తూర్పుగోదావరి

రోడ్డెక్కని సిటీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 22: నగరంలో సిటీ బస్సులను ప్రవేశపెడతామని గొప్పగా ప్రకటించిన ప్రజా ప్రతినిధులు ఇపుడు మాట్లాడటంలేదు.. ఈ ప్రతిపాదనకు కాలదోషం పట్టింది. గోదావరి నది మహా పుష్కరాల సందర్భంగా పుష్కరాల అనంతరం నగరంలో సిటీ బస్సులను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. అయితే ఆటో యూనియన్ల వత్తిడితో ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహించడంతో ఈ ప్రతిపాదన కాస్తా మరుగున పడిందని తెలుస్తోంది.
వాస్తవానికి మొదటి దశలో 50 సిటీ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రతిపాదన రూపొందించింది. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు, వేమగిరి, కడియం, రాజానగరం, కోరుకొండ, రాజవోలు, ద్వారపూడి, అనపర్తి ఇలా వివిధ రూట్లలో నడిపేందుకు సిద్ధం చేశారు. నగరం శరవేగంగా విస్తరిస్తోంది. శివారు ప్రాంతాల్లో సుమారు యాభై కిలో మీటర్ల పరిధిలో వివిధ విద్యా సంస్థలు నెలకొన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు సిటీ బస్సులు లేక సతమతమవుతున్నారు. ఆర్టీసీ సిటీ బస్సులను నిర్వహిస్తే ఆటోల బాదుడు నుంచి తప్పించుకోవచ్చని ప్రయాణీకులు ఆశించారు. కానీ ఆశ నిరాశగానే మిగిలింది తప్ప కార్యరూపం దాల్చలేదు.
ఆటోలు అధికంగా ఉన్న కారణంగా సిటీ బస్సులు నడపడం సాధ్యం కాదని ఆర్టీసీ అంటోంది. రోజుకు ఒక బస్సును నడపాలంటే దానిపై రూ.11వేలు ఛార్జీల రూపంలో ఆదాయం రాబట్టగలిగితే నష్టం, లాభం లేకుండా నడపొచ్చని, అంతకంటే తక్కువ ఆదాయం వస్తే మాత్రం నష్టమేనని ఆర్టీసీ చెబుతోంది. ఒక్కో బస్సుకు ఐదుగురు సిబ్బంది చొప్పున, నెలకు రూ.2.50 జీతాల రూపేణా తీయాల్సి ఉంటుందని చెబుతున్నారు. మొదటి దశలో ప్రతిపాదించిన యాభై బస్సులకు అదనంగా 250 మంది సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుందని, ఒక్కోబస్సుపై సరాసరిగా రూ.11వేలు ఛార్జీల రూపేణా రాబట్టాల్సి ఉంటుందని, ఒక వేళ లాభాలు ఆశించాలంటే రూ.15వేలు తీయాల్సి వుంటుందని ఆర్టీసీ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఆటోలు అధికంగా ఉండటం వల్ల ఇంత ఆదాయం సాధించలేమని ఆర్టీసీ వెనుకంజ వేసినట్టు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం నగరం కేంద్రంగా ఆటోలు దాదాపు 60 కిలో మీటర్ల పరిధిలో చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్యకు ఇవే కారణమవుతున్నాయి. ఆటో ఎక్కి దిగితే రూ.10లు.. ఎక్కడా లేని విధంగా రాజమహేంద్రవరంలోని స్టేజ్ చార్జి వసూలు చేస్తున్నారని ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆర్టీసీ సిటీ బస్సులు నడిపితే ఇబ్బందులు తొలగుతాయని, ప్రధానంగా విద్యార్థులకు, గ్రామాల నుంచి వచ్చి పోయే ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కోరుతున్నారు. మరో వైపు బస్సు కోసం కనీసం ఐదు నిమిషాలు కూడా ఆగలేని స్థితి ప్రయాణికుల్లో ఉండటం వల్ల ఆటో మరింతగా పెరిగిపోయాయంటున్నారు. అయితే ఇపుడు ఏ బస్సు ఎపుడు వస్తుందో తెలియజేసే ఆధునిక సమాచార వ్యవస్థ ఆర్టీసీలో అందుబాటులోకి వస్తోంది కాబట్టి సిటీ బస్సుల విషయంలో కూడా అటువంటి సాంకేతికత ఏర్పాటు చేసి రాజమహేంద్రవరం నగరంలో సిటీ బస్సులను నడపాలని ప్రజలు కోరుతున్నారు. వాస్తవానికి జిల్లాలో రాజమహేంద్రవరం నగరంలోనే ప్రాచీన కాలం నుంచి ప్రైవేటు సిటీ బస్సుల వ్యవస్థ వుంది. ఏదేమైనప్పటికీ ఆటో యూనియన్ల వత్తిడికి తలొగ్గకుండా ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని నగరంలో ఆర్టీసీ సిటీ బస్సులు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని సర్వత్రా కోరుతున్నారు.
