తూర్పుగోదావరి

ప్రశాంతంగా పోలీస్ డ్రైవర్ల పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, మార్చి 19: పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న డ్రైవర్లు, మెకానిక్ పోస్టులకు నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ తెలియజేశారు. ఈ పరీక్షలు కాకినాడలో జెఎన్‌టియుకె, సూరంపాలెంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాల్లో ఆదివారం జరిగాయన్నారు. మొత్తం 8 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయినట్టు తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటుచేశారు. పరీక్షలో అర్హత సాధించిన వారికి తప్పనిసరిగా ఉద్యోగాలు వస్తాయని, దళారులను నమ్మి మోసపోవద్దని ఎస్పీ రవిప్రకాష్ అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు.

చెరువు మరమ్మతు పనులు అడ్డగింత
డి గన్నవరం, మార్చి 19: మండలంలోని గంటి పెదపూడి గ్రామంలోని మంచినీటి చెరువు మరమ్మతు పనులు వివాదాస్పదమైంది. ఈ పనులకు ప్రభుత్వం 40 లక్షల రూపాయలు మంజూరుచేసింది. ఈ నేపథ్యంలో పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ఆదివారం చెరువు పనులు ప్రారంభించడానికి గంటి పెదపూడి వెళ్ళగా గ్రామస్తులు అడ్డగించారు. అయితే పనులు డిజైన్ సరిగ్గా లేదని, దానిని మార్పుచేయాలని, చెరువులో ఉన్న బురదను పూర్తిగా తొలగించాలని, చెరువు చుట్టూ రక్షణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మించాలని, లేనిపక్షంలో చెరువు పనులు చేపట్టడానికి వీల్లేదని గ్రామస్థులు పనులు అడ్డగించారు. దీనిపై ఎమ్మెల్యే పులపర్తి ఆర్‌డబ్ల్యుఎస్ జెఇ కల్యాణ చక్రవర్తిని చెరువు తవ్వకాలకు, రక్షణగోడ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందని ప్రశ్నించగా మంజూరైన 40 లక్షలకు తోడు అదనంగా 70 లక్షలు అవుతుందని వివరించారు. అంచనాలు తయారుచేసి ఇస్తే మంజూరుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చి చెరువు మరమ్మత్తు పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి సంసాని లక్ష్మీగౌరి పెద్దిరాజు, డొక్కా నాధుబాబు, కొల్నాటి సత్యనారాయణరాజు, మంతెన రవిరాజు, కత్తుల విక్టర్ తదితరులు పాల్గొన్నారు.

నెలాఖరుకల్లా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయాలి
అయినవిల్లి, మార్చి 19: ఈ నెల 31 నాటికి అన్ని గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని అమలాపురం పంచాయితీరాజ్ ఇఇ బి సత్యనారాయణ అన్నారు. ఆదివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీలు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలతో ఇఇ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయినవిల్లి మండలంలో మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకగా ఉందని, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లు, కొత్తగా నిర్మించుకునే మరుగుదొడ్లు ఈ నెల 31 లోపు పూర్తిచేయాలని పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు. అదే విధంగా మరుగుదొడ్లు మెటీరియల్ సప్లయ్ చేసే వారితో ఇఇ మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ఎటువంటి ఆటంకం లేకుండా మెటీరియల్ పూర్తిస్థాయిలో సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపిడివోకు సూచించారు. ఈ పదిరోజుల్లో గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకూ అధికారులు మరుగుదొడ్ల నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై నిర్లక్ష్యవైఖరి అవలంబించే అధికారులపై జిల్లాస్థాయి అధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఇఇ చంటిబాబు, జెఇఇ కుమారస్వామి, పంచాయతీ సెక్రటరీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

