తూర్పుగోదావరి

టెన్షన్... టెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జనవరి 23: కాపు రిజర్వేషన్ సాధన కోసం కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పాదయాత్ర పిలుపుతో కోనసీమలో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఈసారి పాదయాత్రను ఎలాగైనా నిర్వహిస్తామని కాపు ఉద్యమ నాయకులు చెపుతుంటే, అనుమతి లేకుండా పాదయాత్రను జరిగనిచ్చేది లేదని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 25న రావులపాలెం నుండి ముద్రగడ నిర్వహించే సత్యాగ్రహ పాదయాత్రపై ఇటు అధికారుల్లో, అటు కాపుఉద్యమ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. గత వారం రోజులుగా పోలీసు షాడో పార్టీలు ఇప్పటికే కోనసీమలోని కాపు ఉద్యమ నాయకుల కదలికలపై, వారి వ్యూహ రచనలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు అందించారు. దీంతో కోనసీమ వ్యాప్తంగా సుమారు మూడువేల మందికి పైగా పోలీసులను మోహరింపజేసారు. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాల నుండి వచ్చిన పోలీసు బలగాలను కోనసీమలోని సున్నిత, అతి సున్నిత ప్రాంతాల్లో మోహరింప చేశారు. సోమవారం సాయంత్రం అమలాపురం పుర వీధుల గుండా పోలీసులు కవాతు నిర్వహించి అనుమతులు లేకుండా ఉద్యమాలు, పాదయాత్రలు చేయడానికి వీలులేదన్న సంకేతాలను ఉద్యమకారులకు పంపించారు. ఏలూరు రేంజ్ డిఐజి రామకృష్ణ సోమవారం సాయంత్రం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఇక్కడ పరిస్థితులపై సమీక్షించి, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు, పోలీసులకు సూచించినట్లు సమాచారం. కాగా గత ఏడాది నవంబర్ 16 నుండి 21 వరకు రావులపాలెం నుండి అంతర్వేది వరకూ నిర్వహించేందుకు ముద్రగడ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఉద్యమ నాయకులను గృహ నిర్భంధాల్లో ఉంచిన సంగతి విదితమే. ఈసారి కూడ ఇదే విధానం అమలు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అనుమతి లేదు
ముద్రగడ పాదయాత్రపై డిఐజి రామకృష్ణ
రావులపాలెం, జనవరి 23: మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఈ నెల 25 నుండి రావులపాలెంలో పాదయాత్ర చేపట్టేందుకు అనుమతులు కోరుతూ ఎలాంటి దరఖాస్తు రాలేదని, దీంతో ఈ యాత్రకు అనుమతి లేదని ఏలూరు రేంజి డిఐజి పివి రామకృష్ణ అన్నారు. సోమవారం ఆయన రావులపాలెం పోలీసుస్టేషను వద్ద పరిస్థితులపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం 144, 30 పోలీసుయాక్టు అమలులో ఉన్నాయని, నిబంధనలు అతిక్రమించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎఆర్ దామోదర్, అమలాపురం డిఎస్పీ ఎల్ అంకయ్య, సిఐ బి పెద్దిరాజు, ఎస్‌బి సిఐ పివి రమణ, ఐపిఎస్ అధికారి వి అజిత, ఎస్సై పివి త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ గ్రామంలో కూరగాయల క్షేత్రాలు
కలెక్టర్ అరుణ్‌కుమార్

కాకినాడ, జనవరి 23: జిల్లాలోని గ్రామాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థలకు కూరగాయల అవసరాలను తీర్చేందుకు గాను ప్రతి గ్రామంలో కూరగాయల క్షేత్రాలను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ చెప్పారు. సంబంధిత శాఖల అధికారులు ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఆయా గ్రామాల్లో ఇందుకు ఒక ఎకరం వంతున భూములను గుర్తించాలన్నారు. ఈ స్థలాల్లో కూరగాయలను పండించడం ద్వారా గ్రామాల్లోని పాఠశాలల్లో అమలుచేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల అవసరాలను కూడా తీర్చవచ్చని పేర్కొన్నారు. ఈ క్షేత్రాల ఏర్పాటుకు అవసరమైన నిధులను జిల్లాకు కేటాయించిన వినూత్న పథకాల నిర్వహణ నిధులను కేటాయించవచ్చని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే వివిధ పాఠశాలల్లో ఏర్పాటుచేసిన 514 న్యూట్రీ గార్డెన్స్ మంచి ఫలితాలనిచ్చాయని, ఈ స్ఫూర్తితో కూరగాయల క్షేత్రాలను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ క్షేత్రాల ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక సలహాలను ఉద్యానవన శాఖ అందిస్తుందన్నారు. జిల్లా ప్రజల నుండి స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధుల బారి నుండి రక్షించేందుకు వెంటనే పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న విద్యా సంస్థల నుండి రావల్సిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేయాలని, జిల్లాలో 86సంస్థల నుండి 25కోట్ల మేర బకాయిలున్నాయని చెప్పారు. ఈ బకాయిల వసూళ్ళకు అవసరమైతే ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటుచేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 2500 పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పారు. 50 శాతం సబ్సిడీపై బయోమెట్రిక్ యంత్రాలను పంపిణీ చేస్తున్నట్టు తెలియజేశారు. సంయుక్త కలెక్టర్-2 జె రాధాకృష్ణమూర్తి, డిఆర్‌డిఎ పిడి మల్లిబాబు, పంచాయతీరాజ్ ఎస్‌ఇ వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సిఇఒ కె పద్మ, డ్వామా పిడి నాగేశ్వరరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రాజేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జెడి వి వెంకటేశ్వరరావు, మత్స్యశాఖ డిడి అంజలి తదితరులు పాల్గొన్నారు.
టెన్త్‌లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ, జనవరి 23: రానున్న మార్చి- ఏప్రిల్ నెలల్లో జరిగే పదవ తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కోర్టు హాలులో విద్యాశాఖ, సాంఘిక, వెనుకబడిన సంక్షేమ శాఖలకు చెందిన అధికారులతో పదవ తరగతి విద్యార్ధులకు చేపట్టే చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్ధుల్లో తక్కువ మార్కులు వచ్చిన వారిని గుర్తించి ఉపాధ్యాయులను కేటాయించి ఉదయం 8.45 నుండి సాయంత్రం 6వరకు అదనపు తరగతులను నిర్వహించాలన్నారు. వారికి వీలైన పరీక్షలు పెట్టి దృష్టి సారించేలా బోధించాలన్నారు. ప్రశ్నా పత్రాలను ఇచ్చి ఇంటి దగ్గరే జవాబులు రాసి తీసుకురమ్మంటే వారికి పరీక్షల భయం ఉండదన్నారు. వార్డెన్స్ హాస్టళ్లలో 6నుండి రాత్రి 9వరకు తప్పనిసరిగా ఉండి వారి చదివించాలన్నారు. అందరు కలిసి పదవ తరగతిలో జిల్లాను ముందంజలో ఉంచేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఇఓ ఆర్ నరసింహారావు, సోషల్ వెల్ఫేర్ డిడి ఎంస్ శోభారాణి, బిసి వెల్ఫేర్ డిడి చిన్నబాబు, బిసి కార్పొరేషన్ ఇడి ఎం జ్యోతి, డివైఇఓలు వాడపల్లి, గంగాభవాని, అబ్రహం, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ గందరగోళం
నగరపాలక సంస్థ అవగాహన లోపం..రాజమహేంద్రవరం ప్రజలకు శాపం..!!

రాజమహేంద్రవరం, జనవరి 23: నగరపాలక సంస్థ అవగాహన లోపంతో నగర ప్రజలకు ఒక్క సారిగా ట్రాఫిక్ ఇబ్బందులు ముంచెత్తాయి..ముందస్తు అవగాహన లేకుండా చేపట్టిన కల్వర్టు నిర్మాణంతో నగరంలోని ట్రాఫిక్ అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఏ రోడ్డులో ట్రాఫిక్ ఎటు వైపు మళ్లించాలనే విషయంపై ముందస్తు అవగాహన కల్పించడంలో ఇటు నగరపాలక సంస్థ, అటు ట్రాఫిక్ పోలీసు వ్యవస్థకు సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది.
