తూర్పుగోదావరి

అధికారుల అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, డిసెంబర్ 17: పెథాయ్ తుపాను తీవ్రతను ముందుగా గుర్తించి జిల్లా అధికారులను అప్రమత్తం చేయడం వలనే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మంగళవారం ఐ పోలవరం మండలం భైరవపాలెంలో తుపాను ప్రభావిత మత్స్యకార ప్రాంతాలను ఆయనతో పాటు మంత్రులు చినరాజప్ప, కాలవ శ్రీనివాస్ పర్యటించారు. ముందుగా తాళ్ళరేవుమండలం గాడిమొగ రిలయన్స్ జట్టీ వద్ద హెలికాప్టర్‌లో దిగి అక్కడ నుండి నేరుగా రోడ్డుమార్గం ద్వారా భైరవపాలెం తుపాను మత్స్యకార ప్రాంతాలకు వెళ్ళారు. ఈ సందర్భంగా తుపాను షెల్టరు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తుపాను విపత్తును ఎదుర్కొడానికి కలెక్టర్ కార్తీకేయమిశ్రా, జిల్లా యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేయడంతో ప్రాణనష్టం జరగలేదని వారిని అభినందించారు. తుపాను బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. 1996లో భైరవపాలెంలో వచ్చిన తుపానులో 99మంది మత్స్యకారులు చనిపోయారని, ఆ ప్రాంతంలో గుట్టలుగుట్టలుగా పడి ఉన్న శవాలను చూసి హృదయం చలించిపోయిందన్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో వచ్చిన హుదూద్, శ్రీకాకుళంలో తిత్లీ తుపాన్లు నష్టం చేకూర్చినప్పటికీ అధికారులంతా సకాలంలో స్పందించి అక్కడ సమస్యలను చక్కదిద్దారన్నారు. ఆ ప్రాంతాల్లో వారం రోజులపాటు అక్కడే ఉండి అక్కడ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం తుపాను దిశ మార్చుకుని ఒడిస్సా వైపు కదలడంతో ఇక్కడ ఎటువంటి నష్టం జరగకపోవడం చాలా అదృష్టం అన్నారు. భైరవపాలెంలో గృహాలు నిర్మించుకోవాలంటే ఇక్కడ ఉప్పునీళ్ళు ప్రాంతం కాబట్టి ఎవరూ ఇళ్ళు నిర్మించుకోడానికి ముందుకు రావడం లేదని, అందరికీ పక్కా ఇళ్ళు నిర్మించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. భైరవపాలెంలో గల మత్సకారులను గుజరాత్ పెట్రోలియం సంస్ధ మోసం చేసిందని, సంస్థ నష్టాల్లో ఉందని చెప్పి ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఓఎన్జీసీలో విలీనం చేసారన్నారు. నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలో ఉన్న జీఎస్పీసీ సంస్థ నష్టంలో ఉందని, ఆ నష్టాల నుండి బయట పడటం కోసం ఓఎన్జీసీకి ధారాతత్తం చేసారని, దీనిపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు అన్నారు. అనంతరం బాధితులకు 50 కేజీల బియ్యంతో పాటు, నిత్యావసర వస్తువుల కిట్‌ను సీఎం అందజేసారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం, అమలాపురం ఎమ్మెల్యేలు దాట్ల సుబ్బరాజు, అయితాబత్తుల ఆనందరావు, కలెక్టర్ కార్తీకేయమిశ్రా, ఎస్పీ విశాల్ గున్నీ, జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు నామన రాంబాబు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద తదితరులు పాల్గొన్నారు.

మత్స్యకారులను మోసగించిన గుజరాత్ పెట్రోలియం సంస్థ
ఐ పోలవరం, డిసెంబర్ 18: గుజురాత్ పెట్రోలియం సంస్థ మత్స్యకారులను మోసగించిందని ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. మంగళవారం భైరవపాలెంలో పెథాయ్ తుపాను ప్రభావిత మత్స్యకార గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తుపాను పునరావాస కేంద్రంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. భైరవపాలెం సమీపంలో గుజరాత్ పెట్రోలియం సంస్థ కార్యకలాపాలు వల్ల నష్టపోయిన మత్స్య కారులకు ఇచ్చే పరిహారాన్ని నిలిపివేసిందన్నారు. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలో ఉన్న గుజరాత్ పెట్రోలియం సంస్థ నష్టాల్లో ఉందని, దానిని గట్టెక్కించేందుకు ఓఎన్‌జీసీ సంస్థలో కలిపారన్నారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ 1996లో వచ్చిన పెను తుపానుకు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హుటాహుటిన కోనసీమకు వచ్చి సహాయక చర్యలు చేపట్టారన్నారు. ఎమ్మెల్యే సుబ్బరాజు మాట్లాడుతూ భైరవపాలెం గ్రామానికి సింగిల్ లైన్ బ్రిడ్జి మాత్రమే ఉందని, ప్రకృతి విపత్తులు ఏర్పడే పరిస్థితులలో సహాయ కార్యక్రమాలు వేగవంతం చేయలేక అధికార యంత్రంగం ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. ఈ గ్రామానికి మరో బ్రిడ్జిని నిర్మించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి భైరవపాలెం గ్రామంలో వౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు నామన రాంబాబు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద తదితరులు పాల్గొన్నారు.

