తూర్పుగోదావరి

గృహ నిర్మాణంలో ప్రగతి చూపండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 21: ‘గృహనిర్మాణంపై దృష్టి సారించి, ప్రగతి చూపండి’ అని జిల్లా అధికారులను గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని ఆదేశించారు. వివిధ గృహ నిర్మాణ పథకాల క్రింద జిల్లాలో సుమారు 35వేల ఇళ్ళు నిర్మించనున్నట్టు చెప్పారు. మార్చి నెలాఖరుకు ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ హాలులో శనివారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మృణాళిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ గృహ నిర్మాణంలో జిల్లాకు 24వేల ఇళ్ళు, పిఎంఇ వైలో 4593 ఇళ్ళు, నగర/పట్టణ ప్రాంతాల్లో 5098 ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన హౌసింగ్ అధికారులు ఇళ్ళ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి, క్షేత్రస్థాయిలో ప్రగతి చూపాలని స్పష్టం చేశారు. జిల్లాలో 2004 సంవత్సరానికి ముందు మంజూరు చేసి, మరమ్మత్తులకు గురైన గృహాలకు 10వేల రూపాయల వంతున రిపేర్ల నిమిత్తం మంజూరు చేసినట్టు మంత్రి చెప్పారు. సంయుక్త కలెక్టర్-2, ఇన్‌ఛార్జి హౌసింగ్ పిడి జె రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ గృహ నిర్మాణ గ్రౌండింగ్‌లో మన జిల్లా వెనుకబడి ఉందని అంగీకరించారు. సకాలంలో గృహాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. హౌసింగ్ ఎస్ ఇ వెంకటరెడ్డి మాట్లాడుతూ గృహ నిర్మాణాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందన్నారు. ఇందుకు సంబంధిత అధికారుల కృషి అవసరమని చెప్పారు. సమావేశంలో ఉపాధి హామీ పథకం జాయింట్ సెక్రటరీ బాల సుబ్రహ్మణ్యం, హౌసింగ్ ఎస్‌ఇ ఒఎస్‌డి ఆర్‌వివి సత్యనారాయణ, డ్వామా పిడి నాగేశ్వరరావు, హౌసింగ్ ఇఇలు, డిఇలు, ఉపాధి హామీ పథకం నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

కాపుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి

అమలాపురం, జనవరి 21: కాపుల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని, కాపు కార్పొరేషన్ ద్వారా అమలాపురం నియోజకవర్గానికి 2వేల మందికి రుణాలను మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామాంజనేయ ప్రకటించారు. అమలాపురం నియోజకవర్గస్థాయిలో శనివారం బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన కాపు కార్పొరేషన్ రుణాలపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. గతంలో 500 రుణాలు ఇస్తే వాటిలో 350 మంది మాత్రమే స్వయం ఉపాధి రుణాలుగా ఉపయోగించుకోగలిగారన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో కాపుల పరిస్థితిని ఎమ్మెల్యే ఆనందరావు చలమలశెట్టికి వివరించడంతో ఆ సంఖ్యను రెండు వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. కాపులను బిసిల్లో చేర్చే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని, దీనిపై వెనుకడుగు వేసే ప్రసక్తేలేదన్నారు. బిసిలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైతే ఒకటి లేదా రెండు శాతం వారికి రిజర్వేషన్లు పెంచైనా సరే కాపులను తప్పనిసరిగా బిసిల్లో చేర్చడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించిన చర్చలు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. నిరుపేదల కాపులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కాపు కుటుంబాల పిల్లలను విద్యాపరంగా ఉన్నత చదువులు చెప్పించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. విదేశీ విద్య కోసం నిమిత్తం ఒక్కొక్క విద్యార్థికి 20లక్షల రూపాయలు కార్పోరేషన్ ద్వారా ఖర్చుచేస్తామన్నారు. దీనిలో 10లక్షలు ఉచితం కాగా మరో 10లక్షలు ఉద్యోగం వచ్చిన తరువాత ఆ విద్యార్థి చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ధనవంతుల పిల్లలతోపాటు పేదపిల్లలు కూడా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా 15వేల 500 మంది పేద కాపువిద్యార్థులకు ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్‌ఎస్ వంటి అత్యున్నత విద్యను అందించడం జరుగుతుందన్నారు. 