తూర్పుగోదావరి

బుచ్చయ్యకు షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 17: రాజమహేంద్రవరం నగర టిడిపిలో దీపావళికి ముందే బాంబు పేలినట్టయింది. ఇంటింటికీ టిడిపి కార్యక్రమంలో రాజమహేంద్రవరం నగరంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా ఛైర్మన్ గన్ని కృష్ణతో ద్విసభ్య కమిటీని ఏర్పాటుచేసి బాధ్యతలు అప్పగించడం పార్టీలో అలజడి రేకెత్తించింది. రాజమహేంద్రవరం నగరంలో జరిగే ఇంటింటికీ టిడిపి కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు వీరిరువురికీ అప్పగిస్తూ మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్టీ కేంద్ర కార్యక్రమాల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ వివివి చౌదరి నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు నామన రాంబాబుకు ఉత్తర్వులు అందాయి. ఈ ఉత్తర్వులు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన పార్టీ సంస్థాగత కార్యవర్గంలో కూడా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఎటువంటి బాధ్యతలు అప్పగించకపోవడం, ఇపుడేమో నగరంలో జరిగే ఇంటింటికీ టిడిపి కార్యక్రమానికి సంబంధించి ద్విసభ్య కమిటీగా ఆదిరెడ్డికి, గన్నికి బాధ్యతలు అప్పగించడం చూస్తుంటే గోరంట్లను రూరల్ నియోజకవర్గ ఇంటింటికీ టిడిపికే పరిమితం చేసినట్టు స్పష్టమవుతోంది. ఈ పరిణామంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
వాస్తవానికి ఇంటింటికీ టిడిపి కార్యక్రమం ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తోంది. ఇప్పటివరకు నగరంలో జరిగే కార్యక్రమానికి గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా విధిగా హాజరవుతున్నారు. నగరంలో డివిజన్ల వారీగా జరిగే ఇంటింటికీ టిడిపి కార్యక్రమాల్లో ఇటు మేయర్ పంతం రజనీ శేషసాయి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ పాల్గొంటున్నారు. కానీ రోజువారీ షెడ్యూల్ సమాచారం మాత్రం ఇటు ఆదిరెడ్డి అప్పారావు కార్యాలయం నుంచి అటు గోరంట్ల బుచ్చయ్యచౌదరి కార్యాలయం నుంచి కూడా సమాచారం అందేది. గతంలో ఇటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ పరిస్థితిని బట్టే ద్విసభ్య కమిటీకి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుందనే చర్చకూడా జరుగుతోంది. మరో వైపు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇటు నగర ఇంటింటికీ టిడిపితో పాటు, అటు రూరల్ ఇంటింటికీ టిడిపి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల అదనపు బాధ్యతల వల్ల రూరల్ నియోజకవర్గానికి సంస్థాగత కార్యక్రమంలో న్యాయం జరగడంలేదనే భావం అధిష్టానానికి కలగడంవల్లే గోరంట్ల పూర్తిస్థాయిలో రూరల్ నియోజకవర్గంపై దృష్టిపెట్టేందుకు అవకాశం ఉంటుందని పార్టీ నుంచి ఇటువంటి ఆదేశాలు జారీఅయ్యాయని చర్చించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకే పార్టీ కేంద్ర కార్యక్రమాల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ వివివి చౌదరి ఈ ఉత్తర్వులు జారీచేసినట్టు సమాచారం.

