తూర్పుగోదావరి

ఏప్రిల్ 7 నుంచి అందరికీ ‘ఆరోగ్య రక్ష’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 23: రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఆరోగ్యం కల్పించాలనే లక్ష్యంతో ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఆరోగ్యరక్ష పథకాన్ని ప్రారంభిస్తుందని కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ వెల్లడించారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ హాలులో గురువారం ఆరోగ్యరక్ష కార్యక్రమంపై అధికారులు, కార్పొరేట్ ఆసుపత్రులు, ఆరోగ్యమిత్రలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాసాధికార సర్వే ద్వారా జిల్లాలో 35 వేల దారిద్య్ర రేఖకు ఎగువనున్న కుటుంబాలున్నట్టు తేలిందన్నారు. వీరందరూ ఆరోగ్యరక్షకు అర్హులేనన్నారు. ఇప్పటివరకు 1847 కుటుంబాలను చేర్పించామని, మిగిలిన వారిని వచ్చే నెల 6వ తేదీలోగా చేర్పించేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో లక్ష కుటుంబాల్లో ఏ విధమైన కార్డు లేనివారున్నారని, వారిని ఈ పథకంలో చేర్చేందుకు కృషిచేయాలని సూచించారు. అర్హులైన కుటుంబాలను గుర్తించి, ఈ పథకంలో చేర్పించాలని అధికారులకు స్పష్టంచేశారు. ఇందుకు డోర్ టు డోర్ క్యాంపులు నిర్వహించి, అర్హులైన వారిని ఆరోగ్యరక్షలో చేర్పించేందుకు కృషి చేయాలని కోరారు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ నమోదుకు కృషి చేయాలన్నారు. దీనిపై ప్రతివొక్కరికి అవగాహన కలిగించాలని, ఆరోగ్యమిత్రలు తమకిచ్చిన లక్ష్యసాధనలో ప్రగతి చూపాలని కోరారు. దీనిపై ఏప్రిల్ 6వ తేదీన సమీక్ష నిర్వహిస్తామని, అర్హులైన కుటుంబాలను బీమా పథకంలో చేర్పించేందుకు ఎవరికైనా అనుమానాలు, అపోహలుంటే తెలియజేయాలని, ఈ పథకం
పట్ల అందరూ ఆకర్షితులయ్యేలా చూడాలని అధికారులు, కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. దీనికి సంవత్సరానికి ఒక్కొక్కరు రూ.1200 వంతున చెల్లించి, హెల్త్‌కార్డు పొందవచ్చన్నారు. ఇందుకు దరఖాస్తు చేసుకోదలచిన వారు సమీప మీ-సేవ కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. ఈ పథకం ద్వారా 410 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స చేయించుకోవచ్చని, 1044 వ్యాధులకు సెమీ, ప్రైవేటు ఎసి ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. వైద్య సహాయం పొందేటపుడు సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని, వైద్యుని సంప్రదింపు, నిర్ధారణ పరీక్షలు, మందులు, వైద్యంతో పాటు ఉచిత భోజనం కూడా అందిస్తారన్నారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే సమయంలో 11 రోజులకు సరిపడే మందులు అందజేస్తారని కలెక్టర్ వివరించారు. సమావేశంలో ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో-ఆర్డినేటర్ కె రాజు, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె చంద్రయ్య, డాక్టర్ రమేష్‌కిషోర్, వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులు, వైద్యులు, ఆరోగ్యమిత్రలు పాల్గొన్నారు.

