తూర్పుగోదావరి

అటవీ విస్తీర్ణం పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 27: జిల్లాలో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. మొక్కలు నాటడంపై కార్యాచరణ ప్రణాళిక సమగ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. నగర వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. రానున్న 35నుండి 40రోజుల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని, జిల్లాలో మొక్కలు నాటేందుకు యుద్ధప్రాతిపదికన ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. ఈనెల 29న రంపచోడవరం, చింతూరు డివిజన్లలో పర్యటించి, కొత్తగా చేపట్టాల్సిన పనులపై సమీక్షిస్తామన్నారు. రానున్న మూడు నెలల్లో చేపట్టనున్న పనులకు సంబంధించి సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నాటిన మొక్కలన్నిటికీ ప్రభుత్వాదేశాల మేరకు జియోట్యాగింగ్ చేయాలన్నారు. అవసరమైతే ప్రభుత్వ అనుమతి తీసుకుని, క్యాంపా నిధులు తీసుకోవచ్చని చెప్పారు. చింతూరు డివిజన్‌లో బీడీ ఆకులు తయారుచేసే కార్మికులను ప్రోత్సహించేందుకు అటవీ శాఖ, ఉపాధి హామీలు సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాజమహేంద్రవరం సమీపంలోని దివాన్‌చెరువు వద్ద ఏర్పాటుచేసిన నగర వనం వంటి ప్రాజెక్ట్‌లు జిల్లాకు అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధికి ఆయా ప్రాంతాలను పరిశీలించి, గుర్తించాలని సూచించారు. వన్యప్రాణి అటవీ విభాగం ఆధ్వర్యంలో మొక్కలు పెంచి, సంరక్షించాలన్నారు. ఇందుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని స్పష్టం చేశారు. వన్యప్రాణి విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న పులులు, చిరుత పులుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకుని, వన్యప్రాణుల సంరక్షణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అటవీ ప్రాంతాల్లో పెంచే వెదురు, టేకు కలప అమ్మకాల వలన ఆదాయం బాగానే ఉందని, ఇంకా అధిక ఆదాయం లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి దృష్టి సారించాలని, హోప్ ఐలాండ్లో ఆలివ్‌రిడ్లే జాతి తాబేళ్ళు, కోరింగ అభయారణ్యంలో వన్యప్రాణుల రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులకు పిలుపునిచ్చారు. సమావేశంలో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమీషనర్ విజయరామరాజు, ఐటిడిఎ పిఒ దినేష్‌కుమార్, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయమీనన్, జిల్లా సంయుక్త కలెక్టర్-2 జె రాధాకృష్ణమూర్తి, డిఆర్‌ఒ ఎం జ్యోతి, కాకినాడ డిఎఫ్‌ఒ ఎం శ్రీనివాసరావు, కాకినాడ సోషల్ ఫారెస్ట్ డిఎఫ్‌ఒ ఎవిఎస్‌ఆర్‌కె అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