సామాన్యులకే ప్రాధాన్యం
శ్రీవారి దివ్య దర్శనంపై టిడిడి ఛైర్మన్ చదలవాడ
కరప, జనవరి 22: తిరుమలలో కొలువైన కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి అందరివాడని, స్వామి వారిని దర్శంచునేందు వచ్చే భకుల్లో సామాన్యులకే ప్రాధాన్యం ఇస్తున్నామని టిటిడి పాలకమండలి ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి అన్నారు. ఆదివారం ఆయన కరప మండలంలో పర్యటించి టిటిడి నిధులతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసారు. ముందుగా ఆయన మండలంలో కొంగోడు గ్రామంలో టిటిడి నిధులు రూ. 65లక్షల వ్యయంతో నిర్మించనున్న కల్యాణమండపానికి శంకుస్థాపన చేసారు. అనంతరర జెడ్.్భవారం గ్రామంలో రూ. 25లక్షల వ్యయంతో నిర్మించనున్న వేణుగోపాలస్వామి అలయ పునఃనిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వెంకన్న దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు ఇటీవల కాలంలో అనేక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. అలాగే స్వామివారికి కానుకల రూపంలో వస్తున్న నగదును ఆయా గ్రామాలు, పట్టణాల్లో భజన కాలక్షేప మందిరాలు, కల్యాణమండపాలు, పురాతన ఆలయాల స్థానంలో కొత్త ఆలయాలు నిర్మాణాలకు వినియోగించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అలాగే టిటిడి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇదేవిధంగా ప్రాధాన్యం కలిగిన పురాతన దేవాలయాలను పరిరక్షించేందుకు టిటిడి నిధులు సమకూరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ ఎంపి తోట నరసింహం మాట్లాడుతూ ఒక్క చిన్న గ్రామమైన కొంగోడుకు 65లక్షలు కేటాయించడం వెనుక స్థానిక ఎమ్మెల్యే, టిటిడి పాలకమండలి సభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి కృషి ఎంతో ఉందన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో సంస్కృతి, సాంద్రదాయాలను పరిరక్షించేందుకు అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్బంగా గ్రామస్థులు టిటిడి ఛైర్మన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకర్గ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పిల్లి సత్తిబాబు, సర్పంచ్‌లు వింత అప్పారావు. పంపన నాగమణి, జెడ్‌పిటిసి బుంగా సింహాద్రి, ఎంపిటిసి ఆట్ల గోవిందు, ఎంపిడి ఓ ఆంజనేయులు, తహసీల్దార్ బూసి శ్రీదేవి, కోటగిరి మహేంద్ర, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
పాదయాత్రకు సిద్ధం:ముద్రగడ
*అనుమతి తీసుకోవల్సిందే: ఎస్పీ*అమల్లోకి 144 సెక్షన్: కలెక్టర్*జిల్లాలో ఉత్కంఠ

కాకినాడ, జనవరి 22: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ పాదయాత్రకు సన్నద్ధం అవుతుండటంతో జిల్లాలోని ఆయా వర్గాల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర చేసి తీరుతానని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి ముద్రగడ పద్మనాభం కాకినాడలో ఆదివారం స్పష్టం చేశారు. అనుమతి లేని పక్షంలో పాదయాత్ర నిర్వహించరాదంటూ జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ జిల్లాలో ఆదివారం నుండి 144 సెక్షన్ విధించినట్టు ప్రకటించారు. ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ నిషేదిత ఉత్తర్వులు అమల్లో ఉంటాయని చెప్పారు. ఈనెల 25వ తేదీన రావులపాలెం నుండి ముద్రగడ పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ముందురోజైన 24వ తేదీ రాత్రికే రావులపాలెం చేరుకునేలా ముద్రగడ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది. రాత్రి అక్కడే బస చేసి మర్నాడు యాత్ర ప్రారంభించే యోచనలో ఆయనున్నట్టు సమాచారం! అంటే యాత్ర ప్రారంభం రోజున పోలీసులు అడ్డుకునే అవకాశం ఉందని, గృహ నిర్బంధం చేసే అవకాశం కూడా ఉండవచ్చని, ఈ కారణంగానే ముందురోజు యాత్ర ప్రారంభస్థలికి చేరుకోవాలని యోచిస్తున్నట్టు తెలిసింది. పోలీసులు