తూర్పుగోదావరి

ఈదురు గాలులు..్భరీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, ఏప్రిల్ 29: ఒకవైపు మండుటెండలు మంట పుట్టిస్తుండగా శనివారం సాయత్రం ఒక్కసారిగా సామర్లకోట పట్టణంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురియడంతో ప్రజలు కొంతసేపు వేసవి ఎండల తాపం నుండి ఉపశమనం పొందారు. కాగా భారీ ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. అలాగే సాయంత్రం 4 గంటల నుండి పట్టణంలో ఈదురు గాలులు వల్ల విద్యుత్తు సరఫరా నిలుపుదల చేశారు. రాత్రి 8.30 గంటలకు కూడా విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించలేదు. విద్యుత్తులైన్లపై కూడా చెట్ల కొమ్మలు విరిగి పడడంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎడిబి రోడ్డులో చెట్లువిరిగి 11కెవి విద్యుత్తు లైన్లపై పడ్డాయి. రెండు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినగా, నాలుగుకు పైగా విద్యుత్తు స్తంభాలు పడిపోయాయి. ఈదురు గాలుల వల్ల ఎల్‌టి లైన్‌లు బాగా దెబ్బతినడంతో వ్యవసాయ రైతుల పీడర్లు బాగుచేయడానికి సుమారు రెండు రోజులు పట్టే అవకాశం ఉందని ట్రాన్స్‌కో వర్గాల ద్వారా తెల్సింది. సుమారు రూ.2.5 లక్షలు వరకూ ట్రాన్స్‌కోకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో ఈదురుగాలుల కారణంగా మామిడి తోటలకు తీవ్ర నష్టం ఏర్పడిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు దాళ్వా వరికోతలు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో పంట పాడవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. హఠాత్తుగా వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.
యు కొత్తపలి: మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. శనివారం మధ్యాహ్నం 3.30నుండి 6.30 గంటల వరకూ మూడు గంటల పాటు ఉధృతంగా వర్షం కురియడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో కొత్తపల్లి, యండపల్లి, నాగులాపల్లి, ఇసుకపల్లి గ్రామాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పనలు తడిసి ముద్దవ్వడంతో రైతులు రోడ్డుపైకి తీసుకువచ్చి బరకాలతో కప్పి వర్షపునీటికి తడవకుండా కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈదురు గాలులు కారణంగా మామిడి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. మండలంలో సుమారు 300 ఎకరాల మామిడి తోటకు నష్టం వాటిల్లగా, 2,500 ఎకరాలకు పైగా వరి పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖాధికారులు చెప్పారు. అలాగే ఉప్పాడ తీరంలో సముద్ర కెరటాలు ఎగసి పడ్డాయి. అలల స్థాయి తీవ్రంగా పెరగడంతో మత్స్యకారులు బోట్లు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరికొన్ని బోట్లు కెరటాల తాకిడికి రక్షణ గోడపైకి ఎగిరిపడ్డాయి. దీంతో బోట్లకు నష్టం వాటిల్లింది. అలల తీవ్రతతో బీచ్ రోడ్డుకు రక్షణగా నిర్మించిన రక్షణ గోడ రాళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో ఉప్పాడ నుండి కాకినాడ వెళ్లే రహదారి ఛిద్రమైంది.
అడ్డతీగల: వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజానీకానికి అకాల వర్షం ఊరటనిచ్చినా గాలి, వడగళ్లు అస్తవ్యస్తం చేశాయి. మండలంలో శనివారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వీచిన గాలి ఉధృతికి పలు చెట్లు నేలకొరిగాయి. విద్యుత్తు వైర్లు, కేబుల్, టెలిఫోన్ వైర్లు తెగిపడ్డాయి. గాలితోపాటు వచ్చిన వడగళ్లు ధాటికి కోసేందుకు సిద్ధంగా ఉన్న మామిడి కాయలు, పనసకాయలు నేలరాలాయి. మామిడి పండ్లు సీజన్‌కు ఈ అకాల వర్షం తీవ్ర నష్టం కలిగించిందని రైతులు, వ్యాపారులు వాపోతున్నారు. మామిడి కాయలు కొన్ని నేలరాలిపోయినా చెట్టుకు ఉన్న కాయలు కూడా ఈ వడగళ్ల ప్రభావానికి పాడైపోతాయని రైతులు అంటున్నారు. మండలంలో ఈ అకాల గాలివానతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం నెలకొంది. ఇరవైనాలుగు గంటల్లో విద్యుత్తు పునరుద్ధరణ చేయగలమా లేదా అన్నది అయోమయంగా వుందని విద్యుత్తు శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. రహదారుల వెంబడి చెట్లు, చెట్లు కొమ్మలు విరిగిపడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అసౌకర్యం నెలకొంది. వర్ష ప్రభావంతో జనజీవనం స్తంభించింది. రెండున్నర గంటలసేపు ఏకథాటిగా వడగళ్లతో కూడిన గాలివాన ప్రభావంతో మండలంలో విద్యుత్తు సరఫరా, వాహనాల రాకపోకలు నిలిచిపోయి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే ఎండ వేడితో అల్లాడుతున్న ప్రజానీకానికి మాత్రం వాతావరణం చల్లబడడం ఊరటనిచ్చింది.