ఎపిలో లక్ష్యాన్ని మించి ఆదాయ పన్ను వసూళ్లు
జాయింట్ కమిషనర్ సత్యానందం

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 27: ప్రధాని మోదీ సంస్కరణల నేపథ్యంలో లక్ష్యాన్ని మించి ఆదాయాన్ని సాధించామని ఆదాయపన్ను శాఖ విశాఖపట్నం జాయింట్ కమిషనర్ సత్యానందం పేర్కొన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను వసూళ్లలో ఎపి లక్ష్యం రూ.2342 కోట్లు కాగా, రూ.6483 కోట్లు లభించిందని తెలిపారు. ఇదంతా ప్రధాని మోదీ సంస్కరణల ఫలితమేనన్నారు. రాజమహేంద్రవరంలో ఆదాయపన్ను శాఖ అధికారి శైలేంద్రకుమార్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సామాజిక సమతుల్యత, హేతుబద్ధ టిడిఎస్‌వల్ల ఇది సాధ్యమయ్యిందన్నారు. ప్రజలు నూరుశాతం పన్ను పరిధిలోకి వస్తున్నారన్నారు. ఆదాయ పన్ను చెల్లింపు అందరి బాధ్యతగా గుర్తించాలన్నారు. దేశవ్యాప్తంగా 3.55 కోట్ల మంది పన్ను పరిధిలో ఉండగా రానున్న రోజుల్లో 10 కోట్ల మంది టాక్సు పరిధిలోకి రావాలనేది ప్రధాని మోదీ సంకల్పమన్నారు. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ, ఆదాయపన్ను శాఖలు ప్రాధాన్యత సంతరించుకున్నాయన్నారు. సంస్కరణల్లో కీలకమైన డిజిధన్, నగదు రహిత ఆర్థిక విధానాలవల్ల ప్రతీ వ్యక్తి ఆదాయ పన్నుశాఖ పరిధిలోకి రావాల్సి ఉందన్నారు. అభివృద్ధిచెందిన సాంకేతికత ఆదాయ పన్ను శాఖ అందిపుచ్చుకుందని, దీనివల్లే కోట్లాది మంది లావాదేవీలు సత్వరం నిర్వహించడానికి వీలు కలుగుతోందన్నారు. ఆధార్‌తో ఆదాయ పన్నును అనుసంధానం చేయడం జరిగిందన్నారు. ఇ ఫైలింగ్‌లో సరైన ప్రమాణాలు సాధించాలన్నారు. సకాలంలో రిటర్న్స్ దాఖలు చేయకపోతే 234 ఇఇ ప్రకారం రూ.200 అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రగతికి, అభివృద్ధికి తార్కాణం పన్నులు చెల్లింపని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో వస్తున్న అనేక మార్పుల నేపథ్యంలో ఆధార్, పాన్ ఆధారిత బ్యాంకు అనుసంధానిత పన్ను చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. 3.50 కోట్ల మంది పన్నుదారుల్లో అత్యధికంగా ఉద్యోగులున్నారన్నారు. టిడిఎస్ (టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) అనేది ప్రతీ వ్యక్తికీ వర్తిస్తుందన్నారు. వ్యవసాయ రంగంపై ఒక శాతం పన్ను ఉందన్నారు. ఎయిడెడ్ కాలేజీ జీతాలు ఆలస్యమవుతున్న క్రమంలో టిడిఎస్ భారమవుతోందని, ఈ విషయంలో పరిశీలన చేయాలని పలువురు ఎయిడెడ్ కాలేజీల ప్రిన్సిపాళ్లు కోరారు. భవనానికి రూ.50వేలకు మించి అద్దె చెల్లిస్తున్న క్రమంలో 10 శాతం టిడిఎస్ వర్తిస్తుందని ఏలూరుకు చెందిన ఆదాయపన్ను శాఖ అధికారి సతీష్‌కుమార్ తెలిపారు. సదస్సులో రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, అధికారులు సుధీర్‌కుమార్, సుందరరావు, రామావతారం తదితరులు పాల్గొన్నారు.