రాజమహేంద్రవరంలోని కారల్ మార్క్స్ రోడ్డు ( ఆర్టీసీ కాంప్లెక్సు రోడ్డు)లో షెల్టాన్ హోటల్ జంక్షన్, తాడితోట బట్టల షాపు జంక్షన్, ఆటో కన్సల్టెన్సీ జంక్షన్, రైల్వే అండర్ టనె్నల్ వద్ద మొత్తం నాలుగు చోట్ల ఒకే సారి భారీ కల్వర్టుల నిర్మాణాన్ని చేపట్టింది నగరపాలక సంస్థ. దీంతో ఆర్టీసీ బస్ కాంప్లెక్సు వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సులను డిపో నుంచి బయలుదేరి బస్సులు గోకవరం బస్టాండ్ మీదుగా గోదావరి గట్టు మీదుగా కోటిపల్లి బస్టాండ్ వైపుగా ఇటు రామచంద్రపురం వైపు వెళ్ళే బస్సులు గానీ, అమలాపురం వైపు వెళ్ళే బస్సులు గానీ వెళ్ళాల్సిందిగా మళ్లించారు. ఇక రామచంద్రపురం, కొవ్వూరు, రాజోలు, అమలాపురం, భద్రాచలం, విజయవాడ వైపు నుంచి వచ్చే బస్సులు ఐఎల్ టిడి సెంటర్ నుంచి తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డు వైపు తిరిగి జాతీయ రహదారి హుకుంపేట జంక్షన్‌ను కలిపే రోడ్డు నుంచి జాతీయ రహదారి మీదుగా ఆర్టీసీ డిపోకు చేరుకునే విధంగా రావాల్సి ఉంది. అయితే ఆర్టీసీ డ్రైవర్లకు సైతం సరైన అవగాహన కల్పించకపోవడంతో ఎటువైపు బస్సులు ఎటు వైపు వెళ్లాలో తెలియని అయోమయం నెలకొంది. ఒక రూటులో వెళ్లాల్సిన బస్సు మరో రూటులో వెళ్తుందని చెప్పి కంగారు పడిన ప్రయాణీకులు గమ్య స్థానానికి చేరుకోకుండానే దిగిపోతున్నారు. ఇదే అదనుగా బస్సు దిగిన ప్రయాణీకులను ఆటోలు చుట్టుముట్టి ఇటు ఆర్టీసీ కాంప్లెక్సుకు, గోకవరం బస్టాండు, దేవీచౌక్, రైల్వే స్టేషన్, తాడితోట వైపునకు ప్రయాణీకులను ఎక్కించుకుని షార్టు కట్‌ల పేరుతో చిన్న చిన్న సందుల్లోకి దూరిపోతున్నారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ పద్మహ్యూహంగా మారింది. కల్వర్టుల నిర్మాణంతో అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్‌ను చక్కదిద్దేందుకు ట్రాఫిక్ పోలీసులకు సైతం సరైన అవగాహన ఉన్నట్టుగా కనిపించడం లేదు. గీతా అప్సరా రోడ్డు నుంచి శ్యామలా సెంటర్‌కు చేరాలంటే ట్రాఫిక్ చిక్కుముడిలో చిక్కుకున్న వాహనాలకు దాదాపు గంట పడుతుంది. అక్కడ నుంచి అడ్డదిడ్డ రోడ్లలో అన్నపూర్ణమ్మపేట రైల్వే గేటు రోడ్డులో చేరుకునే ఆటోలు గేటు పడిన తర్వాత రెండు వైపులా ట్రాఫిక్ పట్టాలపై చిక్కుకుని ట్రైన్ వచ్చేలోగా క్లియరెన్స్ లేక ప్రమాదభరితంగా మారింది. ఇక్కడ ట్రాఫిక్‌ను చక్కదిద్దే ట్రాఫిక్ పోలీసులు కనిపించడం లేదు. ఆజాద్ చౌక్, దేవీచౌక్, చర్చిగేట్, సిమెట్రీపేట, కోటిపల్లి బస్టాండ్ జంక్షన్ తదితర చోట్ల ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను నామమాత్రంగా క్రమబద్ధీకరించడంతో టూ వీలర్స్, కార్లు, ఆటోలు కారల్ మార్క్స్ రోడ్డులోకి చొరబడి అటు వైపు దారి కనిపించక వెనక్కి చక్కర్లు కొడుతూ ట్రాఫిక్ చిక్కుముడుల్లో చిక్కుకుంటున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం ఇటు కార్పొరేషన్ యంత్రాంగానికి, అటు ఆర్టీసీ, ట్రాఫిక్ పోలీసు వ్యవస్థల మధ్య సమన్వయం లేకపోవడమేనని స్పష్టమవుతోంది. ఏ రోడ్డులో ట్రాఫిక్‌ను ఎటువైపు మళ్లించారో అందరికీ అర్ధమయ్యేలా కనీసం బోర్డులు కూడా ప్రదర్శించకపోవడం, ముందస్తు అవగాహన కల్పించడంలో సరైన రీతిలో చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆర్టీసీ బస్సులు సైతం ఎటు వెళ్లాలో తెలియని ట్రాఫిక్ గందరగోళంలో చిక్కుకున్నాయి. ఏదేమైనప్పటికీ ఒకే సారి నాలుగు భారీ కల్వర్టుల నిర్మాణం చేపట్టడంతో ఇవి పూర్తయ్యే సరికి దాదాపు ఆరు నెలలు పడుతుందని, అప్పటి వరకు ఈ ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఇంత దీర్ఘకాల ట్రాఫిక్ సమస్య ఎదురైనపుడు చేపట్టాల్సిన చర్యల్లో మాత్రం అధికార యంత్రాంగం విఫలమైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి
ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప

అమలాపురం, జనవరి 23 : రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలకు పూర్తి స్థాయిలో వౌలిక వసతులు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక బంగారం, వెండి వర్తక సంఘ భవనంలో అమలాపురం చాంబర్ అఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ చిక్కాల గణేష్ సన్మాన సభ చాంబర్ అధ్యక్షుడు గోకరకొండ హరిబాబు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సభలో చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అమలాపురం పట్టణాన్ని సుందరీకరణ చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. పూర్తిస్థాయిలో డ్రెయినేజీ, రహదారుల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీరు వంటి సదుపాయాలు కల్పిస్తామని, పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని రాజప్ప హామీ ఇచ్చారు. గడియారపుస్తంభం సెంటర్‌లో సిగ్నెల్ లైట్లు, నల్లవంతెన, ఎర్రవంతెన, వై జంక్షన్ వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పట్టణాభివృద్ధికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందుకు రావాలని సూచించారు. పురపాలక సంఘ పరిధిలో జరిగే పనులను సకాలంలో పారదర్శకంగా నిర్వహించాలని రాజప్ప అధికారులను ఆదేశించారు. స్వర్గీయ మెట్ల సత్యనారాయణరావు ఘాట్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. సక్రమంగా వ్యాపారాలు నిర్వహించే వర్తకులకు అధికారుల నుండి వత్తిడి లేకుండా చూస్తామని రాజప్ప హామీ ఇచ్చారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 69వ స్థానంలో ఉన్న అమలాపురం పురపాలక సంఘాన్ని రెండోస్థానానికి తీసుకు వచ్చిన ఛైర్మన్ చిక్కాల గణేష్ కృషి అభినందనీయం అన్నారు. ఉపముఖ్యమంత్రి సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. రూ.8కోట్ల అంచనా వ్యయంతో మూడు మంచినీటి ట్యాంకుల నిర్మాణం చేపట్టి పట్టణంలో తాగునీటి ఎద్దడి లేకుండా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు. శిధిలావస్థలో ఉన్న గడియారపుస్తంభం సెంటర్‌ను రూ. 35 లక్షలతో పునఃనిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. అలాగే రూ. రూ.25 కోట్లతో అమలాపురం ముక్కామల రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, రాజప్ప, ఆనందరావు, వైస్‌చైర్‌పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మిలను చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బొర్రా ఈశ్వరరావు, జడ్పీటిసి అధికార జయవెంకటలక్ష్మి, ఏరియా ఆసుపత్రి అభివృద్ధికమిటీ చైర్మన్ మెట్ల రమణబాబు, నల్లా స్వామి, అల్లాడి స్వామినాయుడు, కర్రి దత్తుడు, తిక్కిరెడ్డి నేతాజీ, చెల్లుబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ధర్నా

