తూర్పుగోదావరి

అపార్ట్‌మెంట్లకు సోలార్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 10: అపార్టుమెంట్లకు విధిగా సోలార్ పవర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు కొత్తగా అనుమతి తీసుకోవాల్సిన అపార్టుమెంట్లన్నీ సోలార్ పవర్ వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టారు. టెక్నాలజీని వినియోగించుకుంటూ సోలార్ విద్యుత్‌ను విస్తృతంగా వినియోగించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. జిల్లాలో సుమారు 17 లక్షల విద్యుత్ కనెక్షన్లు వున్నాయి. రోజుకు 11.25 నుంచి 11.50 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరుగుతోంది. సోలార్ విద్యుత్తు వినియోగం పెరిగితే గణనీయంగా విద్యుత్‌ను ఆదా చేసే పరిస్థితి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో ఇటు గృహ వినియోగంతో పాటు వ్యవసాయ రంగంలో కూడా విరివిగా సోలార్ విద్యుత్తును వినియోగించేలా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాకు 1306 వ్యవసాయ సోలార్ పంపుసెట్లు మంజూరయ్యాయి. మంజూరైన మొత్తం యూనిట్లకు రైతులు నగదు చెల్లించడంతో ఇప్పటి వరకు 955 కనెక్షన్ల ఏర్పాటు జరుగుతోంది. మంజూరైనవాటిలో అత్యధికంగా 5 హెచ్‌పి సోలార్ పంపు సెట్లు వున్నాయి. 5 హెచ్‌పి సోలార్ పంపుసెట్టు రూ.4.95 లక్షలు యూనిట్ ఖరీదులో అందిస్తున్నారు. ఇందులో రూ.55వేలు లబ్ధిదారుడు భరించాల్సి వుంది. మిగిలింది ప్రభుత్వాలు సబ్సిడీగా అందిస్తాయి. అదే విధంగా 3 హెచ్‌పి సోలార్ యూనిట్‌ను రూ.3.20 లక్షలకు అందిస్తున్నారు. ఇందులో 11 శాతం సబ్సిడీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. సోలార్ పంపుసెట్ల వల్ల రాత్రి పూట విద్యుత్ వినియోగం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
జిల్లాలో ఇళ్ళకు కూడా సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇళ్ళపై కప్పుపై (రూప్‌టాప్) కూడా సోలార్ విద్యుత్ యూనిట్లను మంజూరు చేశారు. ఈ మేరకు ప్రస్తుతానికి జిల్లాలో 30 సర్వీసులను ఏర్పాటు చేశారు. ఇళ్ళకు ఇటు సోలార్ విద్యుత్ కనెక్షన్‌తో పాటు విద్యుత్ కనెక్షన్ కూడా వుంటుంది. జిల్లాలో ఇప్పటి వరకు 1.43 మెగా వాట్ల సోలార్ విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఇందులో కేటగిరీల వారీగా సబ్సిడీలు కల్పించారు. కేటగిరి 1లో 30 శాతం సబ్సిడీ కల్పించారు. ఒక్కో ఇంటి రూప్‌టాప్‌కు 5 కిలో వాట్ల సోలార్ విద్యుత్ యూనిట్లను రూ.85వేలకు అందిస్తున్నారు. మొత్తం మీద తూర్పు గోదావరి జిల్లాలో సోలార్ విద్యుత్ వినియోగం పెరుగుతోంది.

ఇంటి పన్నుల భారం తగ్గించాలి
-ఉప ముఖ్యమంత్రి రాజప్పకు డిసిఎంఎస్ అధ్యక్షుడు కెవి వినతి
రావులపాలెం, మార్చి 10: జిల్లాలో ఈ ఏడాది ఇంటిపన్ను మదింపులో భాగంగా పెంచిన ఇంటి పన్నులను తగ్గించాలని డిసిఎంఎస్ ఛైర్మన్ కెవి సత్యనారాయణరెడ్డి కోరారు. ఈమేరకు శుక్రవారం రావులపాలెం వచ్చిన ఉప ముఖ్యమంత్రి చినరాజప్పకు ఆయన విజ్ఞాపన పత్రం సమర్పించారు. పన్నుల పెంపు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి అదనంగా విధిస్తున్న నీటి, లైటింగ్, డ్రైనేజీ ఐచ్చిక పన్నులు తగ్గించాలని కోరారు. రావులపాలెం వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన చినరాజప్పను కెవి గ్రామస్థులతో కలిసి ఇంటిపన్ను పెంపు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఇంటిపన్నుపై విధించిన ఐచ్ఛిక పన్నులు నీటి పన్ను, డ్రైనేజీ పన్ను, లైటింగ్ పన్ను పన్నుల వల్ల ప్రజలపై అధికభారం పడుతుందన్నారు. ఇంటి పన్ను పెంచడం వల్ల ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఐచ్ఛిక పన్నులు 40 శాతం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి చినరాజప్పను కోరారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చినరాజప్ప హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొవ్వూరి జగన్నాథరెడ్డి తదితరులు ఉన్నారు.
