తూర్పుగోదావరి

ఆగని మరణ మృదంగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, ఫిబ్రవరి 17: ఏజన్సీలో శిశుమరణాల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న శిశువులకు సరైన వైద్య సహాయం అందకే ఎక్కువమంది మరణిస్తున్నారు. గర్భవతుల్లో ఉన్న రక్తహీనతే శిశువుల అనారోగ్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మండలంలో కేశవరం గ్రామానికి చెందిన గిరిజన మహిళ గోము బుజ్జమ్మకు చెందిన మూడు నెలల ఆడ శిశువు శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ కాకినాడ జనరల్ ఆసుపత్రికి అంబులెన్సులో తరలించిన విషయం విదితమే. ఆ శిశువుకు ఆసుపత్రిలో వైద్యులు గురువారం రాత్రి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలోనే ప్రాణాలు విడిచింది. దీనితో గత నాలుగు నెలలుగా మండలంలో మరణించిన శిశువుల సంఖ్య 20కి చేరుకుంది. కాగా వారం రోజుల వ్యవధిలోనే మండలంలో ఇరువురు శిశువులు, ఒక బాలింత మరణించారు. ఎక్కువ శిశుమరణాలు మారుమూలన ఉన్న లోదొడ్డి పంచాయతీలోనే కేశవరం, పూదేడు, పాకవెల్తి, లోదొడ్డి గ్రామాల నుండే సంభవించడం గిరిజనులను కలవరపరుస్తోంది. వైద్యపరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లో నెల రోజుల వయస్సున్న బిడ్డలను వైద్యులు కాపాడలేకపోతున్నారనేది నగ్నసత్యం. ఈ ప్రాంతంలో జన్మించిన బిడ్డలను ప్రత్యేక వైద్య సహాయం అందించేందుకు ఇప్పటి వరకు సరైన ప్రణాళికను ఉన్నతాధికారులు చేపట్టకపోడం గమనార్హం. జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్‌తోపాటు పలువురు అధికారులు తరచు ఏజన్సీలో పర్యటిస్తున్నా ఈ మరణాలు తగ్గకపోడం విచారించాల్సిన విషయం. ముక్కు పచ్చలారని, నిండునూరేళ్లు జీవించాల్సిన చిన్నారులు నెలల వయస్సులోనే కన్నుమూయడం మన్యం వాసులను కలచివేస్తోంది. చిన్న పిల్లల స్పెషలిస్టులు, గర్భకోశ వ్యాధి నిపుణుల కొరత మన్యాన్ని వేధిస్తోంది. కనీసం ఈ మరణాలు ఎక్కువగా ఉన్న జడ్డంగి, రాజవొమ్మంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిపుణులైన వైద్యులను నియమించాల్సిన అవసరం ఎంతైనావుంది. వ్యాధులు సోకిన బిడ్డలకు, తల్లులకు స్థానికంగా వైద్య సహాయం లేకపోడం, వంద కిలోమీటర్లు పైనే ఉన్న కాకినాడకు వెళ్లడం నిరుపేదలైన గిరిజనులకు చాలా కష్టమైపోతోందనే చెప్పాలి. వైద్య నిపుణులను నియమిస్తామని కలెక్టర్ ఆరుణ్‌కుమార్ హామీ ఇచ్చి నాలుగు నెలలైనా నేటికీ ఫలితం కనిపించలేదు. ఉన్నతాధికారులు తగు చర్యలు చేపట్టనంతకాలం శిశు మరణాలు తగ్గే అవకాశం లేదని స్పష్టంగా చెప్పవచ్చు. తమ బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందోనని పసి బిడ్డల్ని కన్న బాలింతలు ఆందోళనతో తల్లడిల్లిపోతున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు:జెసి
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 17: జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ తెలిపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి శాసనమండలి ద్వైవార్షిక ఎన్నికల నిర్వాహణ అంశాలపై సమీక్షించారు. ఈసమీక్షలో పాల్గొన్న జెసి సత్యనారాయణ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న చర్యలు గురించి సిఈఒకు వివరించారు. జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 1477మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1420మంది డేటా ఎంట్రీ పూర్తిచేసినట్లు చెప్పారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల షెడ్యూల్, మోడల్‌కోడ్ ఆఫ్ కాండక్ట్‌పై వివరించినట్లు తెలిపారు. ప్రతీ మండలంలో ఎంపిడిఒల నేతృత్వంలో మోడల్‌కోడ్ అమలటీమ్, తహసీల్దార్ నేతృత్వంలో ఫ్లయింగ్ స్క్వాడ్, ఆర్‌ఐ, వీడియోగ్రాఫర్‌లతో వీడియో సర్వేలెన్స్ టీమ్ ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. జిల్లాలోని ఏడు డివిజన్‌ల ప్రధాన కేంద్రాలలో పోలింగ్ కేంద్రాలను ఎన్నికల నిర్వహణకు సిద్దం చేస్తున్నామన్నారు. పోలీస్ యంత్రాంగం సహకారంతో పటిష్టమైన బందోబస్తు ప్రణాళికను చేపడుతున్నట్లు జెసి సత్యనారాయణ పేర్కొన్నారు. ఈసమావేశం అనంతరం ఆయన కలెక్టరేట్ నుండి డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న కారణంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అన్ని ప్రభుత్వ శాఖలు ఖచ్చితంగా అమలుచేయాలని ఆదేశించారు. ఈసమావేశంలో ఎఎస్పీ ఎఆర్ దామోదర్, శ్రీనివాసరెడ్డి, జేసి-2 రాధాకృష్ణమూర్తి, జడ్పీ సిఇఒ కె పద్మ, ఇతరు అధికారులు పాల్గొన్నారు.

