తూర్పుగోదావరి

‘నన్నయ’కు జాతీయ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 18: మహారాష్టల్రోని కొల్హాపూర్‌లో 32వ జాతీయ అంతర విశ్వవిద్యాలయాల యువజనోత్సవాలు శివోత్సవం పేరిట ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకు జరిగాయి. 28 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ తరఫున జాతీయ యువజనోత్సవాల్లో రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పాల్గొని చరిత్ర సృష్టించినట్టు నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు తెలిపారు. విసి శనివారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొత్తమంతా విద్యార్థినులే నటించిన ఈ సందేశాత్మక నాటిక 700 యూనివర్సిటీల్లో జాతీయ స్థాయిలో ప్రత్యేకత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా 700 యూనివర్సిటీలు పాల్గొన్న ఈ యువజనోత్సవ పోటీల్లో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం తరఫున సెయింట్ థెరిస్సా విద్యార్థినులు ప్రదర్శించిన సంభవామి అనే నాటిక జాతీయ స్థాయిలో తృతీయ స్థానాన్ని సాధించి అంతర్జాతీయ స్థాయిలో నన్నయ్య కీర్తి పతాకాన్ని ఎగురవేసిందని విసి తెలిపారు. దక్షిణ భారతదేశ స్థాయిలో 48 విశ్వవిద్యాలయాలతో పోటీపడి రెండవ స్థానాన్ని దక్కించుకున్నట్టు తెలిపారు.
స్వాతంత్రానంతరం దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, లంచగొండితనం రూపుమాపేందుకు మార్పు అనేది ఎక్కడ నుంచో రాదు, అది మనలోనే మొదలవ్వాలని, అపుడే అవినీతి రహిత సమాజ నిర్మాణం సంభవం అవుతుందనే సందేశం ఈ నాటిక ఇతివృత్తమన్నారు. బంగారు నంది అవార్డు గ్రహీత మహేంద్ర చక్రవర్తి ఈ నాటికకు దర్శకత్వం వహించినట్టు తెలిపారు. ఇప్పటికే నన్నయ్య విశ్వవిద్యాలయం సాహిత్యం, కళా సేవారంగాలు, క్రీడారంగాల్లో అనేక బహుమతులు సాధించినట్టు విసి ముత్యానాయుడు తెలిపారు. ఈ నాటికలో అందరూ ఆడపిల్లలే నటించి ఈ నాటిక ద్వారా సమాజానికి అవసరమైన సందేశమిచ్చి నన్నయ్య యూనివర్సిటీ కీర్తిని దశదిశలా చాటారని, ఆంధ్రరాష్ట్ర గౌరవాన్ని పెంచారని ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు అభినందనలు తెలియజేశారు. సమావేశంలో ప్రొఫెసర్లు టేకి, రమేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఫీజులు భారీ.. జిఎస్‌టికి దొడ్డిదారి!
--ప్రైవేటు విద్యా సంస్థల తీరు--

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 18: ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల నుంచి తప్పించుకుంటున్న ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజులు వసూలు చేయడంలో దయాదాక్షిణ్యాలను మర్చిపోతున్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్టేషనరీ, బుక్స్, డ్రెస్‌లు వంటివి ప్రైవేటు విద్యాసంస్థల్లో అమ్ముతున్నందుకు 14 శాతం కమర్షియల్ టాక్సు శాఖకు గూడ్స్ సర్వీసు టాక్సు (జిఎస్‌టి) రూపంలో చెల్లించాల్సిన విద్యా సంస్థలు మినహాయింపు పొందుతున్నట్టు తెలిసింది. దానికి ప్రతిగా కనీసం ఫీజుల్లోనైనా కరుణ చూపించడం లేదని తెలుస్తోంది. జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజులు భారీగానే వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రతీ ప్రైవేటు స్కూలు, కాలేజి తమ విద్యార్థులకు ఒక డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నాయి. అదే విధంగా