తూర్పుగోదావరి

కాషాయ శ్రేణుల్లో కదన కుతూహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 19: కమలనాథుల్లో సరికొత్త ఉత్సాహం తొంగిచూసింది. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని సూర్యకళామందిరంలో బుధవారం నిర్వహించిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర సమావేశం ఇందుకు కారణమయ్యింది. పార్టీ కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొనగా, జిల్లా నలుమూలల నుండి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. సభా వేదిక వద్ద ముఖ్య నేతల ప్రసంగాలు ఆద్యంతం కార్యకర్తలను ఆకట్టుకున్నాయి. మరోవైపు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వివిధ వర్గాలు కమలనాథులకు వినతిపత్రాలు సమర్పించుకున్నాయి. కాకినాడ ఎస్‌ఇజడ్ బాధిత నిర్వాసితులు సభావేదిక వద్దకు వచ్చి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. రిజర్వేషన్ల సమస్యపై దళితులు, తమను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ రజకులు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా వేటుకూరి సూర్యనారాయణరాజు బాధ్యతలు స్వీకరించారు. తొలుత అటల్ బిహారీ వాజ్‌పేయి మృతి పట్ల రెండు నిముషాల వౌనం పాటించారు. సభకు వేటుకూరి సూర్యనారాయణరాజు అధ్యక్షత వహించగా ముందుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ నిధులు కేంద్రానికి, సోకులు రాష్ట్రానివని వ్యాఖ్యానించారు. కేంద్రం నిధులతో పథకాలు అమలుచేస్తూ ప్రథాని ఫొటో లేకుండా, చంద్రబాబు ఫొటోలను ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రం నిధులే రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారని, చంద్రబాబు ఆయా పథకాలను తన స్వంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాలో ఇసుక, మైనింగ్, మద్యం మాఫియా రాజ్యమేలుతోందన్నారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సునీల్ దేవదర్ ప్రసంగాన్ని దగ్గుబాటి పురంధ్రీశ్వరి తెలుగులోకి అనువదించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. రైతులను నిలువునా మోసం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు, అఖిల భారత కిసాన్ మోర్చా ప్రథాన కార్యదర్శి కే సుగుణాకరరావు, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ఎస్ సురేష్‌రెడ్డి, ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా, కర్రి చిట్టిబాబు, పెండెం బాబ్జీ, కర్రి పాపారావు, బీజేపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్‌లీక్‌తో ప్రజలు ఆందోళన
కాకినాడ సిటీ, సెప్టెంబర్ 19: స్థానిక గాంధీనగర్‌లోని గాంధీ విగ్రహం సమీపంలోని వీధిలో బుధవారం ఉదయం భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్ నుండి గ్యాస్ లీకై స్వల్పంగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాంధోళనకు గురయ్యారు. గ్యాస్ పైపులైన్ నుండి గ్యాస్ లీకవుతూ మంటలు వస్తుండటంతో స్థానికులు ముందుగా పరుగులు తీశారు. వెంటనే వారు తేరుకుని భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్ నిర్వాహకులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేయడంతో వారు హుటాహుటీన సంఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను సకాలంలో అదుపుచేశారు. లేని పక్షంలో పెనుప్రమాదం సంభవించేది. తరచుగా భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్ల నుండి గ్యాస్ లీకై ప్రమాదాలు జరగడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. గ్యాస్ లైన్ నిర్వాహణ సక్రమంగా లేని కారణంగానే ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు భావిస్తున్నారు.

నివేదికలో నిజాలు దాచారు: మాజీ ఎంపి హర్షకుమార్
జస్టిస్ సోమయాజులు కమిషన్ ఇచ్చిన నివేదికలో నిజాలు దాచిపెట్టినట్లు ఉందని మాజీ ఎంపి జివి హర్షకుమార్ విమర్శించారు. బుధవారం దుర్ఘటన జరిగిన పుష్కరాలరేవు వద్ద మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కాపాడేందుకే నివేదిక రూపొందించినట్లు ఉందని ధ్వజమెత్తారు. ఆయనకు అనుకూలంగా ఆయన చాంబర్‌లోనే నివేదిక తయారుచేసినట్టుందన్నారు. దేశంలో ఇలాంటి దారుణమైన నివేదిక ఎక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటన్నారు. 30 మంది మరణిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోకుండా సిఎంను కాపాడేలా నివేదిక రూపొందించుకోవడంపై ప్రభుత్వం తలదించుకోవాలని ధ్వజమెత్తారు. గోదావరి పుష్కరాల తొక్కిసలాట నివేదికపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని డిమాండ్ చేశారు.