తూర్పుగోదావరి

ఒడిఎఫ్ గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగవరం, ఫిబ్రవరి 10: రెండో విడత ఎంపిక చేసిన ఒడిఎఫ్ గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్ సిబ్బంది కృషిచేయాలని జిల్లా పరిషత్ సిఇఒ పద్మ ఆదేశించారు. శుక్రవారం గంగవరం మండలంలో పర్యటించిన ఆమె ఎంపిడిఒ కార్యాలయాన్ని ఆకస్మింగా తనిఖీ చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో ఎక్కువ గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రజలకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. మండలంలో రెండవ విడత ఒడిఎఫ్ గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎంపిడిఒని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె విలేఖర్లతో మాట్లాడారు. జిల్లాలో 693 గ్రామాలను ఒడిఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేయగా ఇప్పటికి 268 గ్రామాల్లో పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ నెలఖారు నాటికి మరోవంద గ్రామాలను పూర్తి చేస్తామన్నారు. అలాగే న్యూట్రీ గార్డెన్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వర్మీకంపోస్టు కేంద్రాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో ఎంపిడిఒ సుభాషిణి, ఇఒపిఆర్‌డి కృష్ణ, జెఇ అబ్బాయిదొర, వెలుగు ఎపిఎం మధుబాబు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ముగిసిన లక్ష గో పిడకల యజ్ఞం
కాకినాడ, ఫిబ్రవరి 10: ఆంధ్రప్రదేశ్ హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం కాకినాడలో నిర్వహిస్తున్న అయిదవ రాష్టస్థ్రాయి లక్ష గో పిడకల యజ్ఞం శుక్రవారం రాత్రితో ముగిసింది. నగరంలోని ఆనందభారతి మైదానంలో ఈ నెల 6వ తేదీ నుంచి లక్ష గో పిడకల యజ్ఞంతోపాటు సప్త గోమాత, తులసీమాతలకు లక్ష ప్రదక్షిణల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చివరి రోజున ఇస్కాన్ ప్రతినిధి జీవదాసు ప్రసంగించారు. ఇంట్లో తులసి మొక్క, గోవు ఉంటే రోగాలు రావని వారు వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. గోమాతలో సాక్షాత్తూ భగవంతుడున్నారని, ఇది గ్రహించాలని సూచించారు. గోమయం, గో మూత్రంతో సేంద్రీయ వ్యవసాయం చేయవచ్చని ఇది పరిశోధనలో తేలిందన్నారు. హిందూ రక్షా సమితి రాష్ట్ర అధ్యక్షుడు చేదులూరి గవరయ్య మాట్లాడుతూ హిందుత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే సహించవద్దని కోరారు. హిందువులంతా బంధువులుగా ఉండాలని సూచించారు. ప్రస్తుత కాలంలో గోవును మనమంతా దగ్గర చేసుకుని పెద్దలు చెప్పిన సూక్తులను పాటించాలని కోరారు. అన్ని విజ్ఞానాలకు సంబంధించిన సంస్కృతులు భారతీయ వేదాల్లో ఉందని చెప్పారు. కోల్పోతున్న సంస్కృతికి పాడి పంటల ద్వారా తిరిగి తీసుకురావాలని సూచించారు. ఉదయం సౌర పంచాయతన దీక్ష యజ్ఞాన్ని నిర్వహించారు. హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెఎన్‌ఎస్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ ఆర్‌వి రమణారావు, ఎన్‌వివి సత్యనారాయణ, హిందూ రక్షా సమితి జిల్లా అధ్యక్షుడు పుట్టా రాజారావు, కె సూర్యనారాయణ, డాక్టర్ శివప్రసాద వర్మ, బిజెపి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ జాగిలం డోలీకి ఘన నివాళి!