శరవేగంగా డిజిటలైజేషన్
ప్రతి పంచాయతీలో మీ సేవా కేంద్రం - కాగిత రహిత సేవలందించేలా పంచాయతీలు

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 17: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో శరవేగంగా డిజిటలైజేషన్ ప్రక్రియ జరుగుతోంది. ప్రతీ పంచాయతీలోనూ మీ సేవా కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ గ్రామాలను త్వరలో ఫైబర్ గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. జిల్లాలోని మొత్తం 1069 పంచాయతీలను 528 క్లస్టర్లు విభజించి డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టారు. ఇక పంచాయతీ కార్యకలాపాలన్నీ కాగిత రహితంగానే సాగే విధంగా ఆధునికీకరణ విధానాలను అవలంబిస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి 180 మంది పంచాయతీ సిబ్బందికి శిక్షణ కల్పించారు. మిగిలిన వారికి దశలవారీగా శిక్షణ కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు కాగిత రహిత సేవలందించే విధంగా పంచాయతీలు రూపుదాల్చుతున్నాయి. డిజిటలైజేషన్‌కు సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్లను కూడా కొన్ని చోట్ల నియమించారు.
ఇక పన్నులు కట్టించుకోవడం, బిల్లులు చెల్లించడం తదితర పంచాయతీ సేవలన్నీ నగదు రహితంగానే సాగనున్నాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో 40 పంచాయతీల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటుచేశారు. మిగిలిన పంచాయతీల్లో కూడా స్వైపింగ్ మిషన్లు దశలవారీగా ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీల్లో లే అవుట్ల అనుమతి నుంచి భవన నిర్మాణ క్రమబద్ధీకరణ, సిబ్బంది జీతాల నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు తదితర అన్నిరకాల సేవలు ఇకపై డిజిటల్ సంతకంతోనే సాగేలా నిర్దేశిత ఫార్మాట్‌లో సేవలు అందించేందుకు సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేశారు.
జిల్లా అంతా ఏ రోజు లావాదేవీలు ఆ రోజు సాయంత్రానికల్లా గణాంక వివరాలతో సహా తేటతెల్లమయ్యే విధంగా ఆన్‌లైన్‌లో అనుసంధానం చేస్తున్నారు. చెల్లింపులన్నీ నేరుగా అకౌంట్లకు చేరే విధంగా ఏర్పాట్లు చేశారు. మధ్యవర్తులకు చెల్లింపు లేకుండా అంతా నగదు రహితంగా, కాగిత రహిత సేవలతో పారదర్శకంగా సాగేందుకు పంచాయతీల్లో డిజిటలైజేషన్ ఆధునికీకరణ ప్రక్రియ జరుగుతోంది. మొత్తమీద జిల్లా ఆధునిక విధానాల్లో రాష్ట్రంలోనే ముందున్నట్టుగా తెలుస్తోంది.

