తూర్పుగోదావరి

మెయిన్ ట్రాక్‌పైకి కాకినాడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 4: కాకినాడ రైల్వేలైన్‌ను మెయిన్ లైన్‌లో విలీనం చేయాలన్న దశాబ్దాల నాటి కల సాకారం కానున్నది... నేటి వరకు రైలుకూతకు నోచుకోని కోనసీమను పలుకరించేందుకు పొగబండి సిద్ధమవుతోంది... ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి తెర దించుతూ అవసరమైనన్ని నిధుల మంజూరుకు కేంద్ర బడ్జెట్‌లో పెద్దపీట వేయడం జిల్లాకు శుభ పరిణామంగా మారింది.
జిల్లా కేంద్రం కాకినాడ రైల్వేలైన్‌ను మెయిన్‌లైన్‌లో విలీనం చేయాలన్న డిమాండ్ సుమారు అర్ధశతాబ్దంగా వినిపిస్తూనే ఉంది. ఈ సమస్యపై పోరాడేందుకు రైల్వే ప్రయాణికులు ఓ సంఘంగా ఏర్పడ్డారు కూడా! అయితే కేంద్రంలో ఆయా ప్రభుత్వాలు ప్రతియేటా ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌లో మొండిచెయ్యి చూపుతూ వచ్చారు. గతేడాది బడ్జెట్‌లో మాత్రం కేవలం రూ. 50 కోట్లు కేటాయించినట్టు ప్రకటించారు. అయితే ఈ నిధులు ఎటూ సరిపోయే అవకాశం లేకపోవడంతో మళ్ళీ కథ మొదటికొచ్చిందంటూ ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజా బడ్జెట్‌లో కేంద్రం మరో రూ. 150 కోట్లు కేటాయించడంతో ఈ సొమ్ము మొత్తం రూ. 200 కోట్లకు చేరింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 230 కోట్లు కాగా ప్రస్తుత కేటాయింపుతో కావల్సిన నిధులను దాదాపుగా కేటాయించినట్టయ్యింది. ఇక కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు భూసేకరణ నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. పిఠాపురం-కాకినాడ మధ్య సుమారు 18 కిలోమీటర్ల మేర ఈ కొత్త లైన్‌ను నిర్మించాల్సి ఉంది. ఇందుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి ఇస్తుందని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాకినాడ ఎంపి తోట నరసింహం పూర్తిస్థాయిలో ఇక దృష్టి సారించినట్టయితే త్వరలోనే ఈ లైన్ పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్టు స్పష్టమవుతోంది. మెయిన్‌లైన్‌లో కాకినాడ రైల్వే లైన్ కలసిన పక్షంలో ఇక తూర్పు-పశ్చిమ దిశల వైపు ప్రయాణం సాగించే ప్రతివొక్క రైలు కాకినాడ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ విధంగా జిల్లా కేంద్రం కాకినాడ అనూహ్యంగా అభివృద్ధి సాధించేందుకు మార్గం సుగమం అవుతుంది.
ఇక కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం తాజా బడ్జెట్‌లో రూ. 430 కోట్లు కేటాయించింది. దీంతో దశాబ్దాల పోరాటానికి నేడు ఫలితం లభించినట్టయ్యింది. గతంలో కాకినాడ నుండి కోటిపల్లి వరకు సింగిల్ ట్రాక్ నిర్మించారు. అయితే కోటిపల్లి నుండి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వరకు రైల్వేలైన్‌ను నిర్మించకుండా అసంపూర్తిగా వదిలేశారు. దీంతో కోనసీమ వాసులకు రైలు బండి అనేది కలగా మారింది. కోటిపల్లి నుండి నర్సాపురానికి రైల్వే లైన్ నిర్మించిన పక్షంలో కోనసీమ మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే రైల్వేపరంగా ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధి సాధ్యమవుతుంది. తూర్పు తీరం వెంబడి పెద్ద ఎత్తున చమురు, సహజవాయు పరిశ్రమల కార్యకలాపాలు జరుగుతున్నాయి. కోనసీమలో ప్రముఖ పరిశ్రమలు ఆవిర్భవిస్తున్నాయి. వీటన్నిటికీ రైల్వేలైన్ అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇప్పటివరకు రైలు సౌకర్యం లేని కోనసీమ ప్రజలకు ఈ రైల్వేలైన్ అభివృద్ధికి బాటలు వేయనుంది. ప్రజల రాకపోకలకు, పారిశ్రామిక అవసరాలకు పెద్ద ఎత్తున మేలు చేకూరుతుంది. అమలాపురం ఎంపి పి రవీంద్రబాబు కూడా ఈ రైల్వేలైన్ పనులను సకాలంలో ప్రారంభించి, ప్రజలకు అంకితం చేసేందుకు కృషి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
పోలవరానికి నిధుల కొరత!
