తూర్పుగోదావరి

పట్టిసీమ చర్చకు బ్రేకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 18: పట్టిసీమ చర్చకు అనూహ్యంగా బ్రేక్ పడింది.. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో కాగ్ తప్పు పట్టిన అంశాలపై ప్రభుత్వంపై విమర్శలు కురిపించిన నేపథ్యంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. దీనిపై చర్చలకు సై అంటే సై అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ రోజు కృష్ణా బ్యారేజి వద్ద రైతుల సమక్షంలోనే చర్చలకు సిద్ధమని పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో చర్చపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో ఈ చర్చలకు పోలీసు శాఖ నుంచి అనుమతి లేకపోవడంతో బ్రేక్ పడినట్టు సమాచారం. అయితే మంగళవారం ఉదయం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన ఇంటి నుంచి పెద్ద ఎత్తున అనుయాయులతో బయలుదేరి వెళ్ళారు. దాదాపు 50 కార్లతో రైతులు, రైతు నాయకులు, కార్పొరేటర్లు తదితరులంతా పెద్ద ఎత్తున విజయవాడకు తరలివెళ్ళారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు రైతుల నుంచే దీటైన సమాధానం చెప్పించి ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఈ చర్చలకు ఉపక్రమించినట్టు గోరంట్ల మొదటి నుంచీ చెబుతున్నారు. ఉండవల్లి చేస్తున్న ఆరోపణలకు దీటైన సమాధానం చెప్పే బాధ్యతను గోరంట్ల తన భుజంపై వేసుకున్నారు.
ఈ చర్చలకు సంబంధించి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ సోమవారం మధ్యాహ్నమే విజయవాడ చేరుకున్నట్టు సమాచారం. అయితే చర్చలకు అనుమతి లేని కారణంగా ఆయనను పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకుని, ఉయ్యూరు పోలీసు స్టేషన్‌కు తరలించినట్టు తెలిసింది. రాజమహేంద్రవరం నుంచి దాదాపు 50 కార్లతో బయలుదేరిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని గన్నవరం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
గోరంట్ల కృష్ణా బ్యారేజి వద్ద చర్చల నిమిత్తం అనుమతి ఇవ్వాల్సిందిగా ముందుగానే విజయవాడ నగర కమిషనర్‌ను అనుమతి కోరినప్పటికీ అనుమతికి నిరాకరించినట్టు వార్తలు వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలకు సిద్ధమైన నేపథ్యంలో ఇరువర్గాలు బయలుదేరి అక్కడకు చేరుకునేలోపే అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్ 30, 144 అమల్లో వున్న నేపథ్యంలో చర్చలకు అనుమతి ఇవ్వలేదని తెలిసింది. దీనికి తోడు పెద్ద ఎత్తున రైతులు తరలి వెళ్ళేందుకు అధికార పక్షం నేతలు ప్రయత్నాలు చేశారు.

మరో రెండు రోజులు భారీ వర్షాలు

కాకినాడ, జూలై 18: భారీ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగుతాయని, జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. గోదావరి నిలకడగా ఉందని, జిల్లా యంత్రాంగం భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్టు తెలిపారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ విలేఖరులతో మాట్లాడారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్న కారణంగా ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ఏజన్సీలోని మారుమూల ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన నిత్యావసర సరుకులను సిద్ధం చేసినట్టు చెప్పారు. గోదావరిలో ప్రస్తుతం 1,87,161 క్యూసెక్కుల ప్రవాహం ఉందని, భద్రాచలం వద్ద 16.80 అడుగులు, పోలవరం వద్ద 6.62 మీటర్లు, ధవళేశ్వరం వద్ద 9.3 అడుగుల గోదావరి నీటి మట్టం నమోదయ్యిందని తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వెస్ట్రన్ కాలువకు 2 వేల క్యూసెక్కుల నీరు, సెంట్రల్ కాలువకు 1200 క్యూసెక్కులు, ఈస్ట్రన్ కాలువకు 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. గోదావరి నీటి ప్రవాహం కారణంగా ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేదని, గోదావరి వరదల కారణంగా ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లాలోని యు కొత్తపల్లి మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన మత్స్యకారుల బోటు గల్లంతుపై కలెక్టర్ మాట్లాడుతూ వేటకు వెళ్ళిన 3 బోట్లలో రెండు విశాఖ తీరానికి చేరుకున్నాయని, మరో బోటు ఆచూకీ కోసం కోస్ట్‌గార్డు అధికారులను సంప్రదించామని పేర్కొన్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ రాత్రికి తెలిసే అవకాశం ఉన్నట్టు కలెక్టర్ చెప్పారు.
