తూర్పుగోదావరి

వరద గోదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 17: గోదావరి హారతి కార్యక్రమానికి వరద తాకిడి ఎదురైంది. దేవీపట్నం మండలంలో గోదావరి నదికి వచ్చిన వరదల కారణంగా 33 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గురువారం సాయంత్రం వరకూ తగ్గుముఖం పట్టినట్టు అనిపించిన గోదావరి వరద రాత్రి నుంచి మళ్లీ ఉగ్రరూపం దాల్చి శుక్రవారం ఉదయం 9గంటలకు గ్రామాలను చుట్టుముట్టి తన ప్రతాపాన్ని మరోసారి చూపించింది. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో నిత్యం గోదావరి నదికి హారతి కార్యక్రమాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంటారు. శుక్రవారం పుష్కర ఘాట్‌లో 16.66 మీటర్ల ఎత్తులో వరద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో భద్రతా చర్యల నేపధ్యంలో ఘాట్ లోపలికి సందర్శకులను అనుమతించని పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో పోలీసులు ఘాట్‌లో పహారా కాస్తున్నారు. స్నానాలకు సందర్శకులను నదిలోకి దిగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ స్థితిలో నిత్యం ఇచ్చే గోదావరి హారతి కార్యక్రమాన్ని రోజూ ఇచ్చే స్థలంలో కాకుండా వేరొక చోటకు తాత్కాలికంగా మార్పు చేశారు. గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో ఘాట్‌లోని రేకుల షెడ్డులో వేదపండితులు గోదావరి నదికి హారతి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇదిలావుండగా గోదావరి స్నానఘట్టాల్లోకి ఎవరూ దిగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాల మేరకు స్థానిక సబ్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, నగరపాలక సంస్థ కమిషనర్ సుమిత్‌కుమార్ గాంధీ ఘాట్లలో పరిస్థితులను ఎప్పటికపుడు సమీక్షిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దేవీపట్నం: దేవీపట్నం జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ఉదయం 7గంటలకు రెండడుగుల మాత్రమే నమోదైన వరద, సాయంత్రానికి సుమారు పది అడుగుల మేరకు చేరి ప్రమాద స్థాయికి చేరుకుంది. మండలంలో వరద ఉధృతి రెండవ ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. కొండమొదలు పంచాయతీలో 12 గ్రామాలు, తున్నూరు పంచాయతీలో అయిదు గ్రామాలు, మంటూరు పంచాయతీలో అయిదు గ్రామాలు, దేవీపట్నం పంచాయతీలో 8 గ్రామాలు, బోడిపల్లి, చిన రమణయ్య పంచాయతీలో అయిదు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. చిన రమణయ్యపేట గ్రామం వద్ద గెడ్డ కాలువకు వరద నీరు, భూపతిపాలెం రిజర్వాయర్ నీరు రావటంటో కాజ్‌వైపై ప్రమాద స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద శుక్రవారం రాత్రికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయానికి దేవీపట్నం మండలంలో వరద మరింత పెరగవచ్చునని స్థానిక అధికారులు అంచనా వేసి, తగు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దేవీపట్నం నుంచి ఎ వీరవరం వరకూ, తొయ్యేరు డీఆర్ డిపో నుంచి జడ్పీ ఉన్నత పాఠశాల వరకూ నాటు పడవల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకూ ప్రభుత్వం పడవలను ఏర్పాటుచేయలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరదలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం: చిన రాజప్ప
ధవళేశ్వరం, ఆగస్టు 17: ఏటా ఆగస్టులో గోదావరి నదికి వరదలు రావటం సహజమేనని, అయితే ఈ ఏడాది మాత్ర, గోదావరి నదికి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం, అధికారులు సమర్థవంతంగా చర్యలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయటంతో వరద పరిస్థితిపై నేరుగా కాటన్ బ్యారేజ్ వద్దకు వచ్చి ఇరిగేషన్ ఎస్‌ఈ ఎన్ కృష్ణారావుతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి రాజప్ప మాట్లాడుతూ ప్రస్తుతం గోదావరి నుంచి 12 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారని, రాత్రి 9గంటల తర్వాత రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 47 అడుగులకు చేరుకుని తగ్గుముఖం పట్టిందని, దిగువనున్న లంక గ్రామాల ప్రజలు నాటు పడవలు ద్వారా ప్రయాణించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని, మిషనరీ బోట్లు ఉపయోగించి ప్రజలను లంక గ్రామాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలిపారు. వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబునాయుడు కలెక్టర్‌తో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారన్నారు. వర్షం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏటిగట్లను పూర్తిగా అధికారులు పరిశీలించారని, బలిష్ఠంగా ఉన్నాయన్నారు. మంత్రి రాజప్ప వెంట రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, టీడీపీ నాయకులు యర్రమోతు ధర్మరాజు, సావాడ శ్రీనివాసరెడ్డి, పిన్నింటి ఏకబాబు, మహ్మద్, వర్రే చిన్ని, దక్షిణ మండలాల డీఎస్పీ భరత్ మాతాజీ, సీఐ ఎం కృపానందం తదితరులు ఉన్నారు.