ఆయా విద్యాసంస్థల్లోనే బుక్స్, స్టేషనరీ అమ్మకాలు సొంతంగా సాగిస్తున్నాయి. పుస్తకాలు గానీ, డ్రెస్‌లు గానీ ఆయా సంస్థల్లోని కౌంటర్లలోనే లభిస్తాయి. ఈ తరహా వ్యాపారం ప్రైవేటు విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. డ్రెస్‌లతో పాటు బెల్ట్‌లు, రిబ్బన్లు, స్టిక్కర్లు తదితర సామాగ్రి అంతా అక్కడే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఫీజులతో పాటు బుక్స్, స్టేషనరీ, డ్రెస్, బెల్ట్ తదితరాల ఫీజులన్నీ తడిపి మోపెడవుతాయి. దీనికి తోడు విద్యాసొసైటీల పేరుతో నడిచే విద్యాసంస్థలకు రూ. కోటి వరకు ఆదాయ పన్ను మినహాయింపు తీసుకుంటున్నాయి. అయితే స్టేషనరీ, బుక్స్, డ్రెస్‌లకు గూడ్స్ సర్వీసు టాక్సు (జిఎస్‌టి) 14 శాతం కట్టాల్సి వున్నప్పటికీ ఎక్కడా చెల్లించినట్టు దాఖాలు కన్పించడం లేదు. ఈ మేరకు జిల్లాలో చిన్నా, పెద్దా కలిపి దాదాపు 2 వేల వరకు ప్రైవేటు విద్యాసంస్థలు వుంటాయి. జిఎస్‌టి రూపంలో ప్రభుత్వం దాదాపు రూ. 100 కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోతున్నట్టు అంచనా. ప్రైవేటు విద్యాసంస్థలకు జిఎస్‌టి భారం లేనపుడు కనీసం ఫీజులైనా కాస్తంత తగ్గించి వసూలు చేయాలని సర్వత్రా కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ఫీజుల విషయంలో పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు మాత్రం ప్రైవేటు సంస్థల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
ఆదర్శ వివాహానికి వేదికైన కామాక్షీ ప్రేమ మందిరం

అమలాపురం, ఫిబ్రవరి 18: అమలాపురం కామాక్షీ ప్రేమ మందిరం శనివారం ఒక ఆదర్శ వివాహానికి వేదికైంది. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న అమ్మాయిని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆదర్శ వివాహం చేసుకుంటున్నాడు. అంగరంగ వైభవంగా శనివారం రాత్రి 5.10 గంటలకు (తెల్లవారితే ఆదివారం) వధూవరులు ఒక్కటవబోతున్నారు. దీనికి సంబంధించి కామాక్షీ పీఠాధిపతి కామేశ మహర్షి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఐదేళ్ల వయస్సులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక అమ్మాయిని గుర్తుతెలియని వ్యక్తులు రాజమండ్రి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కించారు. రాజమండ్రి బస్టాండ్‌లో బిక్కమొహం వేసుకుని నిస్సహాయంగా చూస్తున్న ఆ అమ్మాయి నుండి సేకరించిన వివరాల మేరకు పోలీసులు తిరిగి పశ్చిమ గోదావరి జిల్లా తీసుకువెళ్ళి ఆరా తీశారు. అయితే ఆ అమ్మాయికి, తమకు ఏ సంబంధం లేదని అక్కడి వారు చెప్పడంతో పోలీసులు తిరిగి రాజమమండ్రి తీసుకువచ్చారు. ఆమె ఆలనాపాలనా ఎవరు చూస్తారనే దానిపై తర్జన భర్జన పడుతున్న సమయంలో అమలాపురంలోని కామాక్షీ పీఠం గుర్తుకు వచ్చి ఆమెను పీఠానికి తరలించారు. అలా చేరుకున్న ఆమెను కామాక్షీ పీఠం అక్కున చేర్చుకుని దాక్షాయణిగా నామకరణం చేశారు. అనంతరం ఇంటర్ వరకూ చదువుకున్న దాక్షాయణి చదువుపై మక్కువ చూపకపోవడంతో సంగీతాన్ని నేర్పించారు. సంగీతంలో దాక్షాయణి పలు రాష్ట్ర, జిల్లాస్థాయి అవార్డులను కైవశం చేసుకుంది. ప్రస్తుతం దాక్షాయణి స్థానికంగా ఉన్న రెండు పాఠశాలల్లో సంగీతం టీచర్‌గా విధులు నిర్వహిస్తూ పీఠంలోనే ఆశ్రయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దాక్షాయణి ఓ ఆదర్శవంతమైన ఇంటికి కోడలుగా వెళ్లబోతున్నారు.
సంబంధం ఎలా కుదిరిందంటే...