కూడా ముద్రగడ సహా కాపు జెఎసి ముఖ్య నేతలను గృహ నిర్బంధం చేసే అవకాశాలున్నట్టు సమాచారం! అలాగే 144 సెక్షన్‌ను పరిగణలోకి తీసుకుని, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని, అనుమతి తీసుకోని పక్షంలో పాదయాత్రను అడ్డుకునే యోచనలో కూడా పోలీసులున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పాదయాత్రను అడ్డుకోని పక్షంలో చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై నిబంధనల ప్రకారం కేసులు పెట్టడమే మంచిదన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలిసింది. ఇదిలావుంటే ముద్రగడ కాకినాడలో కాపు జెఎసి నేత వివై దాసు నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ శాంతి భద్రతలకు భంగం అనే సాకుతో తన పాదయాత్ర అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్దది చేస్తోందని, ఇది ప్రభుత్వానికే మంచిది కాదని ముద్రగడ వ్యాఖ్యానించారు.

రైతులకు ఒకే దఫాలో నగదు ఇవ్వాలి
వైసిపి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు

కొత్తపేట, జనవరి 22: రైతులకు ఎటువంటి షరతులు లేకుండా బ్యాంకు ఖాతాల్లో సొమ్మును ఒకే మొత్తంగా ఇవ్వాలని వైసిపి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని వాడపాలెంలో ఆదివారం వైసిపి నాయకుడు పెదపూడి శ్రీనివాస్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు పంటకు సంబంధించిన సొమ్మును ఆన్‌లైన్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో వేయటం, దానిని మార్చుకోవడానికి షరతులు పెట్టడం వల్ల నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు సంబంధించిన పెట్టుబడులు అప్పులు తీసుకువచ్చి పెట్టారని, వడ్డీల భారంతో రైతులు సతమతమవుతుంటే పంటకు సంబంధించిన సొమ్ములను బ్యాంకుల్లో నుండి తీసుకునేందుకు రైతులు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రైతులకు ఎటువంటి షరతులు లేకుండా సొమ్మును ఏకమొత్తంగా ఇవ్వాలని కురసాల కోరారు.
నిబంధనలకు విరుద్ధంగా లబ్ధిదార్ల ఎంపిక
ఇటీవల జరిగిన ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపు కాపు కార్పొరేషన్‌కు సంబంధించి రుణ లబ్ధిదార్ల ఎంపిక నిబంధనలకు విరుద్ధంగా దేశం నేతల ఇళ్లలో చేస్తున్నారని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. వాడపాలెంలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఇంటర్వ్యూలు చేసినప్పుడే లబ్ధిదార్ల ఎంపిక చేయాల్సి ఉన్నా ఇంటర్వ్యూలను నామమాత్రంగా చేసి లబ్ధిదార్ల జాబితాలను మాత్రం దేశం నాయకుల ఇళ్ళ వద్ద చేస్తున్నారన్నారు. అధికార్ల పాత్ర ఈ విషయంలో నామమాత్రమే నన్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చిర్ల తెలిపారు. ఈ సమావేశంలో వైసిపి నాయకులు మెండుకుదిటి మోహన్, రావులాపాలెం ఎంపిపి కోట చెల్లయ్య, ముత్యాల వీరభద్రరావు, పెదపూడి శ్రీను, బండారు సత్తిరాజు, మట్టా బాబ్జి, పెదపూడి బాపిరాజు, బండారు గంగరాజు, కముజు సత్యనారాయణ, చిరు తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ తెరపైకి కాపు రిజర్వేషన్ పోరాట సమితి
*్ఫబ్రవరిలోపు రిజర్వేషన్లు అమలు చేయాలి *రాజమహేంద్రవరంలో ‘సమితి’ సమావేశం *13 జిల్లాల కాపు ప్రతినిధులు హాజరు

రాజమహేంద్రవరం, జనవరి 22: కాపు రిజర్వేషన్ పోరాట సమితి మళ్లీ తెరపైకి వచ్చింది..మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేకుండా కాపు రిజర్వేషన్ పోరాట సమితి సమావేశం జరగడం చర్చనీయాంశమైంది..రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు హోటల్‌లో ఆదివారం కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పదమూడు జిల్లాల నుంచి కాపు నేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ఈ నెల 25న తలపెట్టిన కాపు సత్యాగ్రహ పాదయాత్ర ప్రస్తావన లేకపోవడం గమనార్హంగా వుంది.
