తూర్పుగోదావరి

బిజెపి బలోపేతానికి కృషిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, మార్చి 16: భారతీయ జనతాపార్టీని ఆంధ్రప్రదేశ్‌లో కూడా బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుండే కృషి చేయాలని నర్సాపురం పార్లమెంటు సభ్యుడు గోకరాజు గంగరాజు పిలుపునిచ్చారు. గురువారం అమలాపురం విచ్చేసిన గంగరాజును పట్టణ బిజెపి కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు యర్రమెల్లి పాండురంగారావు అధ్యక్షతన జరిగిన సభలో గంగరాజు మాట్లాడారు. దేశమంతా ప్రధాని నరేంద్ర మోదీ పాలన, ఆయన చేస్తున్న అభివృద్ధి పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాల ఏర్పాటే అందుకు నిదర్శనమన్నారు. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా బిజెపి బలమైన శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. అందుకు కార్యకర్తలు, నాయకులు కృషిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించడంపై దృష్టి సారించాలని గంగరాజు హితవు పలికారు. చేసిన అభివృద్ధిని కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నామన్నారు. రాష్ట్రానికి చెందిన రామ్‌మాధవ్, వెంకయ్యనాయుడు సారధ్యంలో రైల్వే లైన్ త్వరితగతిన పూర్తవుతుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ళ దొరబాబు, బిజెపి నేతలు ఆర్‌వి నాయుడు, బసవా శివరామప్రసాద్, ముదునూరి రంగరాజు, యల్లమెల్లి కొండ, డాక్టర్ పెయ్యిల శ్యామ్‌ప్రసాద్, గుమ్మళ్ళ రెడ్డినాయుడు, చిట్టూరి రాజేశ్వరి, నిమ్మకాయల వెంకటరెడ్డినాయుడు, కర్రి తాతారావు, బసవా చినబాబు, మల్లాడి హనుమంతరావు, సంసాని వెంకటరత్నకుమార్, సోరపల్లి పద్మినికుమార్ పాల్గొన్నారు.

విదేశీ సిగరెట్ల విక్రయదార్లపై కఠినచర్యలు
జిల్లా వ్యాప్తంగా దాడులు:ఎస్పీ రవిప్రకాష్
కాకినాడ సిటీ, మార్చి 16: ప్రభుత్వం అనుమతులు లేకుండా అక్రమంగా విదేశాలకు చెందిన సిగరెట్లను దేశంలోకి దిగుమతి చేసుకుని విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ తెలియజేశారు. దేశీయ సిగరెట్ ఉత్పాదక సంస్థలు ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా వ్యాప్తంగా గురువారం దాడులు నిర్వహించినట్లు చెప్పారు. విదేశీ సిగరెట్ ఉత్పాదక సంస్థల సిగరెట్లు సేవించడం వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్యలను గురించి తెలియజేసే హెచ్చరికలు తమ ఉత్పత్తులపై ప్రచురించవని తెలిపారు. విదేశీ సిగరెట్ సంస్థలు ఉత్తత్తులను సేవించడం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆయన హెచ్చరించారు. విదేశీ సిగరెట్లను అక్రమంగా విక్రయాలకు పాల్పడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం పెద్దాపురంలో-3, తునిలో ఒకటి, మండపేటలో ఒకటి, కాకినాడ నగరంలో-3, సర్పవరంలో ఒకటి, కరప ప్రాంతం నందు విదేశీ సిగరెట్లను విక్రయిస్తున్న వ్యాపారులపై దాడులు నిర్వహించామన్నారు. ప్రజలు భారతదేశంలో ఉత్పత్తి అయ్యే సిగరెట్లు సేవించడం వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్యలపై హెచ్చరికలు ఉంటాయని, విదేశీ సిగరెట్ల ఉత్పత్తులపై ఆ హెచ్చరికలు ఉండవని పేర్కొన్నారు. ఈ విషయాలను గుర్తించాలని ఎస్పీ రవిప్రకాష్ పిలుపునిచ్చారు. అక్రమంగా విదేశీ సిగరెట్లను విక్రయిస్తున్న వారి సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.

పదోతరగతి పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
*304 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
*పరీక్షా సమయంలో జిరాక్స్ సెంటర్లు మూత
*జంబ్లింగ్ పద్ధతిలో ఇన్విజిలేటర్లు

కాకినాడ, మార్చి 16: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు శుక్రవారం ఉదయం నుండి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీవరకు జరిగే ఈ పరీక్షలకు ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాలతో పాటు పరీక్షా పత్రాలను భద్రపరిచే జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీ కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. 15 స్క్వాడ్స్ ఏర్పాటుచేశారు. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల అనంతరం ప్రశ్న పత్రాలను ట్రెజరీ కార్యాలయాలకు తీసుకువెళ్ళే బాధ్యతలను పోలీస్, రవాణా శాఖాధికారులకు కలెక్టర్ అప్పగించారు. ఈ ఏడాది పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 67,740 మంది హాజరుకానున్నారు. వీరిలో బాలురు 34,172 మంది, బాలికలు 33,568 మంది ఉన్నారు. ప్రైవేటుగా 1113 మంది హాజరుకానున్నారు. వీరిలో బాలురు 623, బాలికలు 490 మంది ఉన్నారు. మొత్తం విద్యార్థులు 68,853 మంది కాగా వీరిలో బాలురు 34,795, బాలికలు 34,058 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 304 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రత్యేక తనిఖీ అధికారులతో పాటు చీఫ్ సూపరింటెండెంట్లు, సూపరింటెండెంట్లు, 3,394 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఈ ఏడాది జంబ్లింగ్ పద్ధతిలో ఇన్విజిలేటర్లను నియమించారు. వివిధ మండలాల్లో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన తాగునీరు, విద్యుత్, శానిటేషన్ సౌకర్యాలను మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. నగర, పట్టణ ప్రాంతాల్లో కేంద్రాలను మున్సిపల్ అధికారులు పర్యవేక్షించేలా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. పరీక్షల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలులో ఉంచడంతో పాటు పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన పక్షంలో సదరు విద్యార్థి సహా ఇన్విజిలేటర్‌పై కూడా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, కాలిక్యులేటర్లు తదితర సాంకేతిక పరికరాలను అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఏజన్సీ మండలాల్లో కూడా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. ఏజన్సీ ప్రాంతంలో మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు చేపట్టారు. ప్రశ్నపత్రాల రవాణా విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించేలా ఆదేశాలు జారీ అయ్యాయి.