లంచం కేసులో
ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌కు జైలు, జరిమానా
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 17: మద్యం షాపు యజమాని నుంచి లంచం తీసుకున్న కేసులో ఎక్సైజ్ ఇనస్పెక్టర్, ఎక్సైజ్ కానిస్టేబుల్‌కు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ శుక్రవారం అవినీతి నిరోధకశాఖ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చినట్లు ఎసిబి డిఎస్పీ ఎన్ సుధాకరరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం 2002లో రామచంద్రపురం ఎక్సైజ్ సిఐగా పనిచేసిన ఆర్ చిరంజీవిరావు గంగవరంనకు చెందిన ఎ నారాయణస్వామి అనే మద్యం దుకాణం యజమాని నుంచి కానిస్టేబుల్ కె రాజబాబు ద్వారా రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. ఈకేసును విచారించిన న్యాయమూర్తి చిరంజీవిరావుకు మూడేళ్ల జైలు, రూ.25వేల జరిమానా, కానిస్టేబుల్ రాజబాబుకు రెండేళ్ల్ల జైలు, రూ.20వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

ఉద్యోగుల శ్రేయస్సే ధ్యేయం
ఉద్యోగ సంఘాల జెఎసి ఛైర్మన్ బొప్పరాజు

అమలాపురం, ఫిబ్రవరి 17: ఉద్యోగుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జెఎసి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. స్థానిక కాటన్ అతిధి గృహంలో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో బొప్పరాజు నూతన జెఎసి ఏర్పాటు, దాని లక్ష్యాలను వివరించారు. జిల్లా నాయకత్వాన్ని బలపరిచి జెఎసి కార్యకలాపాలను సాధారణ ఉద్యోగికి తెలియజెప్పడమే కాకుండా వారికి అందించే సేవలను విస్తరిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న సిపిఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో పనిచేస్తామన్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానానే్న అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే అన్ని సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందేలా ప్రభుత్వంపై వత్తిడి తేవడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని బొప్పరాజు అన్నారు. హెల్త్‌కార్డులు ఇచ్చినా అవి ఉపయోగపడటంలేదని, వాటి అమలుకు కూడా ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పిఆర్‌సిని వర్తింప చేయాలన్నారు. అలాగే 32 సొసైటీల్లో సభ్యులుగా ఉన్న 35 వేల మంది ఉద్యోగులు ఇళ్లస్థలాల కోసం ప్రభుత్వానికి రూ.152 కోట్లు చెల్లించినా నేటికీ పంపిణీ జరగకపోవడానికి గత ఎన్జీవో జెఎసి నిర్లక్ష్యమేనన్నారు. బయోమెట్రిక్ విధానం వల్ల ఫీల్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ విధానంపై కూడా పునరాలోచించాలని ప్రభుత్వానికి నివేదించామని బొప్పరాజు తెలిపారు. ఈసందర్భంగా ఎన్జీవో జెఎసి, ఉద్యోగ సంఘాల జెఎసికి మధ్యగల తేడాను ఆయన వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 150 ఉద్యోగ సంఘాల్లో ఎన్‌జిఒ సంఘం ఒకటని, ఆసంఘం తరుపునే అశోక్‌బాబు ఇంతకాలం అధ్యక్షునిగా కొనసాగారన్నారు. అశోక్‌బాబుకు, తమకు ఏవిధమైనా బేధాభిప్రాయాలులేవని, అయితే ఉద్యోగుల సంక్షేమ, అభివృద్ధి విషయంలో ఎన్జీవో జెఎసి చేసింది శూన్యమన్నారు. సమావేశంలో కోనసీమ జెఎసి ఛైర్మన్ విఎస్ దివాకర్, తహసీల్దార్ నక్కా చిట్టిబాబు, సిఐటియు అధ్యక్షుడు కె సత్తిబాబు, దక్షిణామూర్తి, బండారు రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

