తూర్పుగోదావరి

అన్ని నియోజకవర్గాల నేతలను కలుస్తా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ రూరల్, సెప్టెంబర్ 22: కాపు ఉద్యమానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియపరచడానికి తాను రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నాయకులను కలుస్తానని, ఈ నెల 25, 26 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నట్టు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. కాకినాడ రూరల్ రమణయ్యపేటలోని కాపు జెఎసి నాయకుడు వాసిరెడ్డి యేసుదాసును పరామర్శించారు. ముద్రగడ కిర్లంపూడి నుండి చేపట్టిన అనధికార పాదయాత్రలో గాయపడి దాసును శుక్రవారం సాయంత్రం ముద్రగడ పరామర్శించారు. ఈ సందర్భంగా ముద్రగడ స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. కాపులను బిసిల్లో చేర్చేందుకు చంద్రబాబునాయుడు నవంబర్ వరకు గడువు ఇచ్చారని, ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ నిలబెట్టుకోకపోతే డిసెంబర్ 6వ తేదీ నుంచి ఉద్యమం తీవ్రతరం చేస్తామని, రెండునెలల ఉద్యమానికి విరామం ప్రకటించామని ముద్రగడ తెలిపారు. చంద్రబాబు మాట నిలబెట్టుకోవడం ద్వారా గొప్ప కీర్తి పొందుతారని, లేకపోతే కాపుజాతి ద్రోహిగా మిగులుతారని హెచ్చరించారు. దివంగత బాబా సాహెబ్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 6నే ఉద్యమం తీవ్రతరం అవుతుందన్నారు. సమావేశంలో కాపు జెఎసి నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, కల్వకొలను తాతాజీ, సలాది శ్రీనుబాబు, బసవా ప్రభాకర్, టివి సుబ్బారావు, బి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

దసరా దరువు

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 22: ఇటు ప్రైవేటు, అటు ఆర్టీసీ దసరా ప్రత్యేక బస్సుల చార్జీలు పెంచేసింది. ప్రత్యేక బస్సుల పేరుతో 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు. ఎపిఎస్ ఆర్టీసీ జిల్లాలో 530 ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. ప్రైవేటు యాజమాన్యాలు కూడా యాభై శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ముందస్తు రిజర్వేషన్లతో రైళ్లన్నీ కిటకిటలాడుతుండటంతో బస్సులపై ప్రయాణీకులు ఆధారపడ్డారు. దసరా ఆసరా చేసుకుని అదనపు చార్జీలతో ప్రయాణీకులను గుల్ల చేస్తున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఆర్టీసీ జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం డిపోల నుంచి 530 బస్సులను హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ఖమ్మం తదితర ప్రాంతాలకు నడుపుతోంది. గత ఏడాది అయితే జిల్లాలో కేవలం 270 బస్సులను మాత్రమే నడిపిన ఆర్టీసీ ఈ ఏడాది రద్దీని బట్టి 530 బస్సులను ఏర్పాటుచేసింది. ఒక్క విశాఖపట్నానికే 130 ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. సూపర్ లగ్జరీ బస్సు చార్జీ రూ.240 ఉంటే, దానిని ఇపుడు యాభై శాతం పెంపుదలతో రూ.360కి పెంచారు. హైదరాబాద్‌కు రూ.650 చార్జీ ఉండగా రూ.975కి పెంచారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు సూపర్ లగ్జరీ బస్సు ప్రస్తుతం రూ.325 అయితే దసరా సందర్భంగా రూ.508 చెల్లించాల్సి వస్తోందని ప్రయాణీకులు అంటున్నారు. దూరాన్ని, సీట్ల ఖాళీలను బట్టి చార్జీలను వసూలు చేస్తున్నామని, ప్రజలపై భారాన్ని మోపేందుకు కాదని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇక ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల విషయానికొస్తే ఛార్జీల బాదుడు మరింత అధికంగా ఉంది. వీలును బట్టి హైదరాబాద్‌కు రూ.2000 నుంచి రూ.3000కు పెంచినట్టు తెలుస్తోంది. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని అవసరం ఆసరాగా ఛార్జీలు పెంచుతున్నట్టుగా ఉంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కూడా దసరాను పురస్కరించుకుని ప్రయాణీకుల రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక రైళ్లను వేశారు. విజయవాడ రైల్వే డివిజన్‌లో 39 ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశారు. ఈ ప్రత్యేక రైళ్లలో 14 రైళ్లు రాజమహేంద్రవరంలో హాల్ట్‌కు రైల్వే శాఖ అనుమతిచ్చింది. 21వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లు జిల్లా మీదుగా అక్టోబర్ 4వ తేదీ వరకు నడవనున్నాయి.