వాతావరణ శాఖ కంటే నా టెక్నాలజీ బెటర్
ముఖ్యమంత్రి చంథ్రబాబునాయుడు
కాకినాడ సిటీ, డిసెంబర్ 18: వాతావరణ శాఖ కంటే తాను ఇస్రో సహాయంతో ప్రవేశపెట్టిన ఐవేర్ సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థ తుఫానుకు సంబంధించి మెరుగైన ఫలితాలను అందిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇందుకు ఉదాహరణగా వాతావరణశాఖ ప్రకాశం నుండి విశాఖపట్నం వరకు తుఫాను కేంద్రీకృతాన్ని అంచనావేయగా, తాను ప్రవేశపెట్టిన ఐవేర్ సాంకేతిక పరిజ్ఞానం తుఫాను యానాం నుండి తుని మధ్యలో కేంద్రీకృతం అవుతుందని కచ్చితమై అంచనా వేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం ఆయన తాళ్లరేవు మండలంలో పర్యటించారు. అనంతరం కాకినాడ చేరుకుని కలెక్టరేట్‌లో నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేవంలో ఆయన మాట్లాడుతూ ఫెథాయ్ తుపాను కారణంగా ఏర్పడిన నష్టాలను పరిశీలించడం, తుపానును జిల్లా అధికార యంత్రాంగం ఏవిధంగా ఎదుర్కొన్నారనే విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జిల్లా పర్యటనకు వచ్చినట్లు తెలిపారు. ఇస్రోతో కలసి సంయుక్తంగా రూపొందించిన ఐవేర్ బెస్ట్ టెక్నాలజీతో తుపాను ఏ ప్రాంతంలో తీరాన్ని దాటుతుందనే విషయాన్ని కచ్చితంగా గుర్తించినట్లు చెప్పారు. తుపానును ఈనెల 7వ తేదీనే గుర్తించామని, 12వ తేదీనాటికి తుపానుగా మారుతుందని అంచనా వేసి జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చానన్నారు. తుపాను వంద నుండి 120 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటే అవకాశం ఉందని ముందుగా అంచనావేయగా తుదకు 80 నుండి 85 కిలోమీటర్ల వేగంతో బైరవపాలెం సమీపంలోని మడ అడవులు మీదుగా తీరాన్ని దాటినట్లు తెలిపారు. ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఆస్తి, పంటనష్టం, ప్రాణనష్టం, పశువుల ప్రాణనష్టాన్ని చాలా వరకు తగ్గించినట్లు తెలియజేశారు. హుదూద్, తిత్లీ తుపాను ఎదుర్కొన్న అనంతరం ఓ బ్లూబుక్‌ను తయారుచేశామని, దానిని ఫెథాయ్ తుపానులో అమలుపరిచామన్నారు. దీనికోసం 51మంది ఐఎఎస్ అధికారులను నియమించామని, జిల్లా అధికారులు సైతం తాను ఇచ్చిన ఆదేశాల ప్రకారం తుపానును సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని ఆయన కితాబిచ్చారు. రాష్ట్రంలో సాధారణంగా అక్టోబర్, డిసెంబర్ నెలల్లో తుపాన్లు వస్తాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని వరికోతలు నవంబర్ నెలలోనే జరగాలని అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో చాలావరకు పంటకోతలు పూర్తయ్యాయని తెలియజేశారు. గిరిజన రైతులకు వరికుప్పలను రక్షించుకునేందుకు టార్పాలియన్‌లను అందజేసినట్లు చంద్రబాబునాయుడు వివరించారు. తుపాను కారణంగా విస్తారంగా కురిసిన వర్షాలతో విశాఖ, ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు నీటిసమస్య తీరిందన్నారు. జిల్లాలో ఎంత నష్టం జరిగిందనే వివిరాలు రెండురోజుల్లో తెలిసే అవకాశం ఉందని, జిల్లాలో 25బోట్లకు నష్టం వాటిల్లగా, సముద్రంలో చేపల వేటకు వెళ్లిన నాలుగు బోట్లు ఇంకా ఒడ్డుకు రావలసి ఉందని తెలిపారు. వీటిలో దుమ్ములపేటు చెందిన మూడు బోట్లు మచిలీపట్నానికి సురక్షితంగా చేరుకున్నట్లు సమాచారం అందిందని, అయితే కరప మండలం ఉప్పలంక గ్రామానికి చెందిన బుమ్మిడి శివ, బుమ్మిడి కామేశ్వరరావుకు చెందిన బోట్లపై వేటకు వెళ్లిన 14మంది మత్స్యకారుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందన్నారు. పేద మత్స్యకారులకు పక్క్భావనాలను నిర్మిస్తామని, వారికి ప్రస్తుతం రెండువేల రూపాయలు విలువచేసే నిత్యావసర సరుకులను అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. హోప్ ఐలాండ్ ప్రాంతంలో డ్రెజ్జింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటామని, దీనిపై కలెక్టర్‌కు ఆదేశాలను జారీచేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 13జిల్లాలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించి సమర్ధవంతంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, జ్యోతుల నెహ్రూ, ఎస్‌విఎస్ వర్మ, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్ని తదితరులు పాల్గొన్నారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సోమిరెడ్డి పర్యటన