2.25 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు లక్ష్యం
బడ్జెట్‌లో మత్స్యశాఖకు రూ.22.9 కోట్లు:కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ, ఫిబ్రవరి 17: జిల్లాలో 2016-17 సంవత్సరంలో రూ.4,276 కోట్ల విలువైన 2లక్షల 25 వేల 663 టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యంతో వివిధ పథకాలు అమలుచేస్తున్నామని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 2016-17 సంవత్సరానికి మత్స్యశాఖకు రూ.22.90 కోట్ల బడ్జెట్ కేటాయంచారన్నారు. జిల్లాలో 3.03 లక్షల మంది సముద్ర తీర మత్య్సకారులు, 82,300 ఇన్‌లాండ్ మత్య్సకారులు చేపలవేట వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వీరి జీవనాధార కోసం సముద్రంలో చేపలవేట కోసం 469 మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లు, 2640 ఇన్‌లాండ్ పడవులు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. మత్య్స ఉత్పత్తిలో భాగంగా 12, 180 హెక్టార్లలో ఆక్వా కల్చర్, 12 రిజర్వాయర్లు, 2016 డిపార్ట్‌మెంట్ చెరువులు, 3202 గ్రామ పంచాయతీ చెరువుల ద్వారా చేపలను పెంపకం నిర్వహిస్తున్నారని తెలిపారు. 615 మత్య్స సహకార సంఘాల్లో 40,391 మంది సభ్యులున్నారన్నారు.
చేప పిల్లల ఉత్పత్తి కోసం రూ.20 కోట్లు మంచినీటి చేపపిల్లల ఉత్పత్తి సామర్ధ్యం గల మత్య్సక్షేత్రాలు పనిచేస్తుండగా వాటిలో 7 ప్రభుత్వ, 29 ప్రైవేట్ క్షేత్రాలు ఉన్నాయని తెలిపారు. రొయ్య పిల్లల ఉత్పత్తి కోసం 3250 మిలియన్ల రొయ్య పిల్లల సామర్ధ్యంగల 76 ష్రింప్ సీడ్ హేచరీలు ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తుండగా జిల్లా 2015-16లో 3077 కోట్లు విలువ గల 1లక్షా 90 వేల 066 టన్నుల చేపలు, రొయ్యలు ఉత్పత్తి సాధించి రాష్ట్రంలో నాల్గవ స్థానంలో నిలిచిందన్నారు. చేప పిల్లల రవాణా నిమిత్తం వేన్‌ల కోసం ఈ ఏడాది రూ.3. 83 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ట్రైబల్ సబ్‌ప్లాన్‌లో భాగంగా ఏజెన్సీ గిరిజనులకు చేపల వ్యాపారం, రిజర్వాయర్లు, నదులలో చేపల వేట ఔత్సాహిక గిరిజన మత్య్సకార పారిశ్రామికులకు ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం రూ.1.48 కోట్లు కేటాయించారన్నారు. మత్య్సకారుల అభివృద్ధికి, మహిళా స్వయం సహాయక సంఘాలల సభ్యులకు చేపల మార్కెటింగ్ సౌకర్యాల కోసం 1.80 కోట్లను ఖర్చు చేయనున్నారన్నారు. సోలార్ విండ్ హైబ్రిడ్ ఫ్రీజింగ్ ప్లాంట్స్ ఏర్పాటుకు 91.50 లక్షలు ఖర్చు చేస్తూ మత్య్స రంగంలో అభివృద్ధి సాధిస్తున్నట్లు కలెక్టర్ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.

