తూర్పుగోదావరి

‘విత్తు’పై అన్నదాత వేలిముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 26: అన్నం మెతుకుపై మన పేరు వుంటుందంటారు.. అలా విత్తనం దశ నుంచే రైతు తన వేలి ముద్రతో వ్యవసాయానికి సాక్షీభూతమవుతున్నాడు.. విత్తు కావాలంటే ఇకపై అన్నదాత వేలిముద్ర వుండాల్సిందే.. అన్నం పెట్టే రైతు తన సాగులో అవసరమైన విత్తనానికి వేలిముద్ర వేసి మరీ విత్తనాలను సమీకరించుకోవాల్సి వుంది. విత్తనాల నకిలీ మార్కెట్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్తగా బయోమెట్రిక్ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఖరీఫ్ నుంచి ఈ విధానం అమల్లోకొస్తోంది. ఇప్పటికే ఈ బయో మెట్రిక్ విధానాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. దరిమిలా ఈ ఖరీఫ్ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో కూడా బయోమెట్రిక్ విధానంలో విత్తనాలు పొందే ప్రక్రియ చేపడుతున్నారు. రైతులు తమకు కావాల్సిన విత్తనాల కోసం ఎక్కడి నుంచి పొందితే అక్కడ బయోమెట్రిక్ యంత్రాల్లో వేలి ముద్ర వేసి విత్తనాలు పొందాల్సి వుంది. ఇప్పటికే అవసరమైన బయోమెట్రిక్ యంత్రాలు జిల్లాకు చేరాయి. ఈమేరకు విత్తన డీలర్లు, సొసైటీలు, ఎపి సీడ్స్ గోదాముల వద్ద బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. బయోమెట్రిక్‌కు ఆధార్‌ను అనుసంధానం చేస్తారు. ఒక సారి విత్తనం తీసుకుంటే మరోసారి విత్తనం తీసుకునేందుకు అవకాశం లేదు. విత్తనానికి పూర్తి గ్యారంటీ వుంటుంది. నకిలీకి తావులేకుండా పక్కాగా విత్తనాలు సరఫరా చేసేందుకు అవకాశం వుంటుందని ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చారు.
ఇదిలా వుండగా రైతుకు అవసరమైన విత్తనంలో కేవలం ఇరవై శాతమే ప్రైవేటు డీలర్లు, ఎపి సీడ్స్ సంస్థలు సరఫరా చేస్తున్నాయి. మిగిలిన 80 శాతం విత్తనం రైతులే సమకూర్చుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఖరీఫ్ విత్తనాన్ని రబీ నుంచి సమీకరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తూర్పుగోదావరి జిల్లాకు 2.24 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి 24 వేల మెట్రిక్ టన్నుల విత్తనం అవసరం. ఈమేరకు ఇరవై శాతం విత్తనాన్ని ఎపి సీడ్స్ నుంచి డీలర్లు, సొసైటీల వద్ద అమ్మకానికి పెడతారు. ప్రధానంగా ఖరీఫ్ స్వర్ణ రకాన్ని అత్యధికంగా సాగు చేస్తారు. అదే విధంగా బిపిటి 5204 రకాన్ని కూడా అధికంగానే వేస్తారు. ఈ అవసరమైన విత్తనాన్ని ఈ ఖరీఫ్ నుంచి బయో మెట్రిక్ విధానంలో రైతులు పొందాల్సి వుంది. విత్తనం దుబారా కాకుండా వుంటుందని, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు, విత్తన సరఫరా పారదర్శకంగా వుంటుందని ఆధార్ లింక్ పెట్టి బయోమెట్రిక్ విధానంలో విత్తనం పొందేందుకు ఈ విధానం అమల్లోకి వస్తోంది.