గండేపల్లి, డిసెంబర్ 18: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులను తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి తుపాను బాధితులను ఆదుకోవాలనే ఆదేశాల మేరకు ప్రతి జిల్లాకు తమ మంత్రివర్గం వెళ్లి పంట నష్టం అంచనా వేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని యల్లమిల్లి, తాళ్లూరు గ్రామాల్లోని పంట పొలాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో అరటి, శనగ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. రైతుల సమస్యలను స్వయంగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక విలేఖర్లతో మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ పెథాయ్ తుపాను ప్రభావం కారణంగా ఆరు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఉభయ గోదావరి జిల్లాలు, విజయనగరం, విశాఖ, కృష్ణ, శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తం 9.37 లక్షల హెక్టార్లలో 10,856 హెక్టార్లలో వివిధ పంటలు తీవ్రంగా నష్టపోయినట్టు తెలిపారు. ఫలితంగా రూ.51.86 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ రిక్వర్‌మైంట్ రూ.15 కోట్లన్నారు. నష్టపోయిన పంటల్లో అరటి, మిరప, కూరగాయలు, పూల తోటలు, బొప్పాయి, తమలపాకు తదితర తోటలు నష్టపోగా, వీటివల్ల 9,712మంది రైతులు రూ.128 కోట్లు ఆర్థికంగా నష్టపోయారన్నారు. రైతులపై తుపాను ప్రభావం పడకుండా ఎప్పటికప్పుడు ఆదుకుంటున్నట్టు చెప్పారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. అతివృష్ఠి, అనావృష్ఠి వచ్చినా రైతులు అధైర్యపడవద్దని, రైతులను ఆదుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. మంత్రి వెంట జగ్గంపేట, అనపర్తి ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, స్థానిక టీడీపీ నేతలు కందుల చిట్టిబాబు, కందుల కొండయ్యదొర, పెనుమర్తి భాస్కరరావు, పెనుమర్తి అర్జున్, కుంచే రాజా తదితరులు ఉన్నారు.

సెజ్‌లో నాలుగు పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయు
కరప, డిసెంబర్ 18: కాకినాడ కెఎస్‌ఇజెడ్‌లో నాలుగు ప్రైవేటు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రాగా వారితో ఎంఓయు కుదుర్చుకున్నామని కెఎస్‌ఇజెడ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సీతామహాలక్ష్మి తెలిపారు. మంగళవారం ఆమె కరపలో వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ కాకినాడ సెజ్ కోసం ప్రభుత్వం పదివేల ఎకరాలు సేకరించగా ఇందులో ఏడువేలు కెవి రావు పేరిట రైతులు రిజిస్ట్రేషన్ చేసారని, మిగిలిన మూడువేల ఎకరాలకు తాము భూసేకరణ చేయగా ఇందులో వేయి ఎకరాలకు మాత్రమే రైతులు పరిహారం తీసుకున్నారని తెలిపారు. అలాగే కాకినాడ సెజ్ పరిధిలో ఇప్పటికే చైనా కంపెనీ బొమ్మల తయారీ పరిశ్రమ స్థాపించగా ఇందులో స్థానికులకే నూరుశాతం ఉద్యోగాలు కల్పించామన్నారు. దీంతో పాటు సెజ్ పరిధిలో కోనపాపపేటలో రెండువేల ఎకరాల్లో ప్రైవేటు పోర్టు నిర్మాణం జరుగుతోందన్నారు. సెజ్‌లో ప్రైవేటు కంపెనీల స్థాపనకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. తహసీల్దారు బూసి శ్రీదేవి, ఎంపీడీవో నోరి కామశాస్ర్తీ, డిప్యూటీ తహసీల్దార్ విజయశ్రీ పాల్గొన్నారు.