-పేలుడు పదార్థాలను పసిగట్టడంలో దిట్ట:అనారోగ్యంతో మృతి
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 10: పోలీస్ శాఖ జిల్లా డాగ్ స్క్వాడ్ విభాగంలో విశేష సేవలను అందజేస్తున్న డోలి అనే పేరుగల జాగిలం అకాల మృతి చెందడంతో పోలీస్ సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించారు. పేలుడు పదార్ధాలను పసిగట్టడంలో మంచి నైపుణ్యం ఉన్న డోలీ అనారోగ్యం కారణంగా శుక్రవారం మృతి చెందినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. డోలి 2005వ సంవత్సరం నుండి పోలీస్ శాఖ డాగ్‌స్క్వాడ్ విభాగంలో సేవలను అందిస్తోంది. 2010వ సంవత్సరంలో జరిగిన ఎపి పోలీస్ మీట్‌లో డోలి రాష్ట్రంలోనే ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రంలో విఐపిలు పర్యటించే సమయంలో డోలి విశేష సేవలు అందిస్తుందని, పేలుడు పదార్ధాలను గుర్తించడంతో మంచి నేర్పరని పోలీస్ అధికారులు చెప్పారు. పోలీస్ శాఖ డాగ్‌స్క్వాడ్ విభాగంలో సేవలు అందజేసే జాగిలాలకు సైతం ప్రత్యేక కేడర్ ఉన్న నేపధ్యంలో పోలీస్ అధికారులు పోలీస్ లాంచనాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. శుక్రవారం ఉదయం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఈకార్యక్రమాన్ని నిర్వహించారు.
కోటిపల్లి బస్టాండుపై ప్లై ఓవర్‌కు కదలిక

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 10: రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వద్ద కొత్తగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదనలో కదలిక వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో మరుగునపడిన ఈ ప్రతిపాదన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి కృషి వల్ల ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. త్వరలో సర్వే పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జి నుంచి ట్రాఫిక్ ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదుగా వచ్చే విధంగా రూపకల్పన చేశారు. కోటిపల్లి బస్టాండ్ జంక్షన్ నుంచి మొదలయ్యే ఈ ఫ్లై ఓవర్ తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డులోని వాంబే హౌసింగ్ జంక్షన్ వరకు డిజైన్ చేశారు. ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జి, మోరంపూడి జంక్షన్‌లో ఫ్లై ఓవర్ బ్రిడ్జి, నగరంలో మాస్టర్ ప్లాన్‌ను అనుగుణంగా నిర్మాణమవుతున్న భారీ రహదారులకు సంబంధించి అధికారులతో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి శుక్రవారం క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
కోటిపల్లి బస్టాండ్ వద్ద నిర్మించనున్న ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జి తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డుకు అనుసంధానమై అక్కడ నుంచి వాంబే గృహ సముదాయం మధ్య నుంచి వెళ్లే 100 అడుగుల రోడ్డుకు అనుసంధానం చేస్తారు. మోరంపూడి జంక్షన్ సమీపంలో జాతీయ రహదారికి అనుసంధానంగా ఆవ ప్రాంతం నుంచి 100 అడుగుల రోడ్డును రూ.5 కోట్ల అంచనా నిధులతో సెంట్రల్ లైటింగ్‌తో నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులతో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి సమీక్షించారు. యుద్ధప్రాతిపదికన ఈ రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ రోడ్డు నిర్మాణ ప్రాంతంలో ఉన్న పట్టా భూములు కలిగిన వారు పరిహారం తీసుకుని సహకరించాలని, అవసరమైతే భూములను సేకరించే విధంగా చర్యలు చేపట్టి రోడ్డు పనులను మొదలు పెట్టాలని ఆదేశించారు. దీనికితోడు తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డును 80 అడుగుల రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నారు. కొద్దిరోజుల్లో పనులు చేపట్టనున్నట్టు ఎమ్యెల్యే గోరంట్ల తెలిపారు. దీంతో ఇటు సావిత్రినగర్ రోడ్డు, తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డు, మరో వైపు100 అడుగులు రోడ్డుగా మోరంపూడి రహదారికి అనుసంధానమయ్యే భారీ రోడ్ల సదుపాయంతో ఈ ప్రాంతమంతా శరవేగంగా అభివృద్ధికి మార్గం సుగమమైంది. మోరంపూడి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై నిర్మించనున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిని కూడా తూర్పు రైల్వేస్టేషన్‌కు వచ్చే 100 అడుగులు మోరంపూడి రహదారికి అనుసంధానం చేయనున్నారు.
