తూర్పుగోదావరి

కొనసాగుతున్న గాలింపు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐ పోలవరం, జూలై 20: పశువుల్లంక వడవ ప్రమాదంలో గల్లంతైన వారికోసం అధికార యంత్రాంగం గోదావరిలో, సముద్ర తీరంలో గాలింపు చర్యలు శుక్రవారం కూడా కొనసాగించింది. ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా గల్లంతైన వారిలో ముగ్గురు విద్యార్థుల ఆచూకీ దొరకకపోవడంతో బాధిత కుటుంబాలు ఆవేదనతో కుమిలిపోతున్నారు. శేరిల్లంక సీతారమపురానికి చెందిన అక్కాచెల్లెల్లు పోలిశెట్టి అనూష, సుచిత్రతో పాటు కొడేపూడి రమ్య ఆచూకీ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎఫ్‌డీఆర్‌ఎఫ్, మెరైన్, బృందాలతో పాటు స్థానిక మత్య్సకారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మృతుల ఆచూకీ దొరికే వరకు గాలింపు చర్యలు నిర్వహిస్తామని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు.

మన్యంలో కుండపోత వర్షం
రాజవొమ్మంగి, జూలై 20: ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి మండలంలో శుక్రవారం తెల్లవారుజామున ఆరు గంటలపాటు కుండపోత వర్షం కురిసింది. దీనితో పలు వాగులు పొంగి ప్రవహించాయి. రాజవొమ్మంగి శివారున ఉన్న వట్టిగెడ్డ వాగు, జడ్డంగి మడేరు వాగు, మర్రిపాలెం వద్ద కొక్కెరగెడ్డ వాగు పొంగి ప్రవహించడంతో గంటల కొద్దీ రాకపోకలు నిలిచిపోయాయ. స్థానిక తహసీల్దార్ జె శ్రీనివాస్ అప్పలరాజుపేటలో ఉన్న వట్టిగెడ్డ వాగును పరిశీలించారు. వాగులోకి భారీగా వరదనీరు చేరడంతో వట్టిగెడ్డ కాల్వలు పొంగి ప్రవహించాయి. ఈ వాగు ప్రవహిస్తున్న చిన్నంపల్లి, గింజర్తి, రాజవొమ్మంగి పరిసర ప్రాంతాల్లో పోలీసు పహారా ఏర్పాటుచేశామని తహసీల్దార్ వెల్లడించారు. పొంగి ప్రవహిస్తున్న వాగును దాటి వెళ్లవద్దని సీఐ త్రినాథ్, ఎస్సై రవికుమార్‌లు హెచ్చరించారు. కాగా అమ్మిరేకుల- కొత్తవీధి గ్రామాల మధ్యగల కల్వర్టు వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీనితో రెండు గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. సుమారు 1500 మీటర్ల మేర ఈ రహదారి దెబ్బతింది.
గ్రామస్థులను రక్షించిన పోలీసులు
రాజవొమ్మంగి, జూలై 20: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో మోటారు బైకుతోపాటు కొట్టుకుపోతున్న ఇరువురిని గ్రామస్థుల సహాయంతో పోలీసులు రక్షించిన సంఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. నెల్లిమెట్ల సమీపంలో రహదారిపై చిన ఏరు శుక్రవారం ఉదయం కురిసిన కుండపోత వర్షానికి ఉద్ధృతంగా ప్రవహించ సాగింది. కాకినాడ నుంచి లాగరాయి గ్రామానికి ఒక శుభకార్యం నిమిత్తం ముగ్గురు కుటుంబ సభ్యులు బైకుపై ప్రయాణమై వచ్చారు. వాగు ప్రవాహాన్ని చూసి భార్య వాగు వద్ద ఉండిపోగా, భర్త, కుమార్తె వాగు దాటేందుకు ప్రయత్నించారు. వాగు మధ్యలోకి వెళ్లే సరికి వరద ప్రవాహం మరింత పెరగడంతో బైకుతో సహా ఇరువురూ కొట్టుకుపో సాగారు. కళ్ల ముందే భర్త, కుమార్తె కొట్టుకుపోవడంతో భార్య కూడా పరుగున వాగులోకి వెళ్లసాగింది. అప్పుడే అక్కడికి విధి నిర్వహణకు చేరుకున్న హెచ్‌సీ సువర్ణబాబు, పీసీ పెద్దబ్బాయిలు ఆమెను వారించారు. గ్రామస్థుల సహాయంతో పోలీసులు వాగులోకి దిగి కొమ్మలు పట్టుకున్న వేలాడుతున్న తండ్రి, కూతురిని తాళ్ల సహాయంతో బయటకు తీసుకురావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం వాగు ఉద్ధృతి తగ్గిన తరువాత బైకును కూడా బయటకు తీశారు.
అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా చూడాలి
