తూర్పుగోదావరి

ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 15: జిల్లాలో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా రూపొందే జాబితాలో తప్పులు లేకుండా ఖచ్చితమైనవిగా ఉండాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆయా నియోజకవర్గాల ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించారు. గురువారం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికార్లతో కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూలు ప్రకారం అక్టోబర్ నెలాఖరు వరకు వచ్చిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను నవంబర్ నెలాఖరు నాటికి పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో 2 లక్షల 92 వేల క్లెయిమ్‌లు, అభ్యంతరాలు వచ్చాయని, వీటిలో 2 లక్షల 68 వేల 232 దరఖాస్తులను క్షేత్ర పరిశీలన కోసం పంపినట్టు తెలిపారు. మిగిలినవి ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలన్నారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టే డేటాబేస్‌ను నమోదు చేసేందుకు డేటా ఆపరేటర్లను నియమించాలని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జేసీ ఎ మల్లికార్జున, డీఆర్వో ఎస్‌విఎస్ సుబ్బలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈవో బి విద్యాసాగర్, సెట్రాజ్ సీఈవో ఎస్ మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్ మాస్టర్ తీరుపై ప్రజాసంఘాల ఆగ్రహం
రామచంద్రపురం, నవంబర్ 15: రామచంద్రపురం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఒక మహిళా ఉద్యోగిని పట్ల దురాగతంగా ప్రవర్తించి సస్పెండ్ అయిన స్టేషన్ మాస్టర్ మహ్మద్ రియాద్ వ్యవహారశైలిపై స్థానిక మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయ. కార్మిక సంఘ నాయకుడై ఉండి న్యాయశాస్త్ర పట్ట్భద్రుడైన మహ్మద్ రియాద్ అనుచిత ప్రవర్తన చేయడం పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. కార్మిక నాయకునిగా, రైల్వే ఇనిస్టిట్యూట్ కార్యదర్శిగా రియాద్ వ్యవహరిస్తున్నారని, కాకినాడ బ్రాంచిలో కీలకమైన పదవులు నిర్వహించారని రైల్వేశాఖకు చెందిన పలువురు అధికారులు పేర్కొంటూ గతంలో కూడా రైల్వే క్వార్టర్స్‌లో ఒక వివాహిత పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో దేహశుద్ధి చేశారని తెలిపారు. ఆఫీసర్లకు విందులు, వినోదాలు సమకూర్చి వాటిని రికార్డు చేసి బ్లాక్‌మెయిల్ చేసే విధానంలో కూడా మహ్మద్ రియాద్ పాల్గొన్నారని వారన్నారు. రామచంద్రపురం పట్టణంలో మహ్మద్ రియాద్ బారినపడిన ఆ మహిళా ఉద్యోగిని బీఎస్సీ, బీఈడీ చదివి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు క్లాస్-4 ఉద్యోగానికి ఎంపికైంది. ఐదేళ్లు సర్వీస్ పూర్తిచేసుకుంటే పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగ ఉన్నతి జరుగుతుందన్న లక్ష్యంతో పోటీ పరీక్షలకు చదువుకునేందుకు సమయం రామచంద్రపురంలో అయితే దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో రామచంద్రపురానికి బదిలీ చేయించుకున్నట్టు ఆమెకు సంబంధించిన వ్యక్తులు తెలిపారు. రైల్వేశాఖ అధికారులు కూడా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని మహ్మద్ రియాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సత్యదేవుని గిరి ప్రదక్షిణకు భారీ సౌకర్యాలు
అన్నవరం, నవంబర్ 15: అన్నవరంలో ఈ నెల 23వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా సత్యదేవుని గిరిప్రదక్షణకుగాను పది కిలోమీటర్ల రహదారి మార్గంలో భక్తులకు భారీగా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు ఈవో ఎం జితేంద్ర తెలిపారు. గురువారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులు చేపడుతున్న తగితాల ఇన్‌ఫ్రా ప్రాజెక్టు సంస్థ సబ్ కాంట్రాక్టర్లు కృష్ణకిషోర్, దశరథ్‌లు ఈ రహదారి నిర్మాణానికి పూర్తి సహకారాన్ని అందించారని తెలిపారు. 35 అడుగుల వెడల్పుగల ఈ రోడ్డును నాలుగు నెలల వ్యవధిలో పూర్తిగా చదును చేసి నిర్మించినట్టు తెలిపారు. రహదారి మార్గాన్ని చదునుచేసి శుభ్రం చేసే పనులు మరో రెండు, మూడురోజుల్లో పూర్తవుతాయని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. 23వ తేదీ ఉదయం 8గంటలకు గ్రామంలోని తొలి పావన శాల వద్ద నుంచి గిరి ప్రదక్షణ ప్రారంభమై జాతీయ రహదారి మీదుగా బెండపూడి గ్రామానికి ముందు పోలవరం ఎడమ కాలువ గట్టు వెంబడి పంపా రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు. పంపా రిజర్వాయర్ చెంత నుంచి వెళ్లి దేవస్థానం పవర్‌హౌస్ మీదుగా దిగువ ఘాట్ రోడ్డు నుంచి తొలి పావన శాల వద్దకు చేరుకోవడంతో గిరి ప్రదక్షణ పూర్తవుతుంది. గత రెండేళ్ల నుంచి భారీ ఏర్పాట్లతో నిర్వహిస్తున్న గిరి ప్రదక్షణకు ఈ ఏడాది సుమారు 40వేల నుంచి యాభై వేల మంది భక్తుల వరకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రదక్షణకు హాజరైన భక్తులకు దారిపొడవునా దాతల సహకారంతో సుమారు 15చోట్ల పులిహోర, పాలు, పండ్లు, మజ్జిగ, మంచినీరు వంటివి పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్టు అసిస్టెంట్ కమిషనర్ ఈరంకి జగన్నాథరావు, దేవస్థానం పీఆర్వో తులా రాము తెలిపారు.