నగరంలోని మురుగునీరు డ్రెయిన్లు అనుసంధానమయ్యే ఆవ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రణాళికాబద్ధంగా డ్రెయిన్లు నిర్మించేందుకు, రూ.8 కోట్ల నిధులతో భారీ డ్రెయిన్లు, ఎస్టీపీ స్థాయి పెంపుదల చేయడం వంటి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆవలో డ్రెయిన్లను ఆధునికీకరించడం వల్ల నగరంలో ముంపునకు గురయ్యే వర్షపు నీటి సమస్యకు పరిష్కారం లభించగలదని గోరంట్ల తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రణాళికాబద్ధమైన డ్రెయినేజీ వ్యవస్థకు రూపకల్పన చేశామని వివరించారు. మురుగునీటిని శుద్ధిచేసిన నీటిని గోదావరి నదిలో బ్యారేజీకి దిగువన ఈస్ట్రన్ కెనాల్‌లో కలిసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో ధవళేశ్వరంలో మరుగునపడిపోయిన రాతి కాల్వను, ఆవ ఛానల్, ఇన్నీసుపేట ఛానల్‌ను అభివృద్ధిచేసే పనులు జరుగుతున్నాయి. ఆవ ప్రాంతంలో ఇటు షెల్టాన్ హోటల్ జంక్షన్‌కు అనుసంధానం చేస్తూ జాతీయ రహదారిని కలుపుతూ ఒక భారీ డ్రెయిను నిర్మాణం జరుగుతోంది. ఈ డ్రెయినుకు రెండువైపులా 40 అడుగుల వెడల్పుతో రెండు రోడ్లు జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ రూ.4 కోట్ల నిధులతో నిర్మాణం చేపట్టారు. మొత్తం మీద ఇటు భారీ డ్రెయిన్లు, భారీ రహదారులతో మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి మోరంపూడి జంక్షన్ వరకు విశేషరీతిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో నగరం స్వరూపానే్న మార్చేసే ప్రణాళికాబద్ధ అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్టయింది. ఇందుకు సంబంధించి మొత్తం పనులన్నీ సత్వరం చేపట్టేందుకు స్థానికంగా ఎదురయ్యే సమస్యలపై అప్పటికపుడు పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే గోరంట్ల స్థానికులతో చర్చించి అధికారులను సమన్వయం చేశారు. ఇటు రెవెన్యూ, కార్పొరేషన్, ఆర్‌అండ్‌బి, ప్రజారోగ్య సాంకేతిక విభాగం, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమన్వయం చేసుకుని సత్వరం పనులు పూర్తయ్యేలా చూడాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి అధికారులను ఆదేశించారు.
దాతల సహకారంతో బాల సదనం అభివృద్ది
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 10: దాతల సహకారంతో బాల సదనం, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లను అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన దానవాయిపేటలోని బాలసదనం, హాస్టల్‌ను పరిశీలించారు. భవనాల శ్లాబులు దెబ్బతినడం, నీరుకారుతుండటాన్ని గమనించి మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉందన్నారు. ఈమేరకు అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బాలసదనం, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ను ఆధునీకరించేందుకు దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. బాలసదనంలో 22 మంది విద్యార్థులు మాత్రమే ఉండటాన్ని గుర్తించి, మరింత మంది చేరే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆయన వెంట కమిషనర్ వి విజయరామరాజు, ఐసిడిఎస్ ఇన్‌చార్జి పిఓ టి శారదాదేవి, సిడిపిఓ వరహాలు, సూపరింటెండెంట్ జి రోజారాణి తదితరులు ఉన్నారు.