ప్రజలతో మమేకం కావడానికే...
కాట్రేనికోన, సెప్టెంబర్ 22: తెలుగుదేశం పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతీ కుటుంబానికి తెలియచెప్పి వారితో మమేకం కావడానికే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ముఖ్యోద్దేశ్యమని రాష్ట్ర భూగర్భ గనుల శాఖా మంత్రి రావు వెంకట సుజయ కృష్ణ రంగారావు అన్నారు. శుక్రవారం పల్లంకుర్రు గ్రామంలో ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఇసుకపట్ల అమ్మాజీ రాంబాబు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంకా గ్రామాల్లో మిగిలి ఉన్న వ్యక్తిగత సామాజిక సమస్యలను ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక యాప్‌లో నమోదు చేసి పరిశీలిస్తామన్నారు. అనంతరం స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి రంగారావు మాట్లాడుతూ బాధ్యతగల పౌరులు స్వచ్ఛందంగా పాల్గొని పరిసరాలను కాలుష్యం కాకుండా పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. అలాగే ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకొని బహిరంగ మలవిసర్జనకు స్వస్తి పలకాలన్నారు. వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని, వీటిని ప్రజలు తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. గతంలో ఉపాధి హామీ నిధులు దుర్వినియోగమైతే నేడు సిఎం ఆ పథకంలో మార్పులు చేసి మంత్రి లోకేష్ ద్వారా రోడ్లు, వంతెనలు, పక్కా డ్రెయిన్లు వంటి శాశ్వత పనులు చేస్తున్నారని మంత్రి తెలిపారు. అనంతరం డ్వాక్రా మహిళలకు రూ.2 కోట్ల రుణాల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. పల్లంకుర్రులో రక్షిత మంచినీటి సమస్య పరిష్కారానికి, అలాగే గోదావరి ఇసుకర్యాంపు మంజూరుకు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. అమలాపురం ఎంపిపి పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ నిజాయితీగా కార్యదీక్షతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం కాబట్టే నేడు ధైర్యంగా ప్రజల ముందుకి వస్తున్నామని, మిగిలిన సమస్యలను త్వరలోనే తీరుస్తామన్నారు. దేశంలో ఎపిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, ప్రజలు సహకరించాలని పండుల కోరారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశామన్నారు. అనంతరం గెద్దాడవారిపేటలో ఉపాధి హామీలో నిర్మించిన సిసి రోడ్లను మంత్రి, ఎంపి ప్రారంభించారు. అనంతరం రామాలయం పేటలో ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో ఎమ్మెల్యే సుబ్బరాజు పాల్గొని కరపత్రాలు పంపిణీ చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొప్పిగుంట సర్పంచ్ బొక్కా సత్యనారాయణ తన అనుచరులతో టిడిపిలో చేరడంతో మంత్రి రంగారావు తెలుగుదేశం కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ నాగిడి నాగేశ్వరరావు, టిడిపి అధ్యక్షుడు నడింపల్లి సుబ్బరాజు, ఎఎంసి ఛైర్మన్ గొలకోటి దొరబాబు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, నాయకులు గుత్తుల సాయి, సొసైటీ అధ్యక్షులు మంతెన విజయరామరాజు, ఆకాశం శ్రీను, ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, విత్తనాల రమణ, తాడి నరసింహారావు, కాశి పరివాజ్‌కుమార్, జనిపల్లి సోమన్న, ఉంగరాల వెంకటేశ్వరరావు, దండుప్రోలు సత్యం, వాసంశెట్టి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇంజనీరింగ్ కళాశాల బస్సు దగ్ధం
మలికిపురం, సెప్టెంబర్ 22: మోరి గ్రామంలో శుక్రవారం రాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో శ్రీనివాసా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. అమలాపురం నుండి బయల్దేరిన బస్సు విద్యార్థులను దింపుకుంటూ మోరి పోడు గ్రామం చేరుకునే సరికి బస్సులో ఉన్న ఒకే ఒక విద్యార్థిని బస్సు వెనుక వైపు నుండి పొగలు వస్తుండటం గమనించి డ్రైవర్ వలవల నాగేశ్వరావుకు విషయం చెప్పింది. అనుమానం వచ్చిన నాగేశ్వరరావు వెంటనే బస్సును నిలిపివేసి, విద్యార్థిని వెంటనే కిందకు దింపివేశాడు. బస్సును పరిశీలించగా అప్పటికే వెనుక నుండి మంటలు చెలరేగి బస్సు అంతా అగ్ని కీలల మధ్య చిక్కుకుంది. మంటలను స్థానికులు రాజోలు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో మహ్మద్ ఇబ్రహీమ్ నేతృత్వంలోని ఫైర్ సిబ్బంది రంగప్రవేశం చేసి పూర్తిగా అగ్నికీలల మధ్య ఉన్న బస్సులోని మంటలను అదుపుచేశారు. సఖినేటిపల్లి ఎస్సై పవన్‌కుమార్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని తమ సిబ్బందితో శాంతి భద్రతలను పర్యవేక్షించారు. మెయిన్ రోడ్డుపై బస్సు ఆగిపోవడం, మంటలు చెలరేగడంతో మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న పచ్చికాయల నాగేశ్వరరావు తాటాకిల్లు కూడా ఈ ప్రమాదంలో దగ్థమైంది. బస్సులో ఎవరూ లేకపోవడం, డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల పెనుప్రమాదం తప్పింది. మోరి మోరిపోడు గ్రామానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని బస్సు మంటలు అదుపుచేసేందుకు అధికారులకు తమ సహకారం అందజేశారు.

