తూర్పుగోదావరి

ప్రజల వద్దకే ఆధునిక వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఏప్రిల్ 20: గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ ఆరోగ్య సమస్యలను గుర్తించి అక్కడికక్కడే ఆధునిక వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం చంద్రన్న సంచార చికిత్స వాహనాలను ఏర్పాటు చేసిందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. బుధవారం అమలాపురం ఏరియా ఆసుపత్రి వద్ద చంద్రన్న సంచార చికిత్స వాహనాన్ని రాజప్ప జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ఈ సంచార వాహనం గ్రామాలకు వెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకుని వైద్యసేవలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు అందిస్తుందన్నారు. ఈ వాహనంలో మెడికల్ ఆఫీసర్, టెక్నీషియన్, ఫార్మసిస్టు ఉంటారన్నారు. అమలాపురం డివిజన్‌కు ఆరు సంచార వాహనాలను మంజూరు చేశామన్నారు. గ్రామంలో ప్రతి రోగికి ఒక గుర్తింపు నెంబరు ఇస్తామని, అతను వేరే ప్రాంతానికి వైద్యం కోసం వెళ్లినప్పుడు ఆ నెంబర్ ద్వారా అతని ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం సులభమవుతుందన్నారు. ప్రతి రోగి ఆరోగ్య పరిస్థితి, వాహనంలోని సిబ్బంది వివరాలు, ఆ వాహనం ఎక్కడున్నదనే వివరాలు సిఎం డాష్ బోర్డుపై ప్రత్యేక్షమవుతాయన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించిన సంచార వైద్య చికిత్స ఇన్‌ఛార్జి డాక్టర్ డిఎం రాజ్‌కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నెలలో ఒకసారి వాహనం పర్యటిస్తుందని, రోగికి నెలకు సరిపడిన మందులు ఇస్తామన్నారు. హైదరాబాద్‌కు చెందిన పెరిమాళ్ల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ వాహనం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మున్సిపల్ ఇన్‌ఛార్జి ఛైర్‌పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మి, హెచ్‌డిసి ఛైర్మన్ మెట్ల రమణబాబు, నల్లా స్వామి, బత్తుల సాయి, ఎంపిపి బొర్రా ఈశ్వరరావు, జడ్పీటీసీ అధికారి జయవెంకటలక్ష్మి, ఆర్డీవో జి గణేష్‌కుమార్, డిఎంహెచ్‌ఒ ఉమాసుందరి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ పుష్కరరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

83వేల టన్నుల ధాన్యం సేకరణ
పెద్దాపురం, ఏప్రిల్ 20: జిల్లాలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 89 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ తెలిపారు. మండలంలోని కట్టమూరు పిఎసిసిలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రం నిర్వహణ, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 221 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ఈ కేంద్రాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయన్నారు. ధాన్యం కొనుగోళ్ల ద్వారా ఇప్పటి వరకు రైతులకు రూ..17.21 కోట్లు చెల్లించామన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు ప్రయాణ భత్యాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర సాధారణ రకం 75 కిలోల బస్తాకు రూ.1057, ఎ గ్రేడుకు రూ.1087 చెల్లిస్తున్నామన్నారు. రైతులు అమ్మిన ధాన్యానికి ప్రతి పైసా తప్పనిసరిగా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు చిన వీర్రాజు, ఎంఎస్‌ఓ లక్ష్మీకుమారి పాల్గొన్నారు.

పంటబోదెలోకి దూసుకెళ్లిన కారు
రాజోలు, ఏప్రిల్ 20: రాజోలు పోలీస్ స్టేషన్ సమీపంలో బుధవారం ఇన్నోవా కారు పంట బోదెలోకి దూసుకుపోయిన ప్రమాదంలో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శివకోడు నుండి రాజోలు వైపు వెళ్తున్న కారులో డైవరుకు ఫిట్స్ రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముందుగా కారు అదుపుతప్పి ఆటోను ఢీట్టి, తరువాత రోడ్డు ఆవలి వైపున ఉన్న పంట బోదెలోకి దూసుకుపోయింది. ఆ సమయంలో డ్రైవరుతోపాటు ఉన్న మరో వ్యక్తిని స్థానికులు కారు అద్దాలు పగులగొట్టి రక్షించారు.

సైకిల్ షాపులోకి దూసుకెళ్లిన లారీ
ఒకరు మృతి
ప్రత్తిపాడు, ఏప్రిల్ 20: మండలంలోని రాచపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం క్వారీ లారీ రోడ్డు పక్కనున్న సైకిల్ షాపులోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం లాటరైట్ మట్టి రవాణా చేసే లారీ టిప్పరు బుధవారం సాయంత్రం ఒమ్మంగిలోని బెంకులో ఆయిల్ పోయించుకొని తిరిగి జాతీయ రహదారిపైకి వెళ్తుండగా మధ్యలో రాచపల్లి గ్రామం మీదుగా వెడుతూ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న సైకిల్ షాపులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో రిపేరుచేస్తున్న ఈగర చక్రం (46)కు తీవ్ర గాయాలు కాగా, రిపేరు చేయించుకోవడానికి వచ్చిన సారిపల్లి శ్రీను, గండం అప్పారావుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు ముగ్గురిని ప్రత్తిపాడు ఆసుపత్రిలో చేర్చి పోలీసులు ప్రథమ చిక్సిత్స చేయించారు. చక్రం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా మార్గ మధ్యంలో మృతిచెందాడు.
కాగా చక్రం కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, ఒమ్మంగి, రాచపల్లి గ్రామాల మీదుగా లాటరేట్ లారీల రవాణా నిలుపుదల చేయాలని ఆ రెండు గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు. ప్రత్తిపాడు ఎస్సై నాగదుర్గారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.