తమకు కులం ప్రయోజనాలే ముఖ్యమని, కులమే తమ నాయకత్వమని సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి తనను కలిసిన విలేకరులతో అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చి కాపు జాతి ఔన్నత్యం కోసం కృషి చేస్తే ఆయనకే రుణపడి ఉంటామని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ఆయన వెంట కాపులంతా నిలబడతారన్నారు. తమకు వ్యక్తులు, పార్టీలు ముఖ్యం కాదని, కులం ప్రయోజనమే ముఖ్యమని, ఆ దిశగానే కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించిందని, ముఖ్యమంత్రిని, జాతి కోసం కృషి చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడను సమన్వయం చేస్తామన్నారు.
ఈ మేరకు కాపు రిజర్వేషన్ సంక్షేమ సమితిగా 2015లో రిజిస్టరైన పోరాట సమితి కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు అధ్యక్ష, కార్యదర్శులు నల్లా విష్ణుమూర్తి, ప్రధాన కార్యదర్శి బిఎల్ నర్శింహరావు మీడియాకు విడుదల చేశారు. వ్యవస్థాపక అధ్యక్షులు నల్లా విష్ణుమూర్తి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి బి ఎల్ నర్శింహరావు, కార్యదర్శి రంకిరెడ్డి రామలింగేశ్వరరావు సమావేశాన్ని నిర్వహించారు.
తెలుగుదేశం ప్రభుత్వం 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలపై సమావేశం చర్చించింది. రిజర్వేషన్ల కోసం నియమించిన మంజునాధ కమిషన్‌ను కేవలం కాపుల కోసం ఏర్పాటు చేసింది కాదని, కమిషన్ నియమించిన తేదీ నుంచి 9 మాసాల్లో నివేదిక ఇస్తారనేది విఫలమయ్యిందని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరిలోగా రిజర్వేషన్లు కల్పించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని సమావేశం తీర్మానించింది. కేజీ నుంచి పీజీ వరకు గత అక్టోబర్‌లో ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం డిగ్రీ విద్యార్థులకు రూ.10వేలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు రూ.6వేలు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాపు కార్పొరేషన్‌కు వచ్చే బడ్జెట్‌లో రూ.1900 కోట్లు కేటాయించాలని, అన్ని జిల్లాల్లో కాపు భవన్‌లకు రెండెకరాలు, రూ.5 కోట్ల నిధులు చొప్పున కేటాయించాలని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానించింది.
కాపు కార్పొరేషన్ నిధుల వినియోగంలో అధికార పార్టీ వారికే ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని, గత ఏడాది కాపులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, ఇవన్నీ ప్రభుత్వం పూర్తి చేసి కాపు మద్దతు పొందాలని సమావేశం కోరింది. సమావేశంలో 13 జిల్లాల కాపు నేతలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా నుంచి ఉపాధ్యక్షులు మలిశెట్టి సుబ్బారావు, విజయవాడ నుంచి బత్తిన శ్రీనివాసరావు, పిఠాపురం నుంచి సారా శేఖర్, రాజమహేంద్రవరం నుంచి పిల్లా ప్రకాష్, రంకిరెడ్డి శ్రీరాములు, విశాఖ జిల్లా నుంచి మండలి శేషగిరిరావు, గరివిడి నుంచి వై రామ్మోహనరావు, శ్రీకాకుళం నుంచి ఆర్ సూర్యప్రకాశరావు, అడపా వెంకటేశ్వరరావు, కరాటం ప్రవీణ్, ఒంగోలు నుంచి కె.సంజీవకుమార్, బాపట్ల నుంచి కత్తుల శివ తదితరులు పాల్గొన్నారు. తదుపరి పోరాట సమితి సమావేశం ఫిబ్రవరి మాసంలో గుంటూరులో నిర్వహించేందుకు సమావేశం తీర్మానించింది. ఏదేమైనప్పటికీ ఇచ్చిన హామీల అమలుపై త్వరలో సమితి ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలవనున్నట్టు తెలిసింది.