కాకినాడ, జనవరి 23: అగ్రిగోల్డ్ ఆస్తులను వేగవంతంగా వేలం నిర్వహించి బాధితులకు తక్షణమే బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు మీసాల సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీసాల మాట్లాడుతూ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంస్ధ 19.52 లక్షల మంది నుండి 3957 కోట్లను సేకరించిందని సిఐడి లెక్కలు చెప్పాయన్నారు. గత రెండేళ్ళ కాలం నుండి సంస్ధ ఇబ్బందులకు గురవడంతో ఏజెంట్లు, కస్టమర్లు తీవ్ర ఇబ్బందులకు గురవటమే కాకుండా చాలా ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. బాధితులకు ప్రతీ నెలా వెయ్యి నుండి 2వేల కోట్ల ఆస్తులను వేలం వేసి వడ్డీతో చెల్లించాలని, అగ్రిగోల్డ్ కుంభకోణానికి కారణమైన డైరెక్టర్లను అరెస్ట్ చేసి సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కుంభకోణానికి బలైన కస్టమర్లు, ఏజెంట్ల కుటుంబాలకు 10 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో నాయకులు వి శేషుకుమార్ రెడ్డి, అంబటి రామకృష్ణ, బి రాంబాబు, కొల్లి శ్రీనివాస్, వరలక్ష్మి, వీరవేణి, మాధ్యూస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలో నిబంధన 30 అమలులో ఉండడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి
ప్రజావాణికి 156 మంది హాజరు: కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ, జనవరి 23: మీకోసం ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణిని ఆయన నిర్వహించగా సుమారు 156 మంది హాజరై తమ అర్జీలు, విజ్ఞాపనలు, సమస్యలను తెలియజేశారు. అర్జీదారుల నుండి ఆయన అర్జీలను తీసుకుని పరిష్కరించేందుకు సంబంధిత అధికారుల వద్దకె పంపారు. కలెక్టర్‌తో పాటు జెసి ఎస్ సత్యనారాయణ వినతులను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్వే ఎడి నూతన్‌కుమార్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఎడి కెవి సత్యనారాయణ, బిసి వెల్ఫేర్ డిడి ఎం చిన్నబాబు, వివిధ శాఖలకు చెందిన అదికారులు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్‌కు అపచారం చేసినవారిని వారం రోజుల్లో పట్టుకుంటాం
డిఎస్పీ
మురళీ మోహన్
రామచంద్రపురం, జనవరి 23: కె గంగవరం మండలం పాణింగిపల్లి గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అపచారం చేసిన నిందితులను వారం రోజుల్లో పట్టుకుంటామని జిల్లా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నియంత్రణ డిఎస్పీ సుంకర మురళీ మోహన్ స్పష్టమైన హామీనిచ్చారు. కె గంగవరం మండల ప్రధాన కేంద్రమైన గంగవరం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం దళిత నాయకుల నేతృత్వంలో అయిదారు మండలాలకు సంబంధించిన దళితులు పాణింగిపల్లి దోషులను వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ రోడ్డెక్కారు. దళిత నాయకులు పండు అశోక్ కుమార్, ఎంపిపి పెట్టా శ్రీనివాస్, కపిలేశ్వరపురం మండలానికి చెందిన మానే కిషోర్ తదితర నాయకులు నేతృత్వంలో రాయవరం, రామచంద్రపురం, కె గంగవరం, కపిలేశ్వరపురం, కాజులూరు మండలాల నుండి దళితులు పాణింగిపల్లి గ్రామంలో అపచారం జరిగిన అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం పాదయాత్రగా కె గంగవరం మండల ప్రధాన కేంద్రమైన గంగవరం చేరుకున్నారు. కోటిపల్లి - కాకినాడ, గంగవరం - అంగర ప్రధాన రహదారుల దిగ్భందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పండు అశోక్‌కుమార్, పెట్టా శ్రీనివాస్, మానె కిషోర్‌లు మాట్లాడుతూ రాజ్యాంగ రచనను చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు అపచారం వరుసగా జరుగుతున్నప్పటికీ పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని, కనీసం అనుమానితులన్నవారిని విచారణ కూడా చేయడంలేదని ఆరోపించారు. దోషులను పట్టుకుని ఉంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని వారు స్పష్టం చేశారు. సంఘటన జరిగి చాలా కాలమైనప్పటికీ దోషులను పట్టుకోవడంలో పోలీసు శాఖ విఫలమైందని వారు ఆరోపించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన రాస్తారోకో, రహదారుల దిగ్భందన కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. రామచంద్రపురం సిఐ కొమ్ముల శ్రీ్ధర్‌కుమార్ నేతృత్వంలో ఎస్సైలు ఫజుల్ రహమాన్, పి దొర రాజు, జి నరేష్ తదితర సిబ్బంది ఆందోళనకారులతో పలు దఫాలు చర్చించారు. రామచంద్రపురం డిఎస్పీ ఎన్‌బిఎం మురళీకృష్ణ సమీప బంధువు సోమవారం ఉదయం కృష్ణా జిల్లా గన్నవరంలో మరణించడంతో కాకినాడ కేంద్రంగా కలిగిన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నియంత్రణ డిఎస్పీ సుంకర మురళీ మోహన్ గంగవరం చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చలు నిర్వహించారు. పోలీసులు తమ విధులను సక్రమ రీతిలోనే నిర్వహిస్తున్నారని, అనుమానితులుగా ఉన్నవారిని విచారణ చేస్తూనే ఉన్నారని, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసిన వారు, నిందితుల వివరాలను పోలీసులకు అందించాలని కోరారు. ఏది ఏమైనప్పటికీ అపచారం కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులను వారం రోజుల్లోగా పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు తమ ఆందోళనను విరమించారు.
రూ. 20లక్షల గంజాయి మొక్కలు ధ్వంసం
రాజమహేంద్రవరం, జనవరి 23: రాజమహేంద్రవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయ పరిధిలోని వై రామవరం మండలం పాతకోట, పునిసినిమెట్ట ప్రాంతాల్లో అక్రమంగా సాగు చేస్తున్న రూ. 20లక్షల 11వేల విలువైన 10వేల 56 గంజాయి మొక్కలను ఆదివారం తమ సిబ్బంది ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ సూర్జిత్‌సింగ్ వెల్లడించారు. జిల్లా పోలీసుల సహకారంతో ఈదాడి నిర్వహించినట్లు పేర్కొన్నారు. సాయుధ బలగాలతో వెళ్లి గంజాయి తోటలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఇన్‌ఫార్మర్లు, నిఘా వర్గాల ద్వారా గంజాయి సాగుపై సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈదాడిలో ఎక్సైజ్ సూపరింటెండెంట్‌తో పాటు, ఎఇఎస్‌లు, ఎక్సైజ్ ఇనస్పెక్టర్లు, ముగ్గురు ఎస్‌ఐలు, 23 మంది సిబ్బంది కొండలపైకి ఎక్కి గంజాయి మొక్కలను ధ్వంసం చేశామన్నారు.

మావోయిస్టు బాధిత కుటుంబాల ధర్నా
కాకినాడ, జనవరి 23: ఆదివాసీలను, పోలీసులను అనవసరంగా హింసించి చంపుతున్న మావోయిస్టులకు వ్యతిరేకంగా మావోయిస్ట్ బాధిత కుటుంబాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న మావోయిస్ట్ బాధిత కుటుంబాలు మావోయిస్ట్ చర్యలకు వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. ఇన్‌ఫార్మర్ల పేరుతో ఆదివాసీలను, లక్ష్యం పేరుతో పోలీసులను మావోయిస్ట్ చంపడంతో వారి కుటుంబాలు దిక్కులేకుండా పోయాయన్నారు. మావోయిస్టుల చర్యల వల్ల ఆదివాసీ ప్రాంతాలు అభివృద్ధి నోచుకోక పోవడం లేదని, మనుషులను చంపటమే వారు లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో బాధిత కుటుంబాల నాయకులు జె సన్యాసిరావు, ఎస్ విజయలక్ష్మి, శేషారత్నం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.