తూర్పుగోదావరి

క్రికెట్ బుకీల కోసం స్పెషల్ పోలీసుల గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనపర్తి, జూన్ 19: అనపర్తి ప్రాంతానికి వదలని చీడలా పట్టుకున్న క్రికెట్ బెట్టింగ్‌ను తుద ముట్టించాలని పోలీసులు ఎంతోకాలంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దానికి ఆద్యులైన, బాధ్యులైన వారి వద్దనున్న డబ్బు, అధికార పైరవీలు పోలీసుల చేతులు కట్టి వేస్తూనే వచ్చాయి. బెట్టింగ్ నిర్వాహకులుగా ఉన్న బుకీలను అణచివేయడం కోసం జిల్లా ఎస్పీ తీసుకున్న నిర్ణయాలతో కొన్ని ప్రత్యేక బృందాలు తెరమీదకు వచ్చాయి. అందులో భాగంగా దాదాపు నాలుగురోజులుగా ఒక బృందం అనపర్తి మండలంలోని అనపర్తి, కుతుకులూరు, రామవరం, మహేంద్రవాడ గ్రామాల్లో బెట్టింగ్ వ్యాపారాన్ని విస్తరించి బుకీలుగా వర్థిలుతున్న వారిని అనే్వషించి అవసరమైతే తరలింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా అనపర్తి సర్కిల్ పరిధిలో గల బుకీల వివరాలను చేతపట్టుకుని గ్రామాల్లో వేట కొనసాగిస్తున్నారు. ముందుగా కుతుకులూరు గ్రామ బుకీలపై దృష్టిసారించారు. గ్రామంలో ఉన్న క్రికెట్ బుకీల ఇళ్లకు వెళ్లి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. అందుబాటులో ఉన్నవారిని అదుపులోకి తీసుకోవడంతో మిగిలిన బుకీలలో ఆందోళన పెరిగిపోయి చాలామంది అజ్ఞాతంలోకి జారుకున్నారు. బుకీలలో ఎక్కువమంది ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరులుగా చలామణి అవుతున్నారు. మూడురోజుల క్రితం ప్రతిపక్ష పార్టీ మండలస్థాయి నాయకుడిని, అధికార పార్టీ సానుభూతిపరుడు, మాజీ ప్రజాప్రతినిధిని అనుకోని పరిస్థితుల్లో కాకినాడకు తరలించారు. వారిని పూర్తిస్థాయిలో విచారించి, తదనంతరం పూచీకత్తుపై తిరిగి పంపించి వేసినట్టు తెలిసింది. క్రికెట్ బుకీలుగా పోలీసు రికార్డుల్లో ఉన్న కొంతమంది అధికార పార్టీని ఆశ్రయిస్తుండగా, మరికొంతమంది అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. రామవరం, మహేంద్రవాడ గ్రామాలకు చెందిన బుకీలు మాత్రం యథావిధిగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నాశనమవ్వడానికి, మానసికంగా కుంగిపోవడానికి కారణభూతమైన క్రికెట్ బెట్టింగ్ దెయ్యాన్ని పూర్తిగా వదిలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయాగ్రామాల్లో తల్లిదండ్రులు చేతులెత్తి పోలీసులను వేడుకుంటున్నారు. బెట్టింగ్ వ్యాపారంలో లెజెండ్‌లుగా ఉన్నవారిని మాత్రం పోలీసులు కూడా ముట్టుకోవడానికి ఎందుకో మీనమేషాల్ని లెక్కిస్తున్నారు. చితుకు చేపలు, పిత్తపరిగెలుగా ఉన్నవారిని మాత్రం స్టేషన్లకు పిలిచి హంగామా చేస్తున్నారు. గత రెండు వారాల క్రితం బెట్టింగ్‌కు సంబంధించి పోలీసు రికార్డులకెక్కిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయమని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. దీనితో స్థానిక పోలీసులు రెండురోజులపాటు చాలా హడావిడి చేశారు. చిన్నాచితక బుకీలను తీసుకొచ్చి గంటలు, గంటలు నిరీక్షణ చేయించి తంతు పూర్తి చేశామనిపించారు. ఓ స్థారుూ బుకీలు మాత్రం రైటర్ వ్రాతపూర్వక తంతు పూర్తి చేశాక వచ్చి సంతకాలు చేసి వెళ్లారు. ఆపై స్థాయి బుకీలు మాత్రం నేటికీ కూడా స్టేషన్ గడప కూడా తొక్కకుండా తమ పనులను పూర్తి చేయించుకుంటున్నారు. రికార్డుల్లో ఉన్న బుకీల సంఖ్యనే ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం పోలీసులు తప్పులో కాలేసినట్టమవుతుంది. పైన తెలిపిన గ్రామాల్లో చాలామంది బుకీలుగా అవతారమెత్తి హాయిగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారి బారిన చాలా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వారసత్వంగా వచ్చిన పొలాలను, స్థలాలను అమ్మి బుకీలకు జమ కడుతున్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వీటి నుంచి యువతను రక్షించడం కోసం చిన్నా, పెద్దా అనే తారతమ్యం లేకుండా బుకీలందరినీ అదుపులోకి తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.