న్యాయవాదుల సదస్సుతో కాపుల్లో ఉత్సాహం
అండగా ఉండాలని అడ్వకేట్లకు ముద్రగడ పిలుపు

కాకినాడ, మార్చి 26: కాపు న్యాయవాదుల సదస్సు జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని పద్మనాభ ఫంక్షన్ హాలులో ఆదివారం విజయవంతమయ్యింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి సుమారు 400 మంది అడ్వకేట్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. బిసిలుగా గుర్తింపు పొందేందుకు పోరాటం సాగిస్తున్న నేపథ్యంలో ప్రతివొక్క కాపు న్యాయవాది తమ వంతు సహకారం అందించాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. అంతకు ముందు మహాత్మగాంధీ, బి ఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నివాళులర్పించారు. సమావేశంలో పాల్గొన్న కాపు సామాజికవర్గానికి చెందిన అడ్వకేట్లు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని ప్రకటించారు. సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ కాపుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోందన్నారు. జిఓ 30ని 1995లో హైకోర్టులో ఫుల్ బెంచ్ కొట్టివేయలేదని పేర్కొన్నారు. ఆ జిఓ చెల్లుబాటవుతుందంటూ హైకోర్టు స్పష్టం చేసిందని, కాపులకు ఏ విధంగా న్యాయం చేయాలన్న విషయమై అధ్యయనం చేయాలని సూచించిందన్నారు. సదరు జిఒను హైకోర్టు సమర్ధించినప్పటికీ దాని అమలులో రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేక తమను బిసిల్లో చేర్చకుండా తాత్సారం వహిస్తున్నారని ముద్రగడ పేర్కొన్నారు. సమావేశంలో వివిధ తీర్మానాలను ఆమోదించారు. కాపు, తెలగ, బలిజ , ఒంటరి కులాల కోసం ముద్రగడ భవిష్యత్‌లో చేపట్టనున్న ఆందోళనలకు న్యాయవాదులందరూ సహకరించాలని తీర్మానించారు. కాపు సామాజికవర్గానికి చెందిన కార్యకర్తలకు ఉచిత న్యాయ సేవలందించాలని, అమాయక కార్యకర్తలపై ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయాలని, సెక్షన్ 144సి ఆర్‌పిసి, సెక్షన్ 30పోలీస్ ఏక్ట్‌లను విచక్షణ రహితంగా ప్రయోగించడాన్ని ఖండించాలని సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో హైదరాబాద్ బార్ కౌన్సిల్ సభ్యులు జంగయ్యనాయుడు, చిట్టిబాబు, అడ్వకేట్లు ద్వారకానాథ్, బండారు వెంకట రమణమూర్తి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సభకు అడ్వకేట్ పేపకాయల రామకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
రాష్టస్థ్రాయి ఎడ్ల పరుగు పోటీలు
విజేతగా నిలిచిన చుక్కపల్లి గ్రామం
గొల్లప్రోలు, మార్చి 26: గొల్లప్రోలులో ఆదివారం నిర్వహించిన మాదేపల్లి రంగబాబు మెమోరియల్ రాష్టస్థ్రాయి ఎడ్ల పరుగు పోటీల్లో సీనియర్స్ విభాగంలో విశాఖ జిల్లా చుక్కపల్లి గ్రామానికి చెందిన అద్దేపల్లి పాలవల్లి ఎడ్ల జత ప్రథమ స్థానం సాధించింది. స్థానిక సూరంపేట సమీపంలోని గోదావరి కాలువ గట్టుపై నిర్వహించిన ఎడ్ల పరుగు పోటీలను పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్ వర్మ ప్రారంభించారు. సీనియర్స్ విభాగంలో 7 ఎడ్ల జతలు పాల్గొనగా విశాఖ జిల్లా చుక్కపల్లి గ్రామానికి చెందిన పాలవల్లి ఎడ్ల జత నిర్ణీత