*నాబార్డు నిధులు ఏ మేరకు*బడ్జెట్ కేటాయింపులు నిల్*పెరిగిన అంచనాలకు ఆమోదం ఏది
*పవర్ హౌస్ పరిస్థితి ఏంటి*సకాలంలో పూర్తవ్వడం సందేహమే

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 4: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టును నిధుల కొరత వెంటాడుతోంది. దీనితో ప్రభుత్వం పేర్కొంటున్న గడువులోగా ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి కన్పించడం లేదు. గత బడ్జెట్ కేటాయింపుల్లో యూసీలు ఇవ్వలేదని ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులే లేకుండా చేశారని తెలుస్తోంది. అసలు ప్రాజెక్టు నిధులకే దిక్కులేని స్థితిలో ఇక పవర్ హౌస్ నిర్మాణానికి, పునరావానికి నిధులెలా సమకూరుతాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది.
విభజన చట్టం మేరకు పోలవరం ప్రాజెక్టు తామే పూర్తిచేస్తామని చెప్పిన కేంద్రం 2017-18 బడ్జెట్‌లో నయాపైసా కూడా విడుదలచేయలేదు. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఇచ్చే రుణంపైనే పోలవరం భవిష్యత్తు ఆధారపడింది. నాబార్డు మూలధనం వాటాలో పోలవరానికి ప్రత్యేకించి రూ.500 కోట్లు కేటాయించారు. నాబార్డుకు కేటాయించిన మూలధనం నిధుల నుంచి రాష్ట్రంలో సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఎఐబిపి) కింద ఎనిమిది ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల నుంచే పోలవరానికి కూడా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటి వరకు ఖర్చుచేసిన నిధులను విడుదల చేయాలంటే ఇంకా పోలవరం అథారిటీ ఆమోదం లభించలేదు. 2014-15 బడ్జెట్‌లో రూ.250 కోట్లు, 2015-16లో రూ.400 కోట్లు, 2016-17 బడ్జెట్‌లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు. నీతి ఆయోగ్ ఆమోదం మేరకు పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తామని తేల్చిన కేంద్రం కొత్త అంచనాలను ఎటూ అంగీకరించలేదు. ఇప్పటి వరకు నీతి ఆయోగ్ పాత అంచనాలు అంటే 2010-11 ధరల ప్రకారం రూ.16010.45 కోట్లకు మాత్రమే అంగీకారం తెలిపింది. మరి పెంచిన అంచనాల మాటేమిటో అర్ధం కావడం లేదు. దీంతో అసలు నిధులకే ఠికాణాలేని స్థితిలో గడువులోగా పోలవరం ఎలా పూర్తవుతుందో అనే విషయంలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు 2014 ఏప్రిల్ 1 వరకు ఖర్చు చేసిన నిధులే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇస్తానంటున్న మొత్తం కంటే మరో రెండు రెట్లు అదనంగా అవసరమైన నిధులు ఎక్కడినుండి వస్తాయో దేవుడికే ఎరుక!
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో వౌలిక సౌకర్యాలు
కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 4: జిల్లాలోని ఏజెన్సీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు ఈ నెల 7వ తేదీలోపు ఖచ్చితమైన ప్రతిపాదనలు తయారుచేసి పంపాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టుహాలులో శనివారం సాయంత్రం సమీకృత కార్యాచరణ ప్రణాళికపై ఐటిడిఎ, పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, గిరిజన సంక్షేమం, డిఎఫ్‌ఒ, డిఎంహెచ్‌ఒ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన పాఠశాలల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తాగునీరు సరఫరా, రోడ్లు, విద్యుత్ లైట్లు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరుచేసిందన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు విడుదల చేసిందని, 2010-11సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. 2011-12 సంవత్సరానికి జిల్లాకు 30 కోట్ల రూపాయలు వంతున మంజూరు చేశామన్నారు. 2010 నుండి నాలుగు సంవత్సరాలకు 120 కోట్ల రూపాయలు మంజూరుచేయాల్సి ఉండగా, 100 కోట్ల రూపాయల మంజూరు చేశామన్నారు. 2015-16 సంవత్సరాలకు నిధులు మంజూరు కాలేదని తెలిపారు. ఈ పథకంలో మంజూరైన రూ. 