25వేల మంది విద్యార్థులు చదువుపూర్తిచేసి ఖాళీగా ఉన్నవారికి జాబు గ్యారంటీ స్కీముకు లోబడి నైపుణ్యం సాధించడానికి శిక్షణ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో జాబ్‌మేళాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బిసి కార్పొరేషన్ డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రవౌళి, మున్సిపల్ ఛైర్మన్ చిక్కాల గణేష్, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మెట్ల రమణబాబు, ఎంపిపి బొర్రా ఈశ్వరరావు, అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం జడ్పీటీసీలు అధికారి జయవెంకటలక్ష్మి, వేగిరాజు ప్రవీణ, దేశంశెట్టి లక్ష్మీనారాయణ, ఎఎంసి ఛైర్మన్ గునిశెట్టి చినబాబు తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్రలకు అనుమతి తప్పనిసరి
ఎస్పీ రవిప్రకాష్ స్పష్టీకరణ
కాకినాడ సిటీ, జనవరి 21: జిల్లాలో ఎవరైన పాదయాత్రలు, ఊరేగింపులు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలంటే తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి తీసుకోవలసి ఉంటుందని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ స్పష్టం చేశారు. తమ అనుమతి లేకుండా పాదయాత్రలు నిర్వహించడానికి అనుమతించమన్నారు. కాకినాడ నగరంలోని జిల్లా పోలీస్ అతిథిగృహంలో శనివారం మధ్యాహ్నాం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో శాంతి భద్రల పరిస్థితులు సున్నితంగా ఉన్నాయని చెప్పారు. జిల్లాలో పలుప్రాంతాల్లోనే కాకుండా అత్యంత సున్నితమై ప్రాంతం అమలాపురంలో 1994, 1998, 2016వ సంవత్సరాల్లో ఆందోళనలు, హింసాత్మక సంఘనలు జరిగాయని గుర్తుచేశారు. దీనికితోడు కొన్ని వర్గాలు, కులాల మధ్య సమస్యలు గత కొన్ని నెలలుగా నెలకొన్నాయన్నారు. ఇటువంటి తరుణంలో ఎవరైన ఆందోళనలు, పాదయాత్రలు నిర్వహిస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తమకు ముందస్తు సమాచారం ఉందని ఆయన తెలియజేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, హైకోర్టు గతంలో ఇచ్నిన ఉత్తర్వుల ప్రకారం యాత్రలు చేయాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈహెచ్చరికలను పరోక్షంగా కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పధ్మనాభం ఈనెల 25వ తేదీ నుండి రావులపాలెం నుండి అంతర్వేది వరకు చేపట్టనున్న పాదయాత్రను గురించి ప్రస్తావించారు. దివీస్ కర్మాగారానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆందోళన నిర్వహించడానికి పోలీస్ శాఖ అనుమతి ఇవ్వని విషయాన్ని ఆయన ఈసందర్భంగా గుర్తుచేశారు. సిపిఎం పార్టీ వారు హైకోర్టు అనమతి తీసుకున్న అనంతరమే వారు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. కాపులు ఇటీవల కొవ్వొత్తుల ర్యాలీలు, కంచాలతో నిరసనలు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలను అందజేసే విషయంలో పోలీస్ శాఖ ఎటువంటి ఇబ్బందులు కలగజేయలేదని వివరించారు. ముందస్తు హెచ్చరికలు లేనికారణంగానే గతంలో కాపునాయకులు తునిలో నిర్వహించిన సభకు అనుమతి ఇచ్చామని ఈసందర్భంగా ఎస్పీ రవిప్రకాష్ చెప్పారు. శాంతియతంగా కార్యక్రమాలను నిర్వహించడానికి అందరికీ స్వాతంత్య్రం ఉంటుందన్నారు. అయితే కొన్ని కార్యక్రమాలు నిర్వహించే విషయంలో పోలీస్‌శాఖ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని దరఖాస్తు చేసుకున్న వాటికి అనుమతులు ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ రవిప్రకాష్ అన్నారు. కాపు నేతలు పాదయాత్ర నిర్వహించే విషయంలో ఇప్పటి వరకు పోలీస్ శాఖకు దరఖాస్తు చేసుకోలేదని స్పష్టం చేశారు. బిసి సంఘం నాయకులు ఈనెల 28, 29వ తేదీల్లో కాకినాడ నుండి రావులపాలెం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించేందుకు తమకు దరఖాస్తు చేసుకున్నారని, అయితే ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదన్నారు. జిల్లాలో ప్రస్తుతం సెక్షన్-30 అమలులో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. పోలీస్ శాఖకు పార్టీలు, వర్గాలతో ప్రమేయం లేదని శాంతి భద్రతలను పరిరక్షించడమే తమ ధ్యేయమని ఎస్పీ రవిప్రకాష్ చెప్పారు.