తెలగాకాపులకు కాదు తెలుగు కాపులకు రుణాలు
వైసిపి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, జక్కంపూడి ఆరోపణ

కొత్తపేట, జనవరి 22: కాపులకు ఇస్తున్న రుణాల అర్హత తెలగాకాపులకు కాకుండా తెలుగు కాపులకు మాత్రమే ఇస్తున్నారని వైసిపి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, జక్కంపూడి రాజా ఆరోపించారు. వాడపాలెంలో ఆదివారం నిర్వహించిన గడపగడపకూ వైసిపి కార్యక్రమంలో వారు మాట్లాడారు. కాపు రుణాలు అర్హత ఉన్న పేదలకు మాత్రం కాకుండా తెలుగు పదవులు ఉన్న వారికి మాత్రమే దక్కుతున్నాయన్నారు. అభివృద్ధి చేసేది లేకపోయినా మాటలు మాత్రం కొండలు దాటే విధంగా ఉంటున్నాయన్నారు. ప్రజలు దీనిని గమనిస్తున్నారని, తగిన సమయంలో అధికార పార్టీకి బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తున్నారని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ పేదల చదువుల కోసం ఇచ్చిన భూమిని సైతం దేశం నేతలు వదలకుండా దానిని రియల్ వ్యాపారం చేసుకుని దోచుకుతింటున్నారని ఆరోపించారు. తాను ప్రజలు ఇచ్చిన తీర్పుమేరకు కట్టుబడి ఉన్నానని అందుకే ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులను సైతం రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువు దేశం కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. వారికి కన్నబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు మెండుకుదిటి మోహన్, కోట చెల్లయ్య, ముత్యాల వీరభద్రరావు, బండారు సత్తిరాజు, దూనబోయిన సత్యనారాయణ, నెల్లి లక్ష్మీపతిరావు, పెదపూడి శ్రీను, మట్టాబాబ్జి, మురళి, పెదపూడి బాపిరాజు, బండారు కృష్ణమూర్తి, కముజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్రకు అనుమతులు తీసుకునే ప్రసక్తే లేదు
కాపు రిజర్వేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా

అమలాపురం, జనవరి 22:కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈనెల 25న నుండి నిర్వహించతలపెట్టిన సత్యాగ్రహ పాదయాత్రకు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆరు నూరైనా పాదయాత్ర నిర్వహించి తీరుతామని కాపు రిజర్వేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లా విష్ణుమూర్తి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ఉద్యమాలకు అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో ఎప్పుడూ అనుమతులు తీసుకోలేదని ఎవరైనా అనుమతులు తీసుకొని ఉంటే వాటి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం చంద్రబాబు గతంలో పలుమార్లు పాదయాత్ర నిర్వహించారని అప్పుడు ఆయన తీసుకున్న అనుమతి పత్రాలను బహిర్గతం చేయాలన్నారు. రాష్ట్ర కాపు జెఎసి, ముద్రగడ సంయుక్తంగా పాదయాత్రకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని నల్లా డిమాండ్ చేశారు. హైకోర్టు కూడా పాదయాత్రకు అనుమతి ఇచ్చిందని, కోర్టు ఉత్తర్వులను కాదని పాదయాత్రను అడ్డుకొనేందుకు కుట్ర పన్నుతున్నారని ఇది ప్రజాస్వామికం అని ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా రాష్ట్రంలోని కాపులకు మాత్రం స్వాతంత్య్రం రాలేదని, పౌరుల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. తమపై అడుగడుగునా పోలీసు నిఘా పెట్టడంపై నల్లా ఆగ్రహాం వ్యక్తం చేశారు. శాంతియుతంగా గాంధీమార్గంలో జరిగే పాదయాత్రను అడ్డుకొనేందుకు ముందునుంచి షాడో టీమ్‌ను నియమించి కాపుయువతలో అలజడి రేపుతున్నారన్నారు. తమ వెంట షాడో టీంలను పెట్టవలసిన అవసరం ఏంటని నల్లా ప్రశ్నించారు. అలాగే కాపు కార్పొరేషన్ పేరుతో ఊరూరా తిరుగుతున్న కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కాపుల కోసం ఎప్పుడైనా పట్టించుకున్నారా అని రాష్ట్ర కాపు జెఎసి జాయింట్ కన్వీనర్ నల్లా పవన్‌కుమార్ ప్రశ్నించారు. కాపు రుణాలు ఉద్యోగ మేళాల పేరుతో జాతిని మోసం చేసే కుట్ర పన్నుతున్నారని పవన్ విమర్శించారు. రామానుజయ కాపులకు చేసిన మేలు ఏమిటో శే్వతపత్రం విడుదల చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని సూచించారు.