ఆరోగ్యవంతమైన యువతతోనే దేశాభివృద్ధి
- రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు నాగాబత్తుల
అమలాపురం, నవంబర్ 15: దేశానికి భవిష్యత్తులో ఆరోగ్యకరమైన యువత అత్యంత ఆవశ్యకమనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం కింద కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు నాగాబత్తుల శ్రీనివాసరావు అన్నారు. గురువారం అమలాపురంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక మంది బాలబాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారని, ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందన్నారు. కళాశాలల ప్రిన్సిపాల్స్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేక దృష్టిపెట్టి పిల్లలకు సక్రమంగా ఆహారం అందేలా చూడాలని ఆదేశించారు. పథకం అమలులో ఏ విధమైన లోపాలు లేకుండా చూడాలన్నారు. భోజనం తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని భోజనం తయారుచేసే మహిళలకు సూచించారు. ఈ సందర్భంగా అన్నం మెత్తబడటాన్ని గుర్తించారు. కళాశాలలో 146 మంది విద్యార్థినులు ఉండగా 125 మంది విద్యార్థినులు మధ్యాహ్నం భోజనానికి హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ వీకే మల్లేశ్వరరావు తెలియజేశారు. కమిషన్ సభ్యుల వెంట జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి సిహెచ్ హరిప్రసాద్, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి జేవీ రమణ, ఎస్సీ, బీసీ అసిస్టెంట్ వెల్ఫేర్ అధికారులు సిహెచ్ వీరాస్వామి, వెంకటేశ్వరరావు, అమలాపురం ఎంఈవో డీ విమలకుమారి, ఏఎస్‌వో డీ ఆనందబాబు వున్నారు.

రోడ్డు ప్రమాదంలో పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డులకు గాయాలు
రంగంపేట, నవంబర్ 15: రంగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగంపేట శివారున ఎడిబి రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సెక్యూరిటీకి గాయాలయ్యాయి. కాకినాడ నుంచి రాజానగరం సమావేశానికి పవన్‌కల్యాణ్ సాయంత్రం వెడుతుండగా ఎస్కార్ట్ కారు రంగంపేట దాటిన తరువాత రాజమండ్రి నుంచి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో అంగరక్షకులు ఏడుగురికి గాయాలయ్యాయి. వారు రాజానగరం జిఎస్‌ఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా రాజానగరం బహిరంగ సభకు వెళుతూ పవన్‌కల్యాణ్ మండల కేంద్రం రంగంపేటలో కొద్దిసేపు ఆగారు. కాలేజి యువకులు, గ్రామస్థులు ఆయనతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు.

ఎస్‌ఇజెడ్‌లో నష్టపోయిన రైతులకు తాను అండగా ఉంటా
*పవన్ కల్యాణ్
యు కొత్తపల్లి, నవంబర్ 15: కాకినాడ ఎస్‌ఇజెడ్‌లో నష్టపోయిన రైతులకు తాను అండగా ఉంటానని జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్‌కల్యాణ్ అన్నారు. సెజ్‌లో భూములు, ఇళ్ళు కోల్పోయిన రైతులు, బాధితులతో గురువారం పవన్ కల్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ ముఖాముఖికి కొత్తమూలపేట సెజ్ పునరావాస కాలనీ వేదికయ్యింది. ఈ సందర్భంగా పలువురు రైతులు, బాధితులు కెఎస్‌ఇజెడ్ వల్ల జరిగిన నష్టాన్ని, కోల్పోయిన భూములు, ఇళ్ళ వివరాలను పవన్‌కు వివరించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ప్రజలు, రైతులకు న్యాయం చేయవలసిన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎస్‌ఇజెడ్‌కు కొమ్ముకాస్తున్నాయన్నారు. జనసేన అధికారంలోకి వస్తే సెజ్‌లో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న పివి రావ్‌ను బయటకు తీసుకువచ్చి విచారణ సాగిస్తామన్నారు. 2013లో రాజకీయ నాయకులు భూ దాహం ఉన్నవారితో కలిసిపోయి రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కున్నారన్నారు. జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వంపై ఓ కమిటీ వేసి సెజ్ భూములపై విచారణ చేయిస్తామన్నారు. నష్టపోయిన రైతుల తరఫున జనసేన పార్టీ అండగా ఉండి పోరాటం సాగిస్తుందన్నారు. సెజ్ బాధిత రైతులు శాంతియుతంగా పోరాటం సాగించాలన్నారు. రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కుని ఏళ్ళు గడుస్తున్నా పరిశ్రమలు స్థాపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అలాగే సెజ్ తీసుకున్న భూములు బీడు భూములుగా మారిపోవడాన్ని ఆయన పరిశీలించారు. రామరాఘవపురంలో ఆయన పర్యటించి రైతుల గోడును తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న భూముల్లో పరిశ్రమలు లేవు, పంటలు లేవని రైతులు పవన్‌కల్యాణ్‌కు వివరించారు. ఈ సందర్భంగా రైతులకు ఆయన అధికారంలోకి వస్తే సెజ్ సంగతి చూస్తానని, దీనిపై సమగ్ర విచారణ సాగిస్తామని అన్నారు. సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు చేసే పోరాటానికి తన మద్దతు పూర్తిస్థాయిలో ఉంటుందన్నారు. అలానే సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు, రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తానని ఆయన హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ నాయకులు అనిశెట్టి వెంకట సుబ్బారావు, చలగం శెట్టి వెంకటేశ్వరరావు, సలాది బాబులు, టి శిరీషా, కంబాల దాసు, కందుల దుర్గేష్, బాపన్నదొర, అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.