గతంలో ఇదే ప్రేమ మందిరంలో ఆశ్రయం పొందిన గాయత్రి అనే అమ్మాయికి కూడా ఇక్కడే ఆదర్శ వివాహం జరిగింది. గాయత్రి భర్తకు బంధువైన రామచంద్రపురంనకు చెందిన పేరి కుసుమకుమారి కుమారుడు పేరి ఉమామహేశ్వరరావుకు ప్రేమ మందిరంలో ఆశ్రయం పొందుతున్న దాక్షాయణి విషయాన్ని చెప్పడంతో ఇరువర్గాల వారు అంగీకరించడంతో వివాహ తంతు మొదలైంది. ప్రస్తుతం వరుడు ఎంసిఎ పూర్తిచేసి చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా విషయాన్ని తెలుసుకున్న స్థానికుడు, ప్రస్తుతం హైదరాబాద్‌లో వ్యాపారం నిర్వహిస్తున్న పెమ్మరాజు ప్రసాదరాజు (వీరేష్), సుజాత దంపతులు దాక్షాయణికి వివాహాన్ని తామే స్వయంగా చేస్తామని ముందుకు వచ్చారు. వారే దాక్షాయణికి కాళ్లు కడిగి కన్యాదానం చేయనున్నారని పీఠాధిపతి కామేశ మహర్షి తెలిపారు. కాగా దాక్షాయణి, ఉమామహేశ్వరరావు దంపతులను ఆశీర్వదించేందుకు ఇప్పటికే పలువురు పీఠానికి చేరుకున్నారు. 1986లో స్థాపించిన ప్రేమమందిరంలో ఇంతవరకూ 25 మంది అమ్మాయిలు, 17 మంది అబ్బాయిలకు వివాహాలు జరిపించినట్టు కామేశ మహర్షి తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రేమ మందిరంలో 141 మంది ఆశ్రయం పొందుతున్నారు.
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
*జెసి- 2 రాధాకృష్ణమూర్తి
కాకినాడ, ఫిబ్రవరి 18: మార్చి 1వ తేదీ నుండి 18వరకు జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జెసి-2 జె రాధాకృష్ణమూర్తి సంబంధిత అధికారులకు ఆదేశించారు. శనివారం జెసి-2 రాధాకృష్ణమూర్తి ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. జిల్లాలో 139 సెంటర్లు ఏర్పాటు చేశామని సుమారు 1, 02, 532 మంది విద్యార్ధులకు హాజరుకానున్నారన్నారు. అన్ని సెంటర్లలో 144 సెక్షన్ నిబంధనను ఏర్పాటు చేయాలని, ఫ్లయింగ్ స్వైడ్స్, రెవెన్యూ టీములను ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారిని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు, పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని డిఎస్పీని కోరారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని తహశీల్దార్లను ఆదేశించారు. విద్యుత్‌కు అంతరాయం లేకుండా ప్రసారం చేయాలనిట్రాన్స్‌కో డిఇని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు చేర్చేందుకు ఆర్టీసి బస్సులను అందుబాటులో ఉంచాలని ఆర్టీసి ఆర్‌ఎంకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ ఆర్‌ఐ వెంకటేష్, హైపర్ కమిటీ సభ్యులు దాశరధి, డిఇసి సభ్యులు జగదీశ్వరరావు, నర్సింహం, పేర్రాజు పాల్గొన్నారు.
రెండు తాటాకిళ్లు దగ్ధం
కోరుకొండ, ఫిబ్రవరి 18: మండలంలోని రాఘవపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. స్థానికులు, రెవిన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మోసా గిర్రమ్మ, కందిరెళ్ల భవానీలకు చెందిన రెండు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లలో ఉన్న వడ్రంగి సామాన్లు, మంచాలు, బీరువా, డబ్బులు, బంగారం కాలి బూడిదయాయ్యని తెలిపారు. అదే విధంగా మోసా గిర్రమ్మ కుటుంబం వడ్రంగి పని చేసుకుంటూ బతుకుతుంది. ఇంట్లో ఉన్న వడ్రంగి మిషనులు, కొత్తగా తయారుచేసిన మంచాలు కాలిపోయాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇళ్లలో ఎవ్వరూ లేరని తెలిపారు. నడికొప్పులు అంటుకునే వరకూ స్థానికులకు తెలియకపోవడంతో ఇళ్లు పూర్తిగా కాలిపోయాయని, మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినా పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. ఫైర్ ఇంజిన్ సంఘటనా స్థలానికి వచ్చేసరికి అవి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు ఇచ్చిన వివరాల మేరకు అధికారులకు నివేదిక పంపామని గ్రామ రెవిన్యూ అధికారి నారాయణరావు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని స్థానికులు తెలిపారు.