ఈదురుగాలులతో భారీ వర్షం

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 27: రోజంతా ఎండ వేడిమితో అల్లాడిన జనం గురువారం సాయంత్రానికి వాతావరణం చల్లబడటంతో ఊరట చెందారు.. ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములు మెరుపులతో వాతావరణం భయకంపితం చేసింది. పగలంతా ఎండ వేడిమితో భానుడు భయపెడితే..సాయంత్రం చల్లబర్చినట్టయింది. రాజమహేంద్రవరం నగరంలో భారీ వర్షం కురిసింది..పెద్ద పెద్ద వాన చినుకులతో సుమారు గంట పాటు వాన కురిసింది.. నగరంలో ఎక్కడికక్కడ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం జరుగుతుండటంతో రోడ్లన్నీ అస్త్వస్థంగా వున్నాయి. ఈ తరుణంలో కురిసిన భారీ వర్షానికి పరిసరాలు చిత్తడిగా మారాయి. వాహన చోదకులు ఇబ్బందులకు గురయ్యారు. భారీ ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో ముందస్తుగా విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు. అసలే గ్రామీణ ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడం జరుగుతోంది. దీనికితోడు ఈదురు గాలులు రావడంతో కాస్తంత ఎక్కువ సమయమే విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు. రాజమహేంద్రవరం నగరంలో పలుచోట్ల సుమారు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలుపుచేశారు. గాలులు పూర్తిగా తగ్గిన తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
గండేపల్లి మండలంలో...
గండేపల్లి: మండలంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై చల్లబడి భారీ ఈదురుగాలుల కారణంగా చెట్లు నేలకొరిగి, విద్యుత్ తీగలపై చెట్లు పడడంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయమేర్పడింది. గురువారం సాయంత్రం విపరీతమైన ఈదురుగాలులతో ఏర్పడిన ఈ పరిస్థితికి గ్రామంలో గాడాంధకారం అలుముకుంది. మెట్టప్రాంతంలో ఉన్న మామిడి కాయలు రాలిపోయాయి. గెలలతో ఉన్న అరటి మొక్కలు నేలకూలడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మల్లేపల్లి బిసి కాలనీలో భారీ వృక్షం విద్యుత్తు వైర్లపై పడడంతో తీగల తెగివేలాడుతున్నాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందజేయడంతో తక్షణ చర్యలు చేపట్టారు.
రాజవొమ్మంగి మండలంలో...
రాజవొమ్మంగి: ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి మండలంలో గురువారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అక్కడక్కడా వడగళ్లు కూడా పడ్డాయి. ఒకేమారు కారుమబ్బులు కమ్మి ఉరుములతో కూడిన జల్లులు పడ్డాయి. సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు రెండు గంటలపాటు ఎడతెరిపిలేకుండా గాలులతో వర్షం పడింది. భారీ గాలులకు మామిడి కాయలు రాలిపోగా, పక్వానికి రాకుండానే జీడిమామిడి గింజలు రాలిపోడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ తీగలపై చెట్లకొమ్మలు విరిగిపడడంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. మండలంలో ఉన్న మెత్తం 80 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శుక్రవారం నాటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించగలమని విద్యుత్ సిబ్బంది చెప్పడంతో మండల వాసులు రాత్రంతా చీకట్లోనే గడపాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం 44 డిగ్రీలు, గురువారం 40 డిగ్రీల ఉష్టోగ్రత నమోదు కావడంతో అప్పటి వరకు బెంబేలెత్తిన మన్యం వాసులు ఈ వర్షంతో సేదతీరారు. రాజవొమ్మంగి వీధుల్లో వర్షపునీరు ప్రవహించింది. జడ్డంగి, దూసరపాము, వట్టిగెడ్డ, శరభవరం, అమీనాబాద్, చికిలింత, అప్పలరాజుపేట తదితర గ్రామాల్లో వర్షం పడింది.

30న కందుకూరి రంగస్థల పురస్కారాలు

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 27: సాంస్క తిక రాజధాని, తొలి నాటకం రూపుదాల్చిన నేల, సంఘ సంస్కర్త కందుకూరి పురిటిగడ్డ రాజమహేంద్రవరం నాటక రంగ దినోత్సవానికి వేదిక కానుంది. ఆనం కళా కేంద్రంలో బహుమతి ప్రదానం వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నాటక రంగ దినోత్సవంగా ప్రకటించింది. ఈ మేరకు కందుకూరి జయంతి రోజు ప్రతీ ఏడాది నాటక రంగ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తారు. ఏప్రిల్ 16వ తేదీన కందుకూరి జయంతి. వాస్తవానికి ఆ రోజునే ఈ పురస్కారాల ప్రదానం నిర్వహించాల్సి వుంది. అయితే ఆరోజున రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో నిర్వహించడానికి వీలుపడకపోవడంతో ఈ నెల 30వ తేదీన పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆనం కళా కేంద్రంలో 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టివి, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలు భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా గురువారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నభూతో నభవిష్యత్ అన్నట్టుగా నాటక రంగ దినోత్సవాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా చెప్పారు. నగరంలో పెద్ద ఎత్తున స్వాగత ద్వారాలను ఏర్పాటుచేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. బందోబస్తు, విద్యుద్ధీపాలంకరణ, శానిటేషన్, దూర ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులకు ఆతిధ్యం తదితర అన్ని ఏర్పాట్లు భారీ స్థాయిలో చేపట్టాల్సిందిగా వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. మంగళకరమైన రీతిలో డోలు సన్నాయి, వేదపఠనం, పూర్ణకుంభ స్వాగతం పలికేందుకు దేవాదాయ శాఖ ద్వారా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి అవాంతరం రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రత్యామ్నాయంగా జనరేటర్‌ను కూడా సిద్ధం చేసుకోవాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. కళాకేంద్రానికి శాశ్వత ప్రాతిపదికన ఒక జనరేటర్‌ను సమకూర్చాల్సిందిగా ఎంపి మాగంటి మురళీమోహన్ జిల్లా కలెక్టర్‌ను కోరగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
నంది నాటకోత్సవాల పోటీలు ఈసారి విజయనగరం, గుంటూరు, కర్నూలులో నిర్వహించామని, వీటికి సంబంధించి బహుమతి ప్రదానం నాటక రంగ దినోత్సవం సందర్భంగా కందుకూరి రంగస్ధల పురస్కారాల వేదికపైనే చేస్తున్నామని ఎంపి మాగంటి మురళీమోహన్ చెప్పారు. కందుకూరి విశిష్ట, ప్రతిష్ఠాత్మక రంగ స్ధల పురస్కారాల ప్రదానోత్సవాన్ని, 2016 సంవత్సరానికి సంబంధించి 20వ నంది నాటక బహుమతుల ప్రదానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లతో అధికార యంత్రాంగం సన్నద్ధమయ్యారు. సమీక్షా సమావేశానికి రాజమహేంద్రవరం శాసన సభ్యుడు డాక్టర్ ఆకుల సత్యనారాయణ అధ్యక్షత వహించగా మేయర్ పంతం రజనీ శేషసాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు మాట్లాడారు. డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, అర్బన్ ఎస్పీ రాజకుమారి, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయ్‌క ష్ణన్, కమిషనర్ విజయరామరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, నాటక రంగ అభివృద్ధి సంస్థ అధికారి సాయి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