దూరాన్ని 5 నిమిషాల 54 సెకన్ల 37 పాయింట్లతో అధిగమించి ప్రథమ స్థానంలో నిలిచింది. చుక్కపల్లి గ్రామానికి చెందిన మజ్జి రాజేష్ ఎడ్ల జత 5 నిమిషాల 54 సెకన్ల 44 పాయింట్లతో ద్వితీయ స్థానాన్ని, బెండమూర్లంకకు చెందిన గుర్రం రాణి సంయుక్త ఎడ్ల జత 6 నిమిషాల 5 సెకన్ల 87 పాయింట్లతో తృతీయ స్థానాన్ని సాధించింది. జూనియర్స్ విభాగంలో 30 ఎడ్ల జతలు పాల్గొనగా పి నాయకంపల్లికి చెందిన చెరుకూరి రామవర్షిత్ ఎడ్ల జత ప్రథమ స్థానాన్ని, పిఠాపురం మండలం బి ప్రత్తిపాడు గ్రామానికి చెందిన బొజ్జా లక్ష్మీ అపర్ణ ఎడ్ల జత ద్వితీయ స్థానాన్ని సాధించాయి. ప్రకాశం జిల్లా పంగులూరు గ్రామానికి చెందిన పెండ్యాల రాంబాబు ఎడ్లజత తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా సిద్దా నానాజీ వ్యవహరించారు. విజేతలకు ఎమ్మెల్యే వర్మ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం ఎఎంసి ఛైర్మన్ మాదేపల్లి వినీల్ వర్మ, నగర పంచాయతీ ఛైర్మన్ శీరం మాణిక్యం, నగర పంచాయతీ ప్రతిపక్ష నేత తెడ్లపు చిన్నారావు, నీటి సంఘం అధ్యక్షుడు కడారి బాబ్జీ, వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
నకిలీ నోట్ల కేసులో తంఢ్రీ కొడుకులు అరెస్టు
లక్షా 18 వేల 500 నకిలీ నోట్లు స్వాధీనం

అమలాపురం, మార్చి 26: కష్టపడకుండానే జల్సాలు చేయాలన్న అత్యాశ వారిని కటకటాలపాల్జేసింది. నకిలీ 2000, 500 నోట్లు తయారుచేసి చలామణీ చేస్తూ పోలీసులకు చిక్కారు ఆ తండ్రీ కొడుకులు. దీనికి సంబంధించి అమలాపురం డిఎస్పీ ఎల్ అంకయ్య ఆదివారం సాయంత్రం స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. అల్లవరం మండలం తుమ్మలపల్లికి చెందిన వడ్డి మట్టయ్య, అతని కుమారుడు వడ్డి రాజేష్‌లు అమలాపురం సూర్యానగర్‌లో కాపురం ఉంటున్నారు. వడ్డి రాజేష్ బికాం వరకూ చదువుకుని ఇటీవలే గల్ఫ్ నుండి వచ్చాడు. అయితే రాజేష్ ఆధార్ కార్డును కలర్ జెరాక్స్ తీయించగా ఒరిజినల్‌కు, జెరాక్స్‌కు తేడా లేకపోవడంతో రూ.7000లతో కలర్ ప్రింటర్‌ను కొనుగోలు చేసి దాని సాయంతో 2000, 500 నోట్లను జెరాక్స్ తీసి వాటిని చలామణికి పూనుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న రాజేష్ తండ్రి మట్టయ్య రూ. 500 నోట్‌ను తీసుకుని స్థానిక ఎర్రవంతెన వద్ద దారా మాధవరావు అనే పండ్ల వ్యాపారి వద్ద అరకేజీ ద్రాక్షపళ్ళు కొన్నాడు. అరకేజీ ద్రాక్ష పళ్ళకు రూ. 40లు తీసుకుని మిగిలిన చిల్లర రూ.460లను తిరిగి మట్టయ్యకు పళ్ళ వ్యాపారి మాధవరావు ఇచ్చాడు. అయితే ఆ నోటు నకిలీదని తెలుసుకున్న మాధవరావు వెంటనే ఈ విషయాన్ని అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు డిఎస్పీ ఎల్ అంకయ్య ఆధ్యర్యంలో సిఐ వైఆర్‌కె శ్రీనివాస్, హెచ్‌సిలు అయితాబత్తుల బాలకృష్ణ, బత్తుల రామచంద్రరావులు దర్యాప్తు చేసి నిందితులను ఆదివారం నారాయణపేటలో ఆరెస్టు చేసినట్లు డిఎస్పీ అంకయ్య తెలిపారు. వారి నుండి ఒక ప్రింటర్, రూ. 1,18,500ల 2000, 500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ చెప్పారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు డిఎస్పీ తెలిపారు.
