తూర్పుగోదావరి

పర్యాటక సంబరాలకు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 19: గోదావరి డాన్స్ అండ్ మ్యూజికల్ షో పేరిట రాజమహేంద్రవరంలో పర్యాటక ప్రాచుర్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులపాటు సంబరాలను నిర్వహించనుంది. ఈ నెల 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గత పుష్కరాలకు దేశంలోనే అతిపెద్ద స్నాన ఘట్టంగా రూపుదాల్చిన ప్రసిద్ధ కోటిలింగాల ఘాట్ వద్ద ఈ రెండు రోజుల ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రాథమికంగా పరిశీలనకు వచ్చినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల పర్యాటక విశేషాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం రెండేసి రోజులపాటు రాష్ట్రంలో ఐదు రీజియన్లుగా విభజించి ఇటువంటి కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించనుంది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం రీజియన్‌లో భాగంగా రెండు రోజులపాటు గోదావరి డాన్స్ అండ్ మ్యూజికల్ షోను పెద్దఎత్తున నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంత పర్యాటక విశేషాలతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా విధంగా కార్యక్రమాలను రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రీజియన్‌ను ఒక్కో ఈవెంట్ సంస్థకు అప్పగించింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం రీజియన్‌ను విజ్‌క్రాఫ్ట్ అనే సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ రెండు రోజులపాటు రాజమహేంద్రవరం వేదికగా సంబరాలను నిర్వహిస్తుంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు శివమణి ఈ రెండు రోజుల కార్యక్రమాల్లో సంగీత ప్రతిభా పాటవాలతో అలరించనున్నారు. రాజమహేంద్రవరంలో ఇకపై ప్రతీ ఏడాది రెండు రోజులపాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. భారీస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా జరిగే ఈ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్, మున్సిపల్ స్టేడియం, సుబ్రహ్మణ్య మైదానం ఈ ప్రాంతాలను గుర్తించారు. అన్నిశాఖల సమన్వయ సన్నాహక సమావేశంలో జిల్లా కలెక్టర్ అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నారు. ఇందుకు సంబంధించి 23వ తేదీన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆధ్వర్యంలో సన్నాహక సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఏర్పాట్లపై తుది చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండురోజుల కార్యక్రమాల నిర్వహణకు రూ.1.50 కోట్ల నిధులు కేటాయించింది. పర్యాటక శాఖ స్థాయిని పెంపొందించేలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతీ ఏడాది ఈ పండగను నిర్వహిస్తారు. అదేవిధంగా డిసెంబర్ 21, 23 తేదీల్లో కాకినాడలో బీచ్ ఫెస్టివల్‌ను, జనవరి 13, 14, 15 తేదీల్లో కోనసీమ ఉత్సవాలను, మన్యం జాతరను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అత్యధిక ఈవెంట్లు తూర్పుగోదావరి జిల్లాకే లభించాయి. పర్యాటక విశేషాలు అధికంగా ఉండటంతోనే తూర్పుగోదావరి జిల్లాలోనే నాలుగు పండగలను నిర్వహించేందుకు అవకాశం లభించిందంటున్నారు.