చిన్నారులను మింగేసిన చెరువు
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 17: శుభకార్యం హడావుడిలో చిన్నారులను పట్టించుకోపోవడం, రక్షణ గోడ లేని చెరువు వెరసి జిల్లా కేంద్రం కాకినాడలో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. కన్నవారికి కడుపుకోత మిగిలింది. కాకినాడ నగరంలోని అన్నమ్మఘాటీ వద్ద శుక్రవారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అన్నమ్మఘాటి ప్రాంతానికి చెందిన మందపల్లి వీర్రాజు అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం జరిగిన ఒక వేడుకకు హాజరైన దడాల సునీల్, మందపల్లి శ్రీనివాస్ కుమార్తెలు ధరణి (5), మైత్రి (3) అక్కడి చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతిచెందారు. అయతే వేడుక హడావుడిలో ఉండటంతో ఎవరూ ఈ విషయాన్ని గుర్తించలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో చిన్నారులిద్దరూ కనిపించడం లేదని గుర్తించారు. దీనితో ఆదుర్దాగా వెతకడం ప్రారంభించారు. ఇంటి ఎదురుగా ఉన్న చెరువులో తేలుతున్న చిన్నారుల మృతదేహాలను గుర్తించారు. హుటాహుటిన వెలికి తీసి, ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటన గురించి వన్ టౌన్ సిఐ ఎఎస్ రావు మాట్లాడుతూ అందరూ వేడుకల్లో నిమగ్నమై ఉండగా బాలికలు ధరణి, మైత్రి ఇద్దరు కలసి చెరువువద్ద ఆటలు ఆడుకుంటు ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయ ఉంటారన్నారు. ఆ సయమంలో ఎవరూ చూడకపోవడంతో వారు మృతి చెందారన్నారు. చెరువు గట్టుకు రక్షణగా గోడలేకపోవడం కారణంగానే చిన్నారులు పడిపోయవుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. మృతి చెందిన బాలిక మైత్రి తండ్రి శ్రీనివాస్ కాకినాడ నగరంలో ఉన్న మారుతీషోరూమ్‌లో పనిచేస్తుండగా, మరో బాలిక ధరణి తండ్రి సునీల్ ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. బాలికల మృతదేహాలకు శనివారం పోస్టుమార్టమ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని సిఐ రావు తెలియజేశారు.

నిరుపయోగంగా కాటవరం ఎత్తిపోతల పథకం
పేరుకుపోయన ఇసుక మేటలు:ఎండిపోతున్న పంటచేలు
సీతానగరం, ఫిబ్రవరి 17: కాటవరం గ్రామంలో సుమారు 300 ఎకరాల పంట భూములకు సాగునీరు అందించటానికి నిర్మించిన కాటవరం ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారింది. గత రెండేళ్లుగా ఎత్తిపొతల పథకం వద్ద ఇసుక పేరుకుపోయి ఉండటంతో దానిని ఉచిత ఇసుక పథకంలో భాగంగా ర్యాంపు నిర్వహించాలని, అలాగే పథకం సజావుగా అమలుకావడానికి జెసిబిలతో ఇసుకను లోడింగ్ చేసుకోవచ్చని అనుమతులు ఇచ్చిన స్థానిక నాయకులు అవేమీ పట్టించుకోకుండా పథకం వద్ద ఉన్న ఇసుక మేటలను తొలగించకుండా కోట్లాది రూపాయల వ్యాపారాలు చేసి జేబులు నింపుకున్నారు. అయితే కొన్నిరోజులు పథకం ఫిల్టర్ వరకు కాల్వలు తీసి పథకాన్ని నిర్వహించినా, నానాటికీ గోదావరి నీరు తగ్గిపోవటంతో పంటలు కొద్దిరోజుల్లో చేతికందుతాయనగా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మందపల్లి ఇసుక ర్యాంపులో అనధికార వసూళ్లు!
కొత్తపేట, ఫిబ్రవరి 17: మండలంలోని మందపల్లి ఇసుక ర్యాంపులో అధికార్లు నిర్ణయించిన ధర కంటే అధికంగా అనధికార వసూళ్లు చేస్తున్నారంటూ స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. యూనిట్ ఇసుకను ట్రాక్టర్‌లో లోడింగ్ చేయటానికి రూ.175లు, బాట నిర్వహణ నిమిత్తం రూ.125లు వెరశి రూ.300లు వసూలు చేయాల్సి ఉండగా రూ.400లకు పైగా వసూలుచేస్తున్నారని, అలాగే రెండు యూనిట్ల మినీ లారీకి లోడింగ్‌గా రూ.350లు, బాట నిర్వహణ కింద రూ.250లు మొత్తంగా రూ.600లు వసూలు చేయాల్సి ఉండగా రూ.1000లకు పైగా అనధికారిక వసూళ్లు చేస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పైగా ఇసుకను ఇతర జిల్లాకు కానీ, ఇతర రాష్ట్రాలకు గానీ రవాణా చేయకూడదనే నిబంధన ఉన్నా ఇసుకను ర్యాంపునకు సమీపంలో నిల్వ చేయటం ద్వారా దానిని లారీలలోకి లోడింగ్ చేసి ఇతర జిల్లాలకు అక్రమంగా రవాణా చేస్తున్నా పట్టించుకునే వారే లేకపోయారని వాపోతున్నారు. ప్రభుత్వం సామాన్యులకు ఇసుకను తక్కువ ధరకే ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఉచితంగా ఇసుకను ఇస్తున్నా, దానిని కొందరు దళారులు ఖర్చుల పేరుతో అనధికారిక వసూళ్లు చేస్తుండటంతో ఇసుక అధిక ధరను చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ర్యాంపు నిర్వహణపై నిఘా కొరవడటం వల్లనే అక్రమార్కులు ర్యాంపులో అనధికారిక వసూళ్లకు పాల్పడుతున్నారని, దీనిపై ఉన్నతాధికార్లు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం మంచి ఆశయంతో ఇసుకను ఉచితం చేసినా, కొందరి స్వార్థంతో లక్ష్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