నేలకొరిగిన అరటి తోటలు
మామిడికుదురు, డిసెంబర్ 18: పెథాయ్ తుపాను కారణంగా మండలంలోని పాశర్లపూడి, పాశర్లపూడి లంక, మామిడికుదురు, లూటుకుర్రు, అప్పనపల్లి గ్రామాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. వీచిన ఈదురుగాలులకు లేత గెలలతో ఉన్న అరటి తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయామని రైతులు గనిశెట్టి నాగేశ్వరరావు, ఉప్పే ప్రకాశరావు తదితరులు గగ్గోలు పెడుతున్నారు. తుపాను చేతికి అందివచ్చిన అరటి పంటను చేతికందకుండా చేసిందని వాపోయారు. ఇదేవిధంగా మండలంలోని పెదపట్నంలంక, బి దొడ్డవరం, పెదపట్నం తదితర గ్రామాల్లో కూరగాయల తోటలు కూడా దెబ్బతిన్నాయి. నగరం, గెద్దాడ గ్రామాల్లో పనలపై ఉన్న వరి పొలాలు నీట మునిగాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 40 హెక్టార్లలో అరటి, కూరగాయల తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయని అదనపు జాయింట్ కలెక్టర్ సిహెచ్ సత్తిబాబు తెలిపారు. వీటితోపాటు ఏడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని చెప్పారు. సుమారు 25 కరెంటు స్తంభాలు నేలకొరిగాయని, ఒక సెల్ టవర్ కూడా నేలకొరిగిందని తెలిపారు. బుధవారం ఉదయానికి సంబంధిత అధికారులు వరి, కొబ్బరి పంట నష్టంపై నివేదిక ఇవ్వనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని అదనపు జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం
ఐ పోలవరం, డిసెంబర్ 18: భైరవపాలెం పెథాయ్ తుపాను గ్రామాలలో పరిశీలనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఘన స్వాగతం లభించింది. మంగళవారం గాడిమొగ రిలయన్స్ జట్టి వద్దకు హెలికాప్టరులో చేరుకున్న చంద్రబాబుకు మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కాల్వ శ్రీనివాసులు, ముమ్మిడివరం, అమలాపురం ఎమ్మెల్యేలు, దాట్ల సుబ్బరాజు, అయితాబత్తుల ఆనందరావు, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్నీలతో పాటు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కారులో సావిత్ర నగర్ నుండి తుపానులో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి భాదితులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు నామన రాంబాబు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, ఎఎంసీ ఛైర్మన్లు గొలకోటి దొరబాబు, మందాల గంగసూర్యనారాయణ, చెల్లి శాంతి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ప్రచార ఆర్భాటానికే ప్రాథాన్యత
*బాధితులకు న్యాయం చేయాలి *మాజీ మంత్రి మాణిక్యాలరావు
కాకినాడ, డిసెంబర్ 18: పెథాయ్ తుపాను వల్ల నష్ట జరుగుతుందంటూ ప్రచారానికే అధిక ప్రాధ్యాతిచ్చారే తప్ప బాధితులను ఆదుకునేందుకు మాత్రం కాదని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సిఎం చంద్రబాబును విమర్శించారు. కాకినాడ దుమ్ములపేటకు చెందిన మత్య్సకారులు రిలయన్స్ సమీపంలోని రిగ్గు దగ్గర బోటులో చమురు అయిపోయిందని, తమను కాపాడాలంటూ ఫోన్ ద్వారా సమాచామిచ్చినా వారిని ఒడ్డుకు తీసుకురావడంలో విఫలమయ్యారని చెప్పారు. మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలోని కాకినాడ దుమ్ములపేట, అమలాపురంలోని జి మూలపొలం గ్రామాన్ని సందర్శించి అక్కడ బాధితుల కష్టాలను అడిగానన్నారు. సమాచార వ్యవస్ధను తానే కంట్రోల్ చేస్తున్నానని చెప్పిన సిఎం మాత్రం తుపాను ఎక్కడ తీరం దాటుతుందో చెప్పలేక గందరగోళానికి ప్రజలను గురి చేశారన్నారు. అమలాపురం ప్రాంతంలో పెథాయ్ విలయం వల్ల కొబ్బరి, వరి పంటలకు నష్ట రాగా మెట్ట ప్రాంతంలో మాత్రం పత్తి, అరటి వంటి పంటలకు నష్టం వచ్చిందని చెప్పారు. తుపాను వల్ల రాష్ట్రానికి నష్టం వస్తుందని తెలిసినా సిఎం తన స్వార్ధ రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంకు వెళ్ళారన్నారు. పంటలకు నష్టం, బాధితులకు పరిహారం ఇవ్వని పక్షంలో బిజెపి తరఫున పోరాటం చేస్తామని మాణిక్యాలరావు పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, అధికార ప్రతినిధి తుమ్మల పద్మ తదితరులు పాల్గొన్నారు.