తాపేశ్వరం సురుచి సంస్థలో ఆనంద హేల
ఐఎస్‌ఒ హెచ్‌ఐఎమ్ సర్ట్ఫికెట్, జ్ఞాపికలతో సంస్థ అధినేత మల్లిబాబు
మండపేట, జనవరి 22: నాణ్యత కలిగిన పిండి వంటలను వినియోగదారులకు అందించే అంశంలో ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్‌ఒ) తమ సురుచి ఫుడ్స్ సంస్థకు అరుదైన గుర్తింపు లభించిన నేపథ్యంలో ఆదివారం ఆ సంస్థలో పనిచేసే కార్మికులు తమ యజమాని పోలిశెట్టి మల్లికార్జునరావు (మల్లిబాబు)తో కలసి ఆనందం పంచుకున్నారు. అతి పెద్ద లడ్డూ తయారీతో గిన్నీస్ బుక్‌లో సురుచి ఫుడ్స్ సంస్థ రికార్డును సాధించిన కొద్ది సమయంలోనే ఐఎస్‌ఒ గుర్తింపును అందుకోవడం ఆనందదాయకంగా ఉందని సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు పేర్కొన్నారు. విజయవాడ మహానగరంలో శనివారం రాత్రి ఐఎస్‌ఒ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కెఇ కృష్ణమూర్తి, రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, పల్లె రఘునాథ రెడ్డిల చేతుల మీదుగా మల్లిబాబు ఈ అవార్డును, జ్ఞాపికను అందుకున్నారు. ఐఎస్‌ఒ సంస్థకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక హెచ్‌ఐఎమ్ అవార్డును మల్లిబాబుకు అందించినట్లు ఐఎస్‌ఒ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మల్లిబాబు మాట్లాడుతూ తమ సంస్థలో పనిచేసే కార్మికుల నిరంతర కృషి, యాజమాన్య పద్ధతులు సక్రమ రీతిలో నిర్వహించడంతో గిన్నీస్ రికార్డును సాధించడమే కాకుండా, ఐఎస్‌ఒ ద్వారా నాణ్యత కలిగిన పిండి వంటల తయారీ చేపట్టినందుకు తాజాగా హెచ్‌ఐఎమ్ సర్ట్ఫికెట్ వచ్చిందన్నారు. ఈ సందర్భంగా తనను ఆదరిస్తున్న ఖాతాదారులకు మల్లిబాబు అభినందనలు తెలిపారు.