చోరీ కేసుల్లో ఏడుగురు యువకులు అరెస్టు
రూ. 10 లక్షల విలువైన చోరీసొత్తు స్వాధీనం
కాకినాడ సిటీ, మార్చి 19: ఓ ఆలోచన మనిషి జీవితాన్ని మార్చేసినట్లు, ఓ మహిళతో ఏర్పడిన పరిచయం ఏడుగురి యువకుల జీవితం నేరాల వైపునకు దారితీసింది. ఈ కేసుకు సంబంధించి అడిషినల్ ఎస్పీ ఎఆర్ దామోదర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ నగరం డైరీ ఫారమ్ సెంటర్ రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివాసం ఉండే కాలపురెడ్డి కృష్ణవేణి (33) అనే మహిళ పలువురు ఇళ్లలో పనిచేస్తుంటుంది. ఈమెతో కరప మండలం నడకుదురు గ్రామం వెలమపేటకు చెందిన తమరాన అశోక్‌కుమార్ అనే మున్న (19)కు పరిచయం ఉంది. సెల్‌ఫోన్ కొనుక్కోవాలని భావించిన అశోక్‌కుమార్ కృష్ణవేణిని కొంత నగదు కావాలని అడిగాడు. తన వద్ద అంత మొత్తంలో డబ్బులు లేవని చెప్పి తాను పనిచేస్తున్నవారి ఇంటిలో దొంగతనం చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశ చూపింది. దొంగతనం ఏ విధంగా చేయాలనే పథకం సైతం ఆమె తెలియజేసింది. కృష్ణవేణి స్థానిక భాను గుడి సెంటర్ కృష్ణా లాడ్జి పక్కనే ఉన్న కొప్పర్తి తిరుపతమ్మ అనే వృద్ధురాలి ఇంటిలో పనిచేస్తోంది. కృష్ణవేణి ఇచ్చిన సమాచారం మేరకు గత సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో అశోక్‌కుమార్ మరి కొందరితో కలిసి ఇంటిలోకి ప్రవేశించి, వృద్ధురాలు తిరుపతమ్మను, కొట్టి, తాడుతో బంధించి ఆమె మెడలోని మంగళసూత్రాలు, నానుతాడును దొంగిలించి పరారయ్యారు. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో కొత్త పోర్టు రైల్వే స్టేషన్ నుండి బయటకు వస్తున్న భారపు విజయ రాఘవేంద్రస్వామిని కర్రతో బలంగా కొట్టి అతని వద్ద ఉన్న బ్యాగ్‌లోని 22 వేల రూపాయల నగదును తీసుకుని పరారయ్యారు. గాయపడిన రాఘవేంద్రస్వామి కోమాలోకి వెళ్లి చికిత్స అనంతరం ఇటీవల కోలుకున్నాడు. అదే విధంగా నిందితుడు అశోక్‌కుమార్ తన అనుచరులైన పైలా మహేష్, యాకదేవి సంపత్‌కుమార్, పట్టా శివసాయిదత్తలతో కలిసి నడకుదురులో గత సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన కొబ్బిరెడ్డి రమణమ్మ అనే మహిళపై దాడికి పాల్పడి సుమారు 7 కాసుల విలువైన బంగారు గొలుసును దొంగిలించారు. నవంబర్ 7న స్థానిక భానుగుడి సెంటర్‌లో కృష్ణా లాడ్జి యజమాని కొప్పర్తి రమణమ్మ ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో ప్రవేశించి ఆమె చేతులు, కాళ్లు తాళ్లతో కట్టివేసి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు, బీరువాలో ఉన్న సుమారు 35 కాసుల విలువైన బంగారు ఆభరణాలతోపాటు 60 వేల రూపాయల నగదును అపహరించుకుపోయారు. బాధితుల నుండి ఫిర్యాదులు అందడంతో జిల్లా ఎస్పీ రవిప్రకాష్ పట్టణ క్రైమ్ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. అడిషినల్ ఎస్పీ దామోదర్ ఆదేశాలతో క్రైమ్ డిఎస్పీ ఎ పల్లపురాజు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. క్రైమ్ నిఘా విభాగానికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ప్రధాన నిందితుడు తమరాన అశోక్‌కుమార్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్నట్టు దామోదర్ చెప్పారు. విచారణలో నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు తాళ్ళరేవు మండలం కోరింగ గ్రామానికి చెందిన సంగాడి కళ్యాణ్‌కుమార్ అనే కళ్యాణ్ (20), కాకినాడ రూరల్ మండలం డ్రైవర్స్ కాలనీకి చెందిన పట్టా శివసాయిదత్త (20), డైరీ ఫారమ్ సెంటర్ రాజీవ్ గృహకల్పకు చెందిన బొడ్డు ప్రవీణ్ (26), అన్నమ్మ ఘాటీ సెంటర్ భానుగారి వీధికి చెందిన పైలా మహేష్ (25), డ్రైవర్స్ కాలనీకి చెందిన యాకదేవి సంపత్‌కుమార్ (23), ఓ బాలుడితోపాటు వీరికి అన్నివిధాలుగా సహాయ సహకారాన్ని అందజేసిన కాలపరెడ్డి కృష్ణవేణి (33)ని అరెస్టుచేశామన్నారు. ఈ కేసుల్లో మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశామన్నారు. నిందితుల్లోని మైనర్ బాలుడిని మీడియా ముందు హాజరుపరచలేదన్నారు. చోరీ సొమ్మును నిందితులు జల్సాలకు ఉపయోగించుకున్నారన్నారు. వీరి వద్ద నుండి సుమారు రూ. 10 లక్షలు విలువైన 38 కాసుల బంగారు ఆభరణాలు, రూ.10వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును ఛేదించడంలో కృషిచేసిన ఎస్సైలు రామారావు, రవికుమార్, పాషా, సిబ్బందికి ఎస్పీ రవిప్రకాష్ త్వరలో రివార్డులను అందజేస్తారని అడిషినల్ ఎస్పీ దామోదర్ తెలిపారు. విలేఖరుల సమావేశంలో క్రైమ్ డిఎస్పీ పల్లపురాజు పాల్గొన్నారు.

ముగిసిన ఇంటర్ పరీక్షలు
రాజమహేంద్రవరం, మార్చి 19: జిల్లాలో ఈఏడాది ఇంటర్ పరీక్షలు ఒక్క విద్యార్థి డిబార్ కాకుండానే ముగియడం ఒక రికార్డు. ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియెట్ పరీక్షలు శనివారంతో ముగిసాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈనెల 9వ తేదీన జరగాల్సిన గణితం, జంతుశాస్త్రం, చరిత్ర-2 పరీక్షలను ఆదివారం నిర్వహించారు. ఆదివారం నాటి పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 37వేల 636 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 36వేల 8 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, 1628 మంది గైర్హాజరయ్యారని ఆర్‌ఐఓ ఎ వెంకటేష్ తెలిపారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని అందరికీ ఆర్‌ఐఓ కృతజ్ఞతలు తెలియజేశారు.
మూడు వార్డులకు టిడిపి అభ్యర్థులు ఖరారు
గెలుపు ధ్యేయంగా ఎమ్మెల్యే తోట వ్యూహం:స్థానిక నేతలతో సమావేశాలు
రామచంద్రపురం, మార్చి 19: పురపాలక పరిధిలో మూడు వార్డులకు ఉప ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అభ్యర్థులుగా సమర్థులను నిలబెట్టడమే కాకుండా వారిని గెలిపించుకునేందుకు సకల సన్నాహాలు ప్రారంభించింది. మూడు స్థానాలకు ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసింది. తెలుగుదేశం పార్టీ తరపున 17వ వార్డు నుంచి శ్రీరాజా కాకర్లపూడి రాజగోపాలనరసరాజు (గోపాల్‌బాబు), 21వ వార్డు నుంచి కొండపల్లి చిరంజీవి రవికుమార్, 25వ వార్డు నుంచి నున్నబోయిన దుర్గాప్రసాద్‌లను ఆ పార్టీ ప్రకటించింది.
ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, పట్టణ ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులతో కలసి ఎన్నికలు జరిగే మూడు వార్డులకు సంబంధించిన ప్రాంతాల ప్రజానీకంతో గత రెండు రోజులుగా నిర్వహించిన సమీక్షా సమావేశాలు అత్యంత కీలకంగా మారాయి. గత పురపాలక ఎన్నికల సమయంలో 22వ వార్డులో జరిగిన వెన్నుపోటు రాజకీయాలు మరోసారి పునరావృతం కాకుండా ఈసారి గట్టి నిఘా ఏర్పాటుకు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తగుచర్యలు తీసుకున్నారు. 17వ వార్డులో శ్రీరాజాకాకర్లపూడి రాజాగోపాల నరసరాజు (గోపాల్‌బాబు)ను పోటీచేయిస్తున్న నేపథ్యంలో టిడిపికి కంచుకోటగా మలుచుకునేలా ఎమ్మెల్యే తోట చర్యలు తీసుకున్నారు. గెలుపు గుర్రాలనే బరిలో దించుతున్నామని అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న తనకు పురప్రజలు అండగా ఉంటారన్న గట్టి నమ్మకాన్ని ఎమ్మెల్యే తోట వ్యక్తం చేస్తున్నారు. గత సాంప్రదాయాలను అనుసరించి భర్తలు మరణించిన స్థానాల్లో వారి భార్యలను నిలబెట్టే సాంప్రదాయానికి తాము తెరలేపగా, వైసిపి అందుకు మద్దతు ప్రకటించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి వస్తోందని ఆయన స్పష్టంచేశారు. కాగా వైసిపి తరపున ఎన్నికల్లో పోటీ చేయించకూడదనే భావనను ఆ పార్టీకి చెందిన అగ్రనేత వచ్చినప్పటికీ ఒక కౌన్సిలర్ వత్తిడి మేరకు బరిలో దించే ప్రయత్నాలు జరిగినట్టు ఆ పార్టీ కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు.

ఇంట్లోనే గిరినాగుకు పూజలు!
రాజవొమ్మంగి, మార్చి 19: అత్యంత ప్రమాదకరమైన గిరినాగు ఓ గిరిజనుని ఇంట్లో పూజలందుకుంటున్న అరుదైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. లాగరాయి సమీపంలో జీడిమామిడితోటలో పూసం అబ్బాయిదొర, సత్యవతి నివాసముంటున్నారు. వారు నివశించే తాటాకు ఇంటి సమీపంలో పోసమ్మతల్లి గుడిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. వారి ఇంట్లో ఓ మూలన ఆదివారం భారీ విష సర్పం కనిపించింది. తాము పూజించే పోసమ్మతల్లే గిరినాగు రూపంలో వచ్చిందని గిరిజనులు నమ్ముతున్నారు. వసంత నవరాత్రులు జరిపే సమయంలో ప్రతీ ఏటా పాము తమ ఇంటికి వస్తుందని, అయితే ఈసారి చాలా పెద్ద పాము వచ్చిందని, మూడు రోజుల పాటు తమ ఇంట్లో ఉంటుందని ఆ గిరిజన దంపతులు తెలిపారు. ఇంట్లో పాము ఉన్నా సరే గిరిజనులు వారి పనులు వారు చేసుకుంటున్నారు. తమకు ఈ పామువలన ఎటువంటి భయం లేదని, పాము మా ఇంట దేవత అని వారన్నారు. పాముకు నైవేద్యంగా పాలు పోస్తున్నామని, కాసేపటికి అవి కనిపించడంలేదని గిరిజన మహిళ సత్యవతి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టు పక్కల వారు భారీ సర్పానికి పూజలు చేయసాగారు.