అమరవీరుల సేవలు చిరస్మరణీయం
*ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
పెద్దాపురం, అక్టోబర్ 17: విధి నిర్వహణలో అమరులైన పోలీసు సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర హోం శాఖ మంత్రి, ఉప ముఖ్య మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా స్థానిక లూధరన్ ఉన్నత పాఠశాల్లో మంగళవారం పోలీసులు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టిన సందర్భాలు అనేకమన్నారు. వీరోచిత పోరాటాలు, వీర మరణాలను ఎదుర్కొంటూ విధుల్లో అంకితభావాన్ని ప్రదర్శించే గుణం పోలీసు వ్యవస్థ సొంతమన్నారు. నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ఏకైక వ్యవస్థ పోలీసు వ్యవస్థేనని కొనియాడారు. పోలీసు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏటా అక్టోబర్-21 పోలీసు అమరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నామన్నారు. పోలీసులు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా పోలీసులు ఇంతవరకు చేపట్టిన కార్యక్రమాలను అడిగితెలుసుకున్నారు. సమర్ధవంతంగా పనిచేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలన్నారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేసిన డిఎస్పీ చిలకా వెంకటరామారావు, సిఐ ప్రసన్న వీరయ్యగౌడ్, ఎస్సై కృష్ణ్భగవాన్‌లను ఆయన అభినందించారు. రక్తదాన శిబిరంలో భాగంగా సుమారు 150 మంది యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబురాజు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు శేషుకుమార్, రెడ్‌క్రాస్ ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి హామీ పనులు
*అందుకే కేంద్ర మంత్రికి ఫిర్యాదు*విజిలెన్స్ విచారణకు కేంద్రం ఆదేశం *బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు
రాజమహేంద్రవరం, అక్టోబర్ 17: రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని తాను కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినట్లు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. ఇటీవలే రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తనపై చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. మంగళవారం బిజెపి అర్బన్‌జిల్లా కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ తన ఫిర్యాదు మేరకు కేంద్రప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిందన్నారు. ఉపాధి హామీ పథకం 90శాతం కేంద్రప్రభుత్వ నిధులతో అమలవుతోందన్నారు. ఈపథకం కింద నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం మూడేళ్లలో రూ.9వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. కాంగ్రెస్ హయాంలో చెరువులను కూలీలు తవ్వితే, టిడిపి హయాంలో నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలను వినియోగిస్తున్నారన్నారు. తవ్విన చోటే మళ్లీ తవ్వుతున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం కేవలం రూ.6వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, ఉపాధి హామీ పథకానికి 9వేల కోట్లు ఖర్చుచేసిందన్నారు. తాజాగా గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్ 15వేల గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తామని ప్రకటించారని, తొలి దశలో రూ. 160కోట్లతో 152 గ్రామాల్లో భూగర్భడ్రైనేజీని నిర్మిస్తామని చెప్పారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నదే తమ ధ్యేయమన్నారు. అభివృద్ధికి తమ పార్టీ ఎప్పుడూ సహకరిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకంపై వైసిపి నాయకుల ఫిర్యాదుపై గోరంట్ల విమర్శలను ప్రస్తావిస్తూ గతంలో వైసిపి ఎమ్మెల్యేలే నేడు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని గుర్తుచేశారు. అలాంటి వైసిపి నాయకులే రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారన్నారు.

విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు
వైద్య సిబ్బందికి జిల్లా అదనపు వైద్యాధికారి ఛార్లెస్ హెచ్చరిక : పిహెచ్‌సిలో శిశుమరణం ఘటనపై విచారణ
రాజవొమ్మంగి, అక్టోబర్ 17: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని జిల్లా అదనపు వైద్యాధికారి జిఎస్ ఛార్లెస్ హెచ్చరించారు. స్థానిక పిహెచ్‌సిలో శిశు మరణం సంభవించిన సంఘటనపై ఆయన మంగళవారం దర్యాప్తు నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ మరియమ్మను ఆయన పరామర్శించారు. వైద్య సహాయం ఏవిధంగా అందిందో అడిగి తెలుసుకున్నారు. ఆమెకు వైద్య సహాయం అందజేసిన వైద్యులు మోనీషాను బిడ్డ మరణం ఎలా సంభవించిందని, కాన్పు కష్టమని ముందే భావిస్తే మెరుగైన వైద్యంకై కాకినాడ జనరల్ ఆసుపత్రికి రిఫర్ ఎందుకు చేయలేదన్నారు. రోగులపట్ల నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదన్నారు. 24 గంటలపాటు రోగులకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. మధ్యాహ్న భోజనం వైద్యులు ఆసుపత్రిలోనే చేయాలని, ఇళ్లకు వెళ్లరాదన్నారు. మన్యంలో మరణాలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. ఎటువంటి ఫిర్యాదుల వచ్చినా తీవ్రంగా తీసుకుంటామన్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఎటువంటి వైద్య సహాయం అందుతుందో ఆయన రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మందులు సక్రమంగా ఉండడంలేదని, బయట మార్కెట్‌లో కొనుగోలు చేసుకోలేకపోతున్నామని రోగులు అధికారికి తెలిపారు. జడ్డంగి ఆసుపత్రిలో కొత్తగా అంబులెన్సు ఏర్పాటు చేస్తున్నామని, రాజవొమ్మంగి ఆసుపత్రి అంబులెన్సు కూడా రిపేరు చేయిస్తామన్నారు. శిశుమరణం దర్యాప్తు నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఛాస్ తెలిపారు. ఎంపిడిఒ విజయ, వైద్యులు వంశీ, మహేష్‌రెడ్డి, సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.