విలీన మండలాల్లో వరద భయం
చింతూరు, జూలై 18: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శబరినది నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ఉప్పొంగి ప్రవహిస్తోంది. అలాగే గోదావరి సైతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో విలీన మండలాలైన చింతూరు, ఎటపాక, కూనవరం, విఆర్ పురంలో లోట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశాలున్న నేపథ్యంలో ఏ సమయంలో ఎటువంటి ఉపద్రవం సంభవిస్తుందోనని లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శబరీ నదికి అనుసంధానమైన సోకులేరు, చంద్రవంక, జల్లివారిగూడెం వాగులు పరవళ్లు తొక్కుతూ రోడ్డెక్కి ప్రవహిస్తున్నాయి. సోకులేరు వాగు, జల్లివారిగూడెం వాగులు ప్రవహించడంతో చింతూరు, విఆర్ పురానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరదలను ఎదుర్కొనేందుకు విలీన మండలాల్లో అధికారులు లాంచీలు సిద్ధం చేశారు. చింతూరులోని శబరినది బ్రిడ్జి వద్ద రెండు లాంచీలను మంగళవారం ఉంచారు. ఐటిడిఎ పిఒ చినబాబు ఎప్పటికప్పుడు గోదావరి, శబరి నీటి ఉద్ధృతిని తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. మంగళవారం చూటూరు వద్ద రోడ్డెక్కి ప్రవహిస్తున్న సోకులేరు వాగును పిఒ చినబాబు సందర్శించారు. వరదలను ఎదుర్కొనేందుకు ముందుగానే లోతట్టు ప్రాంత ప్రజలకు మూడు నెలలకు సరిపడా రేషన్‌ను ఆయా ప్రాంతాలకు తరలించారు.
కూనవరం వద్ద 7.9 మీటర్లు...
కూనవరం: గోదావరి, శబరి నదుల్లో వరద నీరు పోటెత్తడంతో మంగళవారం కూనవరం వద్ద 7.9 మీటర్ల వద్ద గోదావరి నది ప్రవహిస్తోంది. గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి శబరి, గోదావరి నదుల ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవటంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరి స్వల్పంగా పెరుగుతోంది. కూనవరం కొండ్రాజుపేట కాజ్‌వే పైకి వర్షపునీరు పోటెత్తడంతో కొద్దిసేపు రాకపోకలు నిలిచి పోయాయి. చింతూరు ఐటిడిఎ పిఒ చినబాబు శబరి నది వద్దకు చేరుకొని వరద ఉద్ధృతిని పరిశీలించి, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
మద్దిగెడ్డ జలాశయానికి జలకళ
అడ్డతీగల: ఇటీవల కురుస్తున్న వర్షాలకు అడ్డతీగలలోని మద్దిగెడ్డ జలాశయం జలకళ సంతరించుకుంది. 188 మీటర్ల సామర్ధ్యం కలిగిన ఈ జలాశయంలో మంగళవారం నాటికి 185.3 మీటర్ల మేర నీరు చేరింది. రాత్రికి 186 మీటర్లకు చేరుకోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. కొండవాగుల నుండి వచ్చి చేరే నీరు ఆధారంగా నిర్మితమైన ఈ మద్దిగెడ్డ జలాశయంలోకి రెండురోజులుగా ఏకబిగిన కురుస్తున్న వర్షానికి వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. 187.5 మీటర్లకు నీరు చేరుకుంటే ఇన్‌ఫ్లో ప్రవాహాన్ని బట్టి గేట్లను దఫదఫాలుగా ఎత్తి నీటిని విడుదల చేయాలని అధికార్లు ఆలోచన చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దారు శ్రీపల్లవి మద్దిగెడ్డ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలోని ప్రజలను అప్రమత్తం చేశారు. మద్దిగెడ్డ జలాశయానికి అనుసంధానంగా ఉన్న కాలువల వెంబడి ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. జలాశయంలో నీటిమట్టం పెరుగుతున్నందున ఏక్షణాన్నైనా నీటిని దిగువకు వదిలే అవకాశమున్నందున ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని, ముఖ్యంగా మద్దిగెడ్డ జలాశయంకు అనుసంధానంగా వున్న కాలువల వెంబడి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.