హోలీఏంజెల్స్ కరస్పాండెంట్ నిర్వాకంపై విచారణ
గిరిజన విద్యార్థినులను చితకబాదిన హోలీ ఏంజెల్స్ పాఠశాల కరస్పాండెంట్ కె మధుసూదనరావు నిర్వాకంపై ఐటిడిఓ పిఓ, సబ్‌కలెక్టర్‌తో విచారణ నిర్వహించనున్నట్లు కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ (మిగతా 6వ పేజీలో)
చెప్పారు. శుక్రవారం ఆయన కమిషనర్ వి విజయరామరాజు, సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్‌తో వివిధ అంశాలపై సమీక్ష జరిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరస్పాండెంట్‌పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన విద్యార్థినులు ఇబ్బందులకు గురికాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి భూమిని ఇచ్చేందుకు ఆ ప్రాంత రైతులు సానుకూలత వ్యక్తం చేశారన్నారు. రైతులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

లంచం తీసుకున్న కేసులో
అన్నవరం ఆలయ డిఇకి జైలు
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 10: సివిల్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రఖ్యాత ఆలయం అన్నవరం దేవస్థానం డిఇ అచ్యుతరమేష్‌కు రెండేళ్ల జైలు శిక్ష, రూ. 75వేల జరిమానా విధిస్తూ శుక్రవారం విజయవాడ అవినీతి నిరోధకశాఖ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చినట్లు రాజమహేంద్రవరం ఎసిబి డిఎస్పీ సుధాకర్‌రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం 2005 సెప్టెంబర్‌లో అచ్యుతరమేష్ తుది బిల్లు మంజూరుకు కాకినాడకు చెందిన సివిల్ కాంట్రాక్టర్ ఎం వీరవెంకట రమణారావు నుంచి రూ. 2000 లంచం డిమాండుచేశారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు పన్నిన వలలో లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసును విచారించిన ఎసిబి ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శుక్రవారం శిక్షను ఖరారు చేశారు.

సందిగ్ధంలో కోనసీమ ఉత్సవాలు

ఐ పోలవరం, ఫిబ్రవరి 10: కోనసీమ ఉత్సవాల నిర్వహణకు స్థానిక రైతులు భూములు ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు, ప్రజాప్రతినిధుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. కోనసీమ ఉత్సవాలు నిర్వహించడానికి భూములు కోసం నెల రోజుల నుండి స్థానిక నాయకులు, అధికారులు రైతులతో సంప్రదింపులు జరిపినప్పటికీ నేటి వరకూ రైతుల నుండి ఎటువంటి సానుకూలత లభించలేదు. దీంతో ఉత్సవాల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. కోనసీమ ఉత్సవాలు ఐ పొలవరం మండలం మురమళ్లలో నిర్వహించడానికి ఒకవైపు రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు ఈ నెల 24 నుండి 27 వరకూ తేదీలు ఖరారు చేయడం విదితమే. ఈ నేపథ్యంలో స్థానిక రైతులతో మరోసారి సంప్రదింపులు జరుపుతామని ముమ్మిడివరం తహసీల్దార్ ఎం వీర్రాజు శుక్రవారం ఆంధ్రభూమికి తెలిపారు. అయితే 2016 ఏప్రిల్ 6నుండి 10వ తేదీ వరకూ మురమళ్లలో కోనసీమ ఉత్సవాలు