విలీన మండలాల ప్రజలకు భరోసా కరవు
చింతూరు, మార్చి 10: ఆంధ్రాలో విలీనమైన మండలాల ప్రజలకు ప్రభుత్వం నుండి భరోసా కరవైందని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. ఈ మండలాల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయంటూ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. శుక్రవారం విలీన మండలమైన చింతూరులో రఘువీరారెడ్డి పర్యటించి, కాంగ్రెసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పోలవరం నిర్వాసితుల పరిహారం, పునరావాసంపై ఇంత వరకూ ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం కమీషన్లు దండుకుంటోందని ఆరోపించారు. పునర్విభజన చట్టంలో ముంపు ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయమందించాలని ఉన్నా ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు పోలవరం నిర్వాసితుల స్థితిగతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. వైద్యం, విద్య విషయాల పట్ల అశ్రద్ధ చూపించడంతో మాతాశిశు మరణాలు పెరుగుతున్నాయని, విద్యార్థుల చదువులు అటకెక్కాయని విమర్శించారు. విలీన మండలాల్లో పర్యటించి నేరుగా నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ఓ ప్రణాళిక ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చేందుకై ఈ మండలాల్లో తాను పర్యటిస్తున్నట్టు రఘువీరారెడ్డి తెలిపారు. సమావేశంలో డిసిసి అధ్యక్షుడు పంతం నానాజీ, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు, కాంగ్రెసు నేతలు గిడుగు రుద్రరాజు, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కె సుధాకర్‌బాబు, పిసిసి కార్యదర్శి రామలక్ష్మి, ఎండి హబీబ్, ఎఫ్‌కె అహ్మద్ అలి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
మంజునాధ పర్యటనకు తరలిరండి
ప్రత్తిపాడు, మార్చి 10: జిల్లా కేంద్రం కాకినాడలో ఈ నెల 22న జరిగే జస్టిస్ మంజునాథ కమిషన్ పర్యటనకు జిల్లాలోని కాపు సోదరులంతా హాజరవ్వాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. తమ దయనీయమైన స్థితిని జస్టిస్ మంజునాథకు వివరించాలన్నారు. శుక్రవారం సాయంత్రం కిర్లంపూడిలోని తన నివాసంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన కాపు నాయకులు, కాపు యువతతో ఏర్పాటైన సమావేశంలో ముద్రగడ మాట్లాడారు. కాపులను బిసిల్లో చేర్చడానికి వేసిన కమిషన్ చివరిగా జిల్లాలో పర్యటనకు వస్తోందన్నారు. ఈ పర్యటన కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల నుండి కాపు సోదరులు జెఎసి నాయకుల ద్వారా కాకినాడలో నిర్ణయించబడిన స్థలానికి చేరుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కాపులకోసం మంజూనాథ్ కమిషన్ ఏర్పాటైందని ఒకపక్క చెబుతూ ఇతర కుల సోదరులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇతర కుల సోదరులు అనుభవించే రిజర్వేషన్ కోటాలో తమ జాతి వాటా అడగడం లేదని, తమ జాతిలో పేదవారికి మాత్రమే ఆదాయ పరిమితి ప్రకారంగా రిజర్వేషన్ కల్పించాలని ఉద్యమం ప్రారంభించిన మొదటి నుండి చెబుతున్నామన్నారు. ఇదే విషయమై బిసి నాయకుల ఇళ్లకు వెళ్లి, తాను, జెఎసి నాయకులు స్వయంగా సందేహాలను తీరుస్తున్నామన్నారు. 