కౌనె్సలింగ్ కాపులకు కాదు... కబ్జాదారులకు చేయండి
కాపు ఉద్యమ నేత ముద్రగడ
ప్రత్తిపాడు, జూలై 18: కాపులను బిసిల్లో చేర్చాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలుచేయమని కోరుతున్న కాపులకు పోలీసులు కౌనె్సలింగ్ చేస్తున్నారని, ఆ కౌనె్సలింగ్ తమకు కాకుండా కబ్జాదారులకు చేయిస్తే బాగుంటుందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. ఇసుక, మట్టి, గ్రావెల్, లాటరైట్ దోచుకున్న దోపిడీదారులను, భూ కబ్జాదారులను కౌనె్సలింగ్ చేయాలని హితవు పలికారు. ఈమేరకు ఆయన కాపు సోదర, సోదరీమణులకు మంగళవారం ఓ లేఖ రాశారు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్నది ప్రజా ప్రభుత్వం కాదా? ప్రజాస్వామంలో మనం ఉన్నామా? విదేశీయుల పాలనలో ఉన్నామా అని ప్రశ్నించారు. ఈ నెల 26వ తేదీ నుండి నిరవధిక పాదయాత్రకు తరలిరావాలని, కదలి రా! కదలి రా! కిర్లంపూడి రా... భావితరాల భవిష్యత్తుకై... అంటూ ఆయన కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులస్తులను ఉద్దేశించి ఒక లేఖను విడుదల చేశారు. కాపులను బిసిల్లో చేర్చాలనే డిమాండ్‌పై తలపెట్టిన పాదయాత్రకు వెళ్లవద్దని, వెళితే పోలీసులతో ఉక్కుపాదం మోపుతామని, కేసులు పెట్టి బాధిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వత్తిడి చేసి సంతకాలు చేయిస్తున్నారని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు కోసం రోడ్డెక్కితే ఇంతగా బాధిస్తున్నారే! హామీలు ఇవ్వనివి, మరేదైనా ప్రజాసమస్యలపై రోడ్డెక్కితే మనుషులను చంపివేయమని కూడా ఆదేశాలు ఇస్తారేమోనని వ్యంగ్యంగా ఆయన విమర్శించారు. యువరాజావారికి పట్ట్భాషేకం చేసి రాష్ట్రాన్ని కట్టబెట్టాలనే తపన ముఖ్యమంత్రికి ఉండవచ్చునని, అధికారులకు మంచి స్థానంలో బదిలీలు, ప్రమోషన్‌ను, వారి పిల్లలకు ఉన్నత చదువులు కావాలని ఆశలు ఉండవచ్చు కానీ మన ఆకలి తీరుస్తానని ఇచ్చిన హామీని అమలు పొందాలనే కోరిక కాపులకు ఉండకూడదా.. అంటూ కాపు సోదర సోదరీమణులను ఉద్దేశించి రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. ఇది ఆఖరి పోరాటం అని పోలీసు వారు కాదు కదా! ఎవరు ఎన్నిసార్లు పిలిచినా పాదయాత్రకు వెళతామన్నారు. కాకుంటే జైలుకు పంపుకోమని, జైలు నుండి వచ్చిన తరువాతనైనా పాదయాత్ర మధ్యలో పాల్గొంటామని ధైర్యంగా చెప్పాలని ఆయన కోరుతూ లేఖను ముగించారు.

