తూర్పుగోదావరి

వజ్రకూటం కబేళాలో అధికారుల తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖవరం, అక్టోబర్ 23: శంఖవరం మండలం వజ్రకూటం గ్రామ పంచాయతీ పరిధిలోని రామన్నపాలెంలో నిర్వహిస్తున్న కబేళాలో సోమవారం సాయంత్రం నుండి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల కబేళా నుండి వెలువడుతున్న దుర్గంధం, రక్తంతో కలిసిన కలుషిత నీరు కారణంగా ప్రజలు, పశువులు అనారోగ్యం పాలవుతున్నట్టు సమీప గ్రామాలైన కొడవలి, వనె్నపూడి, చెందుర్తి, పోతులూరు, వజ్రకూటం, వాకపల్లి, కత్తిపూడి వాసులు పిఠాపురం ఎమ్మెల్యే వర్మ సహకారంతో జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ జిల్లా కాలుష్య నియంత్రణ బోర్డుతోపాటు, ఎపిఐఐసి, డిఐఐసి, పోలీసు శాఖల అధికారులను కబేళాలో తనిఖీలు చేయమని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో కబేళాకు చేరుకున్న కాలుష్య నియంత్రణ బోర్డు ఇఇ రామారావు నాయుడు కబేళా నుండి విడుదల చేస్తున్న నీరు, వాయువుల నమూనాలు సేకరించారు. వీటిని విశాఖలోగల జోనల్ కార్యాలయానికి పరీక్షల నిమిత్తం పంపుతున్నట్టు ఆయన తెలిపారు. అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం తెలుసుకున్న కబేళా సమీపంలో గల కొడవలి గ్రామస్థులు అక్కడికి చేరుకుని అధికారులకు తాము ఎదుర్కొంటున్న ఇక్కట్లను వివరించారు. ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల సమయంలో కబేళా నుండి దుర్గంధంతో కూడిన వాయువును విడుదల చేస్తున్నారని, దీంతో వాంతులు, వికారంతో పలువురు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. సమీపంలోని కాలువలు, వాగుల్లోకి కబేళా నుండి రక్తంతో కూడిన వ్యర్థ పదార్థాలను వదిలివేయడం వల్ల తమ గ్రామాల్లోని నీరు కలుషితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మనుషులుతోపాటు పశువులు సైతం మృత్యువాత పడుతున్నాయని వాపోయారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ పూర్తిగా కబేళాలో తనిఖీలు నిర్వహించి, కలెక్టర్‌కు సమగ్ర నివేదిక సమర్పిస్తామని తదుపరి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. తనిఖీల్లో ఎపిఐఐసి జోనల్ మేనేజర్ గోపీకృష్ణ, డిఐఐసి డిప్యూటీ డైరెక్టర్ దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
రేషను దుకాణాలను మాల్స్‌గా అభివృద్ధి చేయాలి
రావులపాలెం, అక్టోబర్ 23: రేషన్ దుకాణాలను మీ సేవ, మినీ ఎటిఎంలు, మాల్స్‌గా అభివృద్ధిచేసి రాష్ట్రంలో ఉన్న 29 వేల మంది రేషన్ డీలర్లకు ఉపాధి రక్షణ కల్పించాలని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు ప్రభుత్వాన్ని కోరారు. రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో సోమవారం రేషన్ డీలర్ల సంఘం మండల శాఖ అధ్యక్షుడు మట్ట బాబ్జీ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి రేషన్ డీలర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాధవరావు ముఖ్య అతిథిగా హాజరై స్థానికంగా డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేషన్ డీలర్ల సమస్యలను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. రాష్ట్రంలో మొత్తం 1.4 కోట్ల మంది కార్డుదారులు ఉండగా, తద్వారా ఆయా కుటుంబాలకు చెందిన 4.2 కోట్ల మంది ప్రజలకు రేషన్ డీలర్లు సేవలందజేస్తున్నారన్నారు. ప్రభుత్వ సర్వేలో కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. వినియోగదారులే అమ్ముకున్న బియ్యాన్ని రవాణాచేస్తూ పట్టుబడితే దానికి డీలర్లను బాధ్యులను చేయడం సమంజసం కాదన్నారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద సరైన తూకాన్ని ఏర్పాటుచేయాలని, డీలర్ల వేలి ముద్రలతో నూరు శాతం తూకంతో సరుకులు ఇవ్వాలని డిమాండు చేశారు. గ్రామీణ ప్రాంతాలలో రూ.15వేలు, పట్టణ ప్రాంతాలలో రూ.25వేలు గౌరవ వేతనంగా ఇవ్వాలన్నారు. రావులపాలెం ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌ఛార్జి తూకంలో అవినీతికి పాల్పడుతున్నారని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింహారావు, దొమ్మేటి ఏడుకొండలు, అడపా వెంకటరమణ, గుండుగోగుల రామకృష్ణ, చప్పిడి సత్యనారాయణ, సూరపరెడ్డి గోపాలకృష్ణ, బివి మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.