క్రమశిక్షణ నేర్పే దసరా సాంప్రదాయాలు
తొండంగి, సెప్టెంబర్ 22: అత్యంత భక్తిశ్రద్ధలతో హిందువులు నిర్వహించుకునే పండుగల్లో దేవీనవరాత్రి ఉత్సవాలు ప్రముఖంగా చెప్పుకోవచ్చునని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శుక్రవారం ఎవి నగరం గ్రామంలో ఇటీవల ప్రారంభించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. శరన్నవరాత్రిలో రెండవరోజైన అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం రోజు కావడంతో సామూహిక విశేష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. పూజకు ముందుగా ఆర్థిక మంత్రి యనమల సతీమణి లలితాదేవి అమ్మవారి చిత్రపటం వద్ద దీపారాధన చేసి అమ్మవారి నుదిట కుంకుమధారణ చేశారు. అనంతరం అమ్మవారి కలశాలకు పట్టువస్త్రాలను ఉంచి పుష్పాలతో మంత్రి పూజలు నిర్వహించారు. అనంతరం పురోహితులచే సామూహిక విశేష కుంకుమార్చాన పూజలు నిర్వహించగా మంత్రి కుటుంబ సభ్యులు, భక్తులు, భవానీ దీక్షాపరులు పాల్గొన్నారు. మంత్రి యనమల కల్యాణ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దసరా సాంప్రదాయాలు భక్తి, క్రమశిక్షణను నేర్పుతాయని తెలిపారు. ఈ పండుగను పూర్వకాలం నుండే ఆచరిస్తున్నారని పాండవులు జమ్మిచెట్టుపై ఉన్న ఆయుధాలకు ఆయుధ పూజ చేసి యుద్ధంలో గెలుపొందారని, అదేవిధంగా విజయదశమి రోజున వివిధ వర్గాల ప్రజలు ఈ పండుగ రోజున గతంలో విద్యాసంస్థల్లో తరగతి గదులను శుభ్రం చేయడం, పప్పు, బెల్లం పంపిణీ, గిలకలు కొట్టడం వంటి పనులు చేసేవారన్నారు. పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో పడి సాంప్రదాయాలను మరిచిపోతున్నారన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని ఆయన కోరారు. ఎవి నగరం గ్రామంలో భీష్మ ఏకాదశి రోజున ఆలయ ప్రతిష్ఠ జరిగిందని, ఆ రోజును ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామని, అదేవిధంగా విజయదశమిని కూడా పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్టు మంత్రి యనమల తెలిపారు.