కేంద్ర పథకాల అమలుపై అసంతృప్తి
‘దిశ’లో అధికారులపై ప్రజాప్రతినిధుల గుర్రు

కాకినాడ, జనవరి 21: కేంద్ర ప్రభుత్వ పథకాల క్రింద విడుదలవుతున్న నిధులను సమర్ధవంతంగా వినియోగించడంలో అధికారులు వైఫల్యం చెందారని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు విమర్శించారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ హాలులో శనివారం డిస్ట్రిట్ ఇనిషియేటివ్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ హ్యూమన్ అడ్వాన్స్‌మెంట్ (దిశ) కార్యక్రమం క్రింద ఏర్పాటైన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి రాజమహేంద్రవరం ఎంపి, దిశ కమిటీ ఛైర్మన్ మాగంటి మురళీమోహన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు సమావేశంలో వివిధ సమస్యలను ప్రస్తావించారు. తొలుత నీటి సరఫరాపై జరిగిన చర్చలో జిల్లాలో దశాబ్దాల క్రితం నిర్మించిన తాగునీటి పథకాల పైపులైన్ల స్థానంలో కొత్త పైపులైన్లను నిర్మించకపోవడం శోచనీయమని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు అన్నారు. పెరిగిన జనాభా, ఆవాసాలకు అనుగుణంగా ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి ప్రతిపాదించాలని కోరారు. జిల్లాలోని ఏజన్సీ ప్రాంతంలో విజయవంతమైన సోలార్ ఆధారిత డ్యూయల్ పంపింగ్ పథకాలను తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న మెట్ట ప్రాంతాల్లో కూడా ఏర్పాటుచేయాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచించారు. విద్యాశాఖపై జరిగిన సమీక్షలో రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో పోషక విలువలు లేని చిన్న చిన్న గ్రుడ్లు వడ్డిస్తున్నారని, 50నుండి 60 గ్రాముల బరువుండే నాణ్యమైన కోడిగుడ్లను పిల్లలకు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిధులు కేటాయించినప్పటికీ పాఠశాలల్లో వంట షెడ్ల నిర్మాణాలు జరగడం లేదని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని పనులు తమకప్పగిస్తే కేటాయించిన నిధులతో సకాలంలో షెడ్లు నిర్మించి చూపిస్తామని వీర్రాజు అన్నారు. జిల్లాలోని పాఠశాలలకు చెందిన స్థలాలు, ఆస్తుల పరిరక్షణకు, పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పాదుకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపి మురళీమోహన్ అధికారులను ఆదేశించారు. అన్ని పాఠశాలలకు ప్రహారీ గోడలు నిర్మించాలని సూచించారు. పాఠశాలల్లో పనిచేసే వాచ్‌మెన్లు, స్వీపర్లకు సకాలంలో జీతాలు చెల్లించాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కోరారు. జిల్లా వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్ట్‌ల్లో నియామకాలు జరపాలని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కోరారు. ఆరోగ్య కేంద్రాలు సక్రమంగా పనిచేసేలా పటిష్టలైన చర్యలు తీసుకోవాలన్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ గిరిజన రైతులకు పవర్ టెల్లర్లకు బదులు పెద్ద ట్రాక్టర్లు మంజూరు చేయాలని కోరారు. విద్యుత్ శాఖకు సంబంధించి జరిగిన సమీక్షలో ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాచారం అందించకపోవడంతో ఆ శాఖ ఎస్‌ఇ మూర్తిపై కాకినాడ ఎంపి తోట నరసింహం ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షుడు నామన రాంబాబు, కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, తోట త్రిమూర్తులు, పులపర్తి నారాయణమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.