కూలీల వేతనాలు పెరిగేలా పనులు జరగాలి

కాకినాడ, జూలై 18: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీల నెలసరి వేతనాలు పెరిగే విధంగా పనులు జరగాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులకు సూచించారు. ఈ పథకం కింద ఏజన్సీలో పంట కుంతలకు అధిక ప్రాధాత్య ఇవ్వాలన్నారు. కాకినాడ కలెక్టరేట్ నుండి మంగళవారం డివిజన్, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కూలీల వేతనం కొన్ని మండలాల్లో తక్కువగా ఉందన్నారు. ప్రతి మండలంలో సరాసరి వేతనం 150 రూపాయలుండేలా పనులు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని ఉపాధి హామీ పనులను డివిజన్ల వారీ ప్రతి సోమవారం సంబంధిత ఆర్డీవోలు సమీక్షించాలని స్పష్టం చేశారు. ఈ పనుల్లో భాగంగా రంపచోడవరం ఐటిడిఎ పరిధిలో నాలుగు వేల పంట కుంటలు, చింతూరు ఐటిడిఎ పరిధిలో 1500 పంట కుంతలను చేపట్టాలని సూచించారు. ఈమేరకు రైతులను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో జరుగుతున్న సిసి రోడ్ల నిర్మాణానికి స్థానికంగా అందుబాటులో ఉన్న ఇసుకను వినియోగించాలన్నారు. జిల్లాలో 120 అంగన్వాడీ కేంద్ర భవనాలను నిర్మించాల్సి ఉందని, స్థలాలు అందుబాటులో ఉన్నచోట వెంటనే నిర్మాణాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు బాగా కురుస్తున్నందున ఎవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలు విరివిగా నాటాలని సూచించారు. వనం-మనం కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 14 లక్షల మొక్కలు నాటామని చెప్పారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కౌలు రైతులకు ఎల్‌ఇసి కార్డుల పంపిణీని వేగవంతం చేయాలని, ఇ-క్రాప్ బుకింగ్ ప్రక్రియను అన్ని మండలాల్లో చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని తహశీల్దారు కార్యాలయాలను ఆర్డీవోలు తనిఖీ చేసి రికార్డుల నిర్వహణ తీరును మెరుగుపరచాలన్నారు. తనిఖీలను ఆగస్టు 10వ తేదీలోగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఐటిడిఎ అధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసి, వాటి పని తీరు మెరుగుపరుచుకునేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జెసి ఎ మల్లికార్జున, జెసి-2 జె రాధాకృష్ణమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అయ్యో గోమాతలు!
-పట్టుకున్నా పట్టించుకోని పోలీసు, అటవీ శాఖ అధికార్లు
శంఖవరం, జూలై 18: అధికారుల పర్యవేక్షణ లోపంతో కబేళాకు గోవులు తరలిపోవడాన్ని ఎవరూ అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇటీవల అధికారులు జాతీయ రహదారిపై నిఘా ఉంచడంతో గోవులను తరలిస్తున్న వ్యానులను అక్రమ మార్గంలో శంఖవరం మీదుగా తరలిస్తున్నారు. దీనితో స్థానిక యువకులు బొర్రా శ్రీనివాసు, సామాజిక కార్యకర్త మేకల కృష్ణ తదితరులు శంఖవరం శివారులో సుమారు 60 గోవులను వ్యానులో తరలిస్తుండగా వ్యానును అడ్డగించి నిలుపుచేశారు. దీనిపై తొలుతగా అన్నవరం పోలీసులకు సమాచారమందించగా అది తమ పరిధి నుండి అటవీశాఖ పరిధిలోకి వెళ్ళిందని, వారిని సంప్రదించాలని సూచించారు. దీనితో యువకులు అటవీశాఖాధికారులకు సమాచారమందిస్తే వన్యప్రాణులను పట్టుకుంటే తాము స్వాధీనం చేసుకుంటాముగాని, గోవులైతే రెవెన్యూ అధికారులు పట్టుకుని అప్పగిస్తే తాము తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనితో ఇక చేసేదేమి లేక యువకులు వ్యాన్ యాజమాన్యానికి, సిబ్బందికి ఇటువంటి పనులు చేయవద్దని హెచ్చరించి వదిలేశారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ గోవులను దేవతామూర్తిగా ఆరాధించడంతో గోమాత ప్రాచుర్యం పెరిగిందని, రైతన్నలు చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ సాగు విధానంలో గోవు ఎంతగానో దోహదపడుతోందన్నారు. ఏదేమైనా అధికారులు వ్యవహరించిన తీరు, నిర్లక్ష్యం వాటిని కబేళాకు తరలించింది.