స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అయితే అప్పట్లో స్థానిక రైతులకు, సమీప గ్రామాల ప్రజలకు, నాయకులు, అధికారులు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని ప్రస్తుతం ఆ సమస్యలు పరిష్కరిస్తేనే తాము ఉత్సవాలకు సహకరిస్తామని రైతులు, ప్రజలు అధికారులకు బాహాటంగా చెపుతున్నారు. ఉత్సవాలకు మురమళ్ల పంచాయతీ పరిధిలో తీసుకున్న భూములతోపాటు గాడిలంక, అన్నంపల్లి గ్రామాల రైతులకు చెందిన సుమారు 30 ఎకరాల భూములను అధికారులు తీసుకున్నారు. అధికారులు రైతుల డిమాండ్లు పట్టించుకోకుండా తమపై ఒత్తిడి తెచ్చి కొబ్బరి తోటలో రోలర్లతో చదును చేయించి ఉత్సవాలు నిర్వహించారని, తరువాత దుక్కి దున్ని నీరు తోడి ఇవ్వడంలో అధికారులు రైతులను నానా ఇబ్బందులు పెట్టారని రైతు జగతా పద్మనాభం (బాబ్జి) ఆరోపించారు. అంతేకాకుండా కోనసీమ ఉత్సవాల్లో మూడు గ్రామాలకు సంబంధించిన శ్మశానవాటికకు శాశ్వత స్థలాలు కేటాయిస్తామని, రేవులు నిర్మిస్తామని హామీ ఇచ్చిన అధికారులు, నాయకులు వాటిని నెరవేర్చలేదని గాడిలంక సర్పంచ్ దాణం కోట వేణుగోపాలస్వామి, ఎస్సీ సొసైటీ ప్రెసిడెంట్ బళ్ల రామకృష్ణలు ఆరోపించారు. కొబ్బరి తోటల్లో ఒక ఎకరం పొలం దున్ని నీరు తోడటానికి తమకు రూ. 5వేలు ఖర్చవుతుందని రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొబ్బరి దిగుబడి లేక రైతులు నష్టాల్లో ఉన్నారని, గతేడాది ఉత్సవాలు జరిగేటప్పుడు తమ పొలాల్లోకి వెళ్లనీయకపోగా రైతులకు ఉత్సవాలు తిలకించేందుకు పాస్‌లు కూడా పంపిణీ చేయకపోవడంపై అధికారులపై స్థానిక రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. కోనసీమ ఉత్సవాలకు తాము వ్యతిరేకం కాదని, అధికారులు స్వయంగా తమ పొలాల్లోకి వచ్చి రైతులను సమావేశపరచి తమ పొలాల పరిస్థితి స్వయంగా పరిశీలించి తగిన హామీ ఇవ్వాలని అధికారులను రైతులు కోరుతున్నారు.
శాశ్వత శ్మశానవాటికలు ఏర్పాటుచేయాలి
గాడిలంక, అన్నంపల్లి, కొమానపల్లి గ్రామాలకు చెందిన ఒకే ఒక్క శ్మశానవాటిక మురమళ్ల వృద్ధ గౌతమీ నదీతీరాన ఉంది. గతేడాది కోనసీమ ఉత్సవాల్లో ఆయా గ్రామాలకు శాశ్వతంగా శ్మశానవాటికలు ఏర్పాటుచేస్తామని, ఘాట్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన అధికారులు, నాయకులు ఇప్పటికీ ఏమీ చేయలేదు. అప్పట్లో అయిదురోజుల పాటు ఆయా గ్రామాల్లో మరణించిన మృతదేహాలను వేరొక ప్రదేశాలకు తరలించి ఖననం చేశారు. ఇప్పటికైనా మూడు గ్రామాలకు ఆయా గ్రామాల సమీపంలో శాశ్వతంగా శ్మశానవాటికలు ఏర్పాటుచేయాలి.
-దానం వేణుగోపాలస్వామి సర్పంచ్ గాడిలంక
దళితులకు శ్మశానవాటిక శాశ్వతంగా నిర్మించాలి
గతంలో కోనసీమ ఉత్సవాలు సందర్భంగా తమ గ్రామాలకు చెందిన శ్మశానవాటికలో సమాధులు తొలగించారు. అప్పట్లో శ్మశానవాటికలు నిర్మిస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇప్పటికీ వాటిపై దృష్టి పెట్టలేదు. ఇప్పటికైనా గాడిలంక గ్రామానికి దళితులకు శాశ్వతంగా శ్మశానవాటిక నిర్మించాలి.