ఏజన్సీలో మలేరియా మందు స్ప్రేయింగ్
కాకినాడ సిటీ, సెప్టెంబర్ 22: జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలైన రంపచోడవరం, చింతూరు తదితర గిరిజన గ్రామాల్లో మలేరియా ప్రబలకుండా ఇప్పటికే రెండు విడతలగా స్ప్రేయింగ్ పనులను పూర్తిచేసినట్లు జిల్లా మలేరియా అధికారి పిఎస్‌ఎస్ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2014 సంవత్సరంలో జిల్లాలో 7లక్షల 79వేల 562మందికి రక్తపరీక్షలు నిర్వహించగా వీరిలో 5వేల 246మంది మలేరియా బారినపడినట్టు తెలిసిందన్నారు. మరో 824 మంది నుండి రక్తనమూనాలు సేకరించగా, 59 డెంగ్యూ కేసులు రికార్డు అయినట్టు చెప్పారు. 2016 సంవత్సరంలో 8లక్షల 33వేల 843 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా, 9వేల 61 మలేరియా కేసులు, 2వేల 404 రక్త నమూనాలు సేకరించగా, 336 డెంగ్యూ కేసులు నమోదైనట్టు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 5లక్షల 58వేల 512మందికి రక్తపరీక్షలు నిర్వహించగా 4వేల 966 మలేరియా కేసులు, 871మందికి రక్తపరీక్షలు చేయగా 39 డెంగ్యూ కేసులు బయటపడినట్టు మలేరియా అధికారి ప్రసాద్ వివరించారు. గత మూడేళ్ల నుండి తమ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం ఈ సీజన్‌లో మలేరియా, డెంగ్యూ కేసులు అదుపులో ఉన్నట్టు చెప్పారు. జిల్లా కలెక్టర్ మిశ్రా ఆదేశాలతో గ్రామస్థాయిలో టాస్క్ఫోర్స్ కమిటీని, ఎఎన్‌ఎం, మల్టీపర్పస్ వర్కర్, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు, విఒలు, స్వయం సహాయక గ్రూపుల మహిళలతో ఏర్పాటుచేసిన స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు.
మొదటి విడతగా ఐఆర్‌ఎస్ కార్యక్రమాన్ని 612గ్రామాల్లో 97.86శాతం జనాభాను, 98.68శాతం గదులను కవర్ చేయడం జరిగిందని చెప్పారు. రెండవ విడత ఐఆర్‌ఎస్ కార్యక్రమంలో 612గ్రామాలకుగాను 203గ్రామాల్లో 59వేల 321 మంది జనాభాను కవర్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. యంటా లార్వల్ ఆపరేషన్‌లో 278హేబిటేషన్ కవర్‌చేసి 4వేల 538 మందికి వైద్యం చేశామన్నారు. వెక్టార్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక పారశుద్ధ్య డ్రైవ్‌ను పంచాయతీ అధికారులు నిర్వహించి అన్ని హేబిటేషన్లలోను యాంటీ లార్వా ఆపరేషన్ చేసినట్టు తెలిపారు. గిరిజనులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, మలేరియా నిరోధానికి పిహెచ్‌సిలకు, సబ్‌సెంటర్లకు మందులను సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు.
635 గ్రామాల్లో 540 మెడికల్ క్యాంపులు నిర్వహించగా వీటికి 13వేల 127మంది హాజరుకాగా, వీరిలో వెయ్యి 486 మంది జ్వరంతో బాధపడుతున్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ శిబిరంలో 229మంది మలేరియా బారిన పడినట్టు గుర్తించామని, 70 మంది డయేరియా బారినపడినట్టు వైద్యులు నిర్ధారించి వారికి చికిత్సను అందించినట్లు పేర్కొన్నారు. ప్రజలు మలేరియా పట్ల ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, తాము ఎప్పటికప్పు వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజలకు వైద్య సహాయాన్ని అందజేస్తున్నట్టు ప్రసాద్ తెలిపారు.
పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యత
కడియం, సెప్టెంబర్ 22: కడియం ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధిచేసేందుకు ప్రాధాన్యత ఇస్తామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. కడియం మండల టిడిపి అధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. సహజ సిద్ధమైన అందాలతో కడియం నర్సరీలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పర్యాటకులు బసచేసే విధంగా హౌస్ హోస్ట్‌లు నిర్మించేందుకు టూరిజం పర్యాటక అధికారులతో సమీక్ష జరిపానన్నారు. నర్సరీ రైతులు గానీ, ఔత్సాహికులు గానీ ముందుకు వస్తే రాయితీలతో పర్యాటక నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే 2016లో అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కడియపులంకలో కనె్వన్షన్ హాలు నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరు చేశారని, అయితే ఆ భవన నిర్మాణ పనులు నిధులు విడుదల కాక మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. రూ.50లక్షలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో కాంట్రాక్టర్ నిర్మాణ పనులు నిలిపివేశారని ఎమ్మెల్యే గోరంట్ల జిల్లా కలెక్టర్‌కు వివరించారు. ఈ విషయమై కూడా తాను చర్చిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. తొలుత స్థానిక నర్సరీ రైతులు, టిడిపి నేతలు కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు.