తూర్పుగోదావరి

యథేచ్చగా కోడిపందేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జనవరి 16: కోడి పందాలకు కొత్త భాష్యాన్ని చెపుతున్నారు పందాల రాయుళ్ళు. రాజ్యాంగం, చట్టం వంటివాటితో తమకు పనిలేదంటున్నారు. భారత రాజ్యాంగం నాల్గవ భాగం ఆదేశక సూత్రాల్లో 48,48ఎ అధికరణలు ఏ జీవీని హింసించరాదని స్పష్టంగా పేర్కొంది. దానిని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ఓట్లు కోసం అడ్డదిడ్డంగా మాట్లాడుతూ, చట్టాన్ని అమలు చేసే అధికారుల చేతులు కట్టేస్తున్నారు. దీంతో చట్టానికి ఎవరికి తోచిన విధంగా వారు అన్వయించుకుంటూ అధికారులపై అధికార అహంకారాన్ని ప్రదర్శస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సంక్రాంతి అంటే కోడి పందాలు, కోడి పందాలు అంటే సంక్రాంతి’. పందాలు లేని సంక్రాంతిని ఊహించలేము. పందాలు నిర్వహించకపోతే పండగకు మజాయే ఉండదంటున్నారు. అంతే కాదు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు కనీసం ఏడాదికి ఒకసారైనా స్వగ్రామాలకు వస్తున్నారంటే దానికి కారణం కోడిపందాలలేనని చెప్పడం విశేషం. దీనికి రాష్ట్ర హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేస్తున్న వ్యాఖ్యలు, అక్కడక్కడా దేశం పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా బలాన్ని చేకూర్చుతున్నాయి. ఇటీవల పలు సందర్భాల్లో సంక్రాంతి సాంప్రదాయాలను కాపాడటం కోసం చట్టంలో మార్పులు తెస్తామని, ఇలా చట్టాన్ని మార్చుకుంటే ఈవిషయంలో ఎవరికీ ఏవిధమైన ఇబ్బందులు ఉండకుడా పండగ మూడు రోజులు పందాలను నిర్భయంగా నిర్వహించవచ్చనేది రాజప్ప చెప్పడం భవిష్యత్‌లో దీనిపై ఒక చట్టం వచ్చే అవకాశం లేకపోలేదనేది స్పష్టం అవుతుంది. ప్రజల మనోభావాలకు అనుకూలంగా ప్రజా ప్రతినిధులు తలుచుకుంటే కోడి పందాలపై చట్టం తేవడం ఏమంత కష్టం కాదంటున్నారు పందాల రాయుళ్ళు. కోళ్ళకు కత్తులు కట్టకుండా పందాలను నిర్వహించుకుంటే అది సంప్రదాయం కిందే వస్తుందని, దానిని ఎవ్వరూ అడ్డుపెట్టవద్ధని సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అయితే దానిని కూడా పందాల రాయుళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుని కోడి పుంజు కాళ్ళకు కత్తి కట్టి, లక్షలు, కోట్లలో బెట్టింగులు నిర్వహించడమే దీనిపై ఇంత చర్చకు దారితీస్తోంది. కోనసీమ వ్యాప్తంగా కోడి పందాలు జోరు ఏమాత్రం తగ్గలేదు. మకర సంక్రాంతి, కనుమ రోజులైన సోమ, మంగళవారాల్లో కూడా పందెం రాయుళ్ళు మరింత రెచ్చిపోయారు. పగలు, రాత్రి తేడాలేకుండా విద్యుత్ కాంతుల వెలుగుల్లో కోడి పందాలను నిర్వహించి న్యాయస్థానం ఆదేశాలు, అధికారుల ఆంక్షలను బేఖాతరు చేసారు. పందాలను వీక్షించడానికి వచ్చే వీవీఐపి, వీఐపీల కోసం భారీ ఎల్‌ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి మరీ నిర్వహించారంటే పందాలకు పెరుగుతున్న ప్రాధాన్యతను చెప్పవచ్చు. కోడి పందాలకు సాంప్రదాయం ముసుగేసి కోళ్ళ కాళ్ళకు కత్తులు కట్టి పందాల ఒక పక్క నిర్వహిస్తూనే మరో పక్క గుండాటలు, పేకాటలను విచ్చల విడిగా నిర్వహించారు. ఈజూదాల్లో పండగ మూడు రోజుల్లో కోనసీమ వ్యాప్తంగా సుమారు రూ.300 కోట్ల మేర చేతుల మారినట్లు సమాచారం. అయితే హైకోర్డు , సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మధ్య తీవ్ర వ్యత్యాసం ఉండటంతో పందాల నిర్వాహకులు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తమకు అనుకూలంగా మలుచుకుని మూడు రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలను నడిపారు. కోడి పందాలు జరిగే ప్రాంతాలవైపు పోలీసులు కనె్నత్తయినా చూడలేదంటే వారిపై ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రమేయాన్ని ఇట్టే చెప్పొచ్చు. ఇక మీడియా ప్రతినిధులనైతే గంజిలో ఈగలాగ చూసారంటే పందాల నిర్వాహకుల ఆధికార ఆహంకారాన్ని చెప్పనవసరం లేదు. అయితే నిర్వాహకులు మాత్రం అధికారులకు ఇవ్వాల్సిన లాంచనాలు చెల్లించామని, అందుకే తాము నిర్భయంగా కోడి పందాలను నిర్వహించ గలుగుతున్నామని చెప్పడం విశేషం. ఐ పోలవరం మండలం మురమళ్ళలో జరిగిన పందాలకు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, బొడ్డు భాస్కరరామారావులతో పాటు జిల్లా నలుమూలల నుండి అతిరధ మహారధులు హాజరై పందాలను ఆసక్తిగా తిలకించారు. ఇక్కడ జరిగిన పందాల్లో పండగ మూడు రోజుల్లో కనీసం వంద కోట్లకు పైగా చేతులు మారాయని చెప్పుకుంటున్నారు. ఇక్కడ జరిగిన ప్రతీ పందెం కనిష్టంగా లక్ష, గరిష్టంగా రూ.20 లక్షల మద్య జరిగినట్లు చెప్పుకుంటున్నారు. ఇక్కడ జరిగిన పందాలకు హైదరాబాద్, విశాఖ, విజయనగరం జిల్లాల నుండి అధికంగా వీవీఐపిలు హాజరయ్యారు. మురమళ్ళ తరువాత మలికిపురం, రాజోలు, అల్లవరం మండలాల్లో కోడి పందాలు భారీగా జరిగినట్లు సమాచారం.
మండల కేంద్రాల్లో మినీ స్టేడియంల నిర్మాణం
*ఆర్థిక శాఖ మంత్రి యనమల
తొండంగి, జనవరి 16: రాష్ట్రంలో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు మండల కేంద్రాల్లో మినీ స్టేడియంలను నిర్మించనున్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మంగళవారం యనమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి స్వగ్రామమైన మండలంలోని ఏవీ నగరంలో మూడు రోజులపాటు నిర్వహించిన తుని నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీల ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి యనమల మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, అదే విధంగా క్రీడల్లో యువత పోటీపడాల్సిన అవసరం ఉందన్నారు. నార్త్ కొరియా వంటి చిన్న దేశాలు ఒలింపిక్ వంటి అంతర్జాతీయ స్థాయిలో ముందంజలో ఉండగా, అధిక మానవ వనరులు కల్గిన మన దేశంలో కూడా క్రీడలను ప్రోత్సహించి సముచిత స్థానం పొందేలా కృషి జరగాలన్నారు. రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రంలోను స్టేడియం నిర్మాణానికి అయిదెకరాల చొప్పున భూమిని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు మంత్రి తెలిపారు. యనమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో క్రీడాపోటీలు ఈ సంవత్సరం ప్రారంభించామని, ఇక నుంచి ఏటా నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. క్రీడలు కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రజలను ఐక్యపరుస్తామని, ప్రజాభివృద్ధిలో భాగంగా ఆరోగ్యం, ఆనందం కల్గి ఉండాలన్నారు. యనమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు రంగవల్లుల పోటీలు, చిన్నారులకు సంప్రదాయ దుస్తుల పోటీ నిర్వహించామన్నారు. మన దేశ సంస్కృతీ సంప్రదాయాలు ఎంతో ప్రాచీనమైనవని, వీటిని పరిరక్షించడంతోపాటు సంస్కృతీ పరిరక్షణ పట్ల యువతలో ఆసక్తిని పెంపొందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య సౌకర్యాల కల్పనలో యనమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 350 మంది గ్రామీణ విద్యార్థులకు ప్రతి నెలా రూ.500లు ఉపకార వేతనాలు అందిస్తున్నట్టు మంత్రి యనమల తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి యనమల పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ గ్రామీణ క్రీడలైన కబడ్డీ, వాలీబాల్, ఖోఖోను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో ముమ్మిడివరం మండలం గొల్లపల్లిలో ఫిబ్రవరి 13నుంచి ప్రత్యేక వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ పోటీల్లో జాతీయ స్థాయికి చెందిన స్ర్తి, పురుష క్రీడాజట్లు పాల్గొంటున్నట్టు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో బుచ్చయ్యపేట గ్రామానికి చెందిన జట్టుకు ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం వాకదాడిపేట, తృతీయ స్థానం తిమ్మాపురం జట్లకు దక్కాయి. విజేతలకు మంత్రులు యనమల, చినరాజప్ప చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందజేశారు. రంగవల్లుల పోటీల్లో విజేతలైన చిర్ల తేజస్విని, టి శివమంగ, యనమల బేబిలకు మంత్రుల చేతుల మీదుగా నగదు పురస్కారాలు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో తుని ఏఎంసీ ఛైర్మన్ యనమల కృష్ణుడు, తుని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పోలినాటి శేషగిరి, యనమల ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ యనమల శివరామకృష్ణ, కోశాధికారి సురేష్, ప్రసాద్, కాస్మో, ప్రజాప్రతినిధులు, ప్రజలు, మహిళలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
కన్నుల పండువగా ప్రభల తీర్థం
ముమ్మిడివరం, జనవరి 16: ముమ్మిడివరం నగర పంచాయితీ పల్లిపాలెంలో మంగళవారం ప్రభలతీర్థాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. కొత్తలంక, కొమానపల్లి, ముమ్మిడివరం ఉత్సవ ప్రభలతోపాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అనేక ప్రభలు పల్లిపాలెం తీర్ధం జరిగే ప్రాంతానికి తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముమ్మిడివరం సీఐ కెటిటివి రమణారావు ఆధ్వర్యంలో ఎస్సై బి ప్రభాకరావు భారీ బందోబస్తు నిర్వహించారు.