తూర్పుగోదావరి

మొక్కజొన్న ముసుగులో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, అక్టోబర్ 16: బిల్లుల్లో మొక్కజొన్న... కానీ రవాణా చేసేది పేదలకు అందాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం (రేషన్ బియ్యం). ఆదివారం రాత్రి రావులపాలెం మండలం రావులపాడు వద్ద రాజమహేంద్రవరం విజిలెన్సు, ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు జరిపిన దాడుల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. సుమారు రూ. 12.5 లక్షల విలువైన 17 టన్నుల రేషన్ బియాన్ని అధికారులు సీజ్ చేశారు. రాజమహేంద్రవరం విజిలెన్సు ఎస్పీ టి రాంప్రసాదరెడ్డి పర్యవేక్షణలో సిఐ టి రామ్మోహనరెడ్డి బృందం గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుండి కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని సీజ్ చేసిన విషయం విదితమే. కాగా సోమవారం తెల్లవారుజాము వరకు అధికారుల బృందం జరిపిన నిర్ధారణలో పలు విషయాలు వెలుగు చూశాయి. సదరు లారీలో 160 క్వింటాళ్ల మొక్కజొన్న 300 బస్తాల్లో ఉన్నట్టు డ్రైవరు వద్ద ఉన్న వే బిల్లుల్లో పేర్కొనగా లారీలో మాత్రం 17 టన్నుల రేషన్ బియ్యం ఉంది. డ్రైవరు రామావత్ శివనాయక్‌ను అధికారులు విచారించగా యర్రంశెట్టి సాంబశివరావు అనే వ్యక్తి ఈ బియ్యం రవాణా చేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో అధికారులు స్థానిక ఎంఎస్‌ఒ టి సుభాష్, విఆర్వో రవిప్రకాష్, ఎస్సై సిహెచ్ విద్యాసాగర్‌ను రప్పించి సీజ్ చేసిన లారీని, అరెస్టు చేసిన డ్రైవరును అప్పగించారు. ఎంఎస్‌ఒ సుభాష్ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్టు సిఐ రామ్మోహనరెడ్డి తెలిపారు. డ్రైవరుతో పాటు రవాణా చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదుచేశామన్నారు.
పూర్తి ప్యాకేజీతో నిర్వాసితులను ఆదుకోవాలి
రంపచోడవరం, అక్టోబర్ 16: దేవీపట్నం మండలంలోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో ప్యాకేజీ అందించి వారిని ఆదుకోవాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండు చేశారు. సోమవారం దేవీపట్నం మండలంలోని దండంగి, చిన రమణయ్యపేట గ్రామాల్లోని నిర్వాసితులతో కలిపి ఐటిడిఎ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దండంగి, చినరమణయ్యపేట గ్రామాల్లో రీ సర్వే నిర్వహించి, అర్హులను గుర్తించి నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తామన్నారు. ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే వద్దకు ఐటిడిఎ పిఒ దినేష్‌కుమార్, సబ్ కలెక్టర్ వినోద్‌కుమార్ వచ్చి చర్చించారు. నిర్వాసితులకు అన్యాయం జరగకుండా అందరికీ ప్యాకేజీ వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా పిఒకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అందజేశారు. కార్యక్రమంలో దేవీపట్నం జడ్పీటీసీ మట్టా రాణి, వైసిపి నేతలు నండూరి గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.
నేత కార్మికుల సంక్షేమానికి చర్యలు

అమలాపురం, అక్టోబర్ 16: నేత కార్మికులను ప్రభుత్వపరంగా అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హామీ ఇచ్చారు. సోమవారం రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి శివశంకరయ్య, బళ్ల వెంకటరమణ, చింతా శంకరమూర్తి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో రాజప్పను కలిసి చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందించారు. నేత కార్మికులకు సరైన ఉపాధి లేక వలసలు వెళిపోతున్నారని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో నేత పరిశ్రమ కానరాకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుందని వారు ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. దీనిపై రాజప్ప సానుకూలంగా స్పందిస్తూ నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వపరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నేత కార్మికుల సమస్యలపై రాష్ట్ర స్థాయిలో ఒక సదస్సును పెద్దాపురంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఆ సదస్సులో సమస్యలు చర్చించి నిర్ణయాలు ప్రకటిస్తామని రాజప్ప హామీ ఇచ్చారు. రాజప్పను కలిసిన వారిలో పుత్సల వెంకటేశ్వరరావు, గంటు ఫణీంద్రప్రసాద్, బివిఎన్ మల్లేశ్వరరావు, కొండా జగదీష్, చింతపట్ల గంగా సత్యనారాయణ, గుమ్మడి రాజు, పుత్సల వరదరాజులు తదితరులున్నారు.