన్నుల పండువగా ప్రభలతీర్థం
రావులపాలెం, జనవరి 15: సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని ఆదివారం మండలంలోని దేవరపల్లిలో ప్రభల తీర్థం కనుల పండువగా జరిగింది. దేవరపల్లితోపాటు ఈతకోట, కేతరాజుపల్లి తదితర గ్రామాలకు చెందిన ప్రభల ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఊరేగింపుగా ప్రభలను దేవరపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వివిధ దేవతా రూపాలతో అందంగా తయారుజేసిన ఈ ప్రభలను పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు.
మలికిపురం: మండలంలోని కేశనపల్లి, తూర్పుపాలెం గ్రామాల్లో ఆదివారం ప్రభల తీర్థం ఘనంగా జరిగింది. ఇరు గ్రామాల్లో పలు గ్రూపుల నుండి ప్రభలను తీసుకు వచ్చి నీలపల్లమ్మ ఆలయం వద్ద భారీ ఎత్తున తీర్థం నిర్వహించారు. ఈసందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కనుమ పండుగ సందర్భంగా రైతులు బళ్ళ పూజ, ఏరువాక నిర్వహించారు. ఇదిలావుండగా మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లోని వివిధ గ్రామాల్లో సంక్రాంతి మూడవ రోజైన కనుమ రోజున కూడా భారీ ఎత్తున కోడిపందాలు, గుండాటల కొనసాగాయి.
అయినవిల్లి: సంక్రాంతి సందర్భంగా ఆదివారం అయినవిల్లి మండలంలో ప్రభల తీర్థ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అయినవిల్లిలో దశ ఆంజనేయ యువజన సంఘం ఆధ్వర్యంలో సిద్ధివినాయకస్వామి ఆకృతితో చేసిన ప్రభ అందర్నీ ఆకర్షింపచేసి ప్రధమస్థాయిలో నిలిచింది. కడియపులంక నుండి తెచ్చిన వివిధ రకాల పూలతోఅలంకరించి వారంరోజులు ఈప్రభను యువకులు తయారు చేశారు. ఆదివారం ముక్తేశ్వరం హైస్కూలు ఆవరణలో విలస, కె జగన్నాధపురం, సిరిపల్లి, తొత్తరమూడి, మడుపల్లి, అయినవిల్లి, అయినవిల్లిలంక, మాగాం, ఎస్ మూలపొలం గ్రామాల నుండి ప్రభలు హైస్కూలుకు తరలివచ్చాయి.