రేపు మాజీ సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి, రఘువీరా రాక
కాకినాడ, డిసెంబర్ 18: మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి గురువారం జిల్లాలో పర్యటించన్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్‌ఎన్ రాజా తెలిపారు. ఆరోజు ఉదయం అన్నవరం, కడియంలో పర్యటించి స్ధానిక కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు కాకినాడ గాంధీభవన్‌లో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరవుతారని రాజా తెలిపారు.

ఆకట్టుకుంటున్న వాక్యూమ్ క్లీనర్
*సూక్మ కళాఖండాల శిల్పి సాయి అపూర్వ సృష్టి
పెద్దాపురం, డిసెంబర్ 18: పట్టణానికి చెందిన సూక్ష్మ కళాఖండాల సృష్టి కర్త తాళాబత్తుల సాయి మరో అద్భుత సృషికి జీవం పోసారు. సాధారణంగా ఇళ్లలో బూజులు, చెత్తను తొలగించేందుకు వాడే వాక్యూమ్ క్లీనర్లు పెద్దసైజ్‌లో ఉంటాయి. అటువంటి దానిని కేవలం పెన్ను మూత (5.4 సెంటీ మీటర్ల) సైజులో తయారుచేసి పలువురి మన్ననలు అందుకున్నారు. మంగళవారం ఆయన స్ధానిక విలేకరులతో మాట్లాడుతూ క్లీనర్ తయారీకి పెన్ను మూత ఒకటి, 12 వాట్స్ మోటరు, 12 వాట్స్ బ్యాటరీ, ఒక స్విచ్, నెట్ క్లాత్‌ను వినియోగించి బుల్లి వాక్యూమ్ క్లీనర్ తయారు చేశానన్నారు. క్లీనర్ కొలతలను అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ అధికారి సాయిరామ్ పరీక్షించారు. గతంలో సాయి చేతిలో రూపొందిన సూక్ష్మ వౌస్ ట్రాప్, సూక్ష్మ నాటికల్ నాట్ బోర్డు వంటి వస్తువులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు చేసుకోగా ప్రస్తుతం తయారు చేసిన వాక్యూమ్ క్లీనర్ కూడా గిన్నిస్ రికార్డు సాధిస్తుందని ఆయన తెలిపారు.

మత్స్యకారులు సురక్షితం
కాకినాడ సిటీ, డిసెంబర్ 18: కరప మండలం ఉప్పలంక గ్రామానికి చెంథిన బుమ్మిడి శివ, బుమ్మిడి కామేశ్వరరావు అనే చేపల బోట్ల యజమానులకు చెందిన బోట్లపై సముద్రంలో చేపల వేటకువెల్లిన మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్లు అధికారులు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విలేఖరుల సమావేశంలో రెండు బోట్లపై సముద్రంలో చేపలువేటకు వెళ్లిన 14మంది మత్స్యకారుల ఆచూకీ తెలియాల్సి ఉందని చెప్పారు. వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కోస్టు సిబ్బంది మత్యకారుల ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఒక బోటులో ఉన్న వారు అంతర్వేదిపాలెం వద్దకు, మరో బోటులు ఉన్న వారు కొత్తపాకల గ్రామానికి సురక్షితంగా చేరుకున్నట్లు జిల్లా అధికారులు తెలియజేశారు. అదేవిధంగా దుమ్ములపేటకు చెందిన ఓసుపల్లి దానయ్య బోటుపై వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు, విశాఖపట్నంకు చెందిన వాడమదులు కన్నారావు బోటుపై వేటకు వెల్లిన ఆరుగురు మత్స్యకారులు సైతం సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని మత్స్యశాఖ అధికారులు తెలియజేశారు.