15 నెలలుగా రిజర్వేషన్ కోసం శ్రమిస్తున్న జాతి మరికొంతకాలం ఉద్యమాన్ని వదలకుండా సాగిస్తే భవిష్యత్తరాల యువతకు బంగారు బాట వేయవచ్చని ఆయన విజ్ఞప్తిచేశారు. కాకినాడలోని పాత బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ భవనం వద్ద మంజునాథ కమిషన్ ఉంటుందని, దానికి సమీపంలోని మరో ఆవరణలోకి జిల్లా నుండి వచ్చిన కాపు సోదర, సోదరీమణులంతా చేరుకోవాలన్నారు. అక్కడ జెఎసి నాయకులు పత్రాలు ఇస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాపు జెఎసి మహిళలు, అడ్వకేట్లు, జెఎసి నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణు, కల్వకొలను తాతాజీ, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, తుని, కాకినాడ రూరల్ నియోజకవర్గాలకు చెందిన కాపు యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మావోయిస్టు సానుభూతిపరులు అరెస్టు
చింతూరు, మార్చి 10: మావోయిస్టుల కార్యకలాపాలకు సహాయ సహకారాలు అందిస్తున్న ఏడుగురు సానుభూతిపరులను చింతూరు డిఎస్పీ దిలీప్‌కిరణ్ శుక్రవారం అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దిలీప్‌కిరణ్ వివరాలు వెల్లడించారు. మండలంలో మావోయిస్టు కార్యకలాపాలకు చేయూతనిస్తున్న పుంగుట్ట, బోరింగ్‌గుంపు, కలిగొండ, బాలంతోగు గ్రామాలకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో కుంజా రాజు (పుంగుట్ట), డిరిడి అదమయ్య (పుంగుట్ట), ముచ్చిక మాదయ్య (పుంగుట్ట), డిరిడి గంగయ్య (పంగుట్ట), సోడె అదమయ్య (బోరింగ్‌గుంపు), పూనెం రాజు (కలిగొండ), మడకం రామ (బాలంతోగు)లను అరెస్టు చేసినట్టు డిఎస్పీ దిలీప్‌కిరణ్ వివరించారు. మావోయిస్టుల మాయమాటలు నమ్మి, వారి కార్యకలాపాల్లో పాల్గొని అమాయక గిరిజనులు తమ జీవితాలను అంధకారం చేసుకోవద్దని ఈ సందర్భంగా డిఎస్పీ హితవు పలికారు. అడవిబాట పట్టిన అన్నలు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున అన్నివిధాలా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని డిఎస్పీ హామీ ఇచ్చారు. విలేఖరుల సమావేశంలో సిఐ దుర్గాప్రసాద్, ఎస్‌ఐ శ్రీనివాసకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే ధ్యేయం
కరప, మార్చి 10: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర హోం శాఖామాత్యులు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శుక్రవారం ఆయన మండలం గొర్రిపూడి గ్రామంలో సబ్‌ప్లాన్ నిధులు 1.1 కోట్ల రూపాయల వ్యయంతో గొర్రిపూడి-చిట్టయ్యతోట గ్రామాల మధ్య నిర్మించనున్న బిటి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం పాతర్లగడ్డలో 1.38 కోట్లతో నిర్మించనున్న బిటి రోడ్డుకు, అలాగే జి భావారంలో రూ. కోటితో నిర్మించనున్న బిటి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం కరపలో రూ. 13లక్షల వ్యయంతో నిర్మించిన మండల వ్యవసాయాధికారి కార్యాలయాన్ని ప్రారంభించి రైతులకు పవర్ టిల్లర్లను పంపిణీ చేసి మాట్లాడారు. గత మూడేళ్లలో రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో వౌలిక సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామాల మధ్య లింకురోడ్లు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మెన్ పిల్లి సత్తిబాబు, ఎంపిపి గుల్లిపల్లి శ్రీనివాసరావు, జడ్పీటీసీ బుంగా సింహాద్రి, కో ఆప్షన్ సభ్యులు మాట్టా ప్రకాష్‌గౌడ్, జిల్లా వ్యవసాయశాఖాధికారి ప్రసాద్, ఎంపిడిఒ భీమశంకరరావు, తహసీల్దారు శ్రీదేవి, ఎడిఎ నెల్లి రమేష్, ఎఒ ఆచ్యుతరావు, పంచాయితీరాజ్ డిఇ ఐబి వెంకట్రావు, పార్టీ నాయకులు చుండ్రు వెంకన్నరాయచౌదరి, కోటగిరి మహేంద్ర, ఆట్ల గోవిందు, పెదబాబు తదితరులు పాల్గొన్నారు.