అనపర్తిలో దొంగల స్వైర విహారం
అనపర్తి, జూలై 18: స్థానిక జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచిలో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి విఫలయత్నంచేశారు. ఎస్సై రజనీకుమార్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు తలుపులు పగులకొట్టి బ్యాంకు లోపలికి ప్రవేశించారు. లాకర్‌ను తెరిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దొంగతనానికి యత్నించిన వ్యక్తులు తమను గుర్తించకుండా ఉండేందుకు బ్యాంకులో ఉన్న సిసి కెమెరాల, పుటేజీలను తొలగించి ఎత్తుకెళ్లారు. అలాగే బ్యాంకు సమీపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరా ఫీడ్ ఏజన్సీస్ కార్యాలయం తలుపుల తాళాలు తొలగించి లోనికి ప్రవేశించారు. బీరువాలో భద్రపరిచిన సుమారు రూ. 30 వేలు నగదును దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే బ్యాంకు పరిసరాల్లో ఉన్న ఒక న్యాయవాది కార్యాలయంలోకి కూడా దొంగలు ప్రవేశించి ఫైళ్లన్నీ చిందర వందర చేసి పరారయ్యారని తెలిపారు. బ్యాంక్ మేనేజర్ జి. తిరుమల ఆదినారాయణ, ఫీడ్స్ ఏజన్సీస్ యజమాని చిర్ల నారాయణరెడ్డిల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశామన్నారు. కాకినాడ నుంచి వచ్చిన క్లూస్ టీమ్ వేలి ముద్రలు సేకరించిందని ఎస్సై రజనీకుమార్ వివరించారు.
వెంకయ్య ఎంపికపై హర్షాతిరేకాలు
రామచంద్రపురం, జూలై 18: ఉప రాష్టప్రతి అభ్యర్థిగా ముప్పవరపు వెంకయ్య నాయుడు ఎంపికపై జిల్లా అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయ. వెంకయ్యకు జిల్లాలో ప్రత్యేకించి రామచంద్రపురం నియోజకవర్గంతో పూర్తిస్థాయిలో అనుబంధం ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడుగా, కేంద్ర మంత్రిగా కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామానికి సుమారు ఆరుసార్లు రావడమే కాకుండా, భారతీయ విజ్ఞాన భవన్‌కు చెందిన పాఠశాల భవనాలను ప్రారంభించారు. అంతేకాకుండా కోటిపల్లి గ్రామ సర్పంచ్‌గా మత్స్యకార నాయకులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కర్రి చిట్టిబాబు నిర్వహించిన పలు పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కోటిపల్లిలో మంచినీటి చెరువు అభివృద్ధికి 5 లక్షల రూపాయలు నిధులు సమకూర్చి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రక్షిత మంచినీటి అవసరాన్ని ఆనాడే చెప్పారని, ఉపరాష్టప్రతి పదవికి వనె్న తెచ్చే వ్యక్తిగా, ఆంధ్రుడుగా చరిత్రలో ముప్పవరపు వెంకయ్య నాయుడు నిలుస్తారని కర్రి చిట్టిబాబు చెప్పారు. రామచంద్రపురం పట్టణంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త కొప్పాక సత్యనారాయణతో గల అనుబంధాన్ని పురస్కరించుకుని, రాజమండ్రి (రాజమహేంద్రవరం) పార్లమెంటు బిజెపి అభ్యర్థి కంటిపూడి సర్వారాయుడు ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చినప్పుడు, వారింట్లోనే బస చేయడం, ప్రముఖులను కలిశారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు శాసనసభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నేపథ్యంలో వెంకయ్య నాయుడు చేసిన ప్రాసలతో కూడిన ప్రచార ప్రసంగాన్ని ప్రజలు గుర్తుకుచేసుకుంటున్నారు. వెంకయ్య నాయుడు ఉఫ రాష్టప్రతి పదవిని కైవసం చేసుకోవడం తధ్యమని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. వెంకయ్యను ఎంపిక చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ శ్రేణులు వెంకయ్యను ఉప రాష్టప్రతి పదవికి ఎంపిక చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయ.
మాయదారి వర్షాలు
రాజవొమ్మంగి, జూలై 18: ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు ఏజెన్సీలో పలు రహదార్లు దెబ్బతిన్నాయి. గ్రావెల్ రహదారులు నరకానికి నకళ్లుగా తయారయ్యాయి. పెద్దపెద్ద గోతులు, రాళ్లు తేలి బాడీ బందతో కనీసం రహదారులపై ప్రయాణించాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి లబ్బర్తి పోయే 5 కి.మీ బిటి రహదారి పెద్ద పెద్ద గోతులు పడి మట్టిరోడ్డుగా తయారైంది. ఈ రహదారిపై జిగురుమట్టి పేరుకుపోవడంతో వాహన చోదకులు పడిపోయి గాయపడుతున్నారు. స్థానిక శాంతినగర్ మీదుగా వయ్యేడు, వణకరాయి - కరుదేవుపాలెం రహదారులు చాలా అధ్వాన్నంగా తయారయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకురాడానికి కనీసం 108 కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రహదారులు నిర్మించమని అనేక ఏళ్లుగా గిరిజనులు కోరుతున్నా పట్టించుకొనే నాధుడే లేడు. ఈ రహదారులు కనీసం మరమ్మతులకు కూడా నోచుకోకపోవడంతో గత నెల రోజులుగా పడుతున్న వర్షాలకు ధ్వంసం అయిపోతున్నాయని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

‘తొర్రిగెడ్డ’ నుండి నీరు విడుదల
సీతానగరం, జూలై 18: మండలంలోని పురుషోత్తపట్నంలోని గోదావరి నది వద్ద నిర్మించిన తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకం మోటార్లను మంగళవారం రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ స్విచాన్ చేసి కాలువలకు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 1200 ఎకరాల పంట భూములకు సాగునీరు అందుతుందని, ప్రతి ఎడాది జూన్ నెలలోనే పంటలకు నీరు అందించే వారమని, ఈ ఏడాది కాలువలకు రివిట్‌మెంటు పనులు చేపట్టడంతో ఆలస్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో తొర్రిగడ్డ చైర్మన్ కాండ్రు శ్రీను, ఎంపిపి చిట్టూరి శారద, జడ్పీటీసీ కాండ్రు త్రివేణి శ్రీనివాస్, మాజీ ఎంపిపి పెందుర్తి దేవదాస్, గద్దె నళిని, గద్దె సురేష్, గెడ్డం తిమ్మారావు, గెడ్డం కోటేశ్వరరావు, ఎస్సై ఎ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
లక్షలు పలికిన ఫ్యాన్సీ నెంబర్లు
శంఖవరం, జూలై 18: మండలంలోని కత్తిపూడిలో గల ఉప రవాణాశాఖ కార్యాలయానికి మంగళవారం నిర్వహించిన నెంబర్ల వేలంలో రూ.3.24 లక్షల ఆదాయం అదనంగా సమకూరినట్టు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇటీవల కాలంలో వాహనచోదకులకు సంఖ్యాశాస్త్రంపై మక్కువ పెరగడం ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చింది. స్థానిక ఆర్టీఎ కార్యాలయంలో మంగళవారం 2345 నెంబర్‌కు ప్రభుత్వ ధర రూ.10వేలుగా నిర్ణయించగా, ఐదుగురు వ్యక్తులు పోటీపడ్డారు. రహస్య టెండర్‌లో కాకినాడకు చెందిన సిహెచ్ సుబ్రహ్మణ్యేశ్వరరావు 1.95 లక్షలకు దక్కించుకున్నారు. 2349 నెంబర్‌కు నలుగురు వ్యక్తులు పోటీపడగా, పిఇ చిన్నాయపాలెంకు చెందిన బర్ల కృష్ణగంగరాజు రూ. 1.08 లక్షలకు, 2347 నెంబర్‌ను రూ.21 వేలకు ఒక వ్యక్తి దక్కించుకున్నారు.