బిల్లుల మంజూరులో జాప్యం - అభివృద్ధి పనులకు శాపం!
చింతూరు, ఫిబ్రవరి 17: అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి పనుల బిల్లులు మంజూరులో జాప్యం జరుగుతోంది. దీంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. మండలంలో ఉపాధి హామీ పథకంలో వ్యక్తిగత మరుగుదొడ్లు, సేంద్రీయ ఎరువుల తొట్టెల నిర్మాణాలు పంచాయితీరాజ్ శాఖ ద్వారా సిమెంటు రోడ్లు, అంగన్‌వాడీ నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మాణాలు పూర్తయినా వాటికి సంబంధించిన బిల్లులు మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులు, కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒకపక్క ఉన్నతాధికారులు జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని ప్రకటనలు చేయడమే తప్ప బిల్లులు మంజూరుకు కృషిచేయడం లేదని వారు పేర్కొంటున్నారు. అలాగే సేంద్రీయ తొట్టెలు నిర్మించుకుని వాటి ద్వారా సేంద్రీయ ఎరువులు తయారు చేసుకుని పంటలకు వినియోగించి అధికోత్పత్తి పొందాలని నిత్యం ఉపన్యాసాలు పలకడం తప్ప సేంద్రీయ తొట్టెల బిల్లుల మంజూరులో అధికారులు జాప్యం చేస్తున్నారు. ఇక పంచాయితీరాజ్ శాఖ విషయానికొస్తే కలెక్టర్ అంగన్‌వాడీ భవనాలు, సిమెంటు రోడ్ల నిర్మాణాలు మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆ శాఖ అధికారులు వాటిని నిర్మించాలని కాంట్రాక్టర్లకు అప్పగించారు. దాంతో కాంట్రాక్టర్లు శరవేగంగా పనులు చేపట్టారు. నెలలు గడుస్తున్నా వాటికి సంబంధించిన బిల్లులు మంజూరు కాకపోవడంతో మరికొన్ని నిర్మాణాలు మధ్యలోనే నిలిపివేశారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని, నెలలు గడుస్తున్నా వాటికి సంబంధించిన బిల్లులు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అభివృదిధ పనులకు సంబంధించిన బిల్లులు మంజూరుపై దృష్టి సారించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.

27లోగా సాధికార సర్వే పూర్తికావాలి
-ఎంపిడిఒలకు కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశం
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 17: జిల్లాలో చేపట్టిన ప్రజాసాధికార సర్వేను ఈనెల 27వ తేదీలోగా పూర్తి చేయాలని లేనిపక్షంలో సంబంధిత ఎంపిడిఓలపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం సబ్‌కలెక్టర్ కార్యాలయం నుంచి జాయింట్‌కలెక్టర్, జిల్లాలోని తహశీల్దార్లు, ఎంపిడిఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాసాధికార సర్వే పూర్తి చేయడంలో ఇప్పటికే జాప్యం జరిగింది, ఈనేపథ్యంలో గడువులోగా సర్వేను పూర్తి చేయాలన్నారు. మండల, జిల్లా కమిటీల అనుమతి లేనిదే చేపల చెరువుల తవ్వకాన్ని అనుమతించరాదని స్పష్టం చేశారు. అమలాపురంలో విచ్చలవిడిగా సాగుతున్న చేపల చెరువుల తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని ఆర్డీఓను ఆదేశించారు. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కృషిచేయాలన్నారు. ఈసమావేశంలో సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్, నగరపాలక సంస్థ డిప్యుటీ కమిషనర్ ఎంవిడి ఫణిరామ్ తదితరులు పాల్గొన్నారు.