శస్త్ర చికిత్సలో మత్తు వైద్యునిదే ప్రధాన పాత్ర

అమలాపురం, జనవరి 22 : శస్త్ర చికిత్సా సమయంలో మత్తు వైద్యులు చూపించే నైపుణ్యంపైనే రోగి ఆరోగ్య స్థితిగతులు ఆధారపడి ఉంటాయని కిమ్స్ వైద్యకళాశాల మత్తు వైద్యవిభాగాధిపతి డాక్టర్ ఎస్‌జికె మూర్తి అన్నారు. అమలాపురం కిమ్స్ వైద్యకళాశాలలో మత్తు విభాగం ఆధ్వర్యంలో ఆదివారం సిఎంఎ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పలువురు వైద్యులు మాట్లాడుతూ వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులు మత్తుకు సంబంధించిన అంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించుకోవాలని సూచించారు. కొండ ప్రాంత నివాస ప్రజల శ్వాస మరియు ఊపిరిత్తుల సంబంధిత ప్రభావం, వారి జీవనశైలి, ఇబ్బందులను గురించి రంగరాయ వైద్యకళాశాల ప్రొఫెసర్ డాక్టర్ మహేష్‌బాబు వివరించారు. అత్యవసర సమయంలో వెన్నుముకకు ఏర్పడు గాయాలు వాటి సూక్ష్మచికిత్సా విధానం గురించి రంగరాయ వైద్య కళాశాల ఎనస్థీషియా అధ్యాపకులు డాక్టర్ బి సౌభాగ్యలక్ష్మి వివరించారు. రాజమండ్రి జిఎస్‌ఎల్ కళాశాల వైద్యులు కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ గుండె జబ్బుల సంబంధిత వైద్య విధానంలో మత్తు వైద్యులు పాటించాల్సిన సూక్ష్మజాగ్రత్తలను, చికిత్సావిధానం గురించి విద్యార్ధులకు వివరించారు. విజయవాడ పిఎస్‌ఐఎమ్‌ఎస్ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ మాట్లాడుతూ మత్తు వైద్య విధానంలో ఉపయోగించే పలు సాంకేతిక పద్ధతులు, సాంకేతిక పరికరాల ఉపయోగాలపై వివరించారు. అనంతరం పిజి విద్యార్థులకు మత్తు వైద్య విభాగంలో క్విజ్ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి కిమ్స్ వైద్యకళాశాల డీన్ కెఎస్ కామేశ్వరరావు అధ్యక్షతవహించగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వైద్యులు, విద్యార్ధులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
అయినవిల్లి వినాయకుడిని దర్శించుకున్న ఐటి ట్రిబ్యునల్ జడ్జిలు
అయినవిల్లి, జనవరి 22: అయినవిల్లి వరసిద్ధి వినాయకుడిని ఆదివారం విశాఖపట్నంనకు చెందిన ఇన్‌కంటాక్స్ ట్రిబ్యునల్ జడ్జిలు దుర్గారావు, మంజునాథ్, అప్పీలేట్ కమిషనర్ తాళ్ల సత్యనారాయణలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆల్డా ఛైర్మన్ యాళ్ల దొరబాబు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి మిండగుదటి మోహన్ ఉన్నారు.
రావులపాలెంలో ఉత్కంఠ
రావులపాలెం, జనవరి 22: కాపులకు బిసి రిజర్వేషన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ నెల 25న రావులపాలెం నుండి కాపు సత్యాగ్రహ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో రావులపాలెంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ముద్రగడ యాత్రకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని ఒక వైపు ఎస్పీ రవిప్రకాష్ ప్రకటించగా మరోవైపు కాపు జెఎసి నేతలు రావులపాలెంలో యాత్రకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నారు. స్థానిక కళా వెంకట్రావు సెంటరులో నాలుగువైపులా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే జెఎసి నేతలు రావులపాలెం నుండి అమలాపురం మీదుగా అంతర్వేది వరకు జరిగే పాదయాత్రకు సంబంధించి షెడ్యూలును ప్రకటించారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేవని చెబుతున్న పోలీసులు స్థానిక పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అమలాపురం డిఎస్పీ ఎల్ అంకయ్య ఆదివారం రావులపాలెం పోలీసుస్టేషనులో సిఐ బొక్కా పెద్దిరాజు, ఎస్సై పివి త్రినాధ్‌తో సమీక్షించి పలు సూచనలు చేశారు. గతంలో పాదయాత్ర ప్రకటించిన సమయంలో కన్పించిన బందోబస్తు ప్రస్తుతం కన్పించడం లేదు. అయితే సోమవారం నాటికి అదనపు బలగాలు రావులపాలెం చేరుకునే అవకాశం ఉందని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ఒక వైపు పోలీసుల ఏర్పాట్లు, మరో వైపు కాపు జెఎసి నాయకుల ఏర్పాట్లతో రావులపాలెంలో స్వల్ప ఉద్విగ్న వాతావరణం నెలకొంది.