భీమేశ్వరుని దర్శించుకున్న బిసి కమిషన్ సభ్యులు
సామర్లకోట, మార్చి 23: జిల్లా పర్యటనలో భాగంగా గురువారం సామర్లకోట పంచారామక్షేత్రం భీమేశ్వరాలయంలో బిసి కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎఎల్ మంజునాథ్, సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత భారీ బందోబస్తు కాన్వాయ్‌తో ఆలయానికివిచ్చేసిన జస్టిస్ మంజునాథ్ బృందానికి ఆలయ ఇఒ పులి నారాయణమూర్తి, ధర్మకర్తల మండలి ఛైర్మన్ కంటే జగదీష్‌మోహన్ (బాబు) బృందం, ఆలయ అర్చకులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత జస్టిస్ మంజునాథ్ బృందం ఉపాలయాలను, మూల విరాట్‌ను దర్శించుకున్నారు. అనంతరం భీమేశ్వరుని యోగ లింగానికి, బాలా త్రిపుర సుందరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. తదుపరి నంది మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అందుకుని, ఆలయ సిబ్బంది అందచేసిన ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్ర విశిష్టతను ఆలయ అభిషేక పండిట్ వేమూరి సోమేశ్వరశర్మ, అర్చకులు కొంతేటి జోగారావు, సన్నిధిరాజు సుబ్బన్న, చెరకూరి భీమేశ్వరశర్మ తదితరులు వివరించారు. అలాగే ఆలయ ఇఒ నారాయణమూర్తి, ధర్మకర్తల మండలి ఛైర్మన్ కంటే బాబు తదితరులు మంజునాథ్‌కు, బృందం సభ్యులకు కండువాలు కప్పి సత్కరించి, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం జస్టిస్ మంజునాథ్ బృందం పెద్దాపురం మండలానికి తరలివెళ్లారు. మంజునాథ్ బృందంలోని సభ్యులు మల్లెల పూర్ణచంద్రరావు, శ్రీమంతుల సత్యనారాయణ, ప్రొఫెసర్ వెంకట సుబ్రహ్మణ్యం, జిల్లా జాయింట్ కలెక్టర్-2 రాధాకృష్ణమూర్తి, కాకినాడ ఆర్డీవో ఎల్ రఘుబాబు, బిసి కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సామర్లకోట తహసీల్దార్ ఎల్ శివకుమార్, పెద్దాపురం డిఎస్పీ ఎస్ రాజశేఖరరావు, సామర్లకోట ఎస్సై ఆకుల మురళీకృష్ణ, భీమేశ్వరాలయం ట్రస్టు బోర్డు సభ్యులు మహంకాళి వెంకట రమణ, దూది రాజుబాబు, పడాల సూర్యనారాయణ, దేవస్ధానం సిబ్బంది, విఆర్వోలు, పాల్గొన్నారు.

జిల్లాల పర్యటనలు పూర్తి
ఇంకా కమిషన్ కార్యాలయంలో విజ్ఞాపనలు ఇవ్వవచ్చు:బిసి కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ్
కరప, మార్చి 23: రాష్ట్రంలో కులాల అధ్యయనంపై ఏర్పాటైన బిసి కమిషన్ తూర్పుగోదావరి జిల్లాతో పర్యటన పూర్తయ్యిందని, మరింత సమాచారం కోసం విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ శాఖలకు లేఖలు రాశామని, వివరాలు రాగానే నివేదిక రూపొందించి త్వరలోనే ప్రభుత్వానికి అందిస్తామని బిసి కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాధ తెలిపారు. గురువారం బిసి కమిషన్ కరప మండలం గురజనాపల్లి గ్రామంలో క్షేత్ర పర్యటన అనంతరం జస్టిస్ మంజునాధ పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కమిషన్ పర్యటించి వివిధ కులాలపై మార్పు, చేర్పులు అధ్యయనం చేసిందన్నారు. అలాగే జిల్లాల పర్యటనలో బిసి కులాల్లో మార్పులు, చేర్పులపై కులసంఘాల ప్రతినిధుల నండి విజ్ఞాపనలు స్వీకరించామని తెలిపారు. అలాగే మరింత సమాచారం కోసం ఇప్పటికే విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ శాఖలకు లేఖలు రాశామని, వారి నుండి వివరాలు అందగానే మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి నివేదిక రూపొందిస్తామని తెలిపారు. నేటితో జిల్లాల పర్యటన పూర్తయ్యిందని, ఇంకా ఎవరైనా తమకు విజ్ఞాపనలు అందజేయాలనుకుంటే ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకుని నేరుగా తమ కార్యాలయంలో అందజేయవచ్చునని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా అవసరమైన సమాచారాన్ని సేకరించడంతోపాటు వివిధ కులాలపై అధ్యయనం చేశామని తెలిపారు. అలాగే గురుజనాపల్లి గ్రామంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధుల నుండి సమాచారాన్ని సేకరించామని తెలిపారు.

రైల్వే స్టేషన్‌లో ఇద్దరి నుంచి
రూ.29.4 లక్షల నగదు స్వాధీనం
రాజమహేంద్రవరం, మార్చి 23: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి గురువారం ఆర్పీఎఫ్, రైల్వే పోలీసులు రూ. 29.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన శంతన్‌కుమార్‌సింగ్, గోరఖ్‌పూర్‌కు చెందిన రాజ్‌కుమార్‌సింగ్‌లు నగదుబ్యాగ్‌తో పెట్టుకుని రైలు కోసం ఎదురుచూస్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు సోదా చేశారు. దీంతో వారి వద్ద ఉన్న బ్యాగ్‌లో నగదు లభ్యమైంది. లెక్కలు అడగ్గా పొంతన లేని సమాధానం చెప్పడంతో వారిని అరెస్టు చేసి నగదును ఆదాయపుపన్నుశాఖ అధికారులకు అప్పగించారు.