తారాస్థాయకి వైసిపి లుకలుకలు
ఆర్థిక ప్రయోజనాల ఆరోపణలతో నేతల మనస్తాపం:ప్రత్యేక కార్యాలయం ఏర్పాటుకు ఒక వర్గం సన్నాహాలు
రామచంద్రపురం, ఏప్రిల్ 27: రామచంద్రపురం పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు తీవ్రస్థాయికి చేరాయి. ఒకరంటే ఒకరికి పొసగని పరిస్థితి ఏర్పడటంతో చివరకు ప్రత్యేకంగా కార్యాలయం ప్రారంభించడానికి సైతం రంగం సిద్ధమవుతోంది. ఇందుకు సాక్షాత్తూ పార్టీ అధినేతే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం పట్టణంలో సాగుతోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వచ్చిన ఆర్థికపరమైన ఆరోపణలు, మున్సిపల్ వార్డు ఉప ఎన్నికల సందర్భంగా నిధుల వసూళ్ల ఆరోపణలు విభేదాలు తారాస్థాయికి చేరడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... ఇటీవల శాసనమండలి ఎన్నిక విషయంలో పార్టీ తరపున కొందరు భారీ ఆర్థిక ప్రయోజనం పొందారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈవ్యవహారంపై కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నేరుగా వైసిపి నేతలపై ఛలోక్తులు వేసేస్థాయికి పరిస్థితి చేరుకుంది. అలాగే మున్సిపల్ వార్డుల ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల ఖర్చులకు నిధులు సమీకరించారంటూ వచ్చిన ఆరోపణల అంశం కూడా పట్టణ పార్టీ విభాగంలో గత కొద్దిరోజులుగా వివాదాన్ని రేకెత్తించింది. అయితే ఈ ఆరోపణలపై నిగ్గు తేల్చాలంటూ పలువురు నేతలతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సైతం నియోజకవర్గంలోని పార్టీ కీలక నేతను కోరినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ వివాదంలోకి తనను లాగవద్దంటూ ఆయన తప్పించుకున్నట్టు సమాచారం. పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్ టిడిపి తీర్థం పుచ్చుకుంటారనే అంశంపై కూడా పట్టణంలో పసందైన ఛలోక్తులు సాగుతున్నాయి. దీనితో నియోజకవర్గానికి చెందిన కొందరు ఈ ఆరోపణల వ్యవహారాన్ని, పార్టీకి జరుగుతున్న నష్టాన్ని సాక్షాత్తూ పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. ఈసందర్భంగా ఆర్థికపరమైన అంశాలపై తాను ప్రత్యేకంగా విచారణ జరిపించుకుని నిజానిజాలు తెలుసుకుంటానని ఈసందర్భంగా జగన్ వారితో పేర్కొన్నట్టు సమాచారం. ఈసందర్భంగానే మరో కార్యాలయం ఏర్పాటు విషయమై హామీ పొందినట్టు సమాచారం. పార్టీ నేత సత్తి శంకర రెడ్డి నేతృత్వంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ అంశాలన్నింటిని జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లినట్టు కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. మొత్తంమీద ఈ వ్యవహారాలన్నీ రామచంద్రపురం పట్టణం, నియోజకవర్గ పరిధిలో వైసిపిలోని లుకలుకలు తీవ్రస్థాయికి చేరుకున్నాయనే విషయం స్పష్టమవుతోంది.