100 కోట్లతో ఏజెన్సీలో అవసరమైన పనులు గుర్తించి పూర్తిచేశామన్నారు. పంచాయితీరాజ్‌కు రూ. 4.67 కోట్లు, ఆర్‌అండ్‌బికి రూ. 6 కోట్లు, గిరిజన సంక్షేమానికి రూ. 62 కోట్లు, ఆర్‌డబ్ల్యుఎస్‌కు రూ. 16 కోట్లు మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు. వీటిని ఆయా శాఖలు త్వరితగతిన పూర్తిచేయలని ఆదేశించారు. మొత్తం 400 పనులు మంజూరుచేయగా వీటిలో 10 పనులు రద్దుచేశామని, మిగిలిన పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. 2011-12, 2013-14 సంవత్సరాల్లో మంజూరుచేసిన పనులు పూర్తిచేశామని, పంచాయితీరాజ్‌కు సంబంధించిన పనులన్నీ పూర్తిచేసినట్లు కలెక్టర్ అరుణ్‌కుమార్ ప్రకటించారు. మూడు పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని మార్చినాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. కొత్త ఎడిషనల్ సెంట్రల్ అసిస్టెన్స్‌గా రూ. 290 కోట్లు మెటల్ గ్రావెల్ బిటి రోడ్డుకు ఈ నెల 7వ తేదీనాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఎండ్లకొండ-బొడ్డగండి, బంద-కానివాడ, కిమిలిగెడ్డ-కొత్తవీధి, బి చోడవరం-బి పాటవరంపాడు తదితర రోడ్లు అవసరం ఉన్నందున వాటిని సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ఇఇని ఆదేశించారు. గిరిజన గ్రామాల ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తిన సమయంలో వారిని ఆసుపత్రులకు తరలించడానికి అంబులెన్స్‌లు ఏర్పాటుచేయడమే కాకుండా, మారేడుమిల్లి, వైరామవరం, గంగవరంలో మూడు బర్త్ వెయిటింగ్ రూమ్‌లను ఏర్పాటుచేయాలని చెప్పారు. ఏజెన్సీలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంచేసి, ఈ వేసవిలో నీటి ఎద్దడి రాకుండా తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. సమావేశం అనంతరం ఆయన పోలవరం ప్రాజెక్టు కింద కాంటూరు 41 పరిధిలో భూసేకరణ, పురుషోత్తపట్నం పంపింగ్ స్కీమ్ భూసేకరణ పురోగతిని సమీక్షించారు. సమావేశంలో ఐటిడిఎ పిఒ దినేష్‌కుమార్, ఓఎస్‌డి రాజమహేంద్రవరం డిఎఫ్‌ఒ, ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ రాజేశ్వరరావు, పిఆర్ ఎస్‌ఇ వెంకటేశ్వరరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
భూములు ఇచ్చేది లేదు..!
పురుషోత్తపట్నం రైతులు

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 4: ఇప్పటికే నాలుగు సాగునీటి పథకాల్లో భూములన్నీ కోల్పోయిన ఎకరం, అర ఎకరం భూములతో జీవిస్తున్నామని, ఇపుడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ఆ భూములు కూడా తీసేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజమహేద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరుల సమావేశంలో రైతులు మాట్లాడారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి భూములిచ్చేది లేదని, ఒకవేళ ఇచ్చినా పోలవరం కుడి కాల్వలో కృష్ణా జిల్లాలో ఇచ్చినట్టుగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూసేకరణ పేరుతో తమ ఉనికికి ఎసరొచ్చే పరిస్థితి దాపురించిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం అర్బన్ జిల్లా కార్యదర్శి టి. అరుణ్ ఆధ్వర్యంలో బాధిత రైతులు రాంబాబు, రమేష్ తదితరులు మాట్లాడారు. తమ గ్రామాల్లో గ్రామంలో 400 ఎకరాల్లో 300 ఎకరాలు సేకరిస్తున్నారని, మిగిలిన వంద ఎకరాల్లో ఏ విధంగా బతకాలని రైతులు ప్రశ్నించారు. పట్టిసీమ పథకంలో ఎకరం రూ.32 లక్షల నుంచి రూ. 52 లక్షల వరకు పరిహారాన్ని ఇచ్చిన ప్రభుత్వం తమ పొలాల విషయానికొచ్చేసరికి రూ.15 నుంచి 17 లక్షలు మాత్రమే ఇస్తామనడం అన్యాయమన్నారు. తమకు భూమి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సారవంతమైన తమ భూములు కాపాడుకునేందుకు ఐక్యంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ప్రజాప్రతినిధులు లేకుండా షేల్ గ్యాస్ ప్రజాభిప్రాయ సేకరణా!