మద్యం దుకాణానికి వ్యతిరేకంగా ర్యాలీ
కొత్తపేట, మార్చి 26: మండల కేంద్రం కొత్తపేట భవానీ నగర్‌లో మద్యం దుకాణాన్ని ఏర్పాటుచేయవద్దంటూ ఆదివారం మద్యపాన వ్యతిరేక ప్రచార సమితి ఆధ్వర్యంలో గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ మద్యం దుకాణాన్ని ఏర్పాటుచేసేందుకు కొందరు యత్నిస్తున్న నేపథ్యంలో గత వారం రోజులుగా స్థానికులు ఆందోళన బాట పట్టిన విషయం విదితమే. ఈ ఆందోళనకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా జన విజ్ఞాన వేదిక కమిటీకి చెందిన మద్యపాన వ్యితిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పుర వీధుల గుండా ఈ ర్యాలీ నిర్వహించి, పోలీసు, ఎక్సైజ్ స్టేషన్లలో వినతి పత్రాలు సమర్పించారు. మద్యపానాన్ని వ్యతిరేకిస్తున్న గ్రామస్థులకు అండగా ఉండాల్సిన అధికారులు మద్యం వ్యాపారులకు మద్దతునీయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మద్యం దుకాణాన్ని వేరేచోట ఏర్పాటుచేసుకోవాలంటూ వారు నినాదాలు చేశారు. కార్యక్రమంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్ సూర్యనారాయణ, రాష్ట్ర కన్వీనర్ కె గౌరవ్, సిహెచ్ సంతోష్ తదితరులు నాయకత్వం వహించారు.
డ్రెయనేజీలో పడి మాజీ సొసైటీ అధ్యక్షుడు దుర్మరణం
రాజమహేంద్రవరం, మార్చి 26: రాజవోలు మాజీ సొసైటీ అధ్యక్షుడు నిమ్మలపూడి సుబ్బారావు(47) ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి దుర్మరణం చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఆదివారం తన బంధువుతో కలిసి మోటార్‌సైకిల్‌పై బొమ్మూరు నుంచి రాజవోలు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఎదురుగా వచ్చిన పిల్లలను తప్పించబోయి మోటార్‌సైకిల్ అదుపుతప్పి డ్రైనేజీలో పడింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన సుబ్బారావు మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, పోస్టుమార్టం నిర్వహించరాదని సుబ్బారావు బంధువులు, అనుచరులు పట్టుపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, సుబ్బారావు బంధువులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీసులు సర్దిచెప్పడంతో సుబ్బారావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు బంధువులు అంగీకరించారు. బొమ్మూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వెదురుపాక గాడ్‌కు సతీవియోగం
రాయవరం, మార్చి 26: వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) సతీమణి సీతామహాలక్ష్మి (70) ఆదివారం ఉదయం మృతిచెందారు. కుటుంబ సభ్యులు, పిఆర్వో బాబి తెలిపిన వివరాల ప్రకారం..ఆదివారం ఉదయం సీతామహాలక్ష్మి అస్వస్థతకు గురికావడంతో రాయవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె గుండె నొప్పి అధికమైంది. ఆసుపత్రికి చేరుకునే సరికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పీఠానికి విచ్చేసే భక్తులకు ఆప్యాయతతో అన్నప్రసాదాన్ని వడ్డించే సీతామహాలక్ష్మి మరణవార్త తెలియగానే భక్తులు తీవ్ర విషాదానికి గురయ్యారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి సీతామహాలక్ష్మి పార్థివ దేహానికి నివాళులర్పించారు. రాజమహేంద్రవరం కోటి లింగాల రేవు వద్ద హిందూ శ్మశాన వాటికలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వివి బాపిరాజు ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. సీతామహాలక్ష్మి మృతికి మండపేట, అనపర్తి ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి మూలారెడ్డి, తేతలి రామారెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు, సాహితీ వేత్తలు చిలకపాటి రాఘవాచార్యులు, మేడసాని మోహన్‌లు పీఠాధిపతికి ఫోన్లో సంతాపాన్ని తెలిపారు. అలాగే గ్రామ సర్పంచ్ కె సత్యప్రభా ఏసురత్నం, వైస్ ఎంపిపి సత్తి హిమరాణీ సావిత్రీదేవి, ఎంపిటిసి కొవ్వూరి సరోజాదేవి, సొసైటీ అధ్యక్షుడు సత్తి వీరరాఘవరెడ్డి, మాజీ సర్పంచ్‌లు నల్లమిల్లి శివశంకర్‌రెడ్డి, వల్లూరి వీరయ్యచౌదరి, సిరిపురపు పద్మావతి తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.
జిల్లా సమాచారాన్ని ఎప్పటికపుడు తెలుసుకోవాలి
డిఐజి రామకృష్ణ
కాకినాడ సిటీ, మార్చి 26: జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని పోలీస్ శాఖ ఎప్పటికపుడు తెలుసుకుని ఉన్నతాధికారులకు నివేదించాలని ఏలూరు రేంజ్ డిఐజి పివిఎస్ రామకృష్ణ పోలీస్ అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదివారం జిల్లాపోలీస్ కార్యాలయంలోని జిల్లా స్పెషల్ బ్రాంచ్ విభాగాన్ని తనిఖీ చేశారు. స్పెషల్ బ్రాంచ్ విభాగం నందు రికార్డులు, కంప్యూటరీకరణ తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఐజి రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికపుడు పోలీస్ అధికారులు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు. సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటే పోలీస్ శాఖకు శాంతిభద్రతల పర్యవేక్షణ సులభతర మవుతుందన్నారు. స్పెషల్ బ్రాంచ్ విభాగం పనితీరు పట్ల డిఐజి రామకృష్ణ సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం ఆయన ఆర్మ్‌డ్ రిజర్వ్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్, ఎస్బీ డిఎస్పీలు ఆర్ విజయభాస్కర్‌రెడ్డి, అప్పలనాయుడు, సిఐ పివి రమణ, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధిని గ్రామాల్లోకి తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే పులపర్తి
అయినవిల్లి, మార్చి 26: నూతనంగా ఎన్నికైన గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి 2019 ఎన్నికల్లో తిరిగి పార్టీ ఘన విజయం సాధించే విధంగా కృషిచేయాలని పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పిలుపునిచ్చారు. ఆదివారం అయినవిల్లిలంక పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శుల పరిచయ వేదిక సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి కనుమరుగవుతుందని ఎమ్మెల్యే జోస్యం చెప్పారు. రాష్ట్రం విడిపోయి ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి చూసి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేయాలో తెలియక నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇది రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపిపి సలాది పుల్లయ్యనాయుడు, జడ్పీటిసి గంగుమళ్ల కాశీ అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.