పేకాట శిబిరంలో మహిళ
రాజమహేంద్రవరం, మార్చి 10: పేకాట శిబిరంలో ఒక మహిళ దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఎస్‌ఐ శివాజీ ఆధ్వర్యంలో ఎజిఎస్ పోలీసులు స్థానిక మల్లయ్యపేటలోని పాత ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈశిబిరంలోని 8 మందిలో ఒక మహిళ కూడా ఉండటం గమనార్హం. ఈసందర్భంగా వారి నుంచి రూ. 9500, 4సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎస్‌ఐ రాంబాబు ఆధ్వర్యంలో ఎజిఎస్ పోలీసులు ఆశ్రయ లాడ్జిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి, వారి నుంచి 38వేల 860 నగదు, 7సెల్‌ఫోన్లు, 3 మోటారుసైకిళ్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

ద్రాక్షారామ ఆలయంలో పడగవిప్పిన సర్పరాజం!
రామచంద్రపురం, మార్చి 10: దక్షిణకాశీ ద్రాక్షారామలో నెలకొనియున్న శ్రీమాణిక్యాంబ సమేత శ్రీ్భమేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం రాత్రి జరిగిన అఖండ హరినామ సంకీర్తన వద్ద పడగవిప్పిన తాచుపాము కలకలం సృష్టించింది. హరినామ సంకీర్తన భజన చేస్తున్న భక్తులు, సుబ్రహ్మణ్య స్వామిని గానం చేస్తున్న సమయంలో.. హార్మోనియంపై నాగస్వరం వినిపిస్తున్న సమయంలో.. ఎక్కడి నుండో వచ్చిన పాము సుమారు నాలుగు గంటల పాటు అక్కడే తిష్ఠవేయడం అందరినీ విస్మయపరిచింది. అయితే సంకీర్తన కార్యక్రమం ముగిసిన సమయంలో.. ఆ పాము ఎటువెళ్ళిపోయిందో.. అన్న ఆతృతతో ప్రజలు చూశారు. మంగళవారం మండపం వైపుకు వెళ్ళడాన్ని గమనించారు. ఆ సుబ్రహ్మణ్య స్వామే అక్కడకు వచ్చినట్లు భక్తులు భావించడం విశేషం.
నష్టాలు, కక్ష్యలే కారణమా
రాజమహేంద్రవరం, మార్చి 10: రాజమహేంద్రవరంలోని గంటాలమ్మగుడి వీధిలోని బంగారు ఆభరణాల తయారీ కార్ఖానాలో జరిగిన దోపిడీ వెనుక పాత కక్షలతో పాటు, వ్యాపారంలో నష్టపోయిన సొమ్మును రాబట్టుకోవడమే లక్ష్యమని పోలీసులు భావిస్తున్నారు. గురువారం రాత్రి తుపాకులు, కత్తులతో వచ్చిన ఐదుగురు వ్యక్తులు కార్ఖానాలోకి చొరబడి కత్తులు, తుపాకులతో అందులో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులను బెదిరించి సుమారు 150 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయిన సంగతి తెలిసిందే. కార్ఖానాలో పనిచేస్తున్న కార్మికుడు కేకలు వేయడంతో స్థానికులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా, దుండగులు ప్రతిఘటించారు. ఈసందర్భంగా గతంలో ఇక్కడ పనిచేసిన పశ్చిమబెంగాల్‌లోని సిల్డాకు చెందిన పుషాంతో సమంతాతో పాటు, గౌతమ్‌బాంగ్ అనే వ్యక్తి పట్టుబట్టారు. ఈ ఘటనలో పుషాంతో గాయపడ్డాడు. అతడ్ని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. గతంలో ఇక్కడ పనిచేసిన పుషాంతో సొంతంగా వ్యాపారం నిర్వహించాడు. ఆసమయంలో నష్టాలు రావడం, ఈవిషయాన్ని ప్రస్తుతం దోపిడీ జరిగిన కార్ఖానా యజమాని రాణా తన ప్రాంతంలో ప్రచారం చేయడంతోనే కక్ష పెంచుకుని దోపిడీకి పథకం వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడిన గౌతమ్‌ను క్రైం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, శుక్రవారం టిడిపి సీనియర్ నాయకుడు గన్ని కృష్ణ సంఘటనా ప్రాంతాన్ని సందర్శించి, ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ బి రాజకుమారికి విజ్ఞప్తి చేశారు.