- బళ్ల రామకృష్ణ, గాడిలంక

ఘనంగా లక్ష్మీనరసింహ స్వామి చక్రస్నానం
మలికిపురం, ఫిబ్రవరి 10: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు పాణింగిపల్లి శ్రీకిరణ్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, జిడిపి ఛైర్మన్ భూపతిరాజు ఈశ్వరవర్మ, ఆలయ ఉత్సవ కమిటీ ఛైర్మన్ గుండుమేను నాగేశ్వరరావు, అమలాపురం ఆర్డీవో జి గణేష్‌కుమార్, ఆలయ ట్రస్టీలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు ముగింపు సందర్భంగా ఆలయం వద్ద ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

టిబి వ్యాధి నివారణకు 225 యూనిట్లు
రాయవరం, ఫిబ్రవరి 10: రాష్ట్ర వ్యాప్తంగా టిబి (క్షయ) వ్యాధి నివారణకు 225 టిబి యూనిట్స్, 611 కఫం పరీక్షా కేంద్రాల ద్వారా వ్యాధి నివారణ మందులు అందజేస్తున్నట్టు స్టేట్ టిబి ప్రోగ్రామింగ్ జెడి డాక్టర్ టి రామారావు తెలిపారు. 104 సేవలను పరిశీలించి, డీవార్మింగ్ ప్రోగ్రామ్‌ను పరిరిక్షించేందుకు శుక్రవారం ఆయన రాయవరం, వెదురుపాక గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు 150 కేసులు నమోదయ్యేవని, ప్రస్తుతం వాటి సంఖ్య 127కు తగ్గిందన్నారు. రాష్ట్రంలో ఏటా 60వేల మంది క్షయ వ్యాధిగ్రస్థులను గుర్తిస్తుండగా సుమారు 32వేల మంది చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. క్షయ వ్యాధిని ఇప్పుడు నోటిఫైడ్ డిసీజ్‌గా గుర్తించామన్నారు. ప్రైవేటు వైద్యశాలలో టిబి పేషంట్లను గుర్తిస్తే వైద్యులు వెంటనే ఆ విషయాన్ని జిల్లా టిబి కంట్రోల్ వైద్యాధికారికి తెలియజేయాలన్నారు. రెండు వారాలు పైబడిన వారికి దగ్గు పరీక్షలు చేస్తామన్నారు. జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడలో సిబి నాక్ పరికరాలు అందుబాటులో ఉన్నాయని, వీటి ద్వారా హై రిస్క్ గ్రూపువారికి పరీక్షలు చేస్తామన్నారు. తొలుత ఆయన వెదురుపాకలో ‘104’ వాహనాల ద్వారా వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో, సిబ్బంది తగిన శిక్షణ పొందారోలేదో, వాహనంలో వైద్య పరికరాలు ఏ మేరకు ఉన్నాయో పరిశీలించారు. సిబ్బంది రికార్డులను పరిశీలించారు. మండలంలోని డీవార్మింగ్ పోగ్రామ్‌ను కూడా ఆయన పరిశీలించారు. ఈయన వెంట జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ ఎన్ ప్రసన్నకుమార్, రాయవరం పిహెచ్‌సి వైద్యాధికారిణి కె నిరూప ఉన్నారు.
ప్రచారం కోసం కోట్లాది రూపాయలు వృథా
రావులపాలెం, ఫిబ్రవరి 10: రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉందని ఒక వైపు చెబుతూనే మరోవైపు ప్రచార ఆర్భాటాలకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని డిసిసి అధ్యక్షుడు పంతం నానాజీ విమర్శించారు. శుక్రవారం గుంటూరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన జిల్లాలోని పార్టీ శ్రేణులతో కలిసి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రావులపాలెంలో ఆయనకు నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి ఆకుల రామకృష్ణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నానాజీ విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు విశాఖపట్నం, కాకినాడ బీచ్ ఫెస్టివల్‌కు కోట్లాది రూపాయలు ఖర్చుచేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రచారార్భాటానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెడుతున్నారని ఆరోపించారు. విభజన చట్టంలోని అంశాలకు చట్టబద్ధత ఉందని, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతుంటే సిఎం చంద్రబాబు ఆ అంశాలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాన మంత్రి మోదీ పాలన దేశంలో ఎమర్జన్సీని తలపిస్తోందన్నారు. అనంతరం ఆయన గుంటూరు బయలుదేరి వెళ్లారు. ఈ సమావేశంలో డిసిసి కార్యదర్శి సాధనాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

యనమల ఫౌండేషన్ ద్వారా
పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
- మంత్రి యనమల రామకృష్ణుడు
తొండంగి, ఫిబ్రవరి 10: తుని నియోజకవర్గంలోని తొండంగి, తుని, కోట నందూరు మండలాల్లో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని యనమల ఫౌండేషన్ ద్వారా అందజేయనున్నట్లు రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. శుక్రవారం ఎవి నగరం గ్రామంలో నూతనంగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి దేవాలయంలో మంత్రి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఆజ్ఞాత్మికత, భక్తి భావన పెంపొందించేందుకు ఎవి నగరం గ్రామంలో దేవాలయాలు నిర్మించామని అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో యనమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రతిభ చూపి ఇంటర్మీయట్ చదువుతున్న 100 మంది విద్యార్ధులకు ఒక్కొక్కరికీ 500 రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 12వ తేది ఆదివారం ఎవి నగరం గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఈ ఆర్ధిక సహాయాన్ని విద్యార్ధులకు అందజేస్తామని అన్నారు. ఈ ఆర్ధిక సహాయం అందజేయడం కోసం పేద విద్యార్ధుల్లో ప్రతిభ గల వారిని ప్రోత్సహించే విధంగా ఎంపిక చేశామని అన్నారు. ఎవి నగరం గ్రామం చుట్టు పక్కల గ్రామాల్లో విద్యార్ధులకు పోటీ పరిక్షలకు హాజరైన రీతిలో గ్రామాలు జిల్లా పరిషత్ సహాయంతో ప్రత్యేక గ్రంధాలయం ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎవి నగరం గ్రామంలో కోటి 25 లక్షల వ్యాయంతో ప్రాథమిక ఆరోగ్య భవనం పూర్తి కానున్నదని ఈ సందర్భంగా యనమల తెలిపారు.
తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
కాకినాడ, ఫిబ్రవరి 10: జిల్లాలో ఈ రబీ సీజన్‌లో వేసిన అపరాల పంటలకు తెగుళ్ళ బెడద పొంచివుందని, రైతులు దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా రబీలో మినుము పంటకు తలమాడు తెగులు వ్యాపించే అవకాశం ఉందని, దీనిపై రైతులందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ జెడి కెఎన్‌వి ప్రసాద్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో వ్యవసాయ శాఖాధికారులను ఎప్పటికపుడు సంప్రదిస్తూ సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. వాతావరణంలో మార్పులు, పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటూ, రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో ఈ తెగుళ్ళు త్వరగా వ్యాపించే అవకాశం ఉందన్నారు. ఈ తరహా తెగులు తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుందని, తెగులు ఆశించి ఆకుల నుండి రసాన్ని పీల్చడంతో పాటు ఆకులు కుచించుకుపోయేలా చేస్తుందన్నారు. మొక్కలు గిడసబారిపోయే అవకాశం ఉండడంతో కాయలు ఎదగకుండా ఆగిపోతాయని, ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. తామర పురుగుల నివారణకు 1.5మిల్లీలీటర్ల పిప్రోనిల్ లేక 1.5మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్, 0.4మిల్లీలీటర్ల స్పైనోసాడ్‌ను లీటరు నీటిలో కలిపి, ఎకరానికి 10-15 ట్యాంకుల వరకు మొక్కలన్నీ తడిచేలా పిచికారీ చేయాలని సూచించారు. ప్రతి పది రోజులకు మందులను పిచికారీ చేయాలని స్పష్టం చేశారు. తామర పురుగుల నియంత్రణ కోసం ఎకరానికి 20చొప్పున నీలి రంగు జిగురు పూసిన డబ్బాలు లేక అట్టలను ఏర్పాటుచేయాలని, ఎప్పటికపుడు పొలం గట్లపై కలుపు మొక్కలను ఏరివేయాలని పేర్కొన్నారు. అలాగే పంట తొలి దశలో (2-4 ఆకుల దశలో) వేప నూనెను పిచికారీ చేయాలని, దీనివలన రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని అరికట్టవచ్చని చెప్పారు. మినుము సాగు చేస్తున్న రైతులందరూ విధిగా ఈ జాగ్రత్త చర్యలను పాటించాలని, అలాగే అన్ని రకాల అపరాల పంటల సాగు విషయంలో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ జెడి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.