తూర్పుగోదావరి

ఎస్‌ఈజెడ్ రైతులకు తక్షణం బెయిల్ ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, నవంబర్ 17: అక్రమంగా అరెస్టుచేసిన ఎస్‌ఈజెడ్ రైతులకు సోమవారం లోపు బెయిల్ వచ్చే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్టవ్య్రాప్త ఉద్యమం నిర్వహిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు హెచ్చరించారు. ఎస్‌ఇజెడ్ భూముల విషయంలో జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్న యు కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన రైతులు పెనుమల్ల సుబ్బిరెడ్డి, పెనుమల్ల సుభాకరరెడ్డి, లక్ష్మీరెడ్డి, చింతా సూర్యనారాయణమూర్తి అనే వారిని వివిధ కేసుల్లో పోలీసులు అరెస్టుచేశారు. ఈ రైతులు ప్రస్తుతం కాకినాడ సబ్‌జైలులో ఉన్నారు. ఎస్‌ఈజెడ్ రైతులు బెయిల్ రాక జైల్లో మగ్గుతున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుసుకున్న ఆయన శనివారం సాయంత్రం కాకినాడ సబ్ జైలుకు వచ్చి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా మధు స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఎస్‌ఈజెడ్‌కు అవసరమైన భూములు ఇవ్వలేదనే కారణంతో రైతులు సుబ్బిరెడ్డి, సుభాకరరెడ్డి, లక్ష్మీరెడ్డి, సూర్యనారాయణమూర్తి తదితరులపై గత కొన్ని సంవత్సరాలుగా పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎస్‌ఈజెడ్ యాజమాన్యం మోచేతి నీళ్లు తాగి పోలీసులు రైతుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులు సుబ్బిరెడ్డి, సుభాకరరెడ్డిలకు చెందిన భూముల్లో కొంతమంది వ్యక్తులు చెట్లను నరికివేయడంతో వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. చెట్లను నరికిన నిందితులపై చర్యలు తీసుకోవలసిన పోలీసులు ఎస్‌ఈజెడ్ యాజమాన్యం ఒత్తిడితో బాధిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి గత నెల 14న అక్రమంగా అరెస్టుచేశారని ఆయన ఆరోపించారు. అప్పటి నుండి రైతులు కాకినాడ సబ్ జైలులో ఉంటున్నారని, వీరికి బెయిల్ రాకుండా పోలీసులు కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులను ఈ నెల 5న రాజమండ్రి కోర్టుకు, 13న పిఠాపురం కోర్టుకు వాయిదాలకు తీసుకువెళ్లే సమయంలో పోలీసులు బేడీలు వేసి తీసుకువెళ్లారని ఆవేదన వెలిబుచ్చారు. రైతులు సంఘ విద్రోహులు కారని, వారు సాధారణ రైతులని, ఇది వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని మధు ఆరోపించారు. సబ్ జైలులో ఉన్న రైతులను పరామర్శించి అక్కడి నుండే జిల్లా ఎస్పీ విశాల్ గున్నితో ఫోన్‌లో మాట్లాడినట్టు చెప్పారు. ప్రస్తుతం ఎస్పీ తన కుటుంబ సభ్యులతో వేరే ప్రాంతంలో ఉన్నట్లు తెలిపారని, ఆయన సోమవారం కాకినాడ వచ్చిన వెంటనే ఎస్‌ఈజెడ్ రైతుల కేసును పరిస్కరిస్తానని హామీ ఇచ్చారని ఆయన తెలియజేశారు.
గతంలో తాను సీఐ చెన్నకేశవరావుపై ప్రైవేట్ కేసును వేశానని, కోర్టు ఆదేశాలతో కేసును పరిశోధించిన పోలీసులు నేటివరకు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయలేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం, ఎస్‌ఈజెడ్ యాజమాన్యం రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎస్‌ఈజెడ్ రైతులకు సోమవారం లోపుగా బెయిల్ వచ్చే విధంగా పోలీసులు చర్యలు తీసుకోని పక్షంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గౌడను కాకినాడను తీసుకువచ్చి, ఇతర వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. సబ్ జైలులో ఉన్న రైతులను పరామర్శించిన వారిలో దువ్వా శేషుబాబ్జీ, మధు, సీపీఎం, సీపీఐ, ఇతర సంఘాల నాయకులు ఉన్నారు.