కొంతంగిలో భారీ తాచుపాము హతం
శంఖవరం, మార్చి 26: మండలంలోని కొంతంగి గ్రామంలో కూలీల చేతిలో భారీ తాచుపాము హతమయ్యింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కొంతంగి శివారున గల జీడిమామిడి తోటలో కూలీలు చెత్తను తొలగిస్తున్నారు. ఇంతలో చెత్తలో నుండి శబ్దం వస్తుండడంతో అటువైపుగా చూసిన కూలీలకు ఎన్నడూ చూడని విధంగా 15 అడుగుల మేర భారీ పొడవు గల నాగపాము కనిపించింది. కూలీలను చూసిన నాగపాము భారీ ఎత్తున పైకి లేచి పడగ విప్పినట్టు కూలీలు చెబుతున్నారు. దీంతో భయాందోళనకు గురై కొందరు పరుగులు తీయగా, మరికొందరు ధైర్యం చేసి అందుబాబులోని కర్రలతో నాగపామును హతమార్చారు. నాగపాము సమాచారం గ్రామంలోకి వ్యాపించడంతో భారీ పొడవు గల నాగపామును చూసేందుకు కొంతంగి గ్రామస్థులతో పాటు, సమీప గ్రామాల నుండి భారీగా తరలి వచ్చారు.
చేనేత రంగ అభివృద్ధికి సహకరించాలి
వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్ విశ్వనాథ్
యు కొత్తపల్లి, మార్చి 26: చేనేత రంగ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సహకరించాలని వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ టి శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు. యు కొత్తపల్లి మండలంలో మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేనేత రంగ సమస్యలపై ఆదివారం సాయంత్రం సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి కొప్పుల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా రాష్ట్ర చేనేత కార్మిక నాయకుడు విశ్వనాథ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చేనేత కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీడీ, అగరబత్తి కార్మికులకు జిఎస్‌టి బిల్లులో మినహాయింపు ఇచ్చిన విధంగానే చేనేత రంగానికి ఇవ్వాలని విశ్వనాథ్ డిమాండ్ చేశారు. జూలై నుంచి అమలయ్యే జిఎస్‌టి బిల్లులో చేనేత రంగానికి మినహాయింపు ఇవ్వకపోతే చేనేత కార్మికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని విశ్వనాథ్ అన్నారు. అలాగే చేనేత కార్మికులు, వ్యాపారులను అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఉప్పాడలో తయారయ్యే చేనేత చీరలకు దేశవ్యాప్త గుర్తింపు ఉందని, ఇలాంటి సమయంలో చేనేత కార్మికులపై అధికారులలు చట్టాల పేరుతో కొన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయనన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జిఎస్‌టి బిల్లులో చేనేత రంగానికి మినహాయింపును కేంద్రం ఇవ్వాలని, దీనిపై మాస్టర్ వీవర్స్, చేనేత కార్మికులు కలసి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చేనేత రంగ రాష్ట్ర నాయకులు కెవి సంజీవరావు, పుచ్చల రామకృష్ణ, స్థానిక చేనేత వ్యాపార నాయకులు కొప్పుల మధు, మల్లిపెద్ది అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
లోయలోకి ఆటో బోల్తా
ఒకరు మృతి, నలుగురికి గాయాలు
మారేడుమిల్లి, మార్చి 26: మారేడుమిల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గిరిజన మహిళ మృతిచెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం మారేడుమిల్లి మండలం చావడికోట పంచాయతీ ఉప్పరిగోతుల గ్రామ సమీపంలో అదుపు తప్పి ఆటో లోయలోకి బోల్తా పడింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆకు మామిడికోట గ్రామం నుంచి విశాఖ జిల్లా పోతవరం గ్రామానికి 12 మందితో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మఠం భీమవరం పంచాయతీకి చెందిన కిలో కమలమ్మ (50) అనే గిరిజన మహిళ దుర్మరణం పాలవ్వగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మారేడుమిల్లి పిహెచ్‌సిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై మారేడుమిల్లి పోలీసు స్టేషనులో ఎస్సై తులసీరామ్ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.