భయపెడుతున్న కార్యాలయ భవనాలు
*అధికారుల పర్యవేక్షణ కరవు
కొత్తపేట, ఆగస్టు 17: కొత్తపేటలో ఎప్పుడో బ్రిటీషు కాలంలో నిర్మించిన భవనాలు పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు పట్టించుకోకుండా కాలయాపన చేయటంతోనే ఇటువంటి దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేటలోని ఉపఖజానా కార్యాలయం కూలిన ఘటనలో ఒక మహిళా ఉద్యోగి మృతితో ఇటు నేతలు, అటు అధికారులు ఆఘమేఘాలపై ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి ఆత్మ విమర్శలు చేసుకోవడం, తప్పొప్పులు సరిదిద్దుకుని ముందుగానే మేల్కొని ఉంటే ఇటువంటి ఘటన జరిగి ఉండేది కాదని పేర్కొంటున్నారు. కొత్తపేటలో 1898లో నాటి బ్రిటీషు కాలం నాడు నిర్మించిన ఈ పురాతన భవనంలో తహసీల్దార్ కార్యాలయం, ఉపఖజానా కార్యాలయం, ఫైర్ ఆఫీస్, వెనుక సబ్‌జైలు నడుస్తున్నాయి. సుమారు 125 ఏళ్లు సేవలు అందించిన ఈ భవనం గత అయిదు సంవత్సరాల నుంచి ఏదో ఒక మూల వర్షం నీరు కారడం దూలాలు శ్లాబు నుంచి వేరు కావడం కళ్ల ముందు కనిపిస్తున్నా ఆయా కార్యాలయాల అధినేతలు పట్టించుకోకపోవడంతోనే ఒక నిండు ప్రాణం నేడు బలికావాల్సి వచ్చిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే ఆఫీసుకు సంబంధించిన అధినేతలు ముందుగానే ఆయా శాఖల ద్వారా ఎమర్జెన్సీ రిపేర్లకు ప్రతిపాదనలు పంపించి శ్లాబులను పటిష్టపరచినట్టతే ఈసంఘటనలు జరిగి ఉండేవి కావని పలువురు మేధావులు విశే్లషిస్తున్నారు. ఇప్పటికైనా శిధిలావస్థకు చేరుకున్న భవనానికి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.
నిధులు మంజూరైనా నిర్మాణం ఎందుకు చేయలేదు
కొత్తపేట ఉపఖజానా కార్యాలయ భవన నిర్మాణానికి సుమారు ఏడు లక్షల రూపాయల నిదులు మంజూరు అయి చాలా రోజులు గడుస్తున్నా నిర్మాణం ఎందుకు చేయలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిధులు విడుదల చేసే కార్యాలయానికే నిధులు విడుదల చేయటం ఎందుకు జరగలేదో తెలియని పరిస్థితి. భవనం పరిస్థితిపై తెలిసినా ఆ శాఖ అధికార్ల నిర్లక్ష్యంతో నిధులు విడుదల కాలేదనే తెలుస్తోంది. కొత్త కార్యాలయం నిర్మాణానికి అనుమతులు వచ్చినా దానిని అమలు చేయటంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది.