బాహుబలి పడిగాపులు!
అమలాపురంలో గురువారం రాత్రి బెనిఫిట్ షో రద్దు:ఉస్సురుమన్న అభిమానులు

అమలాపురం, ఏప్రిల్ 27: అమలాపురంలో బాహుబలి సినిమాకు టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ప్రభుత్వ అదేశాల మేరకు ఏవిధమైన బెనిఫిట్‌షోలు ప్రదర్శించకూడదన్న నిబంధనలను ఖాతరు చేయకుండా థియేటర్ల యాజమాన్యాలు గురువారం రాత్రి 9 గంటలకు షో వేస్తున్నట్టు ప్రకటించి ఒక్కో టిక్కెట్‌ను రూ.1000, 2000కు విక్రయించి సొమ్ము చేసుకున్నట్టు సమాచారం. టిక్కెట్లు కొనుగోలు చేసుకున్న అభిమానులు భారీ ఎత్తున సినిమా థియేటర్లకు చేరుకోవడంతో ఈ విషయాన్ని ఇతర అభిమాన సంఘాల వారు ఆర్డీవో, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆర్డీవో జి గణేష్‌కుమార్ రంగంలోకి దిగారు. నిబంధనలు ఉల్లఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తాత్కాలికంగా షోలు నిలిపివేశారు. కాగా తమ అభిమాన నటుడు సినిమా కోసం అధిక ధర వెచ్చించి టిక్కెట్లు పొందిన తమకు సినిమా చూసే అవకాశం కల్పించాలంటూ బాహుబలి అభిమానులు గురువారం రాత్రి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిబంధనల మేరుకు శుక్రవారం ఉదయం నుండే సినిమాను ప్రదర్శించాలని, నిబంధనలు ఉల్లఘిస్తే చర్యలు తీసుకుంటామని ఆర్డీవో గణేష్‌కుమార్ తెలిపారు. టిక్కెట్టు ధర రూ.200 మించి విక్రయించినట్టు ఫిర్యాదులు అందితే సంబంధిత థియేటర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే సినిమాను శుక్రవారం తెల్లవారుజామున ప్రదర్శించేందుకు యాజమాన్యాలు ప్రకటించడంతో అభిమానులు థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

ఎమ్మార్పీఎస్ నాయకుల అరెస్టు

అమలాపురం, ఏప్రిల్ 27: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌తో మాదిగ రిజర్వేషన్ పొరాట సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో అమలాపురం నుండి అమరావతికి చేపట్టిన పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు. సంఘర్షణ సమితి అధ్యక్షుడు తెనే్నటి కిషోర్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్రను గురువారం స్థానిక గడియారస్తంభం సెంటర్ నుండి ప్రారంభించారు. పాదయాత్ర పట్టణ పోలీసుస్టేషన్‌కు చేరగానే సిఐ వైఆర్‌కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ఏవిధమైన పాదయాత్రలు నిర్వహించరాదని సిఐ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు ఖాతరు చేయకుండా పాదయాత్రను కొనసాగించేందుకు ప్రయత్నించగా కిషోర్‌తో పాటు ఎస్ రమణ, జొన్నాడ నాగరాజు, నేదునూరి వెంకటరెడ్డి, మస్కూడి సతీష్, సవరపు రాజు, చుట్టుగుళ్ల చిన్నా, కాపా వీరభద్రం, సవరపు నరేష్, నేదునూరి జాన్‌రెడ్డి, చాట్ల సాయి, నేదునూరు ప్రశాంత్, సవరపు ప్రసాద్‌లతో పాటు పలువురిని అరెస్టు చేసి అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలచేశారు.