కాకినాడ, జూలై 20: లారీల సమ్మె సందర్భంగా నిత్యావసర సరుకుల రవాణాకు, అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా చూడాలని జెసి ఎ మల్లికార్జున అధికారులను, లారీ యాజమానుల సంఘం ప్రతినిధులను కోరారు. శుక్రవారం కలెక్టరేట్ కోర్టుహాలులో రవాణా, పోలీస్, పౌరసరఫరాలు, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులు, జిల్లా లారీ యాజమానుల సంఘం ప్రతినిధులతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో శుక్రవారం నుండి దేశ వ్యాప్తంగా లారీల నిరవధిక సమ్మె ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసర సరుకుల రవాణాకు విఘాతం కలుగకుండా చేపట్టాల్సిన చర్యలు, మినహాయింపులపై జెసి సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మల్లికార్జున మాట్లాడుతూ సమ్మె సందర్భంగా రవాణాకు సమ్మె చేస్తున్న లారీ యాజమానుల సంఘాలు ఎటువంటి అవాంతరాలను కలగకుండా సహకరించాలని, ఎవరైనా ఆటంకాలు, ఇబ్బందులను కలుగజేస్తే ఎస్మా చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిత్యావసర సరుకుల రవాణాను ఎవరైనా ఆటంకం చేసేందుకు పూనుకుంటే వారిని అదుపులోకి తీసుకోవాలని పోలీస్ శాఖను జెసి ఆదేశించారు. సరుకుల రవాణాను దాదాపు పూర్తి చేసామని వీటిని ఇతర శాఖల ట్రాక్టర్ల ద్వారా సేవలను వినియోగించుకోవాలని డిఎస్‌ఓకు సూచించారు. అవసరమైతే ఎరువుల రవాణాకు ఆర్టీసీ గూడ్స్ వాహనాలను అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ మేనేజర్‌ను కోరారు. మిర్చి, టమాటా, ఉల్లి, బంగాళాదుంపల రవాణా చేసే వాహనాలను సమ్మె నుండి మినహాయించాలని లారీ యాజమానుల సంఘాన్ని కోరారు. నిత్యావసర సరుకులను దాచిపెట్టి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. కూరగాయల ధరలు పెంచుకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎస్టేట్ అధికారులను ఆదేశించారు. లారీ యాజమానుల సంఘం సమస్యలు కేంద్ర, రాష్ట్ర స్ధాయిలో ఉన్నాయని యాజమానులు డిమాండ్లను అందిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకరిస్తామని జిల్లా లారీ యాజమానుల సంఘం అధ్యక్షుడు రాజాన సూర్యప్రకాష్, కార్యదర్శి జి మృత్యంజయరావులు జెసికి తెలిపారు. ఈ సమావేశంలో డిటిసి సిరి ఆనంద్, ఆర్టీసీ ఆర్‌ఎం సి రవికుమార్, కాకినాడ ఆర్డీవో ఎల్ రఘుబాబు, డిఎస్‌ఓ పి ప్రసాదరావు, మార్కెటింగ్ ఎడి కిషోర్, ట్రాఫిక్ డిఎస్పీ కెవి సత్యనారాయణ, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరలు పాల్గొన్నారు.
23,24 తేదీల్లో ఎంపీఈడీ కోర్సు ప్రవేశాలు

రాజమహేంద్రవరం, జూలై 20: ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉభయ రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ద్వారా ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలను ఈ నెల 23, 24 తేదీలలో నిర్వహించనున్నట్టు వీసీ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు తెలియజేశారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో అన్ని వసతులు వున్నాయని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నన్నయ సెట్ రాయని విద్యార్ధులు కూడా ఈ ప్రవేశాలను పొందవచ్చని, రెండు తెలుగు రాష్ట్రాల్లో బీపీఈడీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఇదో చక్కని అవకాశమన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులకు యూనివర్సిటీలో ప్రత్యేక హాస్టల్ వసతి, గ్రంథాలయం, క్రీడామైదానం తదితర వసతులు ఉన్నాయని పేర్కొన్నారు.