రికార్డులు సక్రమంగా నిర్వహించాలి
-ఏలూరు రేంజి డిఐజి రామకృష్ణ
కాకినాడ సిటీ, మార్చి 23: జిల్లా క్రైమ్ బ్రాంచి విభాగంలో ఉండే రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఏలూరు రేంజి డిఐజి పివిఎస్ రామకృష్ణ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయం వార్షిక తనిఖీలో భాగంగా ఆయన గురువారం జిల్లా క్రైమ్ బ్రాంచి కార్యాలయాన్ని తనిఖీ చేశారు. జిల్లాకు చెందిన క్రైమ్ సమాచారం మొత్తం క్రైమ్ బ్రాంచిలో రికార్డుల రూపంలో దాచి వుంచుతామని, రికార్డులను సంబంధిత సిబ్బంది సక్రమంగా నిర్వహించాలన్నారు. ప్రస్తుతం కార్యాలయంలో ఎన్ని రికార్డులు ఉన్నాయి, వాటి నిర్వహణ, కంప్యూటరీకరణ తదితర విషయాలను ఆయన స్వయంగా పరిశీలించారు. క్రైమ్ బ్రాంచి విభాగంలో ఎంతమంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారనే విషయాన్ని పరిశీలించి వారికి పలు సూచనలు, సలహాలను అందజేశారు. డిఐజి రామకృష్ణ వెంట అడిషినల్ ఎస్పీ ఎఆర్ దామోదర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.

అప్పు తీర్చలేదని యువతిని నిర్బంధించిన
మహిళా వడ్డీ వ్యాపారి!
-ఎస్పీ ఆదేశాలతో విడిపించిన పోలీసులు
రాజమహేంద్రవరం, మార్చి 22: తీసుకున్న అప్పు, వడ్డీ సక్రమంగా చెల్లించడం లేదని ఒక మహిళా వడ్డీ వ్యాపారి ఒక యువతిని నిర్భంధించిన సంఘటన వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను వడ్డీ వ్యాపారి చెర నుంచి విడిపించి విముక్తి కల్పించారు. పోలీసుల కథనం ప్రకారం టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఆల్కాట్‌గార్డెన్స్ వినాయకవీధిలో నివసించే మన్నవ గీతాశ్రీ అదే ప్రాంతంలోని రామాలయం వీధికి చెందిన నీలాపు కన్నమ్మ వద్ద నూటికి రూ. 15 వడ్డీ చొప్పున రూ. 15వేలు అప్పుగా తీసుకుంది. వారానికి 3వేల చొప్పున అప్పు తీర్చేలా ఒప్పందం కుదిరింది. అయితే గీతాశ్రీ అప్పు సక్రమంగా చెల్లించకపోవడంతో గురువారం కన్నమ్మ రామాలయం వీధిలోని తన ఇంట్లో గీతాశ్రీని నిర్భంధించింది, ఇంటికి తాళం వేసింది. ఎస్పీ బి రాజకులారికి ఈమేరకు సమాచారం అందడంతో ఆమె షీ టీమ్‌ను అక్కడికి పంపి గీతాశ్రీని విడిపించారు. టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌లో తనిఖీలు
అమ్మోనియం గ్యాస్ లీకేజీపై ఆరా:కార్మికుల భద్రత, వేతనాలపై ఫిర్యాదులు:తహసీల్దార్ శ్రీదేవి
కరప, మార్చి 23: కరప మండలం గురజనాపల్లి గ్రామంలో గల విబి ఎక్స్‌పోర్ట్స్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో బుధవారం ప్రమాదవశాత్తూ అమ్మోనియం గ్యాస్ లీకై నలుగురు మహిళా కార్మికులు అస్వస్థతకు గురవ్వగా, బాధితుల ఫిర్యాదు మేరకు గురువారం తహసీల్దార్ బూసి శ్రీదేవి, కాకినాడ రూరల్ సిఐ పవన్‌కిషోర్, ఎంపిడిఒ భీమశంకరం తదితరులు విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీదేవి కంపెనీలో ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, ఎంతమేర వేతనాలు చెల్లిస్తున్నారు, కార్మికుల భద్రతకు తీసుకుంటున్న రక్షణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే బుధవారం కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఆరాతీసి ఉదయం ప్రమాదం జరిగితే సాయంత్రం వరకూ బాధితులను ఎందుకు ఆసుపత్రికి తరలించలేదు, అలాగే అస్వస్థతకు గురైన బాధిత కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీశారు. అనంతరం ఆమె కంపెనీలో ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల భద్రతపై కంపెనీ సరైన చర్యలు చేపట్టడంలేదని, అలాగే వెట్టిచాకిరీ చేయించుకుంటూ చాలీచాలనీ వేతనాలు ఇస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిపై ప్రాథమిక విచారణ చేపట్టామని, నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు.

అన్ని రైతుబజార్లలో
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు
-ప్రభుత్వ సలహాదారుడు విజయకుమార్
రాజమహేంద్రవరం, మార్చి 23: రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ సలహాదారుడు టి విజయ్‌కుమార్ వెల్లడించారు. ఈఖరీఫ్ సీజన్‌లో జిల్లాలోని 25 మండలాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. గురువారం ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో జిల్లాలోని వ్యవసాయశాఖ ఎడిలు, అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని విజయనగరం, కడప జిల్లాలు ప్రకృతి వ్యవసాయంలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 5లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలో ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమిలోని సారాన్ని కాపాడుకోవచ్చన్నారు. సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్, వ్యవసాయశాఖ జెడి కెఎస్‌వి ప్రసాద్, డిడిలు కె లక్ష్మణరావు, విటి రామారావు, ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు జిల్లా మేనేజర్ వైవి సుబ్బారావు పాల్గొన్నారు.

పాము కాటుతో టెన్త్ విద్యార్థిని మృతి
అయినవిల్లి, మార్చి 23: పదవ తరగతి పరీక్షల్లో ఎలాగైనా ర్యాంకు సాధించాలనే తపనతో ఆ యువతి పరీక్షలు రాస్తోంది. అయితే విధి వక్రించి ఆమెను పైలోకానికి తీసుకువెళుతుందని ఊహించలేదు ఆ యువతి. బుధవారం ఇంగ్లీషు పరీక్ష రాసి ఇంటికి వచ్చిన ఆ యువతి పాము కాటుకు గురై మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయినవిల్లి మండలం నేదునూరు జమిందారు పేటకు చెందిన విప్పర్తి ఆశ (15) నేదునూరు హైస్కూల్లో పదవ తరగతి పరీక్షలు రాస్తోంది. బుధవారం ఇంగ్లీషు పరీక్ష రాసి ఇంటికి వచ్చింది. సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటినుండి బయటకు వస్తుండగా మెట్ల దగ్గర ఏదో కుట్టిందని బంధువులకు తెలిపింది. వెంటనే బంధువులు ఆ బాలికను స్థానిక ఆర్‌ఎంపి డాక్టర్‌కు చూపించగా ఇంజక్షను ఇచ్చినట్టు బంధువులు తెలిపారు. అయినా ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో బంధువులు హుటాహుటిన ఇరుసుమండలో పాము కాటుకు మందు వేసే ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్ళగా వారి సూచనల మేరకు అమలాపురంలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అప్పటికే ఆ పరిస్థితి విషమించడంతో ఆశ మరణించింది. ఆశ తండ్రి సతీష్ ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు. దీంతో ఆశ తల్లి ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే కావడంతో ఉపాధికోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళింది. ఆశ తాత విప్పర్తి నాగేంద్రుడు సంరక్షణలో ఉంటూ పదవ తరగతి పరీక్షలు రాస్తోంది. తన కుమార్తె మరణవార్త తెలుసుకున్న తల్లి విదేశాల నుండి బయలుదేరింది. ఆశ చుట్టు పక్కవారితో నేను పదవ తరగతిలో 10వ ర్యాంకు సాధిస్తానని, చెప్పిందని గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న హైస్కూలు హెచ్‌ఎం లీలావతి, ఉపాధ్యాయులు, స్కూలు అభివృద్ధి కమిటీ ఛైర్మన్ బండి శ్రీరాములు ఆశ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