ఒఎన్‌జిసి అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు
ఆలమూరు, ఫిబ్రవరి 4: గ్యాస్ వెలికితీసే గ్రామాల ప్రజలకు, గ్రామాలకు ఓఎన్‌జిసి సంస్థ ఎలాంటి వౌలిక సదుపాయాలు కల్పిస్తోందో రాతపూర్వకంగా తెలిపాలని ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నించారు. ఆలమూరు మండలం కలువచర్లలో గల ఓఎన్‌జిసి షేల్ గ్యాస్ అనే్వషణ ప్రాంతంపై స్థానిక జూనియర్ కళాశాల గ్రౌండ్ ఆవరణలో శనివారం ప్రజాభిప్రాయ సేకరణ జాయింట్ కలెక్టర్-2 జె రాధాకృష్ణమూర్తి, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ ఇంజినీర్ డి రవీంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సభకు ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులైన ఎంపిపి, జడ్పీటీసీ, ఆయా గ్రామాల సర్పంచ్‌లకు సమాచారం ఇవ్వకుండా ఇలాంటి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటన్నారు. అలాగే ఈ ప్రాంతం వారికి ఎటువంటి వౌలిక సదుపాయాలు చేయడానికి ప్రణాళిక చేశారో తెలపాలన్నారు. అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఓఎన్‌జిసికి విజ్ఞప్తి చేసి సభ మధ్యలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వెళిపోయారు. సమావేశానికి జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రతినిధులు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర సభ్యులు, రైతుకూలీ సంఘం నాయకులు షేల్ గ్యాస్ వెలికితీతపై సరైన వివరణ తెలపాలని కోరారు. అయితే ఓఎన్‌జిసి అధికారులు ఆయా గ్రామాల్లో మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని, ప్రస్తుతం ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్న పనులు ఆపాలని వారు కోరారు. అలాగే కలువచర్ల గ్రామాన్ని ఓఎన్‌జిసి సంస్థ దత్తత తీసుకుని, ఆ ప్రాంతం నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కలువచర్ల సర్పంచ్ గానుగుల కృష్ణార్జునరావు కోరారు. దీనిపై త్వరలో మరోసారి అభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని వారు తెలిపారు. కాగా సమావేశంలో ఎటువంటి గొడవలు జరగకుండా ఈ ప్రాంతమంతా రామచంద్రపురం డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మండపేట, రూరల్ సిఐలు, నలుగురు ఎస్సైలు, ఇరవై మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ఈ ప్రాంత ప్రజలతో పాటు, ఒఎన్‌జిసి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం
డి గన్నవరం, ఫిబ్రవరి 4: మహిళాశక్తి సంఘాలు, వివిధ కార్పొరేషన్‌ల రుణాల మంజూరులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పి గన్నవం ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌పై ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం పి గన్నవరం ఆంధ్రాబ్యాంకుకు డ్వాక్రా ఎపిఎం వరాలబాబును వెంటబెట్టుకొని వెళ్లిన ఎమ్మెల్యే బ్యాంకు మేనేజర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా శక్తి సంఘాల రుణాల మంజూరులో స్ర్తిశక్తి భవనం అధికారులకు గానీ, సిబ్బందికి గానీ తెలుపకుండా ప్రైవేటు వ్యక్తి సిఫార్సుతో రుణాలు మంజూరు చేయడం ఏమిటని ఎమ్మెల్యే నిలదీశారు. దీనిపై బ్యాంకు మేనేజర్ వెంకటేశ్వరరావు సమాధానం ఇస్తూ బ్యాంకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నానన్నారు. ప్రభుత్వ ఆదేశాలను బ్యాంకు మేనేజర్లు పరిగణనలోనికి తీసుకోవాల్సిన పనిలేదా అని ఎమ్మెల్యే మేనేజరును ప్రశ్నించారు. మాకు ఉన్నతాధికారుల ఆదేశాలే శిరోధార్యం అని సమాధానం ఇవ్వడంతో ఎమ్మెల్యే డిఆర్‌డిఎ పిడితో ఈ విషయంపై ఫోన్‌లో సంప్రదించారు. ఆంధ్రాబ్యాంకు మేనేజర్ ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోవడం లేదని, అన్ని బ్యాంకులు ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేస్తుండగా పి గన్నవరం ఆంధ్రాబ్యాంకు మేనేజర్ మాత్రం ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. బ్యాంకు నుండి ఇప్పటివరకు కాపు కార్పొరేషన్ రుణాలు ఇవ్వకుండా కాగితాలకే పరిమితం అయ్యాయని ఆయన డిఆర్‌డిఎ పిడికి వివరించారు. బ్యాంకు మేనేజర్ దీనికి సమాధానం ఇస్తూ కాపు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తులు హెడ్ ఆఫీసుకు పంపించామని, వచ్చిన వెంటనే రుణాలు ఇస్తామని సమాదానం ఇచ్చారు. ఎమ్మెల్యే దీనిపై స్పందిస్తూ నీ పనితీరు మార్చుకోకపోతే ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియపరుస్తానని చెప్పి, ప్రభుత్వ పథకాలు మీ పనితీరువల్ల విఫలం అవుతున్నాయని మేనేజర్‌ను హెచ్చరించారు. ఆయన వెంట తెలుగుదేశం నాయకులు సంసాని పెద్దిరాజు, శేరు శ్రీను, దొమ్మేటి వెంకటేశ్వరరావు, అడ్డగళ్ల వాసు, రుద్రా గంగారావు తదితరులు ఉన్నారు.