తూర్పుగోదావరి

రూ.6.35 కోట్ల పనులకు కౌన్సిల్ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిఠాపురం, సెప్టెంబర్ 19: పిఠాపురం మున్సిపాల్టీ పరిధిలో ఉన్న ఎస్సీ వార్డుల్లో అభివృద్ధి పనులు, వౌలిక సదుపాయాల కల్పనకు రూ.6.35 కోట్ల నిధులకు ఆమోదం తెలుపుతూ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల మాటేంటని కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. బుధవారం పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ కరణం చిన్నారావు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో పలు సమస్యలపై కౌన్సిల్ చర్చించి నిర్ణయాలు తీసుకుంది. పట్టణంలో 40 శాతం ఎస్సీలు జీవిస్తున్న అన్ని వార్డులను పరిగణలోకి తీసుకుని రోడ్లు, డ్రెయిన్లు, పార్కుల అభివృద్ధితోపాటు, ఇతర వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. వీటితోపాటు ఎమ్మెల్యే వర్మ సిఫార్సు మేరకు పట్టణంలో విశ్వబ్రాహ్మణులకు 10 సెంట్ల స్థలంలో కమ్యూనిటీ హాలు, 17వ వార్డులో పాతయాదవ వీధిలో కమ్యూనీటి హాలు, 28వ వార్డుల్లో రెల్లి కులస్తులకు కమ్యూనిటీ హాలు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. గోర్సరోడ్డులో 874 మందికి నిర్మించిన గృహాలకు సంబంధించి తాగునీరు, డ్రెయినేజీల ఏర్పాటుతోపాటు ఇతర సౌకర్యాల కల్పనకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కౌన్సిలర్లు నామా దొరబాబు, రెడ్డెం భాస్కరరావు, ఖండవల్లి లోవరాజులు పనులు ఆలస్యంపై ఏ ఈ వంశీ అభిషేక్‌ను నిలదీశారు. తన వార్డులో ఎస్సీలున్నప్పటికీ నిధులు ఎందుకు కేటాయించలేదని 6వ వార్డు కౌన్సిలర్ బంగారు ద్వారక మండిపడ్డారు. దీనిపై స్పందించిన ఏఈ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం 40 శాతం ఎస్సీలున్న ప్రాంతాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నామన్నారు. 22వ వార్డు కౌన్సిలర్ ఖండవల్లి సుబ్బారావు మాట్లాడుతూ తన వార్డులో పంటకాలువలను కొంత మంది రియాల్టర్లు ఆక్రమించి పూడ్చేశారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉప్పాడ బస్టాండు వద్ద సులభ్‌కాంప్లెక్స్ నిర్మిస్తారని చెప్పి నాలుగేళ్లు అవుతుందని ఎందుకు పట్టించుకోలేదని 13వ వార్డు కౌన్సిలర్ శీరం అప్పారావు అధికారులను ప్రశ్నించారు. చివరగా మాట్లాడిన కమిషనర్ జి సృజన తాను అన్ని వార్డుల్లో సమస్యలు ఒకొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని కౌన్సిల్‌కు హామి ఇచ్చారు.

24న పార్ట్‌టైమ్ యోగా కోర్సుకు చివరి కౌన్సిలింగ్
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 19: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రాపర్తిరామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగ నిర్వహిస్తున్న ఒక సంవత్సరం పార్ట్‌టైమ్ యోగా కోర్సుకు చివరి కౌన్సిలింగ్ ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్నట్టు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ డి జ్యోతిర్మయి తెలిపారు. ఏదైన డిగ్రీ చదివిన విద్యార్ధులు ఈ కోర్సుకు అర్హులన్నారు. ఆసక్తి గల వారు 24వ తేదీ ఉదయం పది గంటలకు యూనివర్సిటీలోని డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ విభాగాన్ని సంప్రదించాలన్నారు. అడ్మిషన్ల కోసం వచ్చే అభ్యర్ధులు ఒరిజినల్ సర్ట్ఫికేట్లు, ఫొటోలతో హాజరు కావాలన్నారు. ఇదే చివరి కౌన్సిలింగ్ గడువు అని తెలిపారు.

పంచలోహ శ్రీచక్రం బహూకరణ
రామచంద్రపురం, సెప్టెంబర్ 19: దక్షిణకాశీ ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారికి ధవళేశ్వరం గ్రామానికి చెందిన మామిడి వెంకటేశ్వరరావు, మహేశ్వరి దంపతులు పంచలోహాలతో కూడిన శ్రీ చక్రంను బుధవారం అందించారు. కార్యాలయ ప్రాంగణంలో ఈవో పెండ్యాల వెంకట చలపతిరావు పంచలోహ శ్రీ చక్రాన్ని మహేశ్వరి నుండి అందుకున్నారు.