భూముల వివరాలు పంపించాలి
కాకినాడ, మార్చి 10: ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేయకుండా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అన్ని శాఖలు వారి ఆధీనంలో ఉన్న భూముల వివరాలను ఈ నెల 15వ తేదీ లోగా పంపించాలని జెసి ఎస్ సత్యనారాయణ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కోర్టు హాలులో ప్రభుత్వ భూముల వివరాల నివేదిక పంపడంపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేయకుండా నిలపటానికి హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ భూముల నివేదికలు పంపితే వాటికి కలెక్టర్ రిజిస్ట్రేషన్ శాఖకు పంపుతారన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపుతారన్నారు. సెక్షన్ 22-ఎ ప్రకారం తహసీల్దార్లు పంపిన జాబితాలను రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పంపుతామని జెసి వెల్లడించారు. గ్రామకంఠం భూములను కమ్యూనిటీకి అవసరమైన పాఠశాలలు, రోడ్లు, పార్క్‌లు, ఇళ్ళు ఉంటాయని ప్రభుత్వ భూమిని గుర్తించి పంపిస్తే వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపుతామని చెప్పారు. సమావేశంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ వి విజయరామరాజు, రిజిస్ట్రేషన్ శాఖ డిఐజి ఎం లక్ష్మీశివకుమారి, డిపిఒ టివిఎస్‌జి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాళ్లూరు జీయన్న తిరునాళ్లలో అపశృతి
గండేపల్లి, మార్చి 10: గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో వేంచేసియున్న వెంకటేశ్వరస్వామి (జీయన్న) తిరునాళ్లలో శుక్రవారం అపశృతి చోటుచేసుకుంది. ఆలయం వద్ద గజేంద్ర పుష్కరణిలో పడి ఒక బాలుడు మృతి చెందాడు. గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన వనుం దుర్గాప్రసాద్ (16) పుణ్యస్నానం ఆచరించేందుకు గజేంద్ర పుష్కరణిలో దిగి ఊబిలో కూరుకుపోయాడు. భక్తులు అతనిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చివరకు కొంతసేపటికి శవమై తేలాడు. విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. నాలుగు రోజులపాటు జరిగే తిరునాళ్లుకు చుట్టుపక్కల గ్రామస్థులు వందలాదిగా తాళ్లూరు తరలివస్తారు. గజేంద్ర పుష్కరణిలో పుణ్యస్నానాలు చేసి స్వామి వారి దర్శనం చేసుకుంటారు. అయితే ఆలయ అధికారులు గాని, ఆలయ కమిటీ గాని ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం కూడా ఇదే పుష్కరణిలో ఇద్దరు మృత్యువాత పడినా ఏవిధమైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి పుణ్యస్నానాలు ఆచరించే పుష్కరణిలో ఊబిని తొలగించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

అప్పు తీర్చినట్టే తీర్చి...!

రాజమహేంద్రవరం, మార్చి 10: వైసిపి నాయకుడు కర్రి పాపారాయుడుకు చెందిన బ్యాంకు ఖాతాలోని సుమారు రూ. 14లక్షలకు పైగా సొమ్మును కాజేశారు. శుక్రవారం పాపారాయుడు విలేఖర్ల సమావేశంలో ఈవిషయాన్ని వెల్లడించారు. రామచంద్రపురం ఐసిఐసిఐ బ్యాంకులో బంగారు రుణాల ఏజెంట్‌గా పనిచేసే వ్యక్తి ద్వారా పరిచయమైన ఇద్దరు గత ఏడాది తన వద్ద రూ. 14లక్షల అప్పు తీసుకున్నారన్నారు. ఈఅప్పుకు ఏజెంటు హామీగా ఉన్నాడన్నారు. గతనెల ఏజెంటు వచ్చి రుణం తీసుకున్న వ్యక్తులకు బంగారు రుణాలు మంజూరయ్యాయని, బ్యాంకు ఖాతా నెంబరు ఇస్తే సొమ్మును తన ఖాతాలో జమ చేస్తారని చెప్పాడన్నారు. దీంతో రామచంద్రపురం ఐసిఐసిఐ బ్యాంకు ఖాతా నెంబరు ఇచ్చానన్నారు. ఒకరు రూ. 7.45లక్షలు, మరొకరు 7.20లక్షలు తన ఖాతాలో జమ చేశారన్నారు. అయతే 10రోజుల తరువాత తన ఖాతాలోని జమ చేసిన సొమ్మును వారు తిరిగి కాజేశారన్నారు. ఇందుకు ఏజెంటుగా పనిచేసిన వ్యక్తితోపాటు బ్యాంకు అధికారులు, సిబ్బంది సహకరించారని ఆరోపించారు. ఈసంఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలని పాపారాయుడు డిమాండ్ చేశారు.