కమ్యూనిస్టులు నరహంతకులు
*ఎమ్మెల్సీ సోము ధ్వజం
రాజమహేంద్రవరం, అక్టోబర్ 17: దేశంలోని కమ్యూనిస్టులు నరహంతకులని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఆనంరోటరీహాలులో జరిగిన బిజెపి అర్బన్‌జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టుల్లో కొంతమంది చీలిపోయి నక్సలైట్లుగా మారారన్నారు. వారు కాంట్రాక్టర్లు, నాయకులను బెదిరించి, బలవంతపు వసూళ్లతో దొంగలుగా మారారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమకు అడ్డంవచ్చిన వారిని హత్యలు చేస్తున్నారన్నారు. కమ్యూనిస్టులు భారీగా ఆస్తులు పోగేసుకున్నారన్నారు. భారతదేశంలో ఉంటూ చైనాను పొగుడుతారన్నారు. జాతీయ వ్యతిరేక భావాలు కలిగిన కమ్యూనిస్టుల ఆగడాలను సహించేది లేదని, వారి గుండెల్లో నిద్రపోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2019లో కూడా నరేంద్రమోడీయే ప్రధాని పదవిని చేపట్టాలని ప్రజలు భావిస్తున్నారని, దీన్ని సహించలేక కాంగ్రెస్, కమ్యూనిస్టులు బిజెపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. జిఎస్టీ, పెద్దనోట్ల రద్దుపై విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఈవిధానాలను ప్రజలు వ్యతిరేకించలేదని సోము స్పష్టం చేశారు. ప్రధాని దేశంలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేశారన్నారు. పెద్దనోట్ల రద్దుతో అవినీతికి అడ్డుకట్ట పడిందన్నారు. రియల్‌ఎస్టేట్ వ్యాపారులకు ఈవిధానం వల్ల నష్టం జరిగింది తప్ప సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేవన్నారు. భూముల ధరలు గణనీయంగా తగ్గాయన్నారు. దేశాభివృద్ధి కోసం తన కుటుంబాన్ని త్యాగం చేశారన్నారు. తన తల్లిని కూడా ప్రభుత్వాసుపత్రిలో చేర్చి చికిత్స చేయించిన ప్రధాని దేశంలో మోడీ తప్ప ఎవరూ లేరన్నారు. బిజెపిని పోలింగ్ బూత్‌స్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బూత్‌స్థాయి సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రతీ బూత్ పరిధిలో ఒక మొక్కను నాటి, చెట్టుగా పెరిగే వరకు సంరక్షించాలన్నారు. ఈసమావేశంలో నగర అధ్యక్షుడు బొమ్ముల దత్తు, ప్రధాన కార్యదర్శులు అడబాల రామకృష్ణారావు, బూర రామచంద్రరావు, నాయకులు రేలంగి శ్రీదేవి, ధార్వాడ రామకృష్ణ, పొట్లూరి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