తహసీల్దార్ కార్యాలయం ఖాళీ చేయాలి
శిథిలావస్థలో ఉన్న కొత్తపేట తహసీల్దార్ కార్యాలయంతో పాటు సబ్ ట్రెజరీ కార్యాలయాలను తక్షణమే ఖాళీ చేయాలంటూ ఆదేశాలు వచ్చాయి. దీంతో వెంటనే కార్యాలయాలను ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అడ్డతీగలలో డెంగ్యూ ఛాయలు
*పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం*శాఖల సమన్వయ లోపంతో పెచ్చురిల్లుతున్న దోమలు
అడ్డతీగల, ఆగస్టు17: మండల కేంద్రమైన అడ్డతీగలలో అనారోగ్యకర వాతావరణం తాండవిస్తోంది. గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాల్సిన పంచాయతీ కార్యదర్శి నిర్లిప్త ధోరణితో వ్యవహరిస్తున్నారు. మలేరియా శాఖకు సహకరించాల్సిన పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం మూలంగా దోమల నివారణ జరగకపోగా పెచ్చురిల్లుతున్నాయి. ఈనెల 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహణకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అడ్డతీగలలో కానరాలేదు. రోడ్డుపై నీరు నిల్వ ఉన్న ఎడల, చెత్తకుప్పలు నిల్వ ఉన్న ఎడల సంబంధిత పంచాయితీ కార్యదర్శి, విస్తరణాధికారులకూ ఫోటోలతో సహా షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నప్పటకీ గ్రామంలో శానిటేషన్ నిర్వహణకు ఉపక్రమించలేదంటే ఉన్నతాధికారుల ఉత్తర్వులపై ఆ కార్యదర్శికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతోంది. మలేరియా శాఖ అధికారులు పంచాయితీ పరిధిలో రమారమి 39 అత్యంత అపారిశుద్ధ్య పరిస్థితులున్న ప్రదేశాలు, వీధుల్లో రహదారులకు ఆనుకుని నివాసితులు ఏర్పాటుచేసుకున్న మురుగుకుంటలును వెంటనే శుభ్రం చేయించి మూసివేయించాలని నెలరోజుల క్రితమే ఫొటోలతో సహా లిఖిత పూర్వకంగా తెలియజేసినప్పటికీ కూడా స్పందించకపోవడం కార్యదర్శి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇళ్లల్లో వాడకపు నీరు కొన్నిచోట్ల యథేచ్ఛగా రోడ్లుమీద పారుతుండటం, మరికొన్ని చోట్ల నిల్వచేసి రాత్రివేళ వదిలి పెడుతుండటంతో సమీప ప్రాంతాల్లో అపారిశుద్ధ్య పరిస్థితులు నెలకొని దోమల వృద్ధికి కారణమవుతోంది. దోమల నివారణకు మలేరియాశాఖ ఎన్నిసార్లు పిచికారీ చేసినా అపారిశుద్ధ్య పరిస్థితులపై గ్రామపంచాయతీ నుంచి చర్యలు చేపట్టనంత కాలం దోమల నివారణ సాధ్యపడదని ఆ శాఖ అధికార్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ప్రస్తుతం మలేరియా, టైఫాయిడ్ వ్యాధుల వ్యాప్తికి సీజన్ కావడంతో జ్వరాలతో ఆసుపత్రులకు వెళుతున్న రోగులకు రక్తపరీక్షలు నిర్వహిస్తుంటే మలేరియా, టైఫాయిడ్ బయటపడుతున్న సాధారణ జ్వరంగానే వైద్యసేవలు అందిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రక్తపరీక్షల్లో బహిర్గతమైనట్టు మలేరియా, టైఫాయిడ్ అధికారికంగా లెక్కల్లో చూపించి వైద్యం అందిస్తే కేసుల సంఖ్య పెద్దగా కనబడి ఇక్కడి మలేరియా శాఖ పనితీరు అంచనావేస్తారని ఈ జిమ్మిక్కు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు కాకినాడ, రాజమండ్రి వంటి పట్టణ ప్రాంతాలలో వైద్యం చేయించుకొనేందుకు వెళుతున్న రోగులకు డెంగ్యూ లక్షణాలుగా నిర్ధారిస్తున్నారు. ఇటీవల స్థానికంగా గురుకుల పాఠశాల ప్రాంగణంలో నివాసముంటున్న ఓ ఉపాధ్యాయుడి కుమార్తె మలేరియా, టైఫాయిడ్ లక్షణాలతో మృతిచెందిందంటే దాని తీవ్రత చాపకింద నీరులా ఎలా ఉందో అంచనా వేయవచ్చు. ప్రస్తుతం గత వారం రోజులుగా విడవకుండా కురుస్తున్న వర్షానికి గ్రామంలో అపారిశుద్ధ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఈపరిస్థితి కారణంగా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలేందుకు అవకాశాలున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో శానిటేషన్ నిర్వహణకు రోజువారీ చేసే పనిని కూడా చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇక వర్షం వస్తే పరిస్ధితి తీవ్రతను అంచనా వేయవచ్చని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో తాండవిస్తున్న అపారిశుద్ధ్య పరిస్థితులు సరిచేయకపోతే వ్యాధులు ప్రబలుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం, మలేరియా, పంచాయితీ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా పెచ్చురిల్లుతున్న దోమల నివారణకు ప్రత్యేక చర్యలు వెంటనే చేపట్టాలని స్థాకులు కోరుతున్నారు.