కలెక్టరేట్‌కు పచ్చని శోభ
కాకినాడ, ఏప్రిల్ 27: జిల్లా కలెక్టరేట్‌కు పచ్చని గ్రీన్ కార్పెట్‌తో పచ్చని శోభగులను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కార్తికేయ మిశ్రా కలెక్టర్ కార్యాలయంలో తిరిగి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలు, అర్జీలను ఇచ్చేందుకు సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారి కోసం ఆహ్లాద కరంగా ఉండేందుకు కలెక్టరేట్ దగ్గర గ్రీన్ కార్పెట్‌ను ఏర్పాటు చేయించారు. అలాగే కలెక్టరేట్ పరిసర ప్రాంతంలో చెత్త, చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేలా సమాయత్తం చేయిస్తున్నారు. కలెక్టరేట్‌లో పచ్చని మొక్కలను కూడా ఏర్పాటు చేయిస్తున్నారు. పచ్చదనానికి, పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వడంతో పలువురు ప్రశంసిస్తున్నారు.

ఎస్‌కెబిఆర్ కళాశాలకు అరుదైన గుర్తింపు
అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైన వ్యాసాలు

అమలాపురం, ఏప్రిల్ 27: నిరంతరం పరిశోధన చేయడం ద్వారా కొత్త అంశాల ఆవిష్కరణకు అవకాశం కలుగుతుందని ఎస్‌కెబిఆర్ కళాశాల ప్రిన్సిపాల్ వక్కలంక కృష్ణమోహన్ అన్నారు. గురువారం స్థానిక కళాశాల ఆవరణలో నిర్వహించిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో యుజిసి సహకారంతో కళాశాల ఆర్థిక, వాణిజ్య విభాగాలు సంయుక్తంగా డిమోనిటైజేషన్, డిజిటల్ ఎకానమీ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో అధ్యాపకులు సమర్పించిన పరిశోధనా వ్యాసాలు ఇంటర్నేషనల్ నేషనల్ జర్నల్ ఆఫ్ అకడమిక్ రీసెర్చిలో ప్రచురితమయ్యాయి. ఈ సందర్భంగా గురువారం స్థానిక కళాశాల ఆవరణలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వక్కలంక కృష్ణమోహన్ అధ్యక్షతన జర్నల్ ఆవిష్కరణ సభ జరిగింది. ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ ఐక్యూఎసి కో ఆర్డీనేటర్ ఆర్‌ఎస్‌ఎన్ రాజు, అధ్యాపక ప్రతినిధి పి కృష్ణకిషోర్, అకడమిక్ కన్వీనర్ డాక్టర్ అభినాష్‌బాబు, ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మోకా బాలస్వామి, సీనియర్ అధ్యాపకులు కె దయాసాగర్‌బాబులు ఆ జర్నల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలస్వామి, ఆర్‌ఎస్‌ఎన్ రాజులతో పాటు వ్యాసాలు సమర్పించిన అధ్యాపకులను పాలకవర్గ సభ్యులు నడింపల్లి సుబ్బరాజు, కరస్పాండెంట్ జెవిజిఆర్ బానో, ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ తదితరులు అభినందించారు.