డెంగీ వ్యాధి లక్షణాలతో చిన్నారి మృతి
అడ్డతీగల, అక్టోబర్ 17: మండలంలోని వేటమామిడి గ్రామానికి చెందిన మూడు సంవత్సరాల మద్దికొండ అలకనంద అనే చిన్నారి డెంగీ వ్యాధి లక్షణాలతో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించినట్టు చిన్నారి తండ్రి మద్దికొండ ఆనంద్ తెలిపారు. గత ఐదు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన కుమార్తెను ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా రెండు రోజులు గడిచినా ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. అక్కడ మలేరియా, టైఫాయిడ్ మరియు డెంగీ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించి వైద్యం అందిస్తుండగా సోమవారం సాయంత్రం మరణించిందని తెలిపారు. గత నెల రోజులుగా ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో డెంగీవ్యాధి ప్రబలి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. వైద్యాధికారులు తక్షణమే స్పందించి మరింతగా ఈ డెంగీ విజృంభించకుండా అరికట్టాలని కోరుతున్నారు.

పారిశుద్ధ్య కార్మికుల సమస్యను పరిష్కరించిన కన్నబాబు
కాకినాడ రూరల్, అక్టోబర్ 17: జీతాలు ఇవ్వాలంటూ మూడు రోజులుగా ధర్నా చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యను జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఎటువంటి సమస్యలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కార్మికులకు ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం వాకలపూడి ఫిషర్‌మెన్ కాలనీలో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో ఆయన పాల్గొని గ్రామంలోని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసిపి సభ్యత్వం నమోదు చేసి, మిస్డ్‌కాల్స్ ఇప్పించారు. నవరత్నాలు పథకాలు గురించి ప్రజలకు కన్నబాబు తెలియజేసి కరపత్రాలను అందజేశారు. కురసాల సత్యనారాయణ, గొల్లపల్లి జగన్నాథం, గంపల సత్యనారాయణ, ఆనంద్ న్యూటన్, నురుకుర్తి రామకృష్ణ, పెంకే సత్తిబాబు, సిద్దా సతీష్, కర్రి చక్రధర్, పులపకూర వీర్రాజు, నున్న వెంకటేశ్వరావు, గొల్లపల్లి సూరిబాబు, కాశీ, పెనుమత్స సూర్యనారాయణరాజు, వివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

విఎస్‌ఎం కళాశాలలో భారీ రక్తదాన శిబిరం
రామచంద్రపురం, అక్టోబర్ 17: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం పట్టణంలో విఎస్‌ఎం కళాశాలలో భారీ రక్తదాన శిబిరాన్ని రామచంద్రపురం సర్కిల్ పోలీస్ యంత్రాంగం మంగళవారం నిర్వహించింది. కాకినాడ నగరానికి చెందిన రోటరీ బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం నేతృత్వంలో ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు. విఎస్‌ఎం కళాశాల తదితర కళాశాలల, విద్యాసంస్థల విద్యార్థులు రక్తదానం చేశారు. కళాశాల అకడమిక్ డైరెక్టర్ మెర్ల సత్యనారాయణ మూర్తి, తదితరులు ఈ శిబిర నిర్వహణకు విశేష కృషి చేశారు. సమాజంలో పోలీసులు కూడా అంతర్భాగమేనన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అడిషనల్ ఎస్‌పి దామోదర్ పేర్కొన్నారు. రక్తదాన శిబిరాన్ని ఆయన సందర్శించి, డిఎస్‌పి జయంతి వాసవీ సంతోష్, సిఐ కొమ్ముల శ్రీ్ధర్ కుమార్, నిర్వహించిన విఎస్‌ఎం కళాశాల పాలకవర్గాన్ని అభినందించారు. సుమారు 70 మంది రక్తదానం చేసినట్లు డిఎస్‌పి సంతోష్ వెల్లడించారు. ఈ సందర్భంగా రక్తదాతల పేర్లను నమోదు చేసే సమయంలో.. వారి వయస్సుతో పాటు వారి గ్రామాల వివరాలు, బ్లడ్ గ్రూపు వివరాలను కూడా రికార్డులలో నమోదు చేయాలని సంబంధిత నమోదు కార్యకర్తలకు అడిషనల్ ఎస్‌పి దామోదర్ సూచించారు. తద్వారా ఎక్కడైనా ప్రమాదాలలో గాయపడిన, అనారోగ్య పరిస్థితులలో ఇబ్బందులకు లోనవుతున్న వారికి రక్తం సరఫరా చేసేందుకు వీలు కలుగుతుందని వారికి అడిషనల్ ఎస్‌పి దామోదర్ స్పష్టం చేశారు.

