తూర్పుగోదావరి

ఆక్వారంగ సమస్యలు పరిష్కరించకపోతే క్రాఫ్ హాలిడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఏప్రిల్ 17: ధరల పతనం, దళారుల బెడద, తెగుళ్ల కారణంగా నష్టపోతున్న ఆక్వా రైతులను ఆదుకోకపోతే క్రాఫ్ హాలిడే పాటించడానికి వెనుకాడేదిలేదని కోనసీమ ఆక్వా రంగ పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. రోజురోజుకీ పతనమవుతున్న రొయ్యల ధరలను క్రమబద్ధీకరించాలని డిమాండుచేస్తూ మంగళవారం స్థానిక క్షత్రియ కల్యాణ మండపంలో కోనసీమ ఆక్వా సాగుదారుల సమావేశం త్సవటపల్లి నాగభూషణం అధ్యక్షతన జరిగింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో జాతీయ మార్కెట్‌లో ఏ రోజూ ఆక్వా ధరలు పడిపోలేదని, అంతర్జాతీయ మార్కెట్టులో రొయ్యల ధరలు లాభసాటిగా ఉన్నా కొంతమంది ఎక్స్‌పోర్టర్లు, దళారులు ఆక్వా రైతులను అయినకాడికి దోచుకుంటున్నారని నాయకులు ఆరోపించారు. అలాగే ఆక్వా ధరల్లో హెచ్చుతగ్గులు నిలకడగా ఉండేలా ఎక్స్‌పోర్టర్లు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయంచేసే రైతు తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించే వరకు ఆ ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం స్టోరేజ్ గొడౌన్ సదుపాయం కల్పిస్తుందని, అలాగే ఆక్వా ఉత్పత్తులకు కూడా గిట్టుబాటు ధర లభించే వరకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చెయ్యాలని ఆక్వా సాగుదారులు, రైతు సంఘ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకోకపోతే గతంలో వ్యవసాయ రైతులు చేపట్టిన మాదిరిగా తాము కూడా క్రాఫ్ హాలిడే ప్రకటించి ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఆక్వా రంగాన్ని ప్రోత్సహిస్తున్నా జిల్లా యంత్రాంగం తీరు కొంత ఇబ్బంది కలిగిస్తోందని కోనసీమ ఆక్వారంగ ప్రతినిధి త్సవటపల్లి నాగభూషణం ఆరోపించారు. ముఖ్యంగా విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్‌పోర్టర్లకు ప్రభుత్వం ఆరు శాతం వడ్డీ రాయితీ కల్పిస్తోందని, రైతులకు వెన్నుదన్నుగా ఉంటున్న ట్రేడర్ల ఓడీలపై కూడా వడ్డీ రాయితీ కల్పించాలని నాగభూషణం విజ్ఞప్తి చేశారు. అనంతరం మత్య్స శాఖ జాయింట్ డైరెక్టర్ కోటేశ్వరావు మాట్లాడుతూ రైతులందరు ఏడాదికి రెండు పంటలు మాత్రమే సాగుచేసుకోవాలని, తద్వారా అధిక దిగుబడులు రాబట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. అంతే కాకుండా పంటకూ పంటకూ మధ్య రెండు నెలలు వ్యవధి ఉండేలా చూసుకోవాలని జేడీ సూచించారు. జిల్లాలో 17,400 హెక్టార్లలో ఆక్వాసాగు జరుగుతుందని, ప్రత్యక్షంగా 50 వేలు, పరోక్షంగా మరో 1.5 లక్షల మంది కార్మికులు ఈ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారన్నారు. ఇటీవల ప్రభుత్వం ఆక్వా కల్చర్ ప్రోత్సహానికి ఆక్వా జోన్స్ ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. పంట తీసిన తర్వాత చెరువును పూర్తిగా ఎండబెట్టి దున్నాలని, సీడు ఎంపికలో రాజీపడవద్దన్నారు. సాగు జరగుతున్న సమయంలో నీటి నమూనాలను కనీసం 20 సార్లు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అనంతరం ఆక్వా రైతులంతా వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జేడీ కోటేశ్వరావుకు అందజేశారు. సమావేశంలో కోనసీమ ఆక్వా రైతుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు అల్లూరి రమేష్‌రాజు, ముమ్మిడివరం ఏఎంసీ ఛైర్మన్ గొలకోటి దొరబాబు, ఆక్వా రైతు సంఘ నాయకులు మంతెన రామరాజు, త్సవటపల్లి నాగేంద్ర, చెయ్యేరు సూరిబాబురాజు, సాగిరాజు సూరిబాబు, యాళ్ల బ్రహ్మానందం, దాట్ల పృధ్వీరాజు, అల్లూరి సత్తిబాబురాజు, బండిగుప్తపు రంగా, రవిరాజు, సైయప్పరాజు వెంకటసత్యనారాయణరాజు, వేగిరాజు వెంకటరాజులతోపాటు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.