రుణాల మంజూరు మరింత ముమ్మరం కావాలి
సంక్షేమ కార్పొరేషన్ల యూనిట్లపై బ్యాంకర్లను కోరిన కలెక్టర్ కార్తికేయమిశ్రా
కాకినాడ సిటీ, ఏప్రిల్ 27: సంక్షేమ కార్పొరేషన్ల యూనిట్లకు రుణాల మంజూరు, గ్రౌండింగ్ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా బ్యాంకర్లను కోరారు. కలెక్టరేట్ కోర్టు హాలులో గురువారం సంక్షేమ కార్పొరేషన్ల ఇడిలు, వివిధ బ్యాంకుల అధికారులతో కలెక్టర్ మిశ్రా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎస్సీ, బిసి, కాపు, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు రుణాల మంజూరు పురోగతిని సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సంక్షేమ కార్పొరేషన్ల పథకాల కింద లబ్ధిదారులకు రుణాల మంజూరు ప్రగతి ఆశించిన స్థాయిలో లేదన్నారు. ముఖ్యంగా జిల్లా లీడ్ బ్యాంకుగా వ్యవహరిస్తూ పబ్లిక్, ప్రైవేటు బ్యాంకులకు స్ఫూర్తిగా నిలవాల్సిన ఆంధ్రాబ్యాంక్ రుణాల కల్పనలో నిర్లిప్త ధోరణి పాటించడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అమలుచేస్తున్న కార్యక్రమాల రుణాల కల్పనలో బ్యాంకులు సామాజిక బాధ్యతా దృక్పథంతో వ్యవహరించాలని ఆయన కోరారు. వివిధ బ్యాంకులకు కార్పొరేషన్ల వారీగా కేటాయించిన లక్ష్యాల మేరకు వచ్చే మే 10వ తేదీ నాటికి రుణాల మంజూరు, లబ్ధిదారులకు సేవింగ్స్, లోన్ అకౌంట్ల ప్రారంభం పూర్తిచేయాలని స్పష్టంచేశారు. యాభై యూనిట్ల లక్ష్యంగా కేటాయించిన బ్యాంకులు ఈప్రక్రియను మే 5వ తేదీలోపు పూర్తిచేయాలని కలెక్టర్ మిశ్రా కోరారు. బ్యాంకులు, వాటి శాఖలవారీగా కేటాయించిన లక్ష్యాల సమాచారం ఒబిఎంఎంఎస్ వెబ్‌సైట్‌లో పొందుపరచినట్టు తెలియజేశారు. బ్యాంకులు రుణాల మంజూరులో సాధించిన ప్రగతిని ప్రతీరోజు సమీక్షించనున్నట్టు చెప్పారు. రుణాల రికవరీలో ఎదురవుతున్న సమస్యలను పలువురు బ్యాంకర్లు ప్రస్తావించగా, రుణాల వసూళ్లలో బ్యాంకులకు జిల్లా యంత్రాంగం అవరమైన సహాయ సహకారాలు అందిస్తుందని, లక్ష్యాల మేరకు రుణాలను బ్యాంకులు బలహిన వర్గాల ప్రజలకు అందజేయాలని కలెక్టర్ మిశ్రా కోరారు. సమావేశంలో జెసి-2 జె రాధాకృష్ణమూర్తి, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు, సబ్ కలెక్టర్ విజయకృష్ణన్, ఐటిడిఎ పిఒ దినేష్‌కుమార్, ఎల్‌డియం సుబ్రహ్మణ్యం, బిసి, ఎస్సీ కార్పొరేషన్ల ఇడిలు ఎం జ్యోతి, అనురాధ, మైనార్టీ కార్పొరేషన్ ఇడి శర్మ, వివిధ బ్యాంకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమం టిడిపితోనే సాధ్యం
ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
సామర్లకోట, ఏప్రిల్ 27: కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యం కాగలవని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక అన్నపూర్ణ ఫంక్షన్ హాలులో పట్టణ, మండల పరిధిలో తెలుగుదేశం పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీల నియామకం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన మంత్రి రాజప్ప మాట్లాడుతూ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా ప్రచారం చేపట్టాలన్నారు. పలు అంశాలపై చర్చించారు. సామర్లకోట పట్టణ టిడిపి అధ్యక్షునిగా తిరిగి అడబాల కుమారస్వామి, కార్యదర్శిగా బడుగు శ్రీకాంత్ ఎన్నికయ్యారు. సామర్లకోట మండల టిడిపి అధ్యక్షునిగా పిబిదేవం సొసైటీ అధ్యక్షుడు తోటకూర శ్రీనువాసు ఎంపికయ్యారు. పూర్తిస్థాయిలో కమిటీల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సమావేశంలో పట్టణ టిడిపి అధ్యక్ష కార్యదర్శులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, టిడిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్ (చిన్ని), మండల వైస్ ఎంపిపి ఆకునూరి సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షుడు తోటకూర శ్రీనువాసు, ఎఎంసి వైస్ చైర్మన్ అడబాల చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు స్థానికంగా కాపు నవ యువత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేసవి చలివేంద్రాన్ని మంత్రి రాజప్ప ప్రారంభించారు.