రాజమహేంద్రవరం రూరల్‌కు మహర్దశ
*బొమ్మూరులో నాటక అకాడమీ *పాలిటెక్నిక్ కళాశాలలో స్టేడియం *మహిళా ప్రాంగణం భూమిలో సైన్స్ సిటీ

రాజమహేంద్రవరం, అక్టోబర్ 17: రాజమహేంద్రవరం రూరల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. రాజమహేంద్రవరం నగరంలో అనువైన స్థలం అందుబాటులో లేకపోవడం వల్ల రూరల్‌లోనే అభివృద్ధి అంతా కేంద్రీకృతమైంది. ఎలాగూ రాజమహేంద్రవరం మండలం రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో విలీనమైంది కాబట్టి ఇక రాజమహేంద్రవరం నగర విస్తీర్ణం విస్తరించి పలు అభివృద్ధి పథకాలకు బొమ్మూరు కేంద్రమైంది. ఇదే సమయంలో రూరల్ ఎమ్మెల్యేగా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఉండటంతో నిర్మాణాత్మకమైన అభివృద్ధికి రూరల్ నియోజకవర్గం ఆలంబనగా మారింది. పలు కేంద్ర, రాష్ట్ర అభివృద్ధి పథకాలు రూరల్ నియోజకవర్గం పరిధిలోనే అంకురార్పణ జరుగుతున్నాయి. గోరంట్ల బుచ్చయ్యచౌదరి కృషి కారణంగా అనువైన భూములు అందుబాటులోకి రావడంతో పలు పథకాలు ఇక్కడే రూపకల్పన జరుగుతోంది. రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు వద్ద నాటక అకాడమిని ఏర్పాటు చేస్తున్నారు. చిరకాలంగా పెండింగ్‌లో వున్న ఈ అకాడమి ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. రూ.2 కోట్ల నిధులతో బొమ్మూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో స్టేడియం నిర్మాణం చేపడుతున్నారు. ఇదే ప్రాంతంలో రూ. 1.40 కోట్ల అంచనా వ్యయంతో ఉమెన్స్ హాస్టల్‌ను నిర్మించనున్నారు. బొమ్మూరు మహిళా ప్రాంగణానికి చెందిన సుమారు ఆరు ఎకరాల భూమిని సైన్స్ సిటీకి కేటాయించారు. ఈ స్థలం అనువుగా ఎంపిక చేయడంతో ఇక్కడే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సైన్స్ సిటీ నిర్మాణం డిసెంబర్‌లో మొదలు కానుంది.
రూ. 2 కోట్ల నిధులతో ఎస్సీ బాయ్స్ హాస్టల్‌ను నిర్మించనున్నారు. రాజమహేంద్రవరం నగరంలో మున్సిపల్ స్టేడియాన్ని ఇప్పటికే రూ. 2 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతోందని, ఇటీవల ముఖ్యమంత్రి స్టేడియం నిర్మాణం కోసం మరో రూ. 2 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగిందని, వెరసి రూ. 4 కోట్లతో నాగులాచెరువు స్టేడియాన్ని అభివృద్ధి చేస్తామని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. నగరంలో మురుగునీటి శుద్ధికి సంబంధించి కాతేరు, ధవళేశ్వరంలో ఎస్టీపీలను నిర్మించనున్నారు. ఇదంతా ఒకెత్తయితే రాజమహేంద్రవరం నగరానికి 4200 ఇళ్లు మంజూరయ్యాయి. అదనంగా రూరల్ ప్రాంతానికి కలిపి మరో ఐదు వేల గృహాలు మంజూరయ్యాయి. అయతే నగరంలో స్థలం అందుబాటులో లేనందున మొత్తం 9200 గృహాలు రూరల్ మండలంలో నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద అభివృద్ధి అంతా ఇపుడు రూరల్ మండలంలోనే కేంద్రీకృతమైంది.