బిసిల్లో చేర్చమని కోరుతున్న 64 కులాలు
రావులపాలెం, మార్చి 23: రాష్ట్రంలో 1994 నుంచి కమ్మ కులం తప్ప మిగిలిన 64 కులాల వారు తమను బిసిల్లో చేర్చాలని దరఖాస్తులు చేసుకున్నారని, అలాగే బిసిల్లోని 24 కులాలవారు తమను వేరే కేటగిరిలోకి మార్చాలని దరఖాస్తులు చేసుకున్నారని, దీనికి సంబంధించి వేసిన కమిషనే మంజునాథ కమిషన్ అని కమిషన్ సభ్యులు స్పష్టంచేశారు. గురువారం మండలంలోని ఈతకోటలో కమిషన్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ కులాల వారితో ముఖాముఖి చర్చ నిర్వహించారు. కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న బిసిల స్థితిగతులు, ఇతర కులాల వారితో వారికిగల సఖ్యత, సమస్యలు తదితర అంశాలను కూడా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. .
ఆసక్తి రేపిన యువతి ప్రసంగం
మంజునాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా సరోజిని అనే కాపు సామాజిక వర్గ యువతి చేసిన ప్రసంగం ఆసక్తి కలిగించింది. రిజర్వేషన్లు కాకుండా ప్రతిభ ఉన్నవారికే ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. తన తండ్రి మద్యానికి బానిస కావడంతో తమ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని తాము విద్యావంతులు కాలేకపోయామని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై మంజునాథ మాట్లాడుతూ మద్యంపై ఎందుకు పోరాటం చేయకూడదని ఆమెకు సూచించారు. తండ్రిని మార్చేందుకు ప్రయత్నించలేదా అని ప్రశ్నించగా, ప్రయత్నించి విఫలమయ్యానని ఆమె చెప్పింది. వ్యక్తిగా సాధించలేనిది సంఘటితంగా సాధించవచ్చునని, ఇదే సమస్య ఎదుర్కొంటున్న మరికొందరితో కలసి పోరాటాలు చేయవచ్చునని, ఇదేవిధంగా తాను కర్ణాటకలో హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఒక సమస్యను పరిష్కరించిన వైనాన్ని వివరించారు. సమావేశంలో కమిషన్ సభ్యులు ఆచార్య కె వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, మల్లెల పూర్ణచంద్రరావు, శ్రీమంతుల సత్యనారాయణ, జిల్లా రెండవ జెసి రాధాకృష్ణమూర్తి, సోషల్ వెల్ఫేర్ డిడి చినబాబు, తహసీల్దార్ సిహెచ్ ఉదయభాస్కర్, సర్పంచ్ ఎం సుమతి, ఆర్‌ఐ బి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. కమిషన్ పర్యటన నేపథ్యంలో అమలాపురం డిఎస్పీ ఎల్ అంకయ్య ఆధ్వర్యంలో సిఐ బి పెద్దిరాజు, ఎస్సై పివి త్రినాధ్ బందోబస్తు నిర్వహించారు.

మద్యం షాపు వద్దంటూ మహిళల ధర్నా
కొత్తపేట, మార్చి 23: పేదల ఇళ్ల మధ్య మద్యం షాపు పెట్టొదంటూ కొత్తపేట భవానీనగర్‌లో మహిళలు ఆందోళన చేపట్టారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రధాన రహదారికి అయిదు వందల మీటర్ల పరిధిలో మద్యం షాపు నిర్వహించరాదు. ఈమేరకు కొత్తపేటలో మద్యం షాపును మార్చేందుకు చేసే ప్రయత్నాలను మహిళలు పలుచోట్ల అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో పేదలు నివాసం ఉంటున్న తమ కాలనీకి సమీపంలో మద్యం షాపును పెట్టేందుకు స్థలాన్ని పూడుస్తుండటంతో మహిళలు ట్రాక్టర్లకు అడ్డంగా కూర్చున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పనులను ఆపకపోవడంతో ఆగ్రహించిన మహిళలు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఎన్ శ్రీ్ధర్, ఎస్సై డి విజయ్‌కుమార్ ఘటనా ప్రాంతానికి చేరుకొని వారితో చర్చించారు. అయితే ఇప్పటివరకూ మద్యం షాపునకు సంబంధించి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని, అయినా దీనికి సంబంధించి ఎక్సైజ్ అధికార్లు మాత్రమే అనుమతి ఇవ్వాలని చెప్పడంతో మహిళలు ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎక్సైజ్ సిఐ డి రఘుమారెడ్డితో మహిళలు వాగ్వివాదానికి దిగారు. ఎటువంటి అనుమతులు ఇచ్చినా సహించేది లేదని తేల్చి చెప్పారు. టిడిపి నేత పల్లికొండ సుధీర్‌కుమార్ మహిళలకు మద్దతుగా నిలిచారు. అవసరమైతే ఆందోళనకు తాను సిద్ధమని హెచ్చరించారు. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని సిఐ రఘుమారెడ్డి ఇచ్చిన హామీతో వారు ఆందోళనను విరమించారు.

రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత
రాజమహేంద్రవరం, మార్చి 23: రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో డిల్లీకి రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్న 85 కేజీల గంజాయిని ఆర్పీఎఫ్, జిఆర్‌పి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెంది, ప్రస్తుతం డిల్లీలో నివసిస్తున్న మురుగేష్, శేఖర్, సందీప్, పూజ, శివజ్యోతి అనే వారు 3 రోజుల క్రితం తుని సమీపంలో కేజీ రూ.వెయ్యి చొప్పున 85 కేజీల గంజాయిని కొనుగోలుచేసి, బ్యాగుల్లో సర్దుకున్నారు. అప్పటికే రిజర్వు చేసుకున్న టిక్కెట్ల ద్వారా ఎపి ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్రంలో బలమైన శక్తిగా బిజెపి
రాజవొమ్మంగి, మార్చి 23: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలో తమ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఎస్ సురేష్‌రెడ్డి అన్నారు. రంపచోడవరం నియోజకవర్గ నాయకుల సమావేశం గురువారం స్థానిక ఆర్ అండ్ బి వసతిగృహం ఆవరణలో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో అవినీతికి వ్యతిరేకంగా మోదీ చేపట్టిన ఉద్యమం సత్ఫలితాలిచ్చిందన్నారు. గత కాంగ్రెస్ పాలనలో అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించిన ఘనత కూడా మోదీకే దక్కుతుందన్నారు. మోదీ మూడేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా సుపరిపాలన అందిస్తున్నారని, ఇటీవల జరిగిన ఎన్నికలే ఇందుకు నిదర్శనమన్నారు. అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. దేశంలో 13 రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వం పరిపాలిస్తుందని, 65 శాతం భూభాగంలో తమ పార్టీ అధికారంలో ఉందని ఆయన అన్నారు. పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం 74 పథకాలను అమలు చేస్తోందని, నీరు-చెట్టు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధి హామీ, సిసి రోడ్ల నిర్మాణం, సర్వశిక్షాభియాన్, ఫసల్ బీమా యోజన, తదితర పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. పేదలకు పంపిణీ చేస్తున్న కిలో బియ్యానికి రూ.27లు అందజేస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో 40 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, ఇంకా అనేక మంది తీసుకోడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 13 జిల్లాల్లో 44 వేల బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు ద్వారా పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామన్నారు.
శిశుమరణాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళతా...
ఏజెన్సీలో జరుగుతున్న శిశుమరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా దృష్టికి తీసుకెళతానని సురేష్‌రెడ్డి అన్నారు. ఏడాది కాలంలో 700 మంది మాతా, శిశువులు మరణించడం దయనీయమైన విషయమన్నారు. ఈ మరణాలపై సమగ్ర విచారణ చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉపాధి హామీ పనులు సక్రమంగా జరగడంలేదని, కూలి సొమ్ములు ఇవ్వడంలేదని, మరుగుదొడ్లకు, ఇంటి నిర్మాణం బిల్లులు ఇవ్వడంలేదని స్థానికులు సురేష్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. కిర్రాబు వద్ద మడేరుపై ఆనకట్ట వెంటనే నిర్మించాలని రాష్ట్ర గిరిజన మోర్చ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోసూరి కాశీవిశ్వనాధ్ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ టిడిపి కార్యకర్తగా పనిచేస్తున్నారని, జిల్లాలో పాలన సక్రమంగా జరగడంలేదని బిజెపి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య ఆరోపించారు. పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవలసిన చర్యలను గూర్చి, సంక్షేమ పథకాలను ప్రచారం చేయు విధానం గూర్చి నాయకులు చర్చించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి సింగిలిదేవి సత్తిరాజు, జిల్లా ప్రశిక్షణా ప్రచారక్ సర్వారాయుడు, బిజెపి నాయకులు చింతలపూడి వెంకటరమణ